ప్రధాని రేసులో ప్రియాంక వాద్రా?
posted on Apr 27, 2023 @ 2:12PM
పీఎం ప్రియాంక వాద్రా .. ఇదీ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం తెరపైకి తెచ్చిన కొత్త అలోచన. కొత్త నినాదం. నిజానికి ఇది కొత్త ఆలోచన కూడా కాదు, చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకా వాద్రాకు కీలక బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తూనే వుంది. ఆ డిమాండ్ ఇప్పటి వరకూ అలా వచ్చి ఇలా...పోతూవచ్చింది. నిజానికి, ప్రియాంక కూడా కాంగ్రెస్ పార్టీలో మరింత ‘కీ రోల్’ ప్లే చేసేందుకు... ఆసక్తి చూపించారు. 2019 ఎన్నికల్లో వారణాసి నియోజక వర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద పోటీ చేసేందుకు కూడా ప్రియాంక రెడీ అయ్యారు. అయితే ఎందుకో కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందుకు అంగీకరించ లేదు. అలాగే, 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాడి వదిలేసిన సందర్భంలోనూ, పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కుడా ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ, ఫస్ట్ ఫ్యామిలీ బయటి వ్యక్తికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే షరతు విధించడంతో ప్రియాంక ఆశకు రాహుల్ రెండవ సారి బ్రేకులు వేశారు
అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడిన నేపధ్యంలో మరో మారు ప్రియాంక పేరు ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. నిజానికి భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీని ప్రతిపక్ష్లాల ప్రధాని అభ్యర్ధిగా నిలిపేందుకు, కాంగ్రెస్ పెద్దలు చాలా గట్టి ప్రయత్నమే చేశారు. అయితే అనుకోకుండా మోడీ ఇంటి పేరు కేసు విచారణకు రావడంతో కథ అడ్డం తిరిగింది. సీన్ మారిపోయింది. రాహుల్ గాంధీకి సూరత్‌లోని ట్రయల్ కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించడం, ఆయనపై అనర్హత వేటు పడడం,లోక్ సభ సభ్యతం రద్దవడం చకచకా జరిగి పోయాయి.
ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు తీర్పును రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ శిక్ష నిలుపుదల చేయాలన్న అభ్యర్ధనను తిరస్కరించింది. దీంతో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్‌కు ఛాన్స్ లేదు. దీనిపై రాహుల్ హైకోర్టులో సవాల్ చేసినా.. ఆకేసు ఇప్పట్లో తేలే ఛాన్స్ కనిపించడం లేదు.
నిజానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా, కేసు విచారణకు రాక ముందే హై కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు విచారణను జస్టిస్ గీతా గోపి ధర్మాసనానికి గుజరాత్ హైకోర్టు కేటాయించింది. అయితే, కేసు విచారణ బాధ్యతల నుంచి జస్టిస్ గీతా గోపి అనూహ్యంగా వైదొలిగారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆమె సూచించారు. బుధవారం(ఏప్రిల్ 26) రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ముందుగా విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది పీఎస్ చాపనెరి, జస్టిస్ గీతా గోపి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆమె సూచించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పిటిషన్‌పై ఏ ధర్మాసనం విచారణ చేపడుతుందన్న స్పష్టత వస్తుందని పీఎస్ చాపనెరి తెలిపారు.
ఈ పరిణామాలను గమనిస్తే, రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్నది సందిగ్ధంలో పడింది. ఈ నేపధ్యంలోనే రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక వాద్రాను ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే ఆలోచన తెరపైకొచ్చింది. గాంధీ కుటుంబమ వీర విధేయుడిగా ఇంటా బయట గట్టిగా వాదించే ప్రమోద్ కృష్ణ పీఎం ..ప్రియాంక ఆలోచనను, ప్రదిపాదనను తెర మీదకు తెచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.
ఇటు రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ స్థానంలో అయినా.. లేకపోతే.. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి అయినా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ 2019లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.రాహుల్ గాంధీ చిక్కుల్లో పడటంతో ప్రియాంక గాంధీకి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి సంబంధించిన చర్చ అనవసరమని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీకి పార్టీలో ముఖ్యమైన పాత్ర ఉందని. రాహుల్ గాంధీ అత్యున్నత నాయకుడని.. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడని స్పష్టం చేశారు. అయితే, ప్రమోద్ కృష్ణ తెరపైకి తెచ్చిన పీఎం ..ప్రియాంక చర్చ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..చూడవలసిందే అంటున్నారు.