ఆహ్వానమే పంపకుండా రాలేదంటూ నిందలా?
posted on May 3, 2023 @ 10:11AM
మంత్రి జగదీశ్ రెడ్డి అత్యుత్సాహంతో గవర్నర్ తమిళిసై పై చేసిన విమర్శలు, వ్యాఖ్యలు కేసీఆర్ సర్కార్ ను యిరుకున పెట్టాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలు గత కొన్నేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు ఉప్పు.. నిప్పులా ఉన్న సంగతి విదితమే. పెండింగ్ ఫైళ్ల విషయంలో ప్రభుత్వం, గవర్నర్ తగాదా సుప్రీం కోర్టు వరకూ కూడా వెళ్లింది. అంతకు ముందు తెలంగాణ బడ్జెట్ సమావేశాల వ్యవహారంలో కూడా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం పంచాయతీ కోర్టు కెక్కింది.
అప్పట్లోనే.. వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఈ స్థాయికి చేరుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమనీ, అయితే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనీ విమర్శలు వెల్లువెత్తాయి. అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం కూడా తగ్గేదేలా అన్నట్లుగా పరస్పర విమర్శలతో బహిరంగ రచ్చకు ఎంత మాత్రం వెనుకాడని పరిస్థితి ఎంత మాత్రం సరికాదన్న వాదనలూ వినిపించాయి. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయంలో కోర్టు తెలంగాణ సర్కార్ కు అక్షింతలు వేసింది. ఆ తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య అగాధం.. మరో సారి కోర్టు మెట్లు ఎక్కింది.
అలాగే గవర్నర్ తమిళిసై కూడా ప్రొటోకాల్ ఇవ్వడం లేదని బహిరంగ విమర్శలకు దిగడమే కాకుండా.. ప్రభుత్వ విధానాలను కూడా తూర్పారపడుతున్నారు. అందుకు ఆమె మీడియా సమావేశాలనే ఉపయోగించుకుంటున్నారు. గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలు కొత్త కాదు కానీ.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తేంతగా ముదిరిపోవడం మాత్రం దేశంలో బహుశా ఇదే తొలిసారి.
గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ సర్కార్ ఇబ్బంది పెడుతోందనే విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. అసలు ప్రోటోకాల్ ఇవ్వకపోగా.. ఆమె తెలంగాణను అవమానిస్తోందంటూ విమర్శలు చేయడం మంత్రులకు పరిపాటిగా మారింది. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి అలాంటి విమర్శలే చేశారు. అయితే ఆయన తాజా విమర్శలు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ రాలేదంటూ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ.. ఆమె గైర్హాజర్ వల్ల ఆమె నిజస్వరూపమే బయటపడిందంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ అభివృద్దిని చూసి తట్టుకోలేకపోతున్నారని కూడా అన్నారు. అయితే జగదీశ్వరరెడ్డి విమర్శలపై రాజ్ భవన్ ఘాటుగా స్పందించింది. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని, పిలవని పేరంటానికి గవర్నర్ ఎలా వస్తారని నిలదీసింది. ఒక వేళ ప్రభుత్వం నుంచి గవర్నర్ కు ఆహ్వానం అంది ఉంటే.. అందినా ఆమె రాకపోయి ఉంటే.. జగదీశ్ రెడ్డి విమర్శలలో ఒక అర్ధం ఉండేది. కానీ గవర్నర్ కు ఆహ్వానం అందలేదని రాజ్ భవన్ స్పష్టం చేసిన తరువాత కూడా ప్రభుత్వం నుంచి, కానీ విమర్శలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి నుంచి కానీ ఎటువంటి స్పందనా లేకపోవడంతో గవర్నర్ విషయంలో ప్రభుత్వంమరోసారి ప్రొటోకాల్ పాటించలేదని బైటపడింది.