మిత్రధర్మం పాటించని పెదరాయుడు!
posted on May 3, 2023 @ 5:07PM
టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు.. ప్రస్తుతం ఎలా ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారు, ఏమైయ్యారనే సందేహాలు ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్... వివాహం జరిగింది. ఆ సమయంలో ఆయన జస్ట్ అలా కనిపించారు అంతే. అంతకు ముందు ఆ తర్వాత కూడా ఆయన అంతగా ఎక్కడా బయటకు వచ్చింది లేదు. కనిపించింది లేదు. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్నాయి. అలాంటి వేళ.. మళ్లీ ఆయన ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా? గతంలో లా ఆయనకు మద్దతు లభిస్తుందా అన్న సందేహమూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
మరో వైపు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి సందర్బంగా.. ఏప్రిల్ 28వ తేదీన విజయవాడలో అన్నగారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి విజనరీపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గెలిస్తే ఏపీ నంబర్ వన్ అవుతుందని అన్నారు. అయితే రజినీకాంత్ చేసిన వాఖ్యలపై జగన్ పార్టీకి చెందిన మంత్రులు రోజా, జోగి రమేష్‌తోపాటు మాజీ మంత్రి కొడాలి నాని సైతం ఎప్పటిలాగానే.. తమదైన శైలిలో, తమదైన భాషలో విమర్శలు సంధించారు. అయితే వీరి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రజినీకాంత్‌కి సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రజినీకాంత్‌పై ఇలా విమర్శలు వెల్లువెత్తిన వేళ.. టాలీవుడ్ నుంచి కూడా ఎవరైనా స్పందించి.. ఆ విమర్శలను ఖండించి ఉండాల్సిందనన ఓ అభిప్రాయం ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టాలీవుడ్‌లో రజినీకాంత్‌కి అత్యంత ఆప్తులు ఎవరంటే.. తొలుత వినపడే పేరు.. హీరో మోహన్ బాబు.. కనీనం ఆయన అయినా స్పందించి.. అధికార పార్టీ నేతలు విమర్శలను ఖండించి ఉంటే బావుడేందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదీకాక ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేళ.. తనకు చంద్రబాబును మోహన్ బాబే పరిచయం చేశారని రజినీ కాంత్ గుర్తు చేసుకున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
వీరిద్దరు. .. కలిసి చాలా సినిమాలే చేశారని. వాటిలో పెద్దరాయుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. మోహన్ బాబు కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. అన్నిటికీ మించి మోహన్ బాబు తరచుగా రజనీకాంత్ తనకు ఆప్త మిత్రుడని చెబుతారు. అరేయ్, ఒరేయ్ అని పిలుచుకునేంత చనువు, ప్రేమ, అభిమానం తమ వద్ద ఉన్నాయంటారు. అటువంటప్పుడు మిత్ర ధర్మాన్ని పాటించైనా మోహన్ బాబు తమ పార్టీ నేతలు తన ఆప్తమిత్రుడిపై ఇష్టారీతిన నోరు పారేసుకుంటే కనీసం వారించడానికైనా నోరు విప్పకపోవడమేమిటని నిలదీస్తున్నారు. ఇక తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన వేళ.. సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. నాలుగు రోజులు సైలెంట్‌గా ఉంటే.. వాగే నోళ్లే మూతపడతాయని తన ఫ్యాన్స్‌కి తలైవా సూచించి తన హుందా తనాన్ని చాటుకున్నారు.