నా దారి రహదారి.. రజనీ
posted on May 3, 2023 @ 5:54PM
తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ ఏది మాట్లాడినా స్పష్టంగా సూటిగా సుత్తిలేకుండా చెబుతారు. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా బెజవాడ వేదికగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించి చెప్పిన మాటలు దానిపై వైసీపీ వర్గాల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో చంద్రబాబు ఫోన్ చేస్తే.. విమర్శలను పట్టించుకోననీ, తాను ఏమనుకున్నానో అదే చెప్పానని అన్నారు. నిజమే.. రజనీకాంత్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా హృదయపూర్వకంగానే చెబుతారు. హృదయపూర్వకంగానే మాట్లాడతారు.
అందుకే ఆయన వివాదరహితుడిగా దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక ఆయన సినిమాలో ఓ డైలాగ్ ఉంది.. ఒక సారి చెపితే వంద సార్లు చెప్పినట్లే.. అని.. అది కేవలం సినిమాలకే పరిమితం కాదు.. నిజజీవితంలో కూడా రజనీకాంత్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు. తాను మనసా వాచా కర్మణా నమ్మితే తప్ప ఆయన మాట్లాడరు. ఒకప్పడు ఆయన రాజకీయ అరంగేట్రం గురించి, చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అభిమానుల అభిప్రాయ సేకరణ పేరిట తమిళనాడులో అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. నిజానికి ఒక దశలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోన ఒక కాలు పెట్టారు కూడా. సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. అయితే రాజకీయాలు తన ఒంటికి సరిపడవని తెలుసుకున్నాననీ, అందుకే తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించేశారు. రాజకీయ అరంగేట్రం చేయకుండానే, శుభం కార్డు వేశారు.
ఆ తర్వాత ఆయన సైలెంటై పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల గురుంచి ఆయన ఎక్కడా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రాజకీయాలలో ఉన్న వారిలో ఆయనకు మిత్రులు ఉన్నారు. తనకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా మిత్రుల గురించి ఒక మంచి మాట చెప్పడానికి రజనీకాంత్ ఎప్పుడూ వెనుకాడరు. ఎవరో ఏదో అనుకుంటారనీ, అంటారనీ ఆయన బెదరడు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా చంద్రబాబును ప్రశంసించినా.. అంతకు ముందు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అన్యాయం జరిగిందని పేర్కొన్నా.. ఆయన తాను ఏది అనుకున్నారో, ఏది నమ్మారో అదే చెప్పారు. వెంకయ్యనాయుడిని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం తనకు నచ్చలేదనీ, అలా చేయడం ద్వారా ఆయనకు అన్యాయం జరిగిందని కుండబద్దలు కొట్టేశారు.
అయితే రజనీ అభిప్రాయంతో వెంకయ్యనాయుడిని అభిమానించే వారే కాదు.. రాజకీయాల గురించి కొద్ది పాటి జ్ణానం, అవగాహన ఉన్న ఎవరైనా ఏకీభవిస్తారు. వెంకయ్యకు అన్యాయం జరిగిందన్న తన వ్యాఖ్యలు బీజేపీ వారిని నొప్పిస్తాయని తెలిసినా రజనీ వెనుకాడలేదు. తన మనసులో మాట చెప్పేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తన వ్యాఖ్యలు వైసీపీకి రుచించవని తెలిసినా తన మనసులో మాట బయటపెట్టడానికి రజనీకాంత్ వెనుకాడలేదు.
తాను నమ్మిన విషయాన్ని చెప్పడానికి ఆయన ఇసుమంతైనా సందేహించలేదు. అందుకే తన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలను ఆయన లెక్క చేయడం లేదు. ఏదో సామెత చెప్పినట్లు అటువంటి వ్యాఖ్యల వల్ల తన గౌరవానికి ఇసుమంత కూడా భంగం కలగదని ఆయనకు తెలుసు.