వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల బిగింపునకే జగన్ సర్కార్ మొగ్గు
posted on Apr 27, 2023 @ 1:55PM
రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ విూటర్లను బిగించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్ విూటర్ల బిగింపునకు అవకాశంలేని చోట ఇన్ ఫా రెడ్ సమాచార ప్రామాణికం కలిగిన విూటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విూటర్ల బిగింపుతో పాటు బిల్లుల చెల్లింపును తొలుత రైతులే భరించాలని, ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్ బిల్లుల మొత్తాన్ని నగదు బదిలీ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో ఉచిత విద్యుత్ ఇస్తూనే విూటర్లను పెట్టే కార్యక్రమం చురుకుగా సాగుతోంది. విజయనగరంలో ఈ పథకం విజయవంతం అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. విూటర్ల బిగింపు వల్ల మంచి ఫలితాలు సాధించామని సిఎం జగన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. అంతే గాకుండా విద్యుత్ ఆదా అయ్యిందని గుర్తించామని అన్నారు. ఈ క్రమంలో మిగతా జిల్లాల్లో కూడా దీనిని విస్తరించే పని జరుగుతోంది. విద్యుత్ ఉచితం అంటూనే రైతులపై అదనపు భారాన్ని వెూపబోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. ఇకపై వ్యవసాయ విద్యుత్ బిల్లులను రైతులు తమ జేబుల నుంచే చెల్లించాల్సిన పరిస్థితి రాబోతోందన్నభావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాలో కొత్తగా తెచ్చిన సంస్కరణలపై ఇంధన శాఖ కార్యదర్శి మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రత్యేకంగా ఏపీ హరిత ఇంధన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని, ఈ విూటర్ల ద్వారా ప్రతి నెలా వచ్చే బిల్లును తామే చెల్లిస్తామని జీఓలో వెల్లడించారు. ఇలా వెల్లడిస్తూనే, మరోప్రక్క వ్యవసాయ పంపుసెట్లు ఏ నెలలో ఎంతెంత కరెంటు కాల్చుకొనే అవకాశం వుందో ప్రభుత్వం లెక్కగట్టింది. ఆ అంచనా ప్రకారం ఇప్పుడున్న పంపు సెట్లు ఏడాదికి 12 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు వాడే అవకాశం వుందని, ఆ విధంగా ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని, ఆ మొత్తాన్ని నెలవారీగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుందని జీఓలో వెల్లడించారు. కానీ అంతకుమించి వాడకం పెరిగితే ఆ భారం ఎవరు భరించాలన్నది మాత్రం చెప్పడంలేదు. అసలు విద్యుత్తు పంపిణీ సంస్థలకే సబ్సిడీ డబ్బులు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం భవిష్యత్ లో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తుందనే గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న రైతుల నుంచి వస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా సాఫీగా అమలవుతున్న ఉచిత విద్యుత్తు పథకానికి కొర్రీలు వెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందని టిడిపి నిలదీస్తోంది.
పైవేటు కంపెనీల ప్రయోజనం కోసమే వ్యవసాయ పంపుసెట్లకు విూటర్లు బిగిస్తున్నారని ఆరోపిస్తోంది. డిస్కమ్‌లను ప్రయివేటీకరణ చేసే ప్రణాళికలో భాగంగా ఈ విధానం తెస్తున్నారని చెబుతోంది. దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులను జగన్ సర్కార్ ఏమాత్రం వ్యతిరేకించకుండా వేగంగా అమలు చేస్తోందని , నగదు బదిలీ పథకాన్ని డిసెంబరులోగా అమలు చేయాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ నుంచే అమలు చేయాలని నిర్ణయించి, అందుకు శ్రీ కాకుళం జిల్లాను ఎంపిక చేసింది. విూటర్ల బిగింపునకు జగన్ సర్కార్ పరుగుతు ఎందుకని తెలుగుదేశం నిలదీస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ నగదు బదిలీ పథకాన్ని తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భుజానికెత్తుకుందని మండిపడ్డారు. అదనపు అప్పుకోసం కేంద్రం ఆడమన్నట్లల్లా ఆడుతూ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు సిద్ధం కావడం అన్యాయమని విమర్శిస్తోంది.
ఒక పక్క తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానంటూ, వైఎస్ పేరుతో రైతు దినోత్సవాలు జరుపుతూ, మరో పక్క ఆయన అమలుచేసిన ఉచిత విద్యుత్తు పథకానికి తనయుడు జగన్మోహన్ తూట్లు పొడవడం రైతులను వెూసం చెయ్యడం కాదా అని నిలదీస్తోంది. ఉచిత విద్యుత్తుకు స్వస్తి చెప్పే చర్యల్ని పరోక్షంగా అమలు చేస్తూ విూటర్లు బిగించడం పేరిట ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తోంది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం మున్ముందు ఉచిత విద్యుత్తు బిల్లులు మాత్రం చెల్లిస్తుందన్న నమ్మకం ఏ మాత్రం లేదని, ఒకసారి విూటరు బిగించి యూనిట్లు ప్రకారం బిల్లులు చెల్లించడం మొదలు పెడితే అది తమ మెడకు గుది బండ అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.