కర్ణాటక బిజేపీ బాటలో ..

కర్ణాటకలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను అక్కడి బిజేపీ నేతలు  తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలో వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని మేనిఫెస్టో పేర్కొనడం బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. హిందువుల వోట్లను పొందడానికి భజరంగ్ దళ్ బిజేపీకి తన వంతు సహకారం అందిస్తోంది. కాబట్టి కర్ణాటక బిజేపీ నేతలు    ప్రెస్ మీట్ పెట్టి  కాంగ్రేస్ మేనిఫెస్టోను చించేస్తే తెలంగాణా బిజేపీ చీఫ్ బండి సంజయ్ భజరంగ్ దళ్ బాటలో ముందుకెళుతున్నారు.  ఈ నెల 14 న కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్లు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో లక్షలాది మంది పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ యాత్ర హిందువుల ఐక్యతను చాటి చెబుతుందన్న ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారందరూ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా ఈ యాత్రలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తో పాటు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇంకా ప్రముఖ నేతలు పాల్గొననున్నారని సమాచారం. అయితే ఈ యాత్రపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కావాలనే మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకు చేస్తున్న మరో ప్రయత్నమే ఈ యాత్ర అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికేనని భావిస్తున్నారు. మరో వైపు రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకే ఆ పార్టీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే చేవెళ్ల సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లపై అలా మాట్లాడారని.. ఇప్పుడు కర్ణాటకలో బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని ప్రకటిస్తే.. ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. బీజేపీ మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుంది. ప్రతి నెలా పలువురు కేంద్ర బీజేపీ నేతలను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలకు తీసుకొని రావాలని తెలంగాణా బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. 

పిలిచిన పేరంటానికే రానివ్వలేదు

బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయంలో తమకు నచ్చని వారికి  ఎంట్రీ ఇవ్వదల్చుకోలేదా? మొన్న ప్రారంభోత్సవంలో   తెలుగు మీడియాను గేట్ బయటకు గెంటేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో పిల్లర్ ను అవమానించింది. బీఆర్ఎస్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న తలసాని ఆహ్వానం మేరకు సచివాలయానికి వచ్చిన  ఎమ్మెల్యే రాజాసింగ్ ను గేట్ బయటే ఆపేసి అవమానించింది  బీఆర్ఎస్ ప్రభుత్వం.  తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా ఎంట్రీ లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల కిందట ఎంపీ రేవంత్ రెడ్డిని సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. తాజాగా బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. బుల్లెట్ పై వచ్చిన రాజా సింగ్ ను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మీటింగ్‌ అని చెప్పి తనను ఆహ్వానించి, లోపలికి అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలోనికి రాకూడదా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు అక్కడే వేచి ఉండి, రాజాసింగ్ తిరిగొచ్చేశారు. అయితే, తాము ఆహ్వానం పంపినప్పటికీ రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి తలసాని పేషీ ప్రకటించినట్టు తెలుస్తోంది.విద్వేష ప్రసంగ ఆరోపణపై ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ బహిష్కరించింది. ఇటీవలె తెలంగాణా బిజేపీ చీఫ్ బండి సంజయ్  ఇటీవలె రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అసెంబ్లీ పట్టుమని ఆరు నెలలు కూడా లేవు. రాజాసింగ్ కు బిజేపీ టికెట్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు. బిజేపీ నుంచి  సస్పెండ్ అయిన రాజాసింగ్ ను పార్టీ ఆహ్వానించలేదు. రాజాసింగ్ అయోమయంలో పడిపోయారు. తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వేసుకుని పార్టీ టికెట్ కోసం టిడిపి తెలంగాణా చీఫ్ కాసాని ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. గోషామహల్ టికెట్ రాజాసింగ్ కే దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే కన్ ఫమ్ కాలేదు.  ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. బీఆర్ఎస్ గోషామహల్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ పేరు బలంగా వినిపిస్తోంది.  ఇంతలో మంత్రి తలసాని  మీటింగ్ అంటే రాజాసింగ్ అదే బుల్లెట్ మీద సచివాలయానికి వచ్చేశారు. ఏ శక్తులు అడ్డుకున్నాయో రాజాసింగ్ ను సెక్యురిటీ సిబ్బంది ఆపేశారు. రాజాసింగ్  అంటే ఆషామాషీ వ్యక్తి కాదు.  నరేంద్రమోడీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మరి రాజాసింగ్ పిలిచిన పేరంటానికి వచ్చినప్పటికీ అడ్డుకుని అవమానించారు. ఢిల్లీలో బీఆర్ఎస్  కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియాను బీఆర్ ఎస్ అడ్డుకుంది. అసలు వారిని గేట్ లోనికి కూడా రాకుండా అవమానించారు.  నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఆహ్వానాన్నిమన్నించి వచ్చిన ప్రజాప్రతినిధికి వెల్ కమ్ చెప్పడం కూడా సంస్కారం. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కు సంస్కార క్లాసులు అవసరమేమో మరి.   

వోటర్ల దగ్గరికే పోలింగ్ కేంద్రం

ఎన్నికలు సమీపిస్తుంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వోటర్లను ప్రలోభ పెట్టడానికి పోలింగ్ సెంటర్ల వద్దకు తీసుకెళ్లి వోటు వేయించుకున్న సందర్భాలు అనేకం.  ఇటువంటివి రిపీట్ కాకుండా ఎన్నికల కమిషన్ మరో సంస్కరణ చేపట్టింది.  ఈ నెల 10వ తేదీన కర్ణాటకలో పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు కలిగినవారంతా తప్పనిసరిగా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది ప్రశంసనీయ విషయం. వలస కార్మికులతో ప్రతివారూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది ఎన్నికల కమిషన్‌ నియమంగా మారిన నేపథ్యంలో ఈ దిశగా ఇప్పటికే కర్ణాటక ఎన్నికల సందర్భంగా కొన్ని చర్యలు తీసుకోవడం మొదలైంది. సాధారణంగా వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రానికి రాలేకపోతున్నప్పుడు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అయితే, ఇప్పుడు పోలింగ్‌ కేంద్రమే వారున్న ప్రదేశానికి వెళ్లేటట్టుగా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. త్వరలో జరగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఈ పద్ధతిని ప్రయోగాత్మంగా అమలు చేయాలని ఇది భావిస్తోంది. ఇది నిజంగా వృద్ధులకు, దివ్యాంగులకు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలవుతున్న ఈ ప్రక్రియకు ఎన్నికల కమిషన్‌ ‘ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అని పేరుపెట్టింది. ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతికి ఇప్పటికే 99,529 మందిఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 80,250 మంది (80 ఏళ్లు పైబడినవారు) వృద్ధులు కాగా, 19,279 మంది దివ్యాంగులు. ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రారంభమయి అయిదు రోజులు దాటుతోంది. పేర్లను నమోదు చేసుకోవడంకోసం, ఓటర్ల ఇంటికి పోలింగ్‌ కేంద్రాన్ని చేరవేయడం కోసం 2,542 బృందాలు, 2706 రూట్లలో తిరుగుతుంటాయి. ఎన్నికల కమిషన్‌ అతి చిన్న వివరాలను, సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రతి బృందంలో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు, ఒక కాన్‌స్టేబుల్‌, పోలింగ్‌ ఏజెంట్లు ఉంటారు. అంటే ప్రతి ఓటర్‌కు ఇదొక మినీ పోలింగ్‌ కేంద్రం అన్న మాట. బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటరు ఓటు వేసేవరకూ ఈ మొత్తం ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయడం జరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం రావడం దగ్గర నుంచి ఒక పూర్తి స్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎదిగే వరకూ చోటు చేసుకున్న ప్రతి పరిణామాన్ని పరిశీలించిన వృద్ధ ఓటర్లు సాధారణంగా ఓటు వేయకుండా ఉండే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా ఓటు వేయాలని వారు ఒక నియమంగా పెట్టుకుంటారు. ఈ వృద్ధ ఓటర్లు ఎంతో నిష్ఠగా, శ్రద్ధగా ఓటు వేయడం ఓటు వేయడానికి బద్ధకించే యువ ఓటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద ఓటర్లెవరూ ఓటు వేయకుండా ఉండకూడదనే పట్టుదలతో ఉన్న ఎన్నికల కమిషన్‌, వృద్ధులకు, దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించడంతో తన నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టడం ప్రారంభించింది. ఇక దేశంలో 80 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 12.15 లక్షల వరకూ ఉంటుంది.ఇందులో శతాధిక వృద్ధుల సంఖ్య 16,973.ఇందులో దాదాపు లక్షల మందికి కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పిస్తోంది. మొత్తం 5.55 లక్షల మంది దివ్యాంగ ఓటర్లలో అతి తక్కువ శాతం మందికి మాత్రమే ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతున్నప్పటికీ, ఈ వినూత్న ఆలోచన పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొంత కాలం పడుతుందనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.దీనివల్ల ప్రజల్లో చైతన్యం, అవగాహన పెరిగే అవకాశం ఉందని కూడా ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. ఇక మారుమూల గ్రామాలలో ఉన్నవారు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలన్న సదుద్దేశంతో ఎన్నికల కమిషన్‌ టెక్నాలజీ సహాయంతో రిమోట్‌ ఓటింగ్‌ మెషీన్స్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. సమీప భవిష్యత్తులో ఈ ఆలోచన కూడాతప్పకుండా కార్యరూపందాలుస్తుంది. ఎటువంటి లోపాలూ లేకుండా ఈ పద్ధతి కూడా అమలయ్యే పక్షంలో ఇది రాజకీయ దృశ్యాన్నే సమూలంగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లగలగడం, వారిని గురించిన వివరాలు సేకరించడం, వారిని రహస్యంగా ఓటు వేసేలా చేయడం వంటివి దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థలను మార్చడానికి ఉపకరిస్తాయి. దేశంలో ప్రతివారూ ఓటేయడానికి ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపడితే ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పరిపుష్ఠం చేస్తుంది.

బీజేపీలో నల్లారి ఏం చేస్తున్నారు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. చేరి కూడా చాలా రోజులే అయ్యింది. ఆయతే ఆ చేరిక ప్రభావం బీజేపీలో ఏమీ కనిపించడం లేదు. ఆయన రాజకీయంగా క్రియాశీలం అయ్యింది కూడా లేదు. ఆయన రాష్ట్ర విబజన ను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస సొంతంగా సమైక్యాంధ్ర పార్టీని స్దాపించి 2004 ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా ఘోర పరాజయం పాలైంది. అపపటి నుంచీ ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపు పొలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారని అంతా భావించారు. కానీ ఏమైందో ఏమో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని కొద్ది కాలం పాటు ఆ పార్టీలో నామ మాత్రంగా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన  కమలం గూటికి చేరారు.  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో గత నెల 7న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి  4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.   అలాంటి నల్లారి చాలా కాలంగా అంటే 2014 ఎన్నికల తరువాత నుంచీ దాదాపుగా ప్రజాజీవితంలో లేరు. అలాంటి నల్లారి  చేరికతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఏం లాభం, ప్రయోజనం ఉంటుందన్న అనుమానాలు ఆయన చేరిక సమయంలోనే వ్యక్తమయ్యాయి. చేరిక సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై ఒకటి రెండు రాళ్లు వేయడానికి ప్రయత్నించారు. బహుశా బీజేపీ అధినాయకత్వాన్ని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నంగా పరిశీలకులు భావించారు.  నల్లారి చేరికతో తెలుగురాష్ట్రాలలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆయనకు పార్టీ కండువా కప్పుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లారి బీజేపీ తీర్థం పుచ్చుకుని అప్పుడే నెల రోజులు దాటిపోయింది. ఉభయ రాష్ట్రాలలోనూ తనకు రాజకీయ నేతలు పలువురు మంచి మిత్రులనీ, వారందరినీ కమలం గూటికి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని నల్లారి కాషాయ కండువా కప్పుకుంటున్న సందర్భంగా చెప్పారు. కానీ ఈ నెల రోజులలో ఆయన బీజేపీ కోసం ఏం చేశారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యక్రమాలేవీ అంటే నిస్సందేహంగా ఏమీ లేవు అన్న సమాధానమే వస్తుంది.   

మందు ప్రియులకు శుభవార్త

భారత్ లో ఆర్థికంగా పురోగతి చెందుతున్న రాష్ట్రాలలో మహరాష్ట్ర ముందంజలో ఉంది.  తెలంగాణాను కూడా ఆర్థిక పురోగతి చెందిన రాష్ట్రాల సరసన చేర్చడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్  సంకల్పించినట్లు తెలుస్తోంది. మద్యం రేట్లను  బీఆర్ ఎస్ ప్రభుత్వం తగ్గించింది. ఈ తగ్గించిన కారణంగా 10 శాతం ఆర్థిక పురోగతి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఒక వేళ పురోగతి నమోదుకాకపోతే అక్కడి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర సర్కారు హెచ్చరించింది. ఈ నెల నాలుగో తేదీ తర్వాత ఉత్పత్తి అయ్యే మద్యం అమ్మకాలకే ఈ ధరలు వర్తిస్తాయి. తెలంగాణలో మద్యం ధరలను ప్రభుత్వం తగ్గించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. ఫుల్ బాటిల్ పై రూ.40 హాఫ్ బాటిల్ పై రూ.20 క్వార్టర్ బాటిల్ పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్ పై రూ.60 వరకూ తగ్గించినట్లు రాష్ట్ర అబ్కారీ అధికారులు తెలిపారు. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మద్యం అధిక ధరలు కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకు ప్రభుత్వం లిక్కర్ ధరలు తగ్గించినట్టు అబ్కారీ అధికారులు స్పష్టం చేశారు.ఈ మేరకు లిక్కర్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ తగ్గించిన ధరలు కొత్తగా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లపై వర్తిస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గజ్జెల నాగేశ్ వెల్లడించారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరలను తగ్గించామని చెబుతున్నా.. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యమే దీనికి కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు.. నైతికతను బోధించే సంస్థ కాదు..!

సమాజానికి నైతికత, విలువల గురించి బోధించే సంస్థ సుప్రీంకోర్టు కాదని, దేశంలో చట్టబద్ద పాలన కొనసాగేలా చూడడం, రాజ్యంగ పరిరక్షణే దాని ప్రధాన కర్తవ్యమని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ ఎ. అమానుల్లా ధర్మాసనం పేర్కొంది. తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి చంపిన కేసులో 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మహిళను జైలు నుంచి విడుదల చేయడానికి అనుమతిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె అభ్యర్థనను పరిశీలించిన రాష్ట్ర స్థాయి కమిటీ.. ముందుగానే జైలు నుంచి విడుదల చేయాలని సిఫార్సు చేసినప్పటికీ నేర తీవ్రత దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం 2019లో తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును పరిశీలించిన ధర్మాసనం... పరాయి పురుషుడితో ప్రేమలో పడిన ఆమె... అతని బెదిరింపులు, ఒత్తిడితో తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని పేర్కొంది. అయితే, పిల్లలిద్దరికీ విషమిచ్చిన తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోబోతుండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన బంధువు ఒకరు అడ్డుకున్నారని తెలిపింది. ప్రేమికుడితో సంతోషంగా గడపడానికే ఆమె బిడ్డలను చంపిందన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఆమెను విడుదల చేయాలన్న రాష్ట్రస్థాయి కమిటీ సిఫార్సును ఆమోదించకపోవడంలో సహేతుకత కనిపించడంలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణమే ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. హత్య, ఆత్మహత్యాయత్నం కేసుల్లో 2005లో దిగువ కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించగా... ఆత్మహత్యాయత్నం కేసు నుంచి హైకోర్టు ఆమెకు పాక్షికంగా విముక్తి కల్పించింది. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఆ మహిళ తన బిడ్డలకు విషమిచ్చి, తానూ మరణించాలని భావించిందని ధర్మాసనం పేర్కొంది. సమాజంలో నైతికత, విలువలను ఎవరికి వారే అలవర్చుకోవాలి. వీటిని బోధించే సంస్థగా సుప్రీంకోర్టు వ్యవహరించదని ధర్మాసనం పేర్కొంటున్న నేపథ్యంలో.. వీటిని అలవర్చుకోవాల్సిన బాధ్యత పౌరులపైనే ఉందనేది యదార్థం.

144 ఏళ్ల సికింద్రాబాద్ ప్రింటింగ్ ప్రెస్ ఇక గత చరిత్ర..!

సికింద్రాబాద్ ప్రింటింగ్ ప్రెస్ మూతపడింది. 144 ఏళ్ల పాటు రైల్వేలకుసేవలందించిన ఈ ప్రెస్ చరిత్ర గర్బంలో కలసిపోయింది. సికింద్రాబాద్ లో 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో ఏర్పాటైన ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఫామ్స్ డిపార్టమెంట్ ఇక గత చరిత్రగా మిగిలిపోనుంది.  రైల్వే రిజర్వుడు, అన్ రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ముద్రించే ఈ ప్రెస్ ని  మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.  బైకులా- ముంబయి (మధ్య రైల్వే), హావ్డ్ (తూర్పు రైల్వే), శకుర్ బస్తీ-దిల్లీ (ఉత్తర రైల్వే), రాయపురం-చెన్నై (దక్షిణ రైల్వే)ల్లోని ప్రింటింగ్ ప్రెస్ లనూ మూసివేయనుంది. రైల్వే బోర్డు డైరెక్టర్ గౌరవ్ కుమార్ ఆయా రైల్వేజోన్ల జనరల్ మేనేజర్లకు ఈ మేరకు ఉత్తర్వులు పంపించారు. రిలీవ్ చేసే ఉద్యోగులను ఇతర విభాగాల్లో నియమించాలని సూచించారు. రైలు టికెట్ల విధానం పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యేంతవరకు రిజర్వుడు, అన్  రిజర్వుడు టికెట్ల ముద్రణను ఔట్సోర్సింగ్ కు ఇవ్వాలని పేర్కొన్నారు. 1870లో నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. 1879లో రైలు టికెట్ల ముద్రణ కోసం సికింద్రాబాద్ లో    ప్రెస్ ను ఏర్పాటుచేశారు. ప్రారంభంలో 1,500 మంది వరకు ఉద్యోగులుండేవారు. స్వాతంత్య్రానంతరం నిజాం స్టేట్ రైల్వే... భారతీయ రైల్వేలో విలీనమైంది. రైల్వేశాఖ టికెట్ల జారీలో డిజిటలైజేషన్ తీసుకురావడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ 169కి చేరింది. ఆన్లైన్ టికెట్ల విక్రయం 80 శాతానికి చేరడమే రైల్వేశాఖ నిర్ణయానికి కారణం. ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయం జరుగుతున్న కారణంగా.. ఇక టిక్కెట్ల కోసం ప్రత్యేకంగా ప్రెస్ ను నడపాల్సిన అవసరం లేదని.. రైల్వే బోర్డు భావించి ప్రెస్ ను మూసేసింది.   అభివృద్ధి ఓ మార్పుకు నాంది.. అయితే అభివృద్ధి వెన్నంటే ..కష్టాలు, బాధలు కూడా ఉంటాయనే అమెరికన్ విద్వాంసుడు ఎమర్సన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 

బాలినేని శ్రీనివాసులరెడ్డి డిసైడైపోయారా?

మాజీ  మంత్రి బాలినేని వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కూ షాకుల మీద షాకులు యిస్తున్నారు. ఆయన అనుచరులు సైతం వైసీపీ జెండా ఎత్తడం మానేశారు.   హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన సందర్భంగా శుక్రవారం బాలినేనికి ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సంరంభాలు తన నేతకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా కాకుండా బాలినేన బలప్రదర్శనా అన్నతీరుగా ఉన్నాయి. హైదరాబాద్  నుంచి ఒంగోలు చేరుకున్న ఆయనకు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో  వచ్చిన  ఆయన అనుచరుల చేతిలో కానీ, బాలినేనికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కానీ ఎక్కడా వైసీపీ ప్రస్తావనే లేకపోవడంపై స్థానికంగా ఆశ్చర్యం వ్యక్తమైంది.  అలాగే బాలినేని బాలినేని అంటూ జిందాబాద్ నినాదాలు చేశారే కానీ ఎక్కడా జగన్ పేరు కానీ, వైసీపీ పేరు కానీ ఎత్తలేదు.  ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది బాలినేని మాత్రమే. అటువంటి బాలినేని జగన్ పిలిచి బుజ్జగించినా కోర్డినేటర్ పదవి వద్దంటే వద్దని వదులకున్న నాడే ఆయన ఎక్కువ కాలం వైసీపీలో కొనసాగే అవకాశాలు లేవని అంతా భావించారు.   అయితే పార్టీ వీడుతున్నట్లు ఆయన ఎక్కడా చెప్పలేదు. తాను తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమౌతాను అని  క్లారిటీ  యిచ్చారు.  అయితే ఆయన జనసేన పార్టీకి దగ్గరౌతున్నారన్న అనుమానాలు వైసీపీలో ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆ అనుమానాలకు తగ్గట్టుగానే జనసేన నుంచి ఆయన రాకకు ఎటువంటి అభ్యంతరాలూ లేవన్న సంకేతాలు వస్తున్నాయి.  అయితే బాలినేని యిప్పటికిప్పుడు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అంటే.. పరిశీలకులు ఆ అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తం మీద బాలినేనికి వైసీపీ పట్ల ఆశలు సన్నగిల్లాయనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదని చెబుతున్నారు. అలాగే జగన్ కు కూడా బాలినేని విషయంలో దూరం ఉంచితేనే బెటర్ అన్న అభిప్రాయం కలిగిందనీ అంటున్నారు.  బాలినేనిని రెచ్చగొట్టడానికా అన్నట్లు గోనె  ప్రకాశరావు తిరుపతిలో మీడియా సమావేశంలో బాలినేని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని చూపు తెలుగుదేశం వైపు ఉందన్న గోనె ప్రకాశరావు వ్యాఖ్యలను బాలినేతి తీవ్రంగా ఖండించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన గోను ప్రకాశరావు వ్యాఖ్యలను ఖండిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు.  సొంత పార్టీకి చెందిన వారే ఒక వ్యూహంతో, పకడ్బందీగా తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీ కోసం ఎంతో చేశాననీ, ఎన్నో త్యాగాలు చేశాననీ, వాటి ఫలితమేనా యిది అని బాధపడ్డారు.  కార్యకర్తలకు యిసుమంతైనా మేలు చేయలేని కోఆర్డినేటర్ పదవి తనకు వద్దుగాక వద్దని పునరుద్ఘాటించారు. ఆయన బహిరంగంగా పేరు పెట్టి విమర్శించకపోయినా..  ఆయన విసుర్లన్నీ జగన్ ను ఉద్దేశించేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద  యిప్పటికిప్పుుడు కాకపోయినా.. బాలినేని వ్యవహారం వైసీపీలో  ముందు ముందు మరిన్ని సంచలనాలకు కారణమౌతుందని అంటున్నారు. 

రాజీనామాపై పవార్ యూటర్న్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, 24 ఏళ్లుగా పార్టీ బరువు బాధ్యతలు మోస్తున్న, పార్టీ పెద్దదిక్కు శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆయనే పార్టీ కీలక నేతలతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ పవార్  రాజీనామాను తిరస్కరించింది. పవర్ సాబ్ ..మీరే కావాలని తీర్మానం చేసింది . ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే నాయకత్వం వహించాలని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుతూ 18 మంది కమిటీ సభ్యలు ఏకగ్రీవంగా తీర్మానించారు.  ఎన్సీపీ  సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ఈ సమావేశం వివరాలను మీడియాకు తెలిపారు.  శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని కోరుకున్నారు. అయితే  ఎన్సీపీ కోర్ కమిటీ  పవార్ రాజీనామాను ఏకాభిప్రాయంతో తిరస్కరించిందని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఆయనను కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన తర్వాత దేశంలోని అనేక పార్టీల నేతలు ఆయనను సంప్రదించారని తెలిపారు. ఆయన కుమార్తె సుప్రియ సూలేతో పాటు తాను కూడా తమ అభిప్రాయాలను ఆయనకు చెప్పామన్నారు. వివిధ జిల్లాల్లోని పార్టీ కేడర్ కూడా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోకూడదని కోరుకుంటున్నదని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, సుప్రియా సూలే పాల్గొన్నారు. ఈ కమిటీలో వీరితోపాటు సునీల్ టట్కరే, కేకే శర్మ, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేశ్ టోపే, జితేంద్ర అవహద్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, జైదేవ్ గైక్వాడ్, నరహరి ఝీర్వాల్, ఎన్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఫౌజియా ఖాన్, యువజన విభాగం అధ్యక్షుడు ధీరజ్ శర్మ పాల్గొన్నారు. అయితే కమిటీ నిర్ణయాన్ని పవార్   ఆమోదించారు.   నిజానికి, ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగడంపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని.. శరద్‌ పవార్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. అధ్యక్షుడిగా పవార్‌ను కొనసాగిస్తూ.. కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని తీసుకురావాలని పార్టీలోని కీలక నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకొస్తే.. ఆ బాధ్యతలను పవార్‌ కుమార్తె బారామతి ఎంపీ సుప్రియా సూలే  కు  లేదా ఆయన సమీప బంధువు పార్టీలోఅత్యంత కీలక క్రియాశీల నేత అజిత్ పవార్‌కు అప్పగిస్తారని, కాదంటే ఇద్దరికీ సామాన ఎత్తులో రెండు కుర్చీలు వేస్తారని అంటున్నారు.  అయితే గత కొంతకాలంగా ఎన్సీపీలో చోటు  చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, పైకి కనిపించని రాజకీయం ఏదో లోలోపల రగులుతోందనే అనుమానాలు మహా రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక విధంగా పవార్ కుమార్తె సుప్రియా సూలే, పవార్ సోదరుని కుమారుడు అజిత్ పవార్ మధ్య గత  కొంత కాలంగా సాగుతున్న వారసత్వ తగువు రగులుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపధ్యంలోనే శరద్ పవార్ ఇంటి గుట్టు బయటకు రాకుండా వ్యూహ రచన  చేసారని అంటున్నారు. అందులో భాగంగానే రాజీనామా ఎపిసోడ్ నడిచిందనీ అంటున్నారు. నిజానికి   ఇంతవరకు జరిగిన ..ఇప్పుడు జరుగుతున్న..రేపు జరగనున్న పొలిటికల్ డ్రామా శరద్ పవార్ డైరెక్షన్ లోనే జరిగిందని, జరుగుతోందని అంటున్నారు.

కేసీఆర్ పై పోటీకి రె‘ఢీ’అంటున్ననేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? జాతీయ రాజకీయాల్లో  కీలక  పాత్రను పోషించేందుకు వీలుగా ...లోక్ సభకు పోటీచేస్తారా? లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, హ్యాట్రిక్ ముచ్చట తీర్చుకుంటారా? లోక్ సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి మకాం మారుస్తారా? అసెంబ్లీకి పోటీచేసే పక్షాన గజ్వేల్ నుంచే పోటీ చేస్తారా? సిద్దిపేట లేదా మరో  నియోజక వర్గం నుంచి బరిలో దిగుతారా? ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై వ్యూహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.  అయితే నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్  రేపు ఏమి చేస్తారు, అనేది ఈరోజు ఊహించడం సాహసమే అవుతుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహ రచనలో ఆయన ప్రత్యర్ధి పార్టీల నాయకులకే కాదు సొంత పార్టీ, సొంత గూటి నేతలకు  కూడా చిక్కరు.. దొరకరు. నువ్వుకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అన్నట్లుగా ఆయన ప్రత్యర్ధులు ఒకటి ఉహిస్తే, ఆయన ఇంకొకటి చేసి  ప్రత్యర్ధులను ఇట్టే బురిడి కొట్టిస్తారు. ఆ విషయంలో ఆయన చాలా చాలా సమర్ధులు. సో  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..ఉహకు అందని సందేహం.   అయితే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనపై పోటీ చేసేందుకు రె‘ఢీ’ అవుతున్న ప్రత్యర్దుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పడు మాజీ మంత్రి , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేల్ బరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ‘ఢీ’ కొనేందుకు తాను రెడీ  అని ప్రకటించారు. ప్రకటించడమే కాదు నియోజక వర్గంలో కొంత హడావిడి కూడా చేశారు. అప్పట్లో స్వయంగా ఆయనే పబ్లిక్ గా సవాల్ విసిరారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పానని తెలిపారు. అంతే కాదు, ఆయన పశ్చిమ బెంగాల్ తో పోలిక కూడా తెచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని అదే విధంగా ఇక్కడ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడిస్తానని ధీమా వ్యక్త పరిచారు. అలాగే  మరో బీజేపీ ఎమ్మెల్యే, రఘునందన రావు కూడా పార్టీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి పై పోటీ చేసేందుకు తాను సిద్దమని టీవీ డిబేట్స్ లో ప్రకటించారు.   అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, విప్లవ గాయకుడు గద్దర్  బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కేసీఆర్ టార్గెట్ గా గజ్వేల్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు మూడు రోజుల క్రితమే గద్దర్  స్వయంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని తెలిపారు. అయితే  ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేక ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆరే వ్యూహాత్మకంగా ఆయన్ని బరిలో దించుతున్నారా,అనే అనుమానాలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం.  గద్దర్ విషయం ఎలా ఉన్నా  తాజాగా బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై పోటీ చేసేందుకు తాను సైతం సిద్ధమని అన్నారు.గురువారం (మే 4)బీజేపీ చేరికల కమిటీ చైర్మన్  ఈటల రాజేందర్, ఇతర బీజేపీ నాయకులు ఖమ్మంలో  పొంగులేటి నివాసంలో ఆయనతో పాటు మరో  బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు. బీజేపీ నేతలు ఆ ఇద్దరినీ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి, బీజేపీలో చేరే విషయంలో స్పష్టత ఇవ్వక పోయినా గజ్వేల్ లో కేసిఆర్ పై పోటీకి కూడా వెనకడేది లేదని అన్నారు. అలాగే, కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని అందుకోసం అవసరం అయితే రెండు మెట్లు దిగేందుకు కూడా సిద్దమని ప్రకటించారు.  అదెలా ఉన్నప్పటికీ, ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళతారా? అనే విషయంలో స్పష్టత లేదు,  ఆలాగే ఆయన  ఎక్కడి  నుంచి పోటీ చేస్తారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు, కానీ, ఆయనతో ‘ఢీ’అనేదుకు రెడీ అవుతున్న నాయకుల నెంబర్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది.

రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్.. ఇది నజరానాయేనా?

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇటీవల సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. న్యాయమూర్తి హరీశ్ హసుఖాభాయి వర్మ ఈ కేసును విచారించి.. రాహులుకు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయనతో పాటు మరో 68 న్యాయమూర్తులకు జిల్లా జడ్జి కేడర్ కు పదోన్నతి దక్కింది. అయితే, వారి ప్రమోషన్ ను  సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ సివిల్ జడ్జి కేడర్ కు చెందిన ఇద్దరు అధికారులు ఈ పదోన్నతులను సవాల్ చేశారు. 'మెరిట్- కమ్- సీనియారిటీ' ఆధారంగా కాకుండా.. 'సీనియారిటీ- కమ్- మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ హైకోర్టు జారీ చేసిన సెలక్షన్ జాబితాను, వారిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా, జ్యుడిషియల్ అధికారుల నియామకానికి సంబంధించి మెరిట్- కమ్- సీనియారిటీ ఆధారంగా కొత్త జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై మే 8న విచారణ చేపట్టనుంది. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను తన సొంతానికి వాడుకుంటూ.. తమలపై దాడులకు కేంద్రంగా పాల్పడుతుందంటూ కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తికి పదోన్నతి కల్పించడంతో.. కేంద్రం అటు న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ.. తన కనుసన్నలతో పైరవీలు నడుపుతోందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ బంధువుకే మొదటి చాన్స్

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ తమ తొలి అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ పేరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హుస్నాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. కుటుంబ రాజకీయాలను బీఆర్ఎస్ పెంచి పోషిస్తుంది అని ప్రతి పక్షాలు ఒవైపు విమర్శలు చేస్తున్నప్పటికీ కేటీఆర్ ఇవ్వాళ ప్రకటించిన అభ్యర్థి వినోద్ కేసీఆర్ కు సమీప బంధువు  కావడం విశేషం. బోయినపల్లి వినోద్ కుమార్ బంధువులకు ఢిల్లీ పరిధిలో కొన్ని మద్యం లైసెన్స్ ల కోసం కవిత మధ్యవర్తిత్వం వహించిందని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులతో కవిత, బోయినపల్లి వినోద్ కుమార్ లు పలు దఫాలు ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో సమావేశమైనట్టు  ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీపై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై  కేటీఆర్  విమర్శలు గుప్పించారు. నల్లధనం తెస్తామని చెప్పి తెల్లముఖం వేశారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ ఎవరని అడిగితే బండి సంజయ్ పేరు చెప్పాలంటే సిగ్గేస్తోందని అన్నారు. వినోద్ ను ఎంపీగా గెలిపించాలని.. బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని అన్నారు

బజ‘రంగు’ పడుద్దా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్’కు కౌంట్ డౌన్’ మొదలైంది... మరో మూడు రోజుల్లో (మే 8న) ప్రచారం ముగుస్తుంది. మరో ఐదు రోజుల్లో మే 10న పోలింగ్ జరుగుతుంది. మే 13న ఫలితాలు వెలువడతాయి.ఇక అక్కడితో కర్నాటకంలో ఒక అంకం ముగుస్తుంది, మరో అంకం మొదలవుతుంది.  అయితే కర్ణాటక పీఠాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, కర్ణాటక గెలుపుతో దేశంలో పూర్వ వైభవాన్ని పొందేందుకు కాంగ్రెస్ హోరాహోరీగా పోరాదుతున్న ఈ ఎన్నికల ఫలితాలు కర్ణాటకకు మాత్రమే పరిమితం కావు. ఈ సంవత్సరం చివరలో జరగనున్న తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్  అసెంబ్లీ ఎన్నికల పైనా, వచ్చే సంవత్సరం జరిగే  సార్వత్రిక ఎన్నికల పైనా ప్రభావం చుపుతాయనే అంచనాలతో,  దేశం మొత్తం కూడా  కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  కాగా, ఇంతవరకు వచ్చిన సర్వేలు చాలా వరకు కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలనే ఇస్తున్నారు. అయితే  సర్వే సర్వేకు గ్రాఫ్ మారుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ  (135/224) ఖాయం చేసిన సర్వే సంస్థలే.. తాజా సర్వేలో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ నుంచి సింగిల్ – లార్జెస్ట్ దాకా వచ్చారు. అటు చేసి ఇటు చేసిచివరకు మళ్ళీ హంగ్ వైపుకే సర్వే లెక్కలు సర్దుకుంటున్నాయి. అయితే, ఈసారి కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని, సర్వేలు సూచిస్తున్నాయి.   ఇంతవరకు ఒక లెక్క అయితే, ఇక ముందు ఇంకో లెక్క అన్నట్లుగా, మిగిలున్న ఐదు రోజులు అత్యంత కీలకమని సర్వే సంస్థలతో పాటుగా రాజకీయ పండితులు కూడా పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఒకప్పటి సంగతి ఏమో కానీ,ఇప్పడు ఎన్నికలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ గా మారిపోయాయి. చివరి బంతి (ఓటు) పడే వరకు ఏమైనా జరగవచ్చును. ఒక్క బంతి .. ఒక్క రాంగ్ షాట్ మ్యాచ్ రిజల్ట్  ను మార్చి వేసినట్లు ఎన్నికల్లో చివరి ‘ఘడియ’ లో తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్స్ ఫలితాలను తారుమారు చేస్తాయని గతంలో అనేక సందర్భాలలో రుజువైంది. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ చేసిన, ‘మోడీ విషసర్పం’ వంటి వివాదాస్పద  కామెంట్స్ పార్టీ ఇమేజ్ ని డ్యామేజి చేయడమే కాదు, ఎన్నికల ఫలితాలపైన ప్రతికూల ప్రభావం చూపుతాయిని గుర్తించారు, అందుకే ఖర్గే, తూచ్. అన్నారు. విష సర్పం అనండి మోదీని కాదు, ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్దాంతాలను అంటూ అర్థ తాత్పర్యాలు విడమరిచ్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయిందని, కాంగ్రెస్ నాయకులే  అంగీకరిస్తున్నారు. అలాగే సిద్దరామయ్య,డీకే శివకుమార్ లింగాయత్ కమ్యూనిటీకే వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభావం కూడా ఎన్నికల ఫలితాలపై ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే ఎన్నికల ప్రచారం ఆఖరి  ఘట్టానికి చేరుతున్న సమయంలో. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ...తాము అధికారంలోకి వస్తే  ‘బజరంగ్‌దళ్‌’పై నిషేధం విధిస్తామని ఇచ్చిన హామీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుంది. బజరంగ్‌దళ్‌‌ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ వెనకడుగు వేసింది.అసలు తాము బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని అననేలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బజరంగ్‌దళ్‌‌ను బ్యాన్ చేయలేదని కూడా తెలిపారు. మరోవంక ఈ విషయంపై స్పందించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గ నిరాకరించారు. ముఖ్యం చాటేశారు.  మరోవైపు ఓటు వేసేటప్పుడు ‘జై బజరంగబలి’ నినాదం చేయడం ద్వారా కాంగ్రెస్‌ దుష్ట సంస్కృతిని శిక్షించాలని కర్ణాటక ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఆ పార్టీయే అభివృద్ధి, శాంతిసామరస్యాలకు శత్రువని నిందించారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షణ కన్నడ, బెళగావి జిల్లాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో మోడీ ప్రతి బహిరంగసభలోనూ ‘జై బజరంగబలి’ అంటూ నినదించారు. దీంతో పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగించు కుంటున్నాయి. మరో వంక ఎన్నికల విశ్లేషకులు.. ఒకటి రెండు శాతం ఓట్లు అటూ ఇటూ అయితే ఫలితాలు తారుమారతాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వేలు సూచించిన విధంగా హస్తానికి పట్టా కడతాయా ? లేక తుస్సు మంటాయాఅన్నది మే 13న తేలిపోతుంది.

చితి పేర్చుకుని సజీవ దహనమయ్యాడు!

భరించరాని బాధను మనుసులో పెట్టుకున్న ఓ పెద్దాయన తీసుకున్న నిర్ణయం అందరినీ కలిచివేసింది. తన పోషణ కుమారులకు భారం కాకూడదని ఆ పెద్దమనిషి నిర్ణయం   సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 90ఏళ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ మండలం పోట్లపల్లికి చెందిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తనకున్న నాలుగు ఎకరాల పొలంతోనే బిడ్డలను పెంచి పెద్ద చేసి వారికంటూ ఒక జీవితాన్ని అందించాడు. వయసు విూద పడటంతో వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల పొలాన్ని నలుగురు కుమారులకు పంచి ఇచ్చాడు. పొలాన్ని పంచుకున్న ఆ అన్నదమ్ములు తండ్రిని కూడా పంచుకోవాలని భావించారు. తండ్రిని వంతుల వారీగా చూసుకోవాలని కుమారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పారు. అయితే కుమారులు తీసుకున్న నిర్ణయం నచ్చని వెంకటయ్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తనని వంతులు వారీగా చూసుకుంటానన్న కుమారుల నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ప్రాణాలు వదలడానికి సిద్ధమయ్యాడు. దీంతో తన చితిని తానే పేర్చుకున్న వెంకటయ్య ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. వెంకటయ్య ఆత్మాహుతి చేసుకున్నాడని తెలిసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నవెూదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అటకెక్కిన సమగ్ర పంటల బీమా

రైతులలో చైతన్యం నింపి వారితో నామమాత్రంగా బీమా సొమ్ము చెల్లించేలా చేయించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. వ్యవసాయం లో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం, దాని అనుబంధ రంగాలను ప్రోత్స హించడం వల్ల ఒక్కో రైతు కనీసం వందమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించవచ్చు. దీంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు, ఎగుమతులకు అవకాశాలు పెరుగతాయి. విదేశీ మారక నిల్వలను సాధించవచ్చు. ఈ సూత్రాన్ని గతంలో ఉన్న ఏ ప్రభుత్వం పాటించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ సైతం అదే బాటలో సాగుతోంది.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన వెూడీ వారిని రోడ్డున పడేలా చేస్తున్నారు. కేవలం విదేశీ పెట్టుబడులే సర్వస్వం అన్న విధంగా నేతలంతా ఆయా దేశాల ముందు వెూకరిల్లు తున్నాయి. కానీ ఏనాడు రైతులకు ఒక్క పైసా విదల్చడం లేదు. గిట్టుబాటు ధరలు, పంటలకు బీమా తదితర అంశాలను పట్టించుకోవడం లేదు. రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం కదలడం లేదు. పంటల బీమా విధిగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటే రైతులను ఆదుకున్న వారు అవుతారు. ఇందుకు జాతీయ స్థాయిలో సమగ్ర బీమా పథకం అమలు చేయాలి. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తించేలా చూడాలి. పం ట నష్టపోయిన రైతులు ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా లేదా..బిచ్చమెత్తుకునే ఉండే పరిస్థితులు పోవాలి. బీమా సొమ్ము దర్జాగా రాబట్టుకునేలా చట్టాలు రావాలి. అప్పుడే అన్నదాత కంటినిండా నిద్రపోగలడు. ప్రధానంగా బీమా పథకాల వల్ల కలిగే లబ్దిపై వారికి సమాచారం ఉండడం లేదు. అకాల వర్షాలు, వడగళ్లు, తుఫాన్లు సంభవిస్తే జరిగే నష్టాలు పూడ్చేలా సమగ్ర బీమా పథకం రూపొందించాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ మోడీ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.  అలాగే ఏ పంటకు ఎంత చెల్లించాలన్న సమాచారం కూడా రైతులకు చేరడం లేదు. అలాగే పథకాల అమలుపై రైతుల్లో చైతన్యం కానరావడం లేదు. వడగళ్లు, విలయం సంభవించినప్పుడు ప్రభుత్వాలపై ఆధారపడి పరిహారం అందక లబోదిబోమంటున్నారు. దీనిని తప్పించేందుకు ఫసల్‌ బీమా వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులను చైన్యం చేయకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో బీమాకు నోచుకోవడం లేదు. గతంలో కనీసం ఇందులో పది శాతం మంది కూడ బీమా ప్రయోజనాలు పొందలేకపోయారు. వేల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదని సమాచారం. క్షేత్ర స్థాయిలో అధికారులు తగిన రీతిలో రైతులకు బీమా సమాచారాన్ని చేరవేయకపోవడంతోనే బీమాకు దూరమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఈ విషయంపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో ఖరీఫ్‌, యాసంగి పంటల బీమా ప్రీమియం ధరలు ఖరారయ్యాయి. సీజన్‌కు సంబంధించి బీమా పథకంలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, శనగ పంటలతో పాటు మామిడి తోటలను చేర్చారు. అతివృష్టి, అనావృష్టి, వడగండ్లు, ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతింటే రైతులను ఆదుకోవడంలో బీమా పథకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. పత్తికి వాతావరణ ఆధారిత బీమా సోయాబీన్‌కు గ్రామం యూనిట్‌, జొన్న, కంది, పెసర, మినుము తదితర పంటలకు మండలం యూనిట్‌గా పంట బీమా అమలు చేయాల్సి ఉంది. దీనికితోడు టమాట, మామిడి పంటలకు కూడా వాతావరణ బీమాను ప్రకటించడం వల్ల రైతులకు ఊరట కలగనుంది. పంటల వారీగా ప్రీమియం ధరలు, చెల్లించాల్సిన గడువు తేదీల వివరాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు రైతులకు తెలియచేయాలి. ఎన్ని హెక్టార్లలో ఏ విధమైన పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయాలి. ఈ సీజన్‌లో అత్యధికంగా వరి, మొక్కజొన్న , పత్తి, పెసర, మినుము సాగయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో పరిస్థితి అనుభవిస్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏ పంట సాగు విస్తీర్ణం ఎలా ఉంటుందన్నది స్పష్టం కానుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, వేరుశనగ, శనగ పంటల కు వాతావరణ ఆధారిత బీమా పథకంలో భాగంగా మామిడి పంటలకు బీమా వర్తిస్తుంది. పంటరుణం తీసుకునే రైతులు, రుణం అవసరం లేని రైతులు ఈ బీమా పథకాలను వినియోగిం చుకోవచ్చు. అయితే పంట రుణాలను పొందాలనుకున్న రైతులకు సంబంధించి రుణం అంద జేసే సమయంలోనే ప్రీమియాన్ని తీసుకుని మిగతా మొత్తాన్ని సదరు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. పంట నష్టం జరిగితే పరిహారం రావాలంటే నిర్ణీత గడువులో బీమా చెల్లించాలి. ఈ విషయంలో రైతులకు విస్తృతం గా అవగాహన కల్పించాలి ప్రతి రైతు ప్రీమియం చెల్లించేలా కృషి చేయాలి. ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఏఈవోలు, ఏవోలను సంప్రదించేలా క్షేత్రస్థాయిలో రైతుల కు తెలియచేయాలి. పంట రుణాలు తీసుకోని రైతులు నేరుగా ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు ఉంది. విూ సేవా కేంద్రాలు, బ్యాంకులు తదితర వాటి ద్వారా చెల్లించవచ్చు. ఇవన్నీ గ్రామస్థాయిలో ప్రచారం జరగాలి. అపðడే పంటలకు తగిన భరోసా దక్కుతుంది. మిర్చి, పత్తి, శనగ తదితర రైతులు నష్టం సంభవిం చినపðడు ఏ విధంగా పరిహారం పొంద వచ్చో గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేయాలి. విదేశీ పారిశ్రామిక వేత్తలను కాళ్లావేళ్లాపడుతూ వారి ప్రాపకం కోసం పాకులాడే రోజులు పోయేలా రైతులు స్వయం సమృద్ది సాధించాలి.

ఎమ్మెల్యే రాపాక ఎన్నికపై విచారణకు సీఈవో ఆదేశం.. వాచాలతకు తగిన శాస్తి?

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నికపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్  కుమార్ మీనా ఆదేశాలు జారీచేశారు. ఆ ఉత్తర్వుల్లోని వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 24న అంతర్వేదిలో జరిగిన వైకాపా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వరప్రసాద్   పూర్వం నుంచి తమ సొంత గ్రామం చింతలమోరికి కొందరు వ్యక్తులు దొంగ ఓట్లు వేయడానికే వచ్చేవారని, ఒక్కొక్కరు 5నుంచి పది ఓట్లు వేసేవారని, అవే తన విజయానికి దోహదపడేవని వ్యాఖ్యానించగా, పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గత నెల 24న ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వరప్రసాద్ ఎన్నికపై విచారణ నిర్వహించి, వారంరోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విచారణకు ఆదేశం నేపథ్యంలో ఫిర్యాదుదారు ఎనుముల వెంకటపతిరాజా మాట్లాడుతూ, దొంగ ఓట్లతో నెగ్గినట్లు రాపాక స్వయంగా ఒప్పుకొన్నారు కనుక ఆయన ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. జనసేన పార్టీ టికెట్ పై విజయం సాధించి, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి, వైసీపీ పంచన చేరిన రాపాక కు   శాస్తి జరిగిందని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

రజనీ అభిమానుల అగ్రహం

ఇటీవలి కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై  వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు  ఆ పార్టీ మెడకు చుట్టుకున్నాయి. చిత్తూరు, తిరుపతి,  నెల్లూరులో రజనీ కాంత్ అభిమానులు అలాగే తమిళులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాలలో ఈ ప్రభావం కనిపిస్తుంది.  మూడు జిల్లాల ప్రజలు వైసీపీ నేతలపై రగిలిపోతున్నారు. మూరో 9 నెలల్లో జరిగే  ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో  వైసీపీకి తగిన బుద్ది చెబుతాం అంటూ స్థానిక ప్రజలు, రజనీ కాంత్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో  వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులలో ఈ మూడు జిల్లాల్లో ఈ సారి గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. రజనీ కాంత్ పై వైసీపీ నాయకుల వల్ల ఖచ్చితంగా రెండు శాతం ఓట్లపై ప్రభావం పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు

నయీంతో పోలిక..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ జరిగా సంవత్సరాలు గడుస్తున్నా అతని డైరీని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముందు ప్రవేశ పెట్టడం లేదని భట్టి ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి  దోచుకున్న బంగారం,నగదు, భూములను తిరిగి ప్రజలకే ముట్టజెప్పాలని భట్టి వాదన. నయీం సంపాదించిన ఆస్తులను అతని కుటుంబ సభ్యులు, ముఠాసభ్యులే అనుభవిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిందిస్తుంది.    నయీం చోటామోటా గ్యాంగ్ స్టర్ కాదు. గుజరాత్ లో సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్లో నయీం పాత్ర కీలకం. సోహ్రబుద్దీన్ తో నయీంకు ఉన్న పరిచయంతోనే గుజరాత్ పోలీసులకు ఇన్ ఫార్మర్గా మారి ఎన్ కౌంటర్ చేయించినట్లు సమాచారం.   నయీంను షాద్ నగర్ లో 2016 ఆగస్టులో ఎన్ కౌంటర్ చేశారు.     తెలంగాణ పోలీసులు . ఎపిసిఎల్ సి నేత  కరణం పురుషోత్తం హత్య కేసులో నయీం ముద్దాయిగా  ఉన్నాడు. ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ హత్య కేసులో నయీం ముద్దాయి. నయీం ఎన్ కౌంటర్ జరిగి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నయీం డైరీని బయట పెట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  నయీంకు బీఆర్ ఎస్ ప్రభుత్వానికి పెద్ద తేడాలేదని మిలియన్ మార్చ్ పాదయాత్రలో భట్టి సంచలన ఆరోపణ చేశారు. నయీం దోచుకున్న తీరులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని భట్టి అంటున్నారు.    మార్చి 16న యాత్ర ప్రారంభమై మొత్తం 90 రోజుల పాటు యాత్ర సాగనుంది. 39 నియోజకవర్గాల్లో భట్టి కలియ తిరుగుతున్నారు. భట్టి దాదాపు 1,365 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరపనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర తర్వాత భట్టి చేపడుతున్న పాదయాత్ర రెండో అతి పెద్ద యాత్ర అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి 50 అసెంబ్లీనియోజకవర్గాల్లో పర్యటించారు. 5 బహిరంగ సభలు నిర్వహించారు. భట్టి దళిత కమ్యూనిటీ నుంచి వచ్చారు. మునుపటి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. భట్టి చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో జూన్ 15న ముగుస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను స్పూర్తిగా తీసుకుని భట్టి ఈ యాత్రను చేపట్టారు. గడప గడపకు పాదయాత్ర వెళ్లడం వల్ల ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చని ఎ ఐసీసీ భావిస్తుంది. రాష్ట్రంలోబీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఇస్తున్న బూటకపు వాగ్దానాలను కాంగ్రెస్ ఎండగట్టడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుంది. ఇరు ప్రభుత్వాలు యువత కు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రలో ఆరోపిస్తుంది. తెలంగాణ ఏర్పాటు కాకమునుపు 12 లక్షల మంది ఉన్న నిరుద్యోగులు ప్రస్తుతం 30 లక్షలకు చేరుకున్నారని కాంగ్రెస్ లెక్కలేసి చెప్పింది.  భట్టి విక్రమార్క  కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  విద్యార్థులు కొలువులు రాక ఇబ్బందులు పడుతుంటే కేసిఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కట్టామని మట్లాడటం బాధాకరమన్నారు. నిజాం రాచరిక నియంతృత్వ నిరంకుశ మనస్తత్వం కలిగిన కేసీఆర్ ను గద్దె దించటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దివంగత నేత వైఎస్ ఆర్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.