హిమాచల్’లో కమలం కకావికాలం నడ్డాకు ఉద్వాసన?
posted on Dec 11, 2022 7:22AM
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడచి పోతున్నాయి కానీ వేడి మాత్రం తగ్గడం లేదు.అలాగే హిమాచల్ ఎన్నికల దుమారం రేపిన ధూళి మాత్రం సర్దుకోవడం లేదు. ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపిక కసరత్తును పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సుఖీందర్ సింగ్ సుంఖుని సీఎఎంగా, ఉప ముఖ్యమంత్రిగా అగిహోత్రిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రేపు ఆదివారం(డిసెంబర్ 11) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుంతుందని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
అయితే, ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకపోయినా సీట్లు భారీగా కోల్పోయి అధికారం కోల్పోయిన బీజేపీలో మాత్రం రాజకీయ సెగలు బుసలు కొడుతున్నాయి. ముఖ్యంగా, హిమాచల్ ఓటమి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మెడకు చుట్టుకుంటోంది. హిమాచల్ నడ్డా స్వరాష్ట్రం. అదొకటి అలాఉంటే, హిమాచల్లో బీజేపీ ఓటమికి, గ్రూపు రాజకీయాలే ప్రధాన కారణంగా అధినాయకత్వం గుర్తించినట్లు చెపుతున్నారు. ఈ నేపధ్యంలో స్వరాష్ట్రంలోనే పార్టీని ఏక తాటిపై నడిపించలేక పోయిన నడ్డా దేశంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే చర్చ పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది.
అంతేకాదు హిమాచల్ బీజేపీలో ముఠా కుమ్ములాటలకు నడ్డానే కారణమని రాష్ట్రంలో తన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దుమాల్ ను కావాలనే పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా తిరుగుబాట్లను ఎగ దోశారని బిజెపి పెద్దలకు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలుస్తుంది. ఏకంగా 21 మంది రెబల్స్ రంగంలోకి దిగి పార్టీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బ తీశారు. దీనిపై ప్రధానికి నిఘా వర్గాలు నివేదిక కూడా ఇచ్చాయి. నడ్డా ప్రేమ్ కుమార్ ఒకరిని ఒకరు ఓడించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందింది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ సైతం నడ్డా విషయంలో కొంత అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో చర్చజరుగుతోంది. అలాగే హిమాచల్ వ్యవహారం పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రదాని కోరినట్లు తెలుస్తోంది.
యితే నడ్డాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని, పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి నడ్డా పదవీకాలం ముగియక ముందే ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్ళ పాటు పొడిగిస్తూ, పార్టీ నిర్ణయం తీసుకుంది. నడ్డా పదవీకాలం జనవరి 20న ముగుస్తుంది. అయితే, 2024 ఎన్నికల వరకు ఆయన్నే అధ్యక్ష పదవిలో కొనసాగించాలని 2024 లోక్ సభ ఎన్నికలు కూడా ఆయన సారధ్యంలోనే వెళ్లాలని పార్టీ నిర్ణయించింది.
అయితే హిమాచల్ ఓటమి తర్వాత ఆయన స్థానంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను జాతీయ నూతన అధ్యక్షుడిగా నియమించాలని మోడీ షా నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారాం జరుగుతోంది. అయితే నడ్డా సన్నిహిత వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని ఇదంతా మీడియా సృష్టిగా కొట్టి వేస్తున్నారు. కానీ ఒకసారి మోడీ, షా నిర్ణయం తీసుకుంటే, మార్పు ఉండదని అంటున్నారు. గతంలో సీనియర్ మంత్రులకు ఉద్వాసన చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.