50 లక్షలమందితో ఒకేసారి.. నిజమేనా ?
posted on Apr 27, 2023 @ 4:42PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి రోహిణి కార్తెను మించి పోతోంది. నిజానికి, మే 10న జరిగేది అసెంబ్లీ ఎన్నికలే అయినా ఈసంవత్సరం చివరి వరకు క్యూలో ఉన్నమరో ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే, 2024 లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితం లిట్మస్ టెస్ట్ కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, అధికారం కోసం హంగ్ కలలు కంటున్న జేడీఎస్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ప్రతి ఎన్నికను ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకునే మోడీ, షా జోడీ బీజేపీ భవిష్యత్ ను నిర్ణయించే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై సహజంగానే ప్రత్యెక దృష్టిని కేద్రీకరించింది. 2014లో చాయి పే చర్చ తో మొదలు పెట్టి ప్రతి ఎన్నికల్లో ఒక ప్రత్యేక ప్రచార వ్యూహన్ని అమలు చేస్తున్న మోడీ,షా జోడీ ఈసారి ... అవునా.. నిజామా అనిపించేలా కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఒకేసారి 50 లక్షల మంది బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా మాట్లాడారు. నిజానికి కర్ణాటకలో బీజేపీ ఎదురీతుతోంది, అవినీతి ఆరోపణల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ 40 శాతం కమిషన్ స్లోగన్ ప్రజలను ఆలోచింప చేస్తోంది. మరో వంక కాంగ్రెస్ ప్రభుత్వాలపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆసరా చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ కర్ణాటకలో మాత్రం అవినీతి ప్రస్తావన లేకుండా, రాకుండా జాగ్రత్త పడుతోంది.
చివరకు ప్రధాని మోడీ, కార్యకర్తల మెగా మీట్ లోనూ అవినీతి అంశాన్ని ముట్టుకోలేదు. కానీ బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్‌కు వారంటీ ముగిసిందని వ్యాఖ్యానించారు. వారంటీ ముగిసిన కాంగ్రెస్ మీకేం గ్యారెంటీ ఇస్తుందని వ్యంగ బాణాలు సందించారు. అంతేకాదు, ఈ రోజు వర్చువల్’గా ఒకే సారి 50 లక్షల మంది కార్యకర్తలతో మాట్లాదిన మోడీ మరో రెండు రోజుల్లో మీ మధ్యకు వస్తాను. కన్నడ ప్రజల ఆశీస్సులు తీసుకుంటాను, అంటూ తనదైన స్టైల్లో ఇటు కార్యకర్తలను అటు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార గురించీ మోడీ ప్రస్తావించారు. అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే వస్తే సరిపోదు. అది పూర్తి మెజార్టీతో ఉండాలి. దేశంలో మొదటి ఎయిమ్స్ 1956లో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాతది ఎప్పుడు వచ్చింది..? దాని గురించి కాంగ్రెస్ ఏమీ మాట్లాడదు.
మేం అధికారంలోకి వచ్చాం. ఎయిమ్స్ సంఖ్యను మూడు రెట్లు పెంచాం. ఇప్పుడు చెప్పండి డబుల్ ఇంజిన్ వల్ల లాభమా..? నష్టమా..? కాంగ్రెస్ అంటేనే ఒక అబద్ధపు గ్యారంటీ. కాంగ్రెస్ ఉంటే అవినీతికి గ్యారంటీ. ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ వారంటీ ముగిసింది అంటూ మోదీ విమర్శలు గుప్పించారు. 5 నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 50 లక్షల మంది కార్యకర్తలతో మాట్లాడడం ఎంతవరకు నిజమన్న దానిపై కర్ణాటకలో విస్తృత చర్చ జరుగుతోంది.
ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువ ఉండటంతో బీజేపీ నాయకులు వీలైనంత త్వరంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి, మరోసారి అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో పాటుగా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కు సవాలుగా నిలిచిన ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ప్రధాని మోడీచరిష్మా, హోం మంత్రి అమిత్ షా వ్యూహరచన , సంఘ్ పరివార్ అడదందలపైనా ఆధార పడితే, కాంగ్రెస్ పార్టీ స్థానికంగానే బీజేపీ ఎదుర్కునేందుకు సిద్దమవుతోంది. అయినా రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్ణాటక పైన ప్రత్యేక దృష్టి సారించారు.
మరో వంక కర్ణాటకలో ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చెయ్యాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కన్నడిగులు ఎవరిని ఆదరిస్తారు ? అనే విషయం తేలాలంటే వచ్చే నెల 13 వరకూ ఆగాల్సిందే.