రంగులు మారుతున్న రాజకీయం
posted on Apr 27, 2023 6:53AM
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. కడప జిల్లాలో రాజకీయం మాత్రం రంగులు మార్చుకొంటోంది. రాజకీయ ముఖ చిత్రాన్ని నిసిగ్గుగా రాత్రికి రాత్రే రంగులు మార్చుకొంటోన్న తీరును చూసి ఉసరవెల్లి సైతం సిగ్గుతో తలవంచుకోనేటట్లుగా ఉందనే అభిప్రాయం అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా ఊపందుకొంది.
తాజాగా ఉమ్మడి కడప జిల్లాల్లోని ప్రోద్దుటూరు పట్టణంలో పలు కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న వైఎస్ సునీతకు స్వాగతం.. సుస్వాగతం అంటూ పోస్టర్లు ముద్రించి.. అతికించారు. అంతేకాదు.. సదరు పోస్టర్లకు పసుపు రంగు పూసి.. వాటిపై జై తెలుగుదేశం అని ముద్రించడమే కాకుండా... సదరు పోస్టర్లల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు, బీటెక్ రవి, మరోవైపు ఆమె తండ్రి వైయస్ వివేకానందరెడ్డి, ఇంకోవైపు ఆమె భర్త ఎన్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలను ముద్రించారు. అయితే రాత్రికి రాత్రి ఈ పోస్టర్లు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో దర్శన మివ్వడంపై పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైయస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే ఈ కేసులో నేడో రేపు అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకొంది. అలాంటి వేళ సునీత రాజకీయ రంగ ప్రవేశం అంటూ ఇలా ప్రోద్దుటూరు పట్టణం వేదికగా పోస్టర్లు దర్శనం కావడం పట్ల స్థానికంగా విస్మయం వ్యక్తమవుతోంది.
అంతే కాదు ఇంత కాలం వైయస్ సునీత రాజకీయాల్లోకి వస్తారని.. టీడీపీ అభ్యర్థిగా కడప లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతారంటూ ఓ ప్రచారం అయితే గతం నుంచి సాగుతోంది. కానీ ఈ అంశంపై సునీత పెదవి విప్పిందీ లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే తన తండ్రి వివేకా హత్య కేసులో పాత్రదారులే కాదు.. సూత్రధారులు సైతం బయటకు రావాలనే ఆమె బలంగా కోరుకోంటోంది. అంతే కానీ ఈ హత్య కేసులో సూత్రధారులు వీళ్లు అంటూ ఫలానా వారి పేర్లు ఆమె ఎక్కడా ప్రకటించలేదన్న విషయం విదితమే.
కానీ రాత్రికి రాత్రి ఇలా పోస్టర్లు అతికించడం.. అదీ సునీత పేరుతో.. ఇలా.. ఎవరు .. ఎందుకు .. ఇదంతా చేస్తున్నారనేది మాత్రం అంతుబట్టని రహస్యంగా మారింది. అయితే తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలంటూ న్యాయ పోరాటానికి ఆమె దిగడాన్ని జీర్ణించుకోలేని కొన్ని బలమైన శక్తులు ఏకమై.. ఈ రకమైన ఎత్తుగడల ద్వారా.. సునీతను ప్రజలకు, బంధువులకు సాధ్యమైనంత దూరం ఉంచాలన్న లక్ష్యంతో ప్రణాళికా బద్దంగా ఆమె ప్రత్యర్థి వర్గం శ్రీకారం చుట్టిందని.. ఆ క్రమంలో ఇటువంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకోన్నా.. ఆశ్చర్య పోనక్కర్లేదనే చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.