కోహ్లీ నెక్ట్స్ టార్గెట్ సచిన్
posted on Dec 11, 2022 @ 10:49AM
పరుగుల యంత్రం కింగ్ కోహ్లీ నెక్ట్స్ టార్గెట్ సచిన్ టెండూల్కర్. ఔను నిజమే క్రికెట్ లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని పరుగుల దాహం తీర్చుకుంటున్న విరాట్ కోహ్లీ.. తరువాతి టార్గెట్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డు బద్దలు కొట్టడమే. ఔను సచిన్ తరువాత అత్యధిక సెంచరీల రికార్డు ఇప్పుడు కోహ్లీ పేరిటే ఉంది. సచిన్ టెండూల్కర్ మొత్తం 100 సెంచరీలతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, 72 ఇంటర్నేషనల్ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ తో చిట్టగ్యాంగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ సెంచరీ చేశాడు.
ఈ సెంచరీతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాని అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. వన్డేలలో కోహ్లీకి ఇది 44వ సెంచరీ మొత్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇది అతడికి 72వ సెంచరీ. క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ ఒక్కడే కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.
కాగా బంగ్లాతో మూడో వన్డేలో చేసిన సెంచరీతో కోహ్లీ మరో అరుదైన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర (1045) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సంగా రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు.