‘వారాహి’ రైట్ రైట్
posted on Dec 12, 2022 @ 3:50PM
జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’కి లైన్ క్లియర్ అయ్యింది. ఆ వాహనానికిరిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. పవన్ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహీ’ ఇటీవలి కాలంలో వార్తలలో ప్రముఖంగా నిలిచింది. ఆ వాహనం రంగు, ఎత్తు, వాహనానికి ఉన్నటైర్లు.. ఇలా పలు అంశాలు కేంద్ర ట్రాన్స్ పోర్ట్ చట్టానికి అనుగుణంగా లేవంటూ ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఆ వాహనానికి రోడ్లపై తిరిగే అర్హత లేదంటూ మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు.
ఇక ఏపీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అయితే.. వాహనం రంగు ప్రస్తావిస్తూ.. ఆ రంగు అంటే అలీవ్ గ్రీన్ కేవలం మిలిటరీ వాహనాలకు మాత్రమే పరిమితమని, మరో ఇతర వాహనాలకూ ఆ రంగు నిషిద్ధమని చెప్పారు. అందుకే వాహన తయారీ కంపెనీలేవీ అలీవ్ గ్రీన్ రంగుతో వాహనాన్ని విడుదల చేయలేదని అన్నారు. అంతే కాకుండా ఈ రంగుతో పవన్ కల్యాణ్ తన వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అసాధ్యమని కూడా అన్నారు.
మొత్తం మీద జనసేనాని తన ఎన్నికల ప్రచార రథం ఫొటోలు విడుదల చేసిన క్షణం నుంచీ, ఆ వాహనం ‘వారాహి’ ఇంకా రోడ్ల మీదకు రాకముందే వివాదాలలో చిక్కుకుంది. అయితే ఈ వాదనలూ, వివాదాలతో సంబంధంలేకుండా తెలంగాణ ట్రాన్స్ పోర్టు అధికారులు ‘వారాహి’ కి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఈ వాహనం చుట్టూ చుట్టుముట్టిన వివాదాలు దూది పింజెల్లా తేలియోయాయి. అయితే ఇప్పటి వరకూ అందరూ చెబుతున్నట్లుగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం రంగు అలీవ్ గ్రీన్ కాదనీ, డాక్యుమెంట్లలో దానిని ఆల్ట్రాగ్రీన్ గా పేర్కొన్నారని తెలిసింది. వారాహికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ వాహనం రోడ్లపైకి వస్తుందో రాదో అన్న అనుమానాలకు తెరపడినట్లైంది.
అన్ని సర్టిఫికెట్ పరిశీలించిన మీదట, వారాహి’కి రిజిస్ట్రేషన్ చేశామని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX 8384ను కేటాయించారని తెలిపారు.
దీంతో వాహనం రోడ్లపైకి వచ్చేందుకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని అంటున్నారు. అయితే ఏదో ఒక సాంకేతిక కారణం చూపి ఏపీ రోడ్లపై తిరగకుండా ‘వారాహి’ని అడ్డుకుంటారా అన్న అనుమానాలు మాత్రం జనసేన శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి.