విశాఖకు జగన్.. ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు!
నవ్వి పోదురు గాక నాకేటి వెరుపు అన్నది సామెత... పారి పోదురు గాక కాకేటి వెరుపు అన్నది జగన్ నినాదం. లోకమంతా ఒక దారి అయితే ఉలికిపిట్టది ఒక దారి అంటారు. అలా ఉంది మూడు రాజధానుల విషయంలో జగన్ తీరు. కోర్టులు, రాజకీయ పార్టీలు, అమరావతికి భూములిచ్చిన రైతులు, ఆఖరికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ కూడా అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ముక్త కంఠంతో చెబుతున్నా జగన్ చెవికెక్కడం లేదు.
హైకోర్టులో ఎలాగూ వ్యతిరేకంగా తీర్పు వస్తుందన్న ఆలోచనతోనే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. మళ్ళీ పకడ్బంధీగా బిల్లును తీసుకురావాలని చూస్తున్నది. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్తూనే ఉన్నారు. సుందర నగరమైన విశాఖలో దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. దానికి కొద్దిపాటి మొత్తం కేటాయిస్తే రాజధాని సిద్ధమవుతుందని సాక్షాత్తు సీఎం జగన్ పలుమార్లు చెప్పారు. అంతే కాదు ముఖ్యమంత్రిగా తాను ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అదే రాజధాని అవుతుందని కూడా సెలవిచ్చారు. అలా చెప్పడం ద్వారా తాను విశాఖ నుంచే పాలన సాగించాలని భావిస్తున్నట్లు చెప్పకనే చెప్పేశారు.
విశాఖలో వసతులు, కార్యాలయాల కోసం.. ముఖ్యంగా సీఎం క్యాంప్ ఆఫీసు కోసం కూడా ఇప్పటికే స్థల నిర్ధారణ జరిగిపోయిందని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. దీంతో అధికారికంగా విశాఖకు పాలనా రాజధాని తరలించడం వీలు కాకపోయినా.. అనధికారికంగా రాజధానిని విశాఖకి తరలించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే..జగన్ రాజధానిని విశాఖకు తీసుకు వెల్లానంటుంటే.. అక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమలను అక్కడ నుంచి తరలించేస్తున్నారు. ఒక్క విశాఖ అని ఏమిటి జగన్ పాలనా నిర్వాకంతో ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రం నుంచి పలు పరిశ్రమలు తరలిపోయాయి. విస్తరణ లక్ష్యాలను విరమించుకున్నాయి.
కొన్ని కంపెనీలతో ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేసుకుంది. కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ కు తరలిపోయాయి. ఇక అదానీ డేటా సెంటర్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు జగన్ ప్రభుత్వంరద్దు చేశారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఏషియన్ పల్ప్ పేపర్ పరిశ్రమ తన పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. బీఆర్ షెట్టి సంస్థలు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులు, రేణిగుంటలో రిలయన్స్ పెట్టుబడులు, ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీ, విశాఖ రుషికొండ ఐటి సెజ్ నుండి కంపెనీలు తరలిపోయాయి. చిత్తూరు జిల్లాకు తలమానికమైన అమర్ రాజా బ్యాటరీస్ కూడా తరలిపోయింది. అలా రాష్ట్రానికి గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన వాటిలో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వ ఒప్పంద సంస్థలే కాగా.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా అదే బాటలో ఉంది. ఔను పెట్రోలియం యూనివర్సిటీ ఏపీ నుండి తరలిపొంతోంది.
విభజన హామీల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్టీ సంస్థను స్థాపించారు. ఈ విద్యా సంస్థ దేశంలో రెండే చోట్ల ఉంది. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉండగా.. రెండోదాన్ని విశాఖపట్నానికి కేటాయించారు.
ఈ సంస్థ కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వంగలి గ్రామంలో సుమారు 201.8 ఎకరాల సేకరణకు సిద్ధమై కొంత భూమిని సేకరించింది. దీనికి 2016లోనే భూమి పూజ పూర్తయ్యింది. శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి వచ్చే వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్‌లో 60, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 సీట్లు ఉండగా.. ఇప్పటికే రెండు బ్యాచ్ లు తమ విద్యాభ్యాసాన్ని ముగించి బయటకు వెళ్లిపోయాయి. మొత్తం రూ.655 కోట్లతో శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం మొదటి దశగా రూ.150 కోట్లు విడుదల చేశారు. ముందుగా సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణ బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించగా ఇప్పటి వరకు ఈ ప్రహరీ నిర్మాణం పూర్తి కాలేదు పట్టాదారులతో సమానంగా తమకూ నష్టపరిహారం చెల్లించాలని పట్టాలేని రైతులు హైకోర్టులో పిటిషన్ వేయగా.. విచారించిన ధర్మాసనం సాగులో ఉన్నారు కనుక పట్టాదారులకు ఇచ్చినట్టుగానే పట్టాలేని రైతులకూ ఇవ్వాలని ఆదేశించింది.
కానీ, పట్టాలేని రైతులకు ఇక్కడ అంత మొత్తంలో చెల్లిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే చెల్లించాల్సి వస్తుందని, ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కేసు పెండింగ్‌లో ఉండడంతో ఇది ఇప్పట్లో తేలే అంశం కాదని కేంద్రం ఈ విద్యా సంస్థను రాష్ట్రం నుంచి తరలించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనిని కూడా యూపీ యూనివర్సిటీలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.