బీఆర్ఎస్ పోలవరం రాగం ఎందుకంటే..?
posted on May 3, 2023 @ 12:28PM
ఏపీలో ఎంట్రీ కోసం బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అక్కడ ప్రజాభిమానం సంపాదించడానికి బీఆర్ఎస్ అధినేత చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ కమిటీని ఏర్పాటు చేసి చాలా కాలమే అయినా ఇంత వరకూ అక్కడ కనీసం బహిరంగ సభ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంది.
నిన్నటి దాకా పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం అంటూ విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే అవుతుందంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏపీలో కాలు పెట్టేందుకు బీఆర్ఎస్ పోలవరంను అస్త్రంగా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. నిన్న మొన్నటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామనీ, బిడ్ దాఖలు చేసి విశాఖ ఉక్కును కాపాడుతామనీ బీరాలు పలికి చివరకు చేతులెత్తేసిన బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తి చేస్తానంటూ ప్రకటనలు గుప్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రాంత నాయకుల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని ఉద్యమించి రాష్ట్రాన్నిసాధించిన బీఆర్ఎస్ (అప్పుడు తెరాస) ఆ తరువాత పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణను ముంచారని విమర్శలు గుప్పించారు.
అయితే ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం మొదలు పెట్టేందుకు నాడు విమర్శించిన పోలవరం ప్రాజెక్టునే ఆయుధంగా మలచుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రకటనల చూస్తుంటే.. ఏపీ బాగు కోసం పోలవరం పూర్తి చేస్తామనీ, అందుకోసం తెలంగాణ మునిగిపోయినా ఫరవాలేదనీ చెబుతున్నారా అనిపించక మానదు.