అంతా నిజమే చెబుతున్నా.. నమ్మండి ప్లీజ్!
posted on Apr 27, 2023 @ 4:14PM
కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసులో తనను, తన నాన్నను ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారని మరో మారు ఆరోపించారు. మీడియా సమావేశంలో గతంలో పలుమార్లు చెప్పిన విషయాలనే ఆయన ఇంకో సారి ఆ సెల్ఫీ వీడియోలో చెప్పారు. మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇవే విషయాలను చెబితే ప్రశ్నలను ఎదుర్కొన వలసి వస్తుందన్న భయంతోనే సెల్ఫీ విడియో విడుదల చేశారని పరిశీలకులు అంటున్నారు.
ఇంతా చేసి.. తన ముందస్తు బెయలుపై మరి కొద్ది సేపటిలో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుండగా, ఆ విచారణ అనంతరం అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్న తరుణంలో వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి చేసిన చివరి ప్రయత్నంగా అవినాష్ రడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో కొత్త విషయం ఏమీ లేదు. ఈ నాలుగేళ్లుగా అవినాష్ ఏదైతే చెబుతున్నారో.. అదే చెప్పారు. ఎంత సేపూ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త తెలుగుదేశంతో కుమ్మక్కై ఈ కేసులో తనను ఇరికించారని చెప్పుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో గతంలో చేసిన విధంగానే సీబీఐ దర్యాప్తు మొత్తం తననూ, తన తండ్రినీ టార్గెట్ చేసుకునే సాగిందని చెప్పుకొచ్చారు.
వివేకా హత్యకు గురయ్యారన్న సంగతిని తనకు చెప్పకుండా ఆయన మరణించారని సమాచారం ఇచ్చి తనను సంఘటనా స్థలానికి రప్పించారని ఆరోపించారు. తాను ఘటనా స్థలానికి చేరుకునే లోగానే వివేకా రాసిన లేఖ, ఆయన ఫోన్ ను దాచేశారని చెప్పారు. తాను చెబుతున్న కోణంలో సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ విషయాల్నీ తాను గతంలో సీబీఐ డైరెక్టర్ కు కూడా తెలియజేశానని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టాలనే సునీతను అడ్డుపెట్టుకుని తెలుగుదేవం అధినేత ఇదంతా చేయిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే ఈ సెల్ఫీ వీడియో తరువాత పరిశీలకులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిందెవరో అవినాష్ సెల్ఫీ వీడియోలో ఎందుకు చెప్పలేదు? శరీరంపై గాయాలు కడిగి కుట్టు వేసి బ్యాండేజీ కట్టించిందెవరన్నదీ అవినాష్ ఎందుకు చెప్పలేదని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టును తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయిన అనంతరం ఫ్రస్ట్రేషన్ లో లాజిక్ కు అందని ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నంగా సెల్ఫీ వీడియోను విశ్లేషిస్తున్నారు.