మళ్లీ పెద్ద నోటు రద్దు
posted on Dec 13, 2022 8:49AM
మళ్లీ నోట్ల రద్దు ప్రకటనకు రంగం సిద్దమవుతోందా? అదీ ముఖ్యంగా రెండు వేల రూపాయిలు.. ఇకపై ఆదృశ్యం కానుందా? గతంలో ఐదు వందల రూపాయిలు.., వెయ్యి రూపాయిల నోట్ల రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు మరో సారి నోట్ల రద్దుకు సిద్ధమౌతోందా? ఈ సారి రెండు వేల రూపాయిల నోట్లను రద్దు చేయనున్నారా? ఔననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుందన్న చర్చ హస్తినలో వాడీ వేడిగా నడుస్తోంది.
మరోవైపు రాజ్యసభలో సోమవారం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ.. రెండు వేల రూపాయిల నోటు... బ్లాక్ మనీకి కేరాఫ్ ఆడ్రస్‌గా మారిందని అన్నారు. అలాగే మనీ లాండరింగ్‌కి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలకు, ఉగ్రవాద మూకలకు నిధులకు.. రెండు వేల రూపాయిల నోట్లు అత్యంత కీలకంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వేల రూపాయిల నోట్లను దశల వారీగా రద్దు చేయాలంటూ ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఓ వేళ రెండు వేల నోట్ల రద్దు చేసేటట్లు అయితే.. వాటిని మార్చుకోనేందుకు దేశ ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఇప్పటికే ఏటీఎంల్లోరెండు వేల రూపాయిల నోట్లు కనిపించడం లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే రెండు వేల నోట్లపై ప్రజల్లో ఓ విధమైన ఊహాగానాలు ఊపందుకోన్నాయని.. వీటిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ ఆయనీ సందర్బంగా చెప్పారు.
మరో వైపు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం.. గత మూడేళ్లు నుంచి అంటే 2019 నుంచి రెండు వేల రూపాయిల నోట్లు ముద్రణను నిలిపి వేసిందని ఈ సభ సాక్షిగా ఎంపీ సుశీల్ మోదీ గుర్తు చేశారు.
2016 నవంబర్ 8న దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడం కోసం.. పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లు దేశ ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ క్రమంలో ఐదు వందలు, వెయ్యి రూపాయిల నోట్లను రద్దు చేశారు. కానీ ఆ తర్వాత.. అదే మోదీ ప్రభుత్వం రెండు వేల రూపాయిల నోట్లను ముద్రించి చెలామణీలోకి తెచ్చింది. దీంతో పెద్ద నోట్లను రద్దు చేసి.. వాటి స్థానంలో మరీ పెద్ద నోట్లు పెట్టడం ఏమిటనే విమర్శ అప్పట్లో పెద్దగా వినిపించింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం ఏమనుకుందో ఏమో కానీ.. 2019 నుంచి రెండు వేల రూపాయిల నోట్ల ముద్రణను నిలిపివేసింది.
అదీకాక... ఓ వైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో రెండు వేల రూపాయిల నోట్లు నేపాలి మాంత్రికుడు మాయం చేసినట్లు మాయమైపోయాయి. ఎన్నికల వేళ.. ఓటర్ల కోసం వివిధ రాజకీయ పార్టీలు.. ఇప్పటికే రెండు వేల రూపాయిల నోట్లను.. కట్టలుగా పేర్చి గోదాముల్లో దాచేశాయనే ఓ వదంతి అయితే అటు ప్రజల్లో.... ఇటు నెటిజన్లుల్లో షికారు చేస్తోంది. అలాంటి వేళ.. ఓ వేళ రెండు వేల నోట్ల రద్దు చేస్తే మాత్రం.. అధికార పార్టీలకే కాదు.. ప్రతిపక్ష పార్టీలకు సైతం పట్టపగలే చుక్కలు కనిపిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.