కర్నాటకలో హంగా? కాంగ్రెస్సా? సీఓటర్ సర్వే
posted on Apr 27, 2023 @ 1:11PM
కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గెలుపు ఎవరిది? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు అన్న ఆసక్తి ఒక్క కర్నాకటకే పరిమితం కాలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. అటువంటి తరుణంలో సీఓటర్ ప్రీపోల్ సర్వే రాష్ట్రంలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని పేర్కొంది. అయితే అంతకు ముందు పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే రాష్ట్రంలో హంగ్ అనివార్యం అని పేర్కొన్ననేపథ్యంలో తాజాగా సీ ఓటర్ సర్వే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. వచ్చె నెల 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 13న ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఏపార్టీ ప్రతిపక్షానికే పరిమితమౌతుంది అంటే.. ఇప్పటికిప్పుడు జనం నాడిని బట్టి హంగ్ వినా మరో అవకాశం లేదన్న ప్రచారానికి సీ ఓటర్ సర్వే ఫుల్ స్టాప్ పెట్టేసింది. రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యత సాధించకపోయినా.. అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది.
వాస్తవానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే, అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్ కీలకంగా మారుతోంది. 2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది. దీంతో 78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకు పోయింది. కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది.
ఆ తరువాత సంకీర్ణంలో చిచ్చు కారణంగా కుమార స్వామి సర్కార్ కూలిపోయింది. 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా సంవత్సరం తిరక్కముందే బీజేపీ పూర్తి మెజారిటీతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆతర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు.
సరే, ఆ చరిత్రను అలా ఉంచితే, వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నది సీఓటర్ తాజా సర్వే అంచనా వేస్తోంది. అయితే ఎడ్జి మాత్రం కాంగ్రెస్ కే ఉంటుందని ఆ సర్వే తేల్చింది. సీఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 106 నుంచి 116 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ 79 నుంచి 89 స్థానాలలోనూ, జేడీఎస్ 24 నుంచి 34 స్థనాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది.
ఇతరులు ఐదు స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. సీ ఓటర్ సర్వే కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ కు ఎడ్జి ఇచ్చినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతాన్ని రానున్న ఎన్నికలలో గణనీయంగా పెంచుకోగలుగుతుందని పేర్కొన్నప్పటికీ ఆ పార్టీ 106 నుంచి 116 స్థానాల్లో విజయావకాశాలున్నాయని పేర్కొనడం ద్వారా హంగ్ అవకాశాలను తోసిపుచ్చలేమని కూడా తేల్చినట్లైంది.