ఏపీ సర్కార్ సిట్ పై స్టే ఎత్తివేసిన సుప్రీం
posted on May 3, 2023 @ 2:33PM
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు కోసం జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (మే 3)న సూచించింది.
గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం నాయకులు నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హై కోర్టు సిట్ ఏర్పాటుపై స్టే ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు సిట్ దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
సీట్ దర్యాప్తున ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం సమంజసం కాదనీ, అందుకే హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా స్టే ఎత్తివేయడంలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఈ కేసు విచారించి తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీం ఈ సందర్బంగా ఏపీ హైకోర్టుకు సూచించింది. సిట్ పై ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కోట్టివేయడానికి ఈ కేసులో ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకోవడమే కారణమని పేర్కొంది.