జగన్ ప్రభుత్వానికి జాలిలేదు.. ఏపీ హైకోర్టు
posted on Apr 27, 2023 @ 3:01PM
హక్కుల రక్షణకు నడుం బిగించిన ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల కమిషన్ ను ఆ రాష్ట్రప్రభుత్వమే తప్పుపడుతోంది. హై కోర్టు జడ్జి సారథ్యం వహించే హెచ్ఆర్సీ తీర్పులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఓ బాలిక మరణింపై వాదించిన ప్రభుత్వ న్యాయవాదులకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. కుప్పం మునిసిపాలిటీపరిధిలో అంగన్ వాడీ ఆయా ఇచ్చిన ఆహారం తిని ప్రాణాలు కోల్పోయిన దీక్షిత అనే పాప కేసులో ప్రభుత్వం ప్రదర్శించిన అమానవీయతపై హైకోర్టు ఘాటుగా స్పందించింది.
2022 ఫిబ్రవరిలోలో కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని ఓ పాఠశాలలో దీక్షిత అనే పాప ప్రాణాలు వదిలింది. అంగన్ వాడీ ఆయా పెట్టిన కోడుగుడ్డు తినడంతో దీక్షిత చనిపోయిందని ప్రాథమికంగా తేలింది. అప్పుడు మిగిలిన కోడిగుడ్లను పరిశీలించగా, అవి కుళ్లిపోయినవిగా నిర్ధారణ అయ్యింది. దీనితో దీక్షిత తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. ఈ సంఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. దాదాపు పది నెలల పాటు సాగిన విచారణలో ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ ను దోషులుగా తేలుస్తూ హెచ్ఆర్సీ తీర్పు ఇచ్చింది. దీక్షిత కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడమే కాక, బాధ్యులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీ ఆదేశించింది.
అయితే హెచ్ఆర్సీ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ న్యాయ సలహాదారుల సలహా మేరకు ప్రభుత్వం హెచ్చార్సీ తీర్పును సువాల్ చేస్తూ హైకోర్టు తలుపు తట్టింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు హెచ్చార్సీ తీర్పుపై ప్రభుత్వం ఎందుకు అప్పీలు చేయాల్సి వచ్చిందంటూ నిలదీసింది. అసలు ఇలాంటి కేసుపై అప్పీలు చేయడానికి మీకు మనసెలా ఒప్పిందిఅంటూ ప్రభుత్వ అడ్వొకేట్లను హైకోర్టు ప్రశ్నించింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ జయసూర్యలతో కూడిన బెంచ్ కుప్పం సంఘటన ప్రభుత్వ తప్పిదంగానే పరిగణించింది. పసి పాప ప్రాణాలు పోతే, ఆ వావుకు ప్రభుత్వం చే నియమించిన వారే కారణమైతే కేవలం ఎనిమిది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం వెనక్కు తగ్గడాన్ని హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. పరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మానవ హక్కుల వాదులు స్వాగతిస్తున్నారు.