జగన్ పాలనపై వైఎస్ ‘ఆత్మ’ ఘోష
posted on Dec 13, 2022 9:12AM
దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు ఎట్టకేలకు నోరు విప్పారు. అదీ.. తన ప్రాణ స్నేహితుడు వైఎస్సార్ తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనా తీరు పై వైఎస్‘ఆత్మ’ ఘోష వినిపించింది. దాదాపు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత .. అదీ మూడున్నరేళ్ల అనంతరం.... కేవీపీ రామచంద్రరావు ఈ విధంగా స్పందించడం జగన్ పాలనా వైఫల్యానికి అద్దంపడుతోంది.
మూడున్నరేళ్లలో జగన్ పాలన గురించి కానీ, విపక్షాలపై ఆయన సాగించిన అణచివేత గురించి కానీ పన్నెత్తి మాట్లాడని కేవీపీ తాజాగా ఏపీలో జగన్ పాలనపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలా ఏ విషయంలోనూ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సంగతి అటుంచి కనీసం విజ్ణప్తి కూడా చేయకపోవడాన్ని కేవీపీ తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చట్టంలో ఉందని వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన కేసీపీ... జగన్ కాంగ్రెస్ నుంచి విడిపడి కొత్త పార్టీని పెట్టుకున్నా ఆయన మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సీఎం జగన్ కు సాయం చేస్తున్నారని కేవీపీ విమర్శలు లేకపోలేదు. అయితే తాజాగా కేవీపీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ కు సన్నిహితుడైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి హాజరైన కేవీపీ ఆ తర్వాత సీఎంను కలవలేదు. కానీ హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ నిర్వహించిన సదస్సులో కేవీుపీ పాల్గొన్నారు. అధికారం చేపట్టిన తరువాత ఒక్కరొక్కరుగా వైఎస్ సన్నిహితులు, చివరికి కుటుంబ సభ్యులు ఇలా అందరూ దూరం అవుతున్నా.. కేవీపీ మాత్రం ఇంత వరకూ జగన్ కు తెరవెనుక సహాయం అందిస్తున్నారన్న ప్రచారం ఉంది.
తాజాగా ఆయన వ్యాఖ్యలతో ఆయన కూడా జగన్ కు దూరం జరిగారని తేటతెల్లమైపోయింది. ఏపీ విభజన అంశాలను నెరవేర్చడానికి జగన్ ప్రయత్నించలేదనీ, బీజేపీకి దగ్గరై జగన్ ఏపీ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కేవీపీ అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకూ జగన్ బీజేపీకి దగ్గరవ్వడం కాదు.. కేసుల భయంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఏం చెబితే అది చేస్తున్నారనీ ఉన్న విమర్శలకు కేవీపీ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చేవిగా ఉన్నాయి. కేవీపీ బహిరంగంగా జగన్ పాలనపై విమర్వలు చేయడంతో..ఇప్పుడు అందరి దృష్టీ సూరీడు అనే వ్యక్తిపై పడింది. కేవీపీ వైఎస్ కు ఆత్మ అయితే సూరీడు అనే వ్యక్తి వైఎస్ కు అంగరక్షకుడిగా ఆ రోజుల్లో గుర్తింపు పొందారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రైవేటు కార్యక్రమం అయినా వైఎస్ ఎక్కడుంటే అక్కడ సూరీడు ఉండేవాడు. ఇంతకీ సూర్యనారాయణ రెడ్డి అనే సూరీడు కూడా వైఎస్ మరణానంతరం జగన్ పక్కన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.
వైఎస్ కు అత్యంత సన్నిహిడుడిగా గుర్తింపు పొందిన సూరీడు ఆయన మరణం తరువాత ఎందుకు జగన్ కు దూరం జరిగారు. కనీసం వైఎస్ వర్దంతి, జయంతి సందర్భాలలో కూడా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఇంత కాలానికి వైఎస్ ‘ఆత్మ’ కేవీపీ బహిరంగంగా జగన్ పాలనను తప్పుపడితే.. జగన్ తీరు, వ్యవహార శైలిని గుర్తించిన సూరీడు వైఎస్ మరణం తరువాత జగన్ కు దూరమయ్యారని నెటిజన్లు అంటున్నారు.