జగన్మాత..జగన్మాయ
posted on Dec 11, 2022 8:07AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు తల్లి అయిన వైఎస్ విజయమ్మ తాజా వ్యవహారశైలిపై పై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ ఆమె తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో షర్మిల అరెస్ట్, వాహనంలో ఉండగానే షర్మలను టోవింగ్ చేసి మరీ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం.. ఆ సందర్భంగా విజయమ్మ ఆందోళనకు దిగడం.. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. పక్క రాష్ట్రంతో, జగన్‌తో మనకేమిటమ్మా సంబంధం అంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇప్పుడు తన పాదయాత్రకు తెలంగాణలో అనుమతి ఇవ్వకపోవడంపై వైయస్ షర్మిల ఆందోళనకు దిగారు. అలాగే .. టీఆర్ఎస్ అంతర్ధానమై బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌పైన.. జగన్ మోహన్ రెడ్డిపైన ఎలాంటి ప్రభావం చూపుతాయంటూ మీడియా ప్రశ్నలకు.. జగన్‌ను ఎవరు తాకలేరంటూ ఆమె సమాధానం ఇచ్చారు. ఈ పరస్పర విరుద్ధమైన విజయమ్మ మాటలపైనే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొన్న పక్క రాష్ట్రంతో, వైయస్ జగన్‌తో మనకేం పనమ్మా అన్న విజయమ్మ, రోజుల వ్యవధిలోనే ఆయన్ని ఎవరు తాకలేరంటూ వెనకేసుకురావడంలో ఆంతర్యం ఎమిటని నిలదీస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు.. రాజన్న రాజ్యం కోసం జగన్ ను గెలిపించండి.. ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిస్తే.. మీ సమస్యలన్నీ హుష్ కాకి అన్నట్లుగా పరిష్కరించేస్తారని విజయమ్మ ప్రచారం చేసిన విషయాన్ని నెటిజన్లు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే జగనన్న వదిలిన బాణమంటూ షర్మిల సైతం సోదరుడి కోసం పాదయాత్ర చేశారు. తీరా జగన్ ఏపీలో అధికారంలోని రాగానే ప్రజలను పట్టించుకోక పోవడమే కాదు.. తల్లి, చెల్లిని సైతం పక్క రాష్ట్రానికి సాగనంపాడని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యంగా మూడు రాజధానులంటూ ఆయన చేస్తున్న విన్యాసాల కారణంగా.. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, అలాగే పీఆర్సీ, సీపీఎస్ ల విషయంలో జగన్ తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు, జాబ్ కాలెండర్ వాగ్దానాన్ని నిలుపుకోకపోవడంతో నిరుద్యోగులు, నిత్యావసర ధరల పెంపుతో సామాన్యులు, ఇలా జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ కూడా సంతోషంగా లేని పరిస్ధితి ఉంది. ఇలా ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన వాగ్దానాలు... ఏవీ నేటికి నెరవేరలేదని... ఆ క్రమంలో జగనన్న రాజ్యంలో ప్రతి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందని.... కానీ ఈ మూడున్నరేళ్లలో ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏ ఒక్క రోజు విజయమ్మ కానీ షర్మిల కానీ పెదవి అయితే విప్పిందే లేదని నెటిజనులు గుర్తు చేస్తున్నారు.
కానీ తన కుమార్తెకు కానీ.. తన కొడుకుకు కానీ ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చినా.. విజయమ్మ ఆగమేఘాల మీద స్పందిస్తారని.. మరి ప్రజలకు సమస్య వస్తే.. ఎందుకు స్పందించరనీ నిలదీస్తున్నారు. మొన్న జగన్‌తో మనకెందుకమ్మా అన్నారు. ఇప్పుడు అదే జగన్‌ను ఎవరూ తాకలేరంటున్నారు జగన్మాత, జగన్మాయ అంటూ సెటైర్లు వేస్తున్నారు.