జగన్ రోడ్డు ప్రయాణాలెందుకు చేయరో అర్ధమైపోయింది!
posted on Apr 27, 2023 @ 11:20AM
వైఎస్ జగన్.. ఎప్పుడో నాలుగేళ్ల కిందట విపక్ష నేతగా జనంలో తిరిగారు. నెత్తిన చేతులు వేశారు. ప్రజలకు ముద్దులు పెట్టారు. వాగ్దానాలతో అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతే అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో ఆయన మళ్లీ జనం ముందుకు వచ్చింది లేదు. బటన్ నొక్కేందుకు సభలు పెట్టి ప్రసంగాలు చేసినా ఆయన పర్యటనలన్నీ వాయు మార్గంలోనే.. ఆఖరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మంగళగిరి వెళ్లాలన్నా హెలికాప్టర్ ఎక్కాల్సిందే.
అయితే ఇంత కాలం ఆయన విమానయానాలు, వాయు మార్గ పర్యటనలకు కారణం అధికార దర్పం అని అంతా అనుకున్నారు. విమర్శలు గుప్పించారు. అయితే ఆయన తన పర్యటనలకు రోడ్డు మార్గాన్ని ఎంచుకోకపోవడానికి కారణమేమిటో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. తన హయాంలో జనం అష్టకష్టాలూ పడుతున్నారనీ, వారిలో తన పాలనపై ఆగ్రహం పతాక స్థాయికి చేరిందనీ రోడ్డు మార్గాన వెళితే ఎక్కడికక్కడ తనను నిలువరించి, నిలదీస్తారనీ భయంతోనే ఆయన రోడ్డు మార్గాన్ని పూర్తిగా వదిలేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కాల్సిందే . కానీ తాజాగా ఆయన అనంతపురం జిల్లాలోని నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయల్దేరే సమయంలో హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.
దీంతో ఆయన అనివార్యంగా, తప్పని పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో పుట్టపర్తికి బయలు దేరారు. ఆయన పర్యటనలో జరిగిన ఈ మార్పు చివరిక్షణం వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆయన రోడ్డు మార్గంలో వెడుతుంటే.. పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు పరుగుపరుగుల రోడ్ల మీదకు వచ్చేశారు. ఆయనపై అభిమానంతో జయజయధ్వానాలు చేయడానికి కాదు. తమ సమస్యలపై నిలదీయడానికి. తమ నిరసనను తెలియజేయడానికి. ఇళ్ల స్థలాల కోసం పొలాలకు పరిహరం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడానికి. అవును జగన్ కు ప్రజా నిరసన అనుభవం లోకి వచ్చింది. ఆయన రోడ్డు మార్గాల వెళుతుంటే జనం ఆయన కాన్వాయ్ కి అడ్డుపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తమ కష్టాలను ఏకరవు పెట్టారు. సరే యథాప్రకారంగా పోలీసులు వారిని ఈడ్చి అవతల పారేశారనుకోండి అది వేరే సంగతి.
ఇంతకూ జగన్ కాన్వాయ్ కు అడ్డం పడి మరీ నిరసన వ్యక్తం చేసిన వాళ్లెవరో తెలుసా.. వారంతా వైసీపీ సానుభూతిపరులు. ఔను నిజం జగన్ కాన్వాయ్ కు ధర్మవరంలో వైసీపీ సానుభూతి పరులే అడ్డం పడ్డారు. మిమ్మల్ని నమ్మి నట్టేట మునిగామంటూ శాపనార్ధాలు పెట్టారు. పేదల ఇళ్ల కు టిడ్కో ఇళ్లు నిర్మించడానికి గత ప్రభుత్వం భూములు సేకరించింది. అప్పుడు ఎకరానికి ఐదు లక్షల పరిహరం ఇచ్చింది. అయితే అప్పట్లో వైసీపీ నేతల మాటలు నమ్మి.. ఆ పార్టీ సానుభూతిపరులు మరింత పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించారు. సామాన్య రైతులు మాత్రం అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తీసుకున్నారు. పరిహారం చాలదంటూ కోర్టుకు వెళ్లిన వారి పరిమారాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కోర్టులో జమ చేసింది. అప్పట్లో తాము అధికారంలోకి వచ్చాకా పరిహారం పెంచి ఇస్తామని వైసీపీ అప్పట్లో వాగ్దానం చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పైసా పరిహారం పెంచకపోగా… అసలు పట్టించుకోవడం మానేశారు . ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రభుత్వం నుచి పైసా కూడా మంజూరు చేయించలేక మొహం చాటేస్తున్నారు.
ఇప్పడు ఆ పరిహారం కోసమే రైతులు ముఖ్యమంత్రి కాన్వాయ్ కు అడ్డం పడ్డారు. ఇలాంటి నిరసనలను ఎదుర్కొన వలసి వస్తుందని తెలుసు కనుకనే జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణాలు చేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క ధర్మ వరం నియోజకవర్గం అని కాదు.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజల నుంచి ముఖ్యమంత్రికి ఇటువంటి మర్యాదే వస్తుందని, ఇందుకు ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల కూడా మినహాయింపు కాదనీ అంటున్నారు. అందుకే జగన్ అనివార్యంగా రోడ్డు మార్గంలో వెళ్ల వలసి వస్తే పరదాలు కట్టి జనాలకు ఆయన కనబడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారని చెబుతున్నారు.