శరద్ పవార్ దారెటో తేలిపోయిందా?

విపక్షాల ఐక్యత కోసం అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తున్న శరద్ పవార్ ఇప్పుడు అదే విపక్ష కూటమికి దూరమౌతున్నారా? విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పారిశ్రామిక వేత్త అదానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన రాజకీయ రూటు మారిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదానీ, మోడీ నెక్సస్ పై విపక్షాలు విమర్శలు చేస్తుంటే.. పవార్ మాత్రం అదానీ, మోడీ సంబంధం, మోడీ విద్యార్హత తప్ప మరో సమస్యే లేదా అంటూ చిటపటలాడుతున్నారు. దీంతోనే ఆయన విపక్షాల ఐక్యతకు కాకుండా విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారా? కమలానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పరిశీలకులు సైతం అదే దారిలో విశ్లేషణలు చేశారు. ఆ అనుమానాలకూ, విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా అదానీతో శరద్ పవార్ బేటీ అయ్యారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ స్వయంగా ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లి మరీ భేటీ అయ్యారు. వీరిరువురి మధ్యా జరిగిన చర్చలేమిటన్నది పక్కకు పెడితే.. హిడెన్ బర్గ్ నివేదిక తరువాత అదానీపై వెల్లువెత్తుతున్న విమర్శలు, జేపీసీ కోసం విపక్షాల డిమాండ్ నూ పట్టించుకోకుండా కేంద్రం నిర్మొహమాటంగా అదానీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో శరద్ పవార్, అదానీ బేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పైపెచ్చు విపక్షాల విమర్శలను ఖండిస్తూ పవార్ అదానీకి మద్దతుగా నిలవడంతో ఈ భేటీ రాజకీయ ప్రాముఖ్యతను  సైతం సంతరంచుకుంది.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో శరద్ పవార్ కేంద్రానికి మద్దతుగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు. 

కర్నాటక ఎన్నికల సమరంలో యాచకుడు.. ఇండిపెండెంట్ గా పోటీ

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలంటే వందలు వేలు లక్షలు కాదు కోట్లలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే కాదు, చివరకు  పంచాయతీ వార్డు మెంబరుగా పోటీచేసినా అభ్యర్ధులు లక్షల్లో ఖర్చుచేస్తున్న సంఘటనలు ఉన్నాయి.  అంత ఖర్చు చేసినా చివరకు ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని ఇంటికి పంపుతారో తెలియదు.   ఎన్నికలో పోటీ చేయాలంటే చదువు అవసరం లేదు కానీ, డబ్బుల మూటలు మాత్రం మేండటరీగా మారిపోయిన రోజులివి. అటువంటిది కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో యాదగిరి నియోజక వర్గం నుంచి బిచ్చమెత్తుకుని బతికే యంకప్ప అనే యాచకుడు బరిలోకి దిగారు. యాదగిరి పట్టణంలో బిచ్చమెత్తుకుని బతుకుతున్న ఆయనకు ఇల్లూ వాకిలీ    లేవు. పొద్దంతా ఇక్కడా అక్కడా బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునే, యంకప్ప రాత్రికి ఏ గుడిలోనో తలదాచుంటారు. అయితే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కానీ,  పోటీ చేయాలనే నిర్ణయానికి అయితే వచ్చారు. అంతే ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్‌కు కావాల్సిన డబ్బు కోసం నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి, బిచ్చమెత్తి డిపాజిట్  చెల్లించేందుకు అవసరమైన రూ.10వేలు సేకరించారు. ఆలా బిచ్చమెత్తి తెచ్చిన రూ.10వేల చిల్లర నాణేలనే డిపాజిట్  గా చెల్లించారు. ఆ నాణేలను లెక్కించేందుకు అధికారులకు రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. కాగా  యంకప్ప డిపాజిట్ సొమ్ములు సేకరించడంలోనే పనిలో పనిగా   ప్రచారం కూడా కానిచ్చేశారు.. ఈ ఎన్నికల్లో  తాను ఎందుకు పోటీ చేస్తున్నది ప్రజలకు చెప్పి మరీ,  డిపాజిట్ మొత్తం సేకరించారు. ఈ విషయం ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఎన్నికలలో పోటీ కోసం కోసం అవసరమైన డిపాజిట్ డబ్బుల కోసం యాచిస్తున్నానని ఆయన ప్రజలకు చెప్పి మరీ అడుక్కున్నాడు. ఆయన నామినేషన్’ ఆమోదం పొంది, పోటీలో నిలిచి గెలిస్తే   యంకప్ప చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. యంకప్పే కాదు, యాదగిరి నియోజక వర్గం, నియోజక వరం ప్రజలు కూడా చరిత్ర పుటల్లో నిలిచి పోతారు.అయితే, గతంలోనూ కొందరు పేదలు పోటీ చేసిన సందర్భాలు లేక పోలేదు. అయితే, సక్సెస్ అయిన సందర్భాలు మాత్రం అతి స్వల్పం. ఇంతకీ కొసమెరుపేమిటంటే.. దిగ్గజాల మధ్య యంకప్ప ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. 

కాంగ్రెస్‌ గూటికి పొంగులేటి, జూపల్లి?! ముహూర్తం ఖరారు?

బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్‌రెడ్డి,  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్‌ గూటికి చేరడం దాదాపు ఖరారయ్యింది.  మే నెల మొదటి వారంలో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వచ్చే నెల 4 లేదా 5న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.   వచ్చే 4 లేదా 5న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో టీ పీసీసీ ఆధ్వర్యంలో  నిరుద్యోగ నిరసన గర్జన జరగనుంది. ఈ నిరుద్యోగ నిరసన గర్జన సభకు  ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఆ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి, జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్ కండువాకప్పుకోనున్నారు. ఈ  ఇరువురితో  పాటు వారి న అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో  పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్‌ కనుగోలు రాష్ట్రంలో పార్టీ   బలోపేతం కావాలంటే ఇతర పార్టీలోని అసంతృప్తులను, బలమైన నాయకులు చేర్చుకోవాలని చేసిన సూచన మేరకు  టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి   ప్రత్యేక చొరువ తీసుకుని మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో  చర్చించారనీ, ఆ చర్చల ఫలితమే వీరి చేరికకు రంగం సిద్ధం అయ్యిందనీ కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని అదే జిల్లాకు చెందిన  కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆమె ఖమ్మం లోక్‌సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరితే.. ఖమ్మం పార్లమెంట్‌ సీటు విషయంలో ఇబ్బందులు వస్తాయని ఆమె వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి  సహా పలువురు సీనియర్ నేతలు   ఆమె నివాసానికి వెళ్లి ఆమెను ఒప్పించారని చెబుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక విషయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నాయకుల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

విశాఖ స్టీల్ బిడ్డింగ్ పైహైప్ క్రియోట్ చేసి ఉస్సురుమనిపించారు!

బీఆర్ఎస్ విశాఖ ఉక్కుబాగోతం బట్టబయలైంది. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)బిడ్ దాఖలు చేస్తాం, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానీయం, కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది.. అంటూ గంభీరంగా ప్రకటనలు గుప్పించి, డాంబికాలు పలికిన బీఆర్ఎస్ చేతులెత్తేసింది. విశాఖ స్టీల్‌ ఈవోఐ బిడ్లలో తెలంగాణ సర్కారు పాల్గొని, విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను ఆపుతుందని.. బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన హడావిడి, హుటాహుటిన సింగరేణి యాజమాన్యాన్ని విశాఖకు పంపించి, స్టీల్ ఫ్యాక్టరీని పరిశీలించమని ఆదేశించి, బిడ్డింగ్ వివరాలపై ఆరా తీయించిన కేసీఆర్ సర్కార్.. తమకంత సీన్ లేదని చతికిలపడిపోయింది. బిడ్ వేసి విశాఖ స్టీల్ ను గంపగుత్తగా తాము అధీనంలోకి తెచ్చేసుంటామన్నంత బిల్డప్ ఇచ్చిన కేసీఆర్  తాము బిడ్ వేయడానికి గడువు కావాలంటూ కోరింది. నిజమేకాబోలని  స్టీల్‌ యాజమాన్యం ఐదు రోజులు గడువు పొడిగించింది. ఆ గడువు ముగిసిపోయింది.. అయినా  సింగరేణి యాజమాన్యం బిడ్ దాఖలు చేయలేదు. తమకసలా ఉద్దేశమే లేదన్నట్లుగా గమ్మునుండిపోయింది.   దాంతో  విశాఖ స్టీల్‌ యాజమాన్యం తన పని తాను చేసుకుపోయింది. విశాఖ స్టీల్‌ను  ప్రైవేటీకరణ నుంచి కాపాడేస్తున్నామంటూ తెగ హంగామా చేసిన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు నోరెత్తడం లేదు. విశాఖ స్టీల్‌ను ఆదుకుంటున్న కేసీఆర్‌ను, విశాఖకు తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారంటూ.. గొప్పలు చెప్పిన ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ముఖం చాటేశారు.  బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడానికి కారణమేమిటో కూడా చెప్పేందుకు సింగరేణి యాజమాన్యానికి కానీ, బీఆర్ఎస్ నాయకత్వానికి కానీ కనీసం ముఖం చెల్లలేదు.  అయితే విశాఖ స్టీల్ విషయంలో కేసీఆర్ కుప్పిగంతులు ఆయనకు రాజకీయంగా కావలసినంత నష్టం చేకూర్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విశాఖ స్టీల్‌ బిడ్డింగ్‌లో పాల్గొని, అందులో పెట్టుబడి పెట్టడమో, లేక సరుకు సరఫరా చేయడం ద్వారా.. బీఆర్‌ఎస్‌ ఆంధ్ర ప్రజలకు దగ్గరవుతుందన్న అంచనాలు మంత్రుల ప్రకటనలు, సింగరేణి అధికారుల విశాఖ పర్యటన, ఏపీ బీఆర్‌ఎస్‌ నేతల అత్యుత్సాహం వల్ల భారీగా పెరిగాయి.   చివరికి బిడ్డింగ్ లో పాల్గొనకుండా పలాయనం చిత్తగించడంతో  ఏ రాజకీయ మైలేజీ కోసమైతే బీఆర్ఎస్ ఇంత హడావుడి చేసిందో.. అది దక్క లేదు సరికదా, రాజకీయంగా ప్రతిష్ట మసకబారింది. విపక్షాలు బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా సమాధానం చెప్పుకోలేని, కౌంటర్ ఇవ్యలేని దుస్థితిలో ఇప్పుడు ఆ పార్టీ ఉంది.   కేసీఆర్ విశాఖ స్టీల్ బిడ్ ప్రస్తావన తేగానే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ సర్కార్ కానీ, సింగరేణి యాజమాన్యం కానీ 5 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తుంది? ఇదంతా కేసీఆర్‌ పబ్లిసిటీ స్టంట్‌. తాదూర కంత లేదు కానీ మెడకో డోలన్నట్లు.. ఇక్కడ మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించే దిక్కులేదు కానీ ఆంధ్రాకు వెళ్లి ఏం చేస్తారంటూ బీజేపీ-కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.   ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు వాటిని అప్పట్లో ఖండించారు. తీరా విపక్షాలు విమర్శించినట్లుగానే   తెలంగాణ సర్కారు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా  ముఖం చాటేయడంతో బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధిని, ప్రచారపటోపం తప్ప మరేం కాదన్న విషయం ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. బీజేపీ-కాంగ్రెస్‌ విమర్శలు నిజమని  తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అసలు విశాఖ స్టీల్‌ వ్యవహారంలో తలదూర్చడమే వ్యూహాత్మక తప్పిదమని, సింగరేణికి అంత ఆర్ధిక స్తోమత లేదని తెలిసికూడా సాహసం చేసి, చేతులు కాల్చుకున్నామని బీఆర్‌ఎస్‌ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఇక ఇప్పుడు పట్టుకుందామన్నా ఆకులు దొరికే పరిస్థితి  లేదనీ, జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ అంటున్నారు. ఈ అనవసర తప్పిదం వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. జాతీయ స్థాయిలో కూడా మసకబారిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. పరిశీలకులూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ పై భూ కబ్జా ఆరోపణ

విశ్వ భారతి యూనివర్శిటీ నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ కు ఇచ్చిన కబ్జా ఆరోపణలు  రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 13 దశాంశాల భూమిని సైతం ఖాళీ చేయాలని యూనివర్శిటీ నోటీసులు జారీ చేయడం నోబుల్ గ్రహీతను అవమానపర్చడమేనని విశ్లేషకులు అంటున్నారు.  అమర్త్యాసేన్ ఒక కబ్దాదారు అన్న లెవల్ లో కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం చూస్తే బీజేపీ ప్రభుత్వం  అమర్త్యా సేన్ ను టార్గెట్ పెట్టుకున్నట్టు కనబడుతోంది. వాయువ్య మూలలో ఉన్న 13దశాంశాల భూమిని సైతం వదులుకోవడానికి సిద్దంగా లేదు. పైగా రూల్స్ మాట్లాడుతోంది. చట్టవిరుద్దంగా  భూమిని అమర్త్యాసేన్ ఆక్రమించాడని బీజేపీ ప్రభుత్వ ఆరోపణ. అమర్త్యాసేన్ వంటి దిగ్గజానికి భూమిని ఆక్రమించాల్సిన అగత్యం ఏమిటి? ఉద్దేశ్యపూర్వకంగా 13 దశాంశాల భూమిని ఆక్రమించాడా? ప్రభుత్వమే అమర్త్య సేన్ ను టార్గెట్ చేసి కబ్జా ఆరోపణలు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి  జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ‘‘ ప్రధానమంత్రి తనను విమర్శించే ఎవరినైనా టార్గెట్ చేస్తాడని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీద భారత రత్న అవార్డు అందుకున్న అమర్థ్య సేన్ ను టార్గెట్ చేయడం శోచనీయం’’ అని ఆయన ట్వీట్ చేశారు.  అమర్త్యసేన్ గొప్ప ఆర్థికవేత్త. 1998లో నోబుల్ పురస్కారం దక్కింది. పేదరిక నిర్మూలనకు ఆయన పాటుపడ్డారు.  వివాదాస్పదమైన ఈ భూమిని తన తండ్రి కొనుగోలు లీజుకు తీసుకున్నాడని, ఇందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని అమర్త్య సేన్ చెబుతున్నారు. పేదల అభ్యున్నతికి ఆయన అనేక ఆర్థిక విధానాలను రూపొందించాడు. 99 సంవత్సరాల కోసం అమర్త్యసేన్ తండ్రి విశ్వ భారతి విశ్వ విద్యాలయానికి చెందిన 1.25 ఎకరాల  భూమిని లీజుకు తీసుకున్నాడని వైస్ చాన్సలర్ చెబుతున్నారు. 15 రోజుల్లో వివాదాస్పద 13 దశాంశాల భూమిని వెనక్కి తీసుకుంటామని వైస్ చాన్సలర్ అంటున్నారు.  అమర్థ్య సేన్ ముగ్గురిని వివాహం చేసుకున్నాడు.  ఆయన 1933లో జన్మించారు. 89 సంవత్సరాల వయసులో కూడా అమర్థ్యా సేన్ కబ్జా ఆరోపణలు ఎదుర్కోవడం పలువురిని విస్మయపరుస్తుంది. అమర్త్యా సేన్ తండ్రి అశుతోష్ సేన్ కెమిస్ట్రీ  ప్రొఫెసర్ గా పని చేశాడు. అతను ధాకా యూనివర్శిటీలో పని చేశాడు. అమర్థ్యా సేన్ కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజిలో చదువుకున్నారు. తర్వాత హార్వార్డ్ యూని వర్శిటీలో చదువుకున్నారు. 

విజయసాయిరెడ్డి... మార్పులో మతలబేంటి?

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు జన్మదినం గురువారం (ఏప్రిల్ 20) ఆయనకు   పార్టీ నుంచి, ప్రజల నుంచీ, వివిధ రంగాల ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ వైసీపీ విజయసాయిరెడ్డి  ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం, అదీ ఎంతో అభిమానంతో, గౌరవంతో మర్యాదపూర్వక భాషలో తెలియజేయడం అన్ని వర్గాల వారినీ సంభ్రమాశ్చర్యలలో ముంచెత్తింది.  సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నావిజయసాయిరెడ్డి చంద్రబాబుకు తెలిపిన అభినందనలు రాజకీయవర్గాలలోనే కాదు సామాన్య జనంలో కూడా కొత్త చర్చకు దారితీశాయి. విజయసాయి ట్వీట్లు.. అవి అభినందించడానికి చేసినా సాధారణంగా విమర్శలు, వెటకారాలు, అనుచిత భాషా ప్రయోగాలతో ఉంటాయి. ఆయన గతంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన ట్వీట్లు చూస్తే ఆ విషయం ఇట్టే అవగతమౌతుంది. అయితే ఈ సారి మాత్రం విజయసాయి చంద్రబాబుకు తెలిపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం చాగంటి వారి ప్రవచనంలాగా చాలా మర్యాద, మన్ననా ఉట్టిపడుతూ ఉంది.  ఇదే సర్వత్రా చర్చకు కారణమైంది. రాజకీయవర్గాలలో విజయసాయిలో వచ్చిన ఈ మార్పు పట్ల పలు కోణాల్లో చర్చ జరుగుతోంది. విజయసాయి చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ పై నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు.  గతంలో విజయసాయిరెడ్డి స్పందించిన తీరుకీ... ఇప్పుడ ఆయన స్పందించిన తీరుకు చాలా చాలా వ్యత్యాసం ఉందనీ,సీఎం జగన్ భాషలో లా  నాడు – నేడు కార్యక్రమం స్టైల్‌లో చెప్పాలంటే   చాలా చాలా ఉదాహరణలతో చెప్పొచ్చని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, ఆయన కుమారుడు  లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా..  విజయసాయిరెడ్డి ఎలా చెలరేగిపోయేవారో గుర్తు చేస్తున్నారు.  ఇంతకీ..  విజయసాయిరెడ్డిలో ఇంతటి మార్పు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి.. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి సమీప బంధువని.. అయితే తారకరత్న మృతి నేపథ్యంలో వారి ఇంట విజయసాయిరెడ్డి అంతా తానై వ్యవహరించారని.. ఆ క్రమంలో తారకరత్న నివాసానికి వచ్చిన  చంద్రబాబు, నారా లోకేశ్‌, నందమూరి బాలకృష్ణతో ఈ విజయసాయిరెడ్డి చాలా సన్నిహితంగా మెలిగారని.. ఈ ఎపిసోడ్ తర్వాత విజయసాయిరెడ్డిని  జగన్ సాధ్యమైనంత దూరం పెట్టారనీ,  ఇటీవలి కాలంలో విజయసాయికి వైసీపీ కార్యక్రమాలలో కానీ,   వ్యవహారాలలో కానీ కనీస ప్రాతినిథ్యం లేకుండా పోయిందని అంటున్నారు.  మరో నెటిజన్ అయితే  వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి.. చంచల్‌గూడాకు తరలించారని... మరికొద్ది రోజుల్లో వైయస్ అవినాష్‌రెడ్డికి  సైతం శ్రీ కృష్ణ జన్మస్థానం తప్పదంటూ ఓ ప్రచారం అయితే బయట జోరుగా సాగుతోందని... అటువంటి తరుణంలో  జగన్... పార్టీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో భేటీ అయి.. ప్రస్తుత పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారని... కానీ ఈ భేటీకి విజయసాయిరెడ్డిని దూరంగా ఉంచిన సంగతిని గుర్తు చేస్తూ..  జగన్..  తనను దూరం పెడితే.. తాను సైతం ఆయనను దూరం పెట్టగలనన్న సంకేతాన్ని విజయసాయి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ట్వీట్ ద్వారా ఇచ్చారని వివరించాడు.  ఏది ఏమైనా ఏదో అడ్వర్టైజ్ మెంట్లలో మరక మంచిదే అన్నట్లు.. విజయసాయిలో వచ్చిన ఈ మార్పు కూడా మంచికే నంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

కడప బరిలో అత్తా కోడలా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ  అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఇప్పటికే  భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి... హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించి... విచారిస్తున్నారు. ఇక  అవినాష్ రెడ్డి ఎన్ని సార్లు కోర్టు తలుపు తట్టినా.. ఆయన అరెస్ట్ కావడం మాత్రం పక్కా అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఓ వేళ  అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన రాజకీయ జీవితానికి శుభం కార్డు పడే అవకాశాలున్నాయని వైసీపీలోని ఒక వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.  అదీకాక వివేకా హత్య కేసులో ప్రజల వేళ్లన్నీ  అవినాష్ రెడ్డి ఆయన తండ్రి   భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయని...  దీంతో ఆయన పోటిలికల్ గ్రాఫ్ పడిపోయిందనీ... ఈ విషయాన్ని గ్రహించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ రంగంలోకి దిగి.. తమ ఫ్యామిలీకి ఆయువు పట్టులాంటి   కడప లోక్‌సభ స్థానం లో పార్టీ పట్టు జారకుండా ఉండేందుకు చేపట్ట వలసిన నష్ట నివారణ చర్యలపై ఫోకస్ చేశారని ఆ వర్గం చెబుతోంది. అందులోభాగంగా తాడేపల్లి ప్యాలెస్‌లో తాజాగా పార్టీ అగ్రనేతల భేటీలో ఇదే అంశంపై   జగన్ కులంకుషంగా చర్చించారని చెబుతోంది.    ఆ భేటీలో.. వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి   భారతీని నిలబెట్టాలన్న ఓ ప్రతిపాదన  వచ్చిందనీ... అయితే వివేకా హత్య కేసులో ఆమె ప్రమేయం ఉందంటూ ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం   నేతలు ఆరోపణలు   గుప్పిస్తున్నారని... అదీకాక   వివేకా హత్య జరిగిన తర్వాత.. అటు   జగన్ ఓఎస్డీకి, ఇటు   భారతి పీఏ నవీన్‌కు   అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి పలుమార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు.. సీబీఐ విచారణలో అధికారులు గుర్తించారని...ఆ క్రమంలో వారిద్దరికీ సీబీఐ నోటీసులు జారీ చేసి.. విచారించిందని... అటువంటి పరిస్థితుల్లో   భారతిని కడప ఎంపీగా బరిలోకి దింపితే... విజయావకాశాలు కష్టమయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం కూడా ఆ భేటీలో వ్యక్తమైందని అంటున్నారు.   ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మను.. కడప ఎంపీగా బరిలోకి దింపితే.. ఆమె భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయన్న చర్చ కూడా తాడేపల్లి ప్యాలస్ లో పార్టీ అగ్రనేతలతో జగన్ జరిపిన భేటీలో చర్చకు వచ్చిందని అంటున్నారు. అయితే కడప ఎంపీగా బరిలో దిగేందుకు  విజయమ్మ అంగీకరిస్తారా? లేదా అన్న అనుమానం సైతం   ఈ సందర్బంగా  వ్యక్తమైందని అంటున్నారు.  జగన్.. అధికార పీఠం ఎక్కిన కొద్ది రోజులకే... ఆయన తల్లి   విజయమ్మ,  సోదరి  షర్మిలలు..   తెలంగాణకు షిప్టయిపోయారు. ఆ తర్వాత   షర్మిల... వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి.. ఆ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. అలాంటి వేళ కడప ఎంపీగా   పోటీ చేయాలంటూ    జగన్ విజయమ్మకు ఆఫర్ ఇస్తే అంగీకరిస్తారా? అన్న అనుమానాలు ఆ భేటీలో వ్యక్తమయ్యాయి.  కడప లోక్‌సభ స్థానం కోసమే   వివేకా హత్య జరిగిందంటూ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆ ఆఫర్‌ను   విజయమ్మ   తిరస్కరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన భావన ఆ భేటీలో వ్యక్తమైందంటున్నారు. ఓ వేళ   విజయమ్మ   ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. కడప లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ   అభ్యర్థిగా వైఎస్ ఫ్యామిలీలోని వారే నిలుస్తారా? లేకుంటే.. బయట వ్యక్తి బరిలో నిలిచే అవకాశం ఉందా? అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

కర్నాటకలో రేకలు రాలిన కమలం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా, నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందే అభ్యర్ధుల ఎంపిక కసరత్తును, దిగ్విజయంగా పూర్తి చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన చివరి జాబితాను  గురువారం (ఏప్రిల్ 20) విడుదల చేసింది. అలాగే  కొన్ని నియోజక్ వర్గాల్లో ముందు ప్రకటించిన అభ్యర్ధుల స్థానంలో కొత్తవారిని తెర మీదకు తెచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పోటీ చేస్తున్న షిగ్గావ్ నుంచి తమ అభ్యర్థిగా మహ్మద్ యూసఫ్ సవనూర్‌ను ప్రకటించిన కాంగ్రెస్, తాజాగా ఆయన స్థానంలో స్థానికుడైన యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది.  షిగ్గావ్ ఎమ్మెల్యేగా బొమ్మై ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించారు. షిగ్గావ్ నియోజకవర్గంలో లింగాయత్‌లు, ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. దీంతో నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని మార్చడం ఆసక్తికరంగా మారింది. కాగా, తుది జాబితాలో రాయచూర్ టికెట్ మహ్మద్ షలీమ్‌కు ఇచ్చిన కాంగ్రెస్.. సిడ్లఘట్ట నుంచి బీవీ రాజీవ్ గౌడ, సీవీ రామన్ నగర్ నుంచి ఎస్.ఆనంద్ కుమార్, అర్కాల్‌గుడ్ నుంచి హెచ్‌పీ శ్రీధర్ గౌడ, మంగళూరు సిటీ నార్త్ నుంచి ఇనాయత్‌ అలీని పోటీలో నిలిపింది. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో, ఏ పంచాయతీ లేకుండా సజావుగా అభ్యర్ధుల ఎంపిక సాగడం   ఐక్యతకు సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే హస్తం పార్టీకి ఇదొక శుభ సంకేతంగా పేర్కొంటున్నారు. అదలా ఉంటే, ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని ఆశిస్తున్న అధికార బీజేపీలో అభ్యర్ధుల ఎంపిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంచు మించుగా మూడింట ఒక వంతు (75) టికెట్లు కొత్త వారికి ఇచ్చిన కమలం పార్టీలో క్రమశిక్షణ కట్టుబాట్లు కట్లు తెంచుకున్నాయి. కమలం రేకలు రాలిపోతున్నాయి.  టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఒకరివెంట ఒకరు క్యూ కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.  బీజేపీ టికెట్ పై ఆరు సార్లు  ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి  లక్ష్మణ్ సవాడీ తదితర బీజేపీ నేతలు ఇప్పటికే హస్తం గూటికి చేరగా.. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2017 వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన తర్వాత జేడీఎస్ తరఫు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపరేషన్ కమలంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయ కారణాలతో తాను పార్టీ మారుతున్నట్లు ఆయన తెలిపారు. రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన ఆయన 2017 వరకు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. అనంతరం ఆయన జేడీఎస్‌లో చేరి హున్సూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపరేషన్ కమలంలో భాగంగా.. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019 డిసెంబర్లో జరిగిన ఉపఎన్నికల్లో ఓడిన ఆయనకు 2020 జులైలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇప్పుడు ఆయన మళ్ళీ సొంత గూటికి చేరారు.  అదలా ఉంటే, ఫిరాయింపుల ప్రభావం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి  లక్ష్మణ్ సవాడి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగదీశ్ షట్టర్ అయితే 25 నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్ధులను ఓడిస్తానని ప్రకటించారు. అయితే, బీజేపీ నాయకులు మాత్రం జగదీశ్ షట్టర్  , జనసంఘ్’రోజుల నుంచి పార్టీలో ఉండి  ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆయన కుటుంబ సభ్యులే జీర్ణించుకోలేక పోతున్నారని..ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిదంగా ఉన్నారని అనటున్నారు. అలాగే, సుదీర్ఘ కాలంగా ఆయనతో కలిసి పనిచేసిన పార్టీ స్థానిక నాయకులు , కార్యకర్తలు, జగదీశ్  షట్టర్ స్వతంత్ర అభ్యర్ధిగా పొటీకి దిగి ఉంటే ఆయనపై ఉన్న అభిమానంతో ఆయనను గెలిపించుకునే వారమని, పోయిపోయి కాంగ్రెస్ లో చేరి ఆయన తప్పు చేశారాణి అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుంది అనుకునేదుకు లేదని, ప్రస్తుతం తుపాను ముందు ప్రశాంతత ఉన్నా, ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేమని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.

బీఆర్ఎస్ మరో సెల్ఫ్ గోల్!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం, అనవసరంగా వేలు పెట్టి, చేయి కాల్చుకుందా? బీఆర్ఎస్ పార్టీ మరో మారు సెల్ఫ్ గోల్ చేసుకుందా? అంటే, అవునన్న సమాధానమే వస్తోంది, నిజానికి ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇటీవల కాలంలో ఇలాంటి తప్పటడుగులే బీఆర్ఎస్ ఎక్కువ వేస్తోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం అయితే నేమీ, నిన్న మొన్నటి పరిక్ష పత్రాల లీకేజీ వ్యవహరం, బండి సంజయ్ అరెస్ట్ విషయం అయితే నేమి,ఇలా ప్రతి విషయంలోనూ బీఆర్ఎస్ నాయకత్వం ముందు వెనక ఆలోచించకుండా తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలతో చిక్కులు తప్పడం లేదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ ట్రాప్ లో పడి సమస్యలు కొనితెచ్చుకుంటోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ఏదో విధంగా బద్నాం చేయడమనే సింగిల్  పాయింట్ అజెండాతో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు.    ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే సంకల్పంతో, స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం బిడ్ లో పాల్గొని, విశాఖ ఉక్కును కాపాడుతుందని  ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు చాలా చాలా హడావిడి చేశారు. ఇంతలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్థే విశాఖ వచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు అని మాట మాత్రంగా ఒక ముచ్చటను బయట పెట్టారు,అంతలోనే తూచ్ అన్నారు. కానీ, అంతలోనే, కేసీఆర్ దెబ్బంటే అట్లుంటద ని కేసీఆర్ కు భయపడి విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, మంత్రి కేటీఆర్  జబ్బలు చరుచుకున్నారు. అయితే కేంద్ర ఉక్కుగనుల శాఖ విశాఖ ఉక్కుని అమ్మేది అమ్మేదే.. వెనక్కి తగ్గేది లేదు, అని కుండ  బద్దలు కొట్టింది. దీంతో, బీఆర్ఎస్  నాయకులు ముఖాలు చిన్నబిచ్చుకున్నారు.  అదలా ఉంటే  బిడ్ వేసే విషయంలోనూ చాంతాడంత రాగం తీసి చివరకు అదేదో పాట పడినట్లుగా, బిడ్ లో పాల్గొంటామని అరివీర భయంకర ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, బిడ్ గడవు ముగిసినా ఆ ముచ్చట మళ్ళీ తీయలేదు. నిజానికి  విశాఖ ఉక్కు కంపెనీ యాజమాన్యం ముందుగా ప్రకటించిన బిడ్ గడువు ఐదు రోజుల క్రితమే ముగిసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్ లో పాల్గొనేందుకు సిద్దమైన సింగరేణి అధికారుల అభ్యర్ధన మేరకే, బిడ్ గడువును ఏప్రిల్ 20 వరకు (ఐదు  రోజులు) పొడిగించారు. ఇప్పడు ఆ  గడువు కూడా ముగిసింది కానీ, సింగరేణి బిడ్ వేయలేదు. దీంతో విశాఖ ఉక్కు విషయంలో బీఆర్ఎస్  మరో మారు సెల్ఫ్ గోల్ చేసుకుందని అంటున్నారు.

వివేకా వీలునామా?..ఆమె ఎక్కడ?

వైఎస్ కుటుంబం ఇదివరకెన్నడూ ఊహించని ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి మరణంతో వైఎస్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకూ ఏం చేసిన ఎవరూ అడగలేదు, అడిగినా వైఎష్ కుటుంబం సమాధానం చెప్పలేదు కూడా. రాజకీయంగా ఒక్క చంద్రబాబు తప్ప మరొ ఎదురు లేకుండా సాగింది వైఎస్ కుటుంబం హవా. 2009 తరువాత  వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ చేయి ఇవ్వడంతో సొంత కుంపటితప్పలేదు. వైఎస్ కుటుంబం అంత వరకూ చేసిన తప్పులే వారిని కాంగ్రెస్ కు దూరం చేశాయని అప్పట్లో చెప్పుకున్నారు. ఇంతలో జగన్ కొత్త పార్టీ పెట్టడం, ఆయనపై సీబీఐ కేసులు, తదననంతరం జైలు జీవితం వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా పాఠాలు నేర్పించాయి.   2019లో జగన్ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారం చేపట్టిన తరువాత మళ్లీ పాత గాయాలు ఇబ్బంది పెడుతూ వచ్చాయి. వివేకా హత్య కేసు వైఎస్ కుటుంబంలో చీలిక తెచ్చిందని కడప వాసులు అంటున్నారు. ఆ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైఎస్ కుటుంబం తాజాగా వివేకా రెండో వివాహాన్ని తెరపైకి తెచ్చింది. షేక్ షమీమ్ అనే మహిళతో వివేకాకు సంబంధం ఉందంటూ ఓ ఫొటో జోరుగా ప్రచారంలో ఉంది.  ఏప్రిల్ 24న తెలంగాణ హైకోర్టులో సునీతపై కేసు వేయబోతున్నట్లు ఒక వాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తనవాటా, తన కుమారుడివాటాను తేల్చాల్సిందిగా షమీమ్ అనే మహిళ పేరుతో ఈ వార్త బయటకు వచ్చింది.   దీంతో వివేకా స్త్రీ లోలుడడని ప్రపంచానికి చెప్పడమే కాక, వారి ఆస్తిని అనుభవిస్తూ డాక్టర్ సునీత తన పిన్నికి, తమ్ముడికి అన్యాయం చేస్తోందని ఈ వార్త సారాంశం. హత్యకు ముందే వివేకాతన అస్తులపై వీలునామా రాశారనీ, అందులో రెండవ భార్యకు, కొడుకుకు వాటాలు స్పష్టంగాఉన్నాయనీ ప్రచారం జరుగుతోంది.   కానీ ఈ ప్రయత్నంతో సునీతకు వచ్చే నష్టం ఏమీ లేదని న్యాయ విశ్లేషకులు చెబుతున్నారు. వివేకా హత్య కేసు పరిశోధనకు షమీమ్ అనే మహిళ ఆరోపణలకు సంబంధం లేదనేది లాయర్ల వాదన. వివేకా హత్య జరిగి నాలుగేళ్లయితే ఇంత వరకూ షమీమ్ ఎందుకు తెరమీదకు రాలేదని ప్రశ్నించే వారూ లేకపోలేదు. వివేకాకు మరో కుటుంబం ఉందన్న ప్రచారం ఇప్పుడున్నపరిస్థితులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఏ మాత్రం ఉపయోగపడదు. ఆస్తుల పంపకాల వివాదానికి హత్య కేసుకు సంబంధం లేదన్న లాజిక్ అందరికీ అర్ధమయ్యింది. ఇలా ఉండగా  కడప ప్రకాష్ నగర్ లో నివసించే షేక్ షమీమ్ ను వైఎస్ అవినాష్ రెడ్డి అనుయాయులు హైదరాబాద్ తరలించారు.  సునీతను ఇబ్బంది పెట్టేందుకు షమీమ్ ను పావుగా వాడబోతున్నారన్నది విశ్వసనీయమైన సమాచారం. ప్రస్తుతం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో షమీమ్ ప్రస్తుతం ఉందని ఆమె బంధువులు చెప్పడం కొసమెరుపు. 

కడప మద్దతు సునీతకే

వివేకా హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తున్న అంశం. త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను విపరీతంగా ప్రభావితం చేసే అంశం కూడా ఇదే.  కొంత మంది వ్యక్తులు అనాలోచితంగా చేసిన హత్య తిరిగి వారి మెడకే చుట్టుకోవడంతో బయటపడే మార్గం కోసం అడ్డదారులు తొక్కడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే వివేకా హత్య కేసులో ప్రత్యేకంగా చెప్పుకోదగిన వ్యక్తి ఆయన కుమార్తె డాక్టర్ సునీత. పులివెందుల ప్రజలు సునీతమ్మ అని అభిమానంతో పిలుచుకునే సునీత వృత్తి రిత్యాడాక్టర్. ప్రతిష్టాత్మకమైన క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన అనంతరం డెట్రాయిట్ లో ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తిగా పులివెందులతో సహా కడప జిల్లా వాసులు సునీతను గౌరవిస్తారు.  మార్చి 15వతేదీ 2019వ సంవత్సరం వివేకా హత్య జరిగిన రోజు. ఆ రోజు నుంచి సునీత తండ్రి హత్యకు బాధ్యులైన వారికి శిక్షపడాలని పోరాటం చేస్తోంది.  అంత పెద్ద రాజకీయ కుటుంబం నుండి వచ్చినా ఎక్కడా రాజీ  పడకుండా సునీత చేస్తున్న పోరాటం కడప జిల్లా ప్రజలను కదిలిస్తోంది.  వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సైతం సునీతమ్మ కన్నీళ్లకు కరిగిపోయాడు. తండ్రిని కోల్పోయి ఒంటరిగా  మిగిలిన సునీతమ్మకు న్యాయం జరగాలని ఇటీవల మీడియాతో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. వివేకా గుండె పోటుతో మరణించాడన్న అబద్ధాన్ని మొదట సునీత ప్రశ్నించింది. వృత్తిరిత్యా డాక్టర్ కావడంతో ఆమె అనుమానం వ్యక్తం చేసింది. కానీ, కుటుంబంలోని వ్యక్తులే తండ్రిని చంపారని తొలుత ఊహించలేకపోయింది.  తదననంతర పరిణామాలతో ఆమెకు నిజం పూర్తిగా అర్ధమైంది.  ఆ క్రమంలో హత్య వెనుక ఉన్న వ్యక్తుల బెదిరింపులు సునీత అనుమానాన్ని మరింత బలపరిచాయి.  ఎదురింటి సందింటి  కుటుంబంలో నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో బాగా తెలిసిన సునీతమ్మ ఎంత  తెగువయచూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  నాలుగేళ్లుగా సాగుతున్న పరిశోధన ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటి వరకూ హైకోర్టు, సుప్రీం కోర్టులు కూడా ఈ కేసుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలవరించడం సునీత పట్టుదకు అద్దం పడుతోంది.  తెలుగుదేశం హయాంలో హత్య జరిగిందంటూ వాదించిన  వైసీపీ నేతలు ఇప్పటి వరకూ వివేకా హత్యకు డజన్ కు పైగా కారణాలను వెతికారు. అవన్నీ అబద్ధాలు అని అందరికీ తెలిసినా కేసును తప్పుదారి పట్టించేందుకు వైఎస్ కుటుంబం ప్రయత్నం చేసింది. కానీ సీబీఐ పటిష్టమైన విచారణ  ముందు అవేమీ పని చేయలేదు. చివరకి హంతకులు ఎవరో, హత్యకు పథకం రచించిన వారు ఎవరో ప్రపంచం ముందు నిలబెట్టడంలో సునీత ఉత్తీర్ణురాలైంది. ఎప్పుడూ  అన్యాయాన్ని ప్రశ్నించని వైఎస్ కుటుంబం నుంచి ఒక  మహిళ న్యాయం కోసం చేస్తున్న పోరాటాన్ని పులివెందుల ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రాంతంలో సునీతకు మద్దతు పెరుగుతోంది. రాజకీయాలకు, ఆడంబరాలకు దూరంగా ఉండే సునీత రాజకీయాల్లోకి వస్తే ఆదరిస్తామని కడప జిల్లా రాజకీయాలలో మార్పు కోరుకునే వారు అంటున్నారు.  వైఎస్ కుటుంబంలో పెద్ద దిక్కుగా చెప్పుకునే రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత కాలం ఆ కుటుంబంలో మహిళల గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిలలు అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.  వివేకా హత్య వరకూ బయటి ప్రపంచానికి తెలియని సునీత కూడా తండ్రికి న్యాయం కోసం పోరాడాల్సి వస్తోంది. ఏది ఏమైనా వివేకా హంతకులకు శిక్ష పడేంత వరకూ తన పోరాటం ఆగదని ప్రకటించి పోరాడుతున్న సునీత ధైర్యానికి కడప జిల్లా వాసులు జేజేలు పలుకుతున్నారు. 

కర్ణాటక బరిలో దిగ్గజాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం(ఏప్రిల్ 20) నాటితో ముగిసింది. దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు ఈ నెల 24వ తేదీన ముగియనుంది.  పోలింగ్ తేదీ మే  పదో తేదీన ఉంటుంది.  కౌంటింగ్ తేదీ మే 13 నుంచి ప్రారంభం కానుంది.   కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ అధికారికంగా గురువారమే ముగిసినప్పటికీ బుధవారమే మెజార్టీ సభ్యులు నామినేషన్లు వేశారు. అధికారిక గణాంకాల ప్రకారం 1, 110 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మయ్, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బి. విజయేంద్ర తదితరులు  బుధవారం తమ నామినేషన్లు సమర్పించే సమయంలో మెగా ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు.  మొత్తం 164 మంది బీజేపీ అభ్యర్థులు, 147 మంది కాంగ్రెస్  అభ్యర్థులు, 108 మంది జేడీఎస్ అభ్యర్థులు , 91 మంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు , బీఎస్పి నుంచి 46 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించుకున్నారు. 1041 మంది పురుష అభ్యర్థులు, 69 మంది స్త్రీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించుకున్నారు.  బీజేపీ యువ మోర్చా కార్యకర్త ఇస్మాయిల్ షఫీ బెల్లారే హత్య కేసులో ప్రధాన నిందితుడు కూడా పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.   ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించుకునే సమయంలో ఆస్తుల వివరాలు వెల్లడించారు. కర్ణాటక చిన్న తరహా పరిశ్రమల శాఖామంత్రి ఎంటీబీ నాగరాజ్ రాబోయే ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.   అతని ఆస్తి విలువ  రూ1,614కోట్లు అని తేలింది. బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ఆయన ఈ సారి గెలుపొందితే  ఈ స్థానం నుంచి గెలుపొందడం ఇది నాలుగోసారి అవుతుంది. రెండో అత్యంత సంపన్న అభ్యర్థిగా డికే శివకుమార్ నిలిచారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం కర్ణాటకలో ఉద్యానవన శాఖ మంత్రిగా కొనసాగుతున్న మునిరత్న నాయుడు రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. 293 కోట్ల ఆస్తులతో, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో అత్యంత సంపన్న అభ్యర్థిగా మూడో స్థానంలో నిలిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి  తన ఆస్తుల విలువ రూ 181 కోట్ల రూపాయలు అని ప్రకటించారు. 2018లో కుమారస్వామి అతను ప్రకటించిన ఆస్తి విలువ కంటే రూ 14 కోట్లు పెరిగింది.  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఆస్తి విలువ 126.18 కోట్ల రూపాయలు. ఆయన రాజకీయాల్లో రాకమునుపు న్యాయ వాద ప్రొఫెషన్లో ఉన్నాడు. 2020లొ అతను కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడి హోదాలో రాజకీయాల్లో వచ్చాడు తర్వాతి కాలంలో బిజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. 

జేడీఎస్ మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పథకాలు

కర్నాటక ఎన్నికలపై తెలంగాణ ప్రభావం పడుతుందా? తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలకు జేడీఎస్ తన మేనిఫెస్టోలో చోటు కల్పించి.. ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది. జేడీఎస్ కు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలున్న సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే ఈ పథకాల ద్వారా తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటూ.. ఆ పథకాలకు తన మేనిఫెస్టోలో పెట్టింది. అధికారికంగా జేడీఎస్ ఇంకా మేనిఫెస్టోను విడుదల చేయకపోయినా... తాము అధికారంలోకి వస్తే వీటిని అమలు చేస్తామంటూ ఓ 12 అంశాలను జేడీఎస్ నేత హెచ్ డి కుమారస్వామి విడుదల చేశారు. వాటిలో తెలంగాణలో అమలుఅవుతున్న రైతు బంధు, ఆసరా ఫించన్లు, అంగన్ వాడీలకువేతనాల పెంపు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీ బడ్జెట్ వంటి అంశాలుఉన్నాయి.   అయితే ఇదేమీ కొత్త విషయం కాదు.. తెలంగాణ పథకాలను కర్నాటకలో అమలు చేస్తామని కుమారస్వామి గతంలోనూ హామీ ఇచ్చారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెడతామంటున్నారు.   నిన్న మొన్నటి దాకా స్పష్టత లేకపోయినా.. ఇప్పుడు కర్నాటక ఎన్నికలలో జేడీఎస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు  ప్రకటించారు.  ఆయన ప్రచారం ప్రధానంగా కర్నాటకలో తెలుగు వారు అధికంగా ఉండే నియోజకవర్గాలలో కొనసాగుతుందని అంటున్నారు.  రైతుబంధు స్కీమ్ ద్వారా తెలంగాణ రైతుల్లో పెరిగిన జీవన ప్రమాణాల గురించి వివరిస్తారు. అయితే కర్నాటకలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందని ఇప్పటికే పలు సర్వేలు పేర్కొన్నాయి.  ముఖ్యంగా  పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే  రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న సంకేతాలను ఇచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్ సాధించి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేవని పేర్కొంది. వచ్చె నెల 3వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 10న ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల ఉంటుంది. గురువారం (ఏప్రిల్ 20)తో  నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఏపార్టీ ప్రతిపక్షానికే పరిమితమౌతుంది అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.   ఇప్పటికిప్పుడు జనం నాడిని బట్టి హంగ్ వినా మరో అవకాశం లేదన్న మాటే గట్టిగా వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట వెలువడిన పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే కూడా అదే చెప్పింది. రాష్ట్రంలో అధికార   బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యత సాధించినా.. అది అధికార పగ్గాలను అందుకునేందుకు అవసరమైన సంఖ్యా బలం సాధించడానికి కూతవేటు దూరంలోనే నిలిచిపోతుందని సర్వే పేర్కొంది. ఈ పరిస్థితుల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించే జేడీఎస్ కీలకమౌతుందని సర్వే పేర్కొంది.  ఔను రాష్ట్రంలో జరిగేది ముఖాముఖీ పోరే అయినా.. ఏవో కొన్ని స్థానాలను ఖాతాలో వేసుకోగలిగే పాటి బలం ఉన్న జేడీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశీలకులు కూడా అంటున్నారు. పైగా కర్నాటకకు హంగ్ కొత్త కాదు.. సంకీర్ణ ప్రభుత్వాలూ కొత్త కాదు.   2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది. దీంతో  78 స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకు పోయింది.   కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా కర్నాటకలో అదే పరిస్థితి పునరావృతమౌతుందన్న భావన సర్వత్రా నెలకొని ఉంది.  ఈ నేపథ్యంలోనే జేడీఎస్.. తన పరిస్థితిని మరింత పటిష్టం చేసుకోవడానికి బీఆర్ఎస్ ను ఆశ్రయించిందని చెప్పవచ్చు. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానం దిశగా అడుగులు ప్రారంభించినప్పటి నుంచీ జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆయన వెన్నంటే ఉన్నారు. మధ్యలో కొంత దూరం పెరిగిందన్న వార్తలు వచ్చినా.. కర్నాటకలో జేడీఎస్ కోసం బీఆర్ఎస్ పని చేస్తుందని హరీష్ రావు ప్రకటనతో తేటతెల్లమైంది. అసెంబ్లీ ఎన్నికల వరకూ కర్నాటకలో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి జేడీఎస్ కు పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా ఆ తరువాత జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో జేడీఎస్ మద్దతుతో కొన్ని లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ తన అభ్యర్థులను నిలిపి గెలిపించుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యూహం ఉభయ తారకమని జేడీఎస్ కూడా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు మద్దతు ఇచ్చి, అందుకు బదులుగా లోక్ సభ ఎన్నికలలో తాను పోటీ చేసే స్థానాలలో మద్దతు కోరడం ద్వారా బీఆర్ఎస్ కర్నాటకలో పాగా వేయాలని భావిస్తోందని చెబుతున్నారు. ఇక పోతే బీఆర్ఎస్ మద్దతు ద్వారా కర్నాటకలో చెప్పుకోదగ్గ అసెంబ్లీ స్దానాలలో విజయం సాధించడం ద్వారా మరో సారి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకోవాలని జేడీఎస్ భావిస్తోంది. అందుకు బీఆర్ఎస్ మద్దతే కాకుండా.. బీఆర్ఎస్ పథకాలు కూడా దోహదపడతాయని అనుకుంటోంది. 

రాహుల్ గాంధీకి మరో ఎదురు దెబ్బ

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్  మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో ఇప్పటికే రెండేళ్ళు జైలు శిక్ష పడిన నేపధ్యంలో పార్లమెంట్  సభుత్వం కోల్పోయిన రాహుల్ గాంధీకి, అదే కేసులో మరో మారు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబదించి సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు మార్చి23 న ఇచ్చిన తీర్పులో రెండేళ్ళు జైలు శిక్ష  విధించిన నేపథ్యంలో మార్చి 24న ఆయనపై అనర్హత వేటు పడిన విషయం  తెలిసిందే. కాగా సూరత్ కోర్టు విధించిన  శిక్షను నిలిపేయాలంటూ రాహుల్‌ గాంధీ వేసిన స్టే పిటిషన్‌ను అదే సూరత్‌ సెషన్స్‌ కోర్టు  గురువారం (ఏప్రిల్ 20) తిరస్కరించింది. ఈ తాజా తీర్పు పర్యవసానంగా రాహుల్ గాంధీ  లోక్ సభ సభ్యత్వంపై విధించిన అనర్హత కొనసాగుతుంది. అలాగే  రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం తక్షణ పునరుద్దరణకు ఇక తలుపులు మూసుకు పోయినట్లేనని అంటున్నారు. రాహుల్ గాంధీ పై కోర్టుకు వెళ్లి శిక్ష అమలు కాకుండా స్టే తెచ్చుకున్నా, అయన నిర్దోషిగా తేలే వరకూ అనర్హత కొనసాగుతుందని అంటున్నారు.  కాగా  ట్రయల్‌ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ జరపలేదని, పరిమితులు దాటి కఠినంగా వ్యవహరించిందని,  ఇది రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత కేసు కాదంటూ సెషన్స్‌ కోర్టును రాహుల్‌ ఆశ్రయించారు. శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్‌ పిటిషన్‌పై వారం రోజుల క్రితం  వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్‌పీ మొగేరా   గురువారం (ఏప్రిల్ 20)  తీర్పును వెలువరించారు. దీంతో రాహుల్ గాంధీ పై కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి ఎదురైంది.  రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీ దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఇది కక్షపూరిత చర్య అని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.అయితే,నేరాలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని  పునీత్  కోర్టుకు వివరించారు.దీంతో శిక్ష తగ్గించాలన్న రాహుల్ గాంధీ అభ్యర్ధను కోర్టు తిరస్కరించింది.

రక్షణ మంత్రికే రక్షణ లేదు

కరోనా మహమ్మారి కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ను వదల్లేదు. గురువారం ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అధికార పార్టీని కలవరపరిచింది. రక్షణ శాఖా మంత్రికే కరోనా నుంచి రక్షణ లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటనే చర్చకు దారి తీసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ దేశ రాజధానిలో జరుగుతున్న సమయంలోనే రాజ్ నాథ్ సింగ్ కు కరోనా ఉన్న విషయం బయటపడింది. ఆయనకు పాజిటివ్ అని తేలడంతో వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా ఇటీవలి కాలంలో పెరిగిపోవడం సామాన్య ప్రజలను ఆందోళన పరుస్తుంది . ఢిల్లీ ఆరోగ్య శాఖామంత్రి భరద్వాజ్ కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చబోదని చెబుతున్నప్పటకీ ఢిల్లీలో కరోనా బాధితులు ఎక్కువవుతున్నారు.  కరోనాను సత్వరం ఎదుర్కోగలమని ఢిల్లీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చేతల్లో పురోగతి లేదు. 

సింగరేణి దుస్థితికి కారణాలెన్నో...

తెలంగాణకు తలమానికంగా నిలిచిన సింగరేణి అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. రూ 10 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థ ఒకప్పుడు రూ 3,500 కోట్ల మిగులు సాధించింది. తెలంగాణ  ప్రభుత్వం 51 శాతం బిజేపీ ప్రభుత్వం 49 శాతం ఉన్న సింగరేణి కాలరీస్ ఈ దుస్థితికి గల కారణాలు ఏమిటి అని లోతుగా  ఆరా తీస్తే అసలు విషయాలు బయటకొస్తాయి. సింగరేణి కంటే పెద్దదైన కోల్ ఇండియా లిమిటెడ్ కు కేవలం రూ 12 వేల కోట్ల రూపాయల అప్పులుంటే సింగరేణి ఇంత పెద్ద మొత్తంలో అప్పుల పాలు కావడానికి ఎవరిని నిందించాలి? కార్మికులకు విపరీతంగా వేతనాలు ఇచ్చేయడం వల్లే సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందని అనడానికి వీల్లేదు. సింగరేణి కార్మికుడికి  రూ 420 ఇస్తే కోల్ మైన్ ఇండియా కార్మికుడికి రూ 930 అందుతుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు సింగరేణి బంగారు గనిలా బాసిల్లింది. సింగరేణిలో గుట్టు చప్పుడు కాకుండా ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ నేతల, కేసీఆర్ కుటుంబ సభ్యుల జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణిలో రోజురోజుకు టర్నోవర్ పెరుగుతుంటే లాభాలు వచ్చే బదులు నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి.  కార్మికులకు, ఉద్యోగులకు అప్పులు చేసి వేతనాలివ్వడం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ బీఆర్ఎస్ నేతలు ఉద్దరిస్తామనడం విడ్డూరంగా ఉంది అని బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కల్వకుంట్ల ఫ్యామిలీ పెట్టుబడులు పెడతామనడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసగించడమేనని ఆయన అన్నారు. సింగరేణి కాలరీస్ కార్మికులకు ఇళ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నీరుగారిపోయింది. కనీసం ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నామని సింగరేణి కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. సింగరేణి కాలరీస్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ 25 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. టిఎస్ జెన్ కో రూ 2,500 కోట్లు, ట్రాన్ కో రూ 18 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని బీజేపీ ఆరోపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా  గుర్తింపు  సాధించిన సింగరేణిని లాభాల బాటలో తీసుకెళ్లినప్పుడు మాత్రమే తెలంగాణ బంగారు గనిగా పూర్వ వైభవం తెచ్చుకుంటుంది. రాజకీయాలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సి ఉంది. 

యాంటీ జగన్.. బీజేపీ కొత్త స్టాండ్ స్ట్రాటజీ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ వ్యూహం మార్చిందా? పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న నేపధ్యంలో, ఒంటరి పోరాటానికి సిద్డంవుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి  ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేదీ లేదు. ఆ మాటకొస్తే ఒక్క బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ సహా ఏ జాతీయ పార్టీకీ ఆంధ్ర ప్రదేశ్ లో పట్టుమని పదిశాతం ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లోనే అది తేలిపోయింది. తెలుగు దేశం, వైసీపీ, జనసేన ఈమూడు పార్టీలే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయనే విషయంలో స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ  అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు సమాన దూరం పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అలాగే  అందులో భాగంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న, వైసీపీతో అంటకాగుతోందనే మచ్చను తుడిచేసుకునేందుకు బీజేపీ నాయకులు జగన్ సర్కార్ టార్గెట్ గా  పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలు కమల నాథులను కలవరపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. ఇంతకాలం ఈ కేసులో, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అండగా నిలిచిందనే ముద్ర పడిపోయింది. ఈ అపవాదును తుడిచేసుకునేందుకు బీజేపే నేతలు, సీబీఐ పై వైసీపీ  నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇందులో భాగంగానే కావచ్చును బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్  తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందన్నారు  జగన్ తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారన్న ఆయన వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైంది కాదన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే నిందితులను  అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్న వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని చెప్పు కొచ్చారు.  అంతే కాదు పనిలో పనిగా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. నిజానికి గడచిన నాలుగేళ్ళలో ఎప్పుడూ లేని  విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అనే అర్థం వచ్చేలా సునీల్ దియోధర్ ఘాటైన విమర్శలు చేశారు. జగన్ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు,  ఏడుకొండలవాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదని సునీల్ దియోధర్ శాపనార్థాలు పెట్టారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పంథా  మార్చుకోక పోతే  వచ్చే  ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ ఉండదని వ్యాఖ్యానించారు. టీటీడీలో అన్యమతస్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారని.. కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారని,   కొన్ని రోజుల ముందు  టీటీడీ ఇచ్చిన  నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో  నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆందోళనలు చేస్తామని  హెచ్చరించారు. నిజానికి టీటీడీ నిర్వహించే ఆసుపత్రులలో ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ విషయంలో బీజేపీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇది కేవలం మచ్చ తుడుచుకునేందుకా లేక అంతో ఇంతో మిగిలిఉన్న హిందూ ఓటును కాపాడుకునేందుకా ? అనేది ముందు ముందు తెలుస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

అవినాష్ తన నెత్తిన తానే చేయి పెట్టుకున్నారా?

వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేయకుండా సాధించుకున్న ముందస్తు బెయిలు వల్ల ఆయన ఊరట కలిగిందా? అంటే పరిశీలకులు లేదనే చెబుతున్నారు. నిజం ఆయన ముందస్తు బెయిలు కోసం వెళ్ల కుండా ఉండి ఉంటే సీబీఐ ఆయనను అరెస్టు చేసేది. అక్కడితో ఇక విషయం కోర్టు విచారణలకే పరిమితమయ్యేది. కానీ హైకోర్టుకు వెళ్లి సీబీఐ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడం ద్వారా అవినాష్ సాధించిందేమిటి? అంటే ఏమీ లేదనే జవాబు వస్తోంది. పై పెచ్చు ప్రతి రోజూ హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం (ఏప్రిల్ 19) నుంచి ఈ నెల 25 వరకూ ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందే. అంటే ఆయనపై అభియోగాలు, వివేకా హత్య కేసులో ఆయన పాత్ర గురించి నిత్యం వార్తలు పతాక శీర్షికల్లో ఉంటాయి. అంతే కాకుండా అంత వరకూ హైదరాబాద్ లోనే ఉండి రోజూ సీబీఐ కార్యాలయానికి అనివార్యంగా హాజరు కావాల్సి ఉంటుంది. పురాణాల్లో భస్మాసరుడికి వరమే శాపమైనట్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు శాపంగా మారిందని అంటున్నారు. అవినాష్ బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 25 వరకూ అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రోజు అవినాష్ బెయిలు పిటిషన్ పై తీర్పు వెలువరిస్తానని పేర్కొంది. అంటే అప్పటి వరకూ టెక్నికల్ గా అవినాష్ అరెస్టు కారు.. కానీ వాస్తవంగా మాత్రం ప్రతి రోజూ సీబీఐ ఆయనను అరెస్టు చేస్తున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటు సభ్యుడిగా అవినాష్ కు బోలెడు అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. కానీ కోర్టు తీర్పు మేరకు ఆయన ప్రతి రోజూ హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. కనుక ఆయన తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకోక తప్పదు. సొంత ఊరికి వెళ్లే అవకాశమూ లేదు. ఇక 25న బెయిలుపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది పక్కన పెడితే.. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇప్పటి వరకూ అరెస్టు చేసిన వారి రిమాండ్ రిపోర్టుల్లో.. మరీ ముఖ్యంగా చవరి రెండు అరెస్టులు అంటే ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిల రిమాండ్ రిపోర్టుల్లో ఈ కేసులో అవినాష్ ప్రమేయం ఉందని విస్పష్టంగా చెప్పింది. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును ఈ నెల 30వ తేదీతో ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక వేళ అవినాష్ కు ఈ నెల 25న ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించినా, సీబీఐ సుప్రీంను ఆశ్రయిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం గురించి సీబీఐ స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు అనివార్యమన్నది స్పష్టమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు లభించిన ముందస్తు బెయిలు వల్ల తాత్కాలిక ఊరట కూడా లభించలేదని, రోజూ సీబీఐ విచారణకు వెళ్లి వచ్చి.. చవరికి అరెస్టు కావడం తప్ప సాధించేదేమీ ఉండదనీ అంటున్నారు. 

రాజస్తాన్ కాంగ్రెస్ లో కిస్సా కుర్సీకా ?

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో అంటే నవంబర్ లేదా డిసెంబర్ లో లేదా  అంతకంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎన్నికలకు   నిండా ఎనిమిది నెలల సమయం కూడా లేదు. మరోవంక  ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఇతర కీలక నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. భరత్‌పూర్‌లో బూత్ ప్రెసిడెంట్ సంకల్ప్ సమ్మేళనంలో అమిత్ షా పాల్గొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.  అయితే, ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మరో యుద్ధానికి తెరలేచింది. అంటే మరో ‘వార్’ మొదలైంది. నిజమే కాంగ్రస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు  గ్రూప్ రాజకీయాలు కొత్త కాదు. ముఖ్యంగా రాజస్థాన్ విషయంలో అయితే గత నాలుగు సంవత్సరాలుగా గెహ్లాట్ వర్సెస్ పైలట్ వర్గాల మధ్య నిత్య సంఘర్షణ  డైలీ సీరియల్  గా నడుస్తూనే వుంది. అవును  కథ పాతదే ... కిస్సా కుర్సీకా కహానీ. గత నాలుగు సంవత్సరాలుగా వివిధ దశల్లో  వివిధ రూపాల్లో నడుస్తున్న నాటకమే, ఇప్పడు మరో రూపంలో తెరమీదకు వచ్చింది.  ముఖ్యమంత్రి అశోక్ గెభహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇదేమీ రహస్యం కాదు. ఆ ఇద్దరి మధ్య గల శతృమిత్ర సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఒకరిని ఒకరు అనని మాట లేదు. ఒకరిపై ఒకరు చేయని ఆరోపణ లేదు. అశోక్ గెహ్లాట్ అయితే సొంత పార్టీకి చెందిన పైలట్ ను ద్రోహి’ అని దూషించారు. పైలట్ అదే మాటను ఇంకో భాషలో అన్నారు. నిజానికి  గడచిన నాలుగు సంవత్సరాలలో ఆ ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు అనేకం పతాక శీర్షికలకు ఎక్కాయి. ఒకటి రెండు సందర్భాలాలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇలా ఇద్దరి విభేదాలు తెరపైకొచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్  అధిష్టానం జోక్యం చేసుకుంది. అయినా  ప్రతి సందర్భంలోనూ గెహ్లాట్ దే పై చేయి అయింది. అన్ని సందర్భాలలో కాంగ్రెస్ అధిష్టానం కారణాలు ఏవైనా   గెహ్లాట్ కే జై కొట్టింది. చివరకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గెహ్లోట్  అధిష్టానం దూతలను (అందులో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆన్నారు) అవమానించి పంపినా ఆయన పై చర్యలు తీసుకునే సాహసం కాంగ్రెస్ అధిష్టానం (సోనియా, రాహుల్) చేయలేక పోయింది.  గత ఏడాది కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నిక సందర్భంగా గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు  అప్పగించి, పైలట్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కానీ,గెహ్లాట్ అందుకు ఓకే అంటూనే తెర వెనక చక్రం తిప్పారు. ఆఖరు నిముషంలో గెహ్లాట్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఏగరేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ అధిష్టానం చివరకు దిగిరాక తప్పలేదు. చివరకు  గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పైలట్‌ డిమాండ్‌ కూడా నెరవేరలేదు. ఇదిగో అదిగో అంటూ చివరకు ఆ ఉదంతానికి  కాంగ్రెస్ హైకమాండ్ ముంగింపు పలికింది.  అందుకే ఇప్పుదు ఎన్నికల ముందు పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై మరోమారు యుద్దాన్ని ప్రకటించారు. ఆయన ఎత్తుకున్న రాగం గత బీజేపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలనే డిమాండే అయినా ఆయన టార్గెట్ మాత్రం ముఖ్యమంత్రి గెహ్లాట్ అనేది వేరే చెప్పనక్కరలేదు. అవును గెహ్లాట్ టార్గెట్ గానే పైలట్  మిస్సైల్ ఫైర్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలను బేఖాతారు చేస్తూ ముందు ప్రకటించిన విధంగా  ఏప్రిల్ 11న తమ మద్దతుదారులతో కలిసి ఒక  రోజు నిరశన దీక్షకు కూర్చున్నారు.  గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా రేపటి ఎన్నికల్లో ఏ ముఖంతో ప్రజలముందుకు పోగలమని సచిన్‌ ప్రశ్నిస్తున్నారు.  ప్రశ్న బానే వుంది కానీ, నాలుగేళ్ళ తర్వాత ఎన్నికలు తరుము కొస్తున్న సమయంలో పైలట్  రోడ్డెక్కడం ఏమిటి ? ఎందుకు అంటే  అదేమీ బ్రహ్మ రహస్యం కాదు. గెహ్టాట్ ను ఆయనను వెనకేసుకువస్తున్న పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు పైలట్  వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారని వేరే చెప్పనక్కరలేదు.  గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను అస్త్రాలుగా చేసుకుని ముఖ్యమంత్రి గెహ్లాట్ ను డిఫెన్సులోకి నేట్టే  వ్యూహంతోనే పైలట్  పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి  గెహ్లాట్ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే, గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. గెహ్లాట్ ను అవినీతి ఎండగట్టేందుకు సచిన్ పైలట్  బీజీపీ భుజాల్ పై తుపాకీ పెట్టి గెహ్లాట్ పైకి తూటాలు గురి పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనేది ఆసక్తి కరంగా మారింది.