సింహపురి వర్సిటీలో సిత్రం చూశారా? 5,360 మార్క్స్ ఔటాఫ్ 800
posted on Dec 13, 2022 @ 10:16AM
నెల్లూరులోని సింహపురి విశ్వవిద్యాలయంలో బోధన ఎంత ఘనంగా సాగుతోందో చెప్పడానికి ఆ వర్సిటీ కాలేజీలో నాలుగో సెమిస్టర్ పేపర్ల వాల్యుయేషన్ తీరును చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. ఫోర్త్ సెమిస్టర్ ఫలితాలలో తమకు వచ్చిన మార్కులు చూసి విద్యార్థులు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు.
800 మార్కులకు నిర్వహించిన పరీక్షలకు ఒక్కొక్కరికి 2 వేలకు పైగానే మార్కులొచ్చాయి. ఓ విద్యార్థికైతే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి. ఆ మార్కులు చూసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. తాము ఏ గ్రేడ్ లో పాసయ్యామో తెలియక గందరగోళంలో పడ్డారు.
పరీక్షలు నిర్వహించిన ఎనిమిది నెలల తరువాత విడుదల చేసిన ఈ ఫలితాలలో మార్కులు తప్పుల తడకగా ఉండటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 800 మార్కులకు నిర్వహించిన పరీక్షల్లో తమకు రెండు వేలకు పైగా మార్కులువచ్చినట్లు ఫలితాలలో ఉండటంపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని యూనివర్సిటీ రిజిస్ట్రార్ చాలా లైట్ గా తీసుకున్నారు. మార్కుల జాబితాలో తప్పులుంటే ఏమైంది.. సరి చేసి మళ్లీ విడుదల చేస్తామంటూ కూల్ గా సమాధానమిస్తున్నారు.