కేసీఆర్ పై పోటీకి రె‘ఢీ’అంటున్ననేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? జాతీయ రాజకీయాల్లో  కీలక  పాత్రను పోషించేందుకు వీలుగా ...లోక్ సభకు పోటీచేస్తారా? లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, హ్యాట్రిక్ ముచ్చట తీర్చుకుంటారా? లోక్ సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి మకాం మారుస్తారా? అసెంబ్లీకి పోటీచేసే పక్షాన గజ్వేల్ నుంచే పోటీ చేస్తారా? సిద్దిపేట లేదా మరో  నియోజక వర్గం నుంచి బరిలో దిగుతారా? ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై వ్యూహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.  అయితే నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్  రేపు ఏమి చేస్తారు, అనేది ఈరోజు ఊహించడం సాహసమే అవుతుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహ రచనలో ఆయన ప్రత్యర్ధి పార్టీల నాయకులకే కాదు సొంత పార్టీ, సొంత గూటి నేతలకు  కూడా చిక్కరు.. దొరకరు. నువ్వుకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అన్నట్లుగా ఆయన ప్రత్యర్ధులు ఒకటి ఉహిస్తే, ఆయన ఇంకొకటి చేసి  ప్రత్యర్ధులను ఇట్టే బురిడి కొట్టిస్తారు. ఆ విషయంలో ఆయన చాలా చాలా సమర్ధులు. సో  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..ఉహకు అందని సందేహం.   అయితే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనపై పోటీ చేసేందుకు రె‘ఢీ’ అవుతున్న ప్రత్యర్దుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పడు మాజీ మంత్రి , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేల్ బరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ‘ఢీ’ కొనేందుకు తాను రెడీ  అని ప్రకటించారు. ప్రకటించడమే కాదు నియోజక వర్గంలో కొంత హడావిడి కూడా చేశారు. అప్పట్లో స్వయంగా ఆయనే పబ్లిక్ గా సవాల్ విసిరారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పానని తెలిపారు. అంతే కాదు, ఆయన పశ్చిమ బెంగాల్ తో పోలిక కూడా తెచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని అదే విధంగా ఇక్కడ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడిస్తానని ధీమా వ్యక్త పరిచారు. అలాగే  మరో బీజేపీ ఎమ్మెల్యే, రఘునందన రావు కూడా పార్టీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి పై పోటీ చేసేందుకు తాను సిద్దమని టీవీ డిబేట్స్ లో ప్రకటించారు.   అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, విప్లవ గాయకుడు గద్దర్  బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కేసీఆర్ టార్గెట్ గా గజ్వేల్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు మూడు రోజుల క్రితమే గద్దర్  స్వయంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని తెలిపారు. అయితే  ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేక ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆరే వ్యూహాత్మకంగా ఆయన్ని బరిలో దించుతున్నారా,అనే అనుమానాలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం.  గద్దర్ విషయం ఎలా ఉన్నా  తాజాగా బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై పోటీ చేసేందుకు తాను సైతం సిద్ధమని అన్నారు.గురువారం (మే 4)బీజేపీ చేరికల కమిటీ చైర్మన్  ఈటల రాజేందర్, ఇతర బీజేపీ నాయకులు ఖమ్మంలో  పొంగులేటి నివాసంలో ఆయనతో పాటు మరో  బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు. బీజేపీ నేతలు ఆ ఇద్దరినీ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి, బీజేపీలో చేరే విషయంలో స్పష్టత ఇవ్వక పోయినా గజ్వేల్ లో కేసిఆర్ పై పోటీకి కూడా వెనకడేది లేదని అన్నారు. అలాగే, కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని అందుకోసం అవసరం అయితే రెండు మెట్లు దిగేందుకు కూడా సిద్దమని ప్రకటించారు.  అదెలా ఉన్నప్పటికీ, ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళతారా? అనే విషయంలో స్పష్టత లేదు,  ఆలాగే ఆయన  ఎక్కడి  నుంచి పోటీ చేస్తారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు, కానీ, ఆయనతో ‘ఢీ’అనేదుకు రెడీ అవుతున్న నాయకుల నెంబర్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది.

రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్.. ఇది నజరానాయేనా?

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇటీవల సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. న్యాయమూర్తి హరీశ్ హసుఖాభాయి వర్మ ఈ కేసును విచారించి.. రాహులుకు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయనతో పాటు మరో 68 న్యాయమూర్తులకు జిల్లా జడ్జి కేడర్ కు పదోన్నతి దక్కింది. అయితే, వారి ప్రమోషన్ ను  సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ సివిల్ జడ్జి కేడర్ కు చెందిన ఇద్దరు అధికారులు ఈ పదోన్నతులను సవాల్ చేశారు. 'మెరిట్- కమ్- సీనియారిటీ' ఆధారంగా కాకుండా.. 'సీనియారిటీ- కమ్- మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ హైకోర్టు జారీ చేసిన సెలక్షన్ జాబితాను, వారిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా, జ్యుడిషియల్ అధికారుల నియామకానికి సంబంధించి మెరిట్- కమ్- సీనియారిటీ ఆధారంగా కొత్త జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై మే 8న విచారణ చేపట్టనుంది. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను తన సొంతానికి వాడుకుంటూ.. తమలపై దాడులకు కేంద్రంగా పాల్పడుతుందంటూ కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తికి పదోన్నతి కల్పించడంతో.. కేంద్రం అటు న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ.. తన కనుసన్నలతో పైరవీలు నడుపుతోందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ బంధువుకే మొదటి చాన్స్

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ తమ తొలి అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ పేరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హుస్నాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. కుటుంబ రాజకీయాలను బీఆర్ఎస్ పెంచి పోషిస్తుంది అని ప్రతి పక్షాలు ఒవైపు విమర్శలు చేస్తున్నప్పటికీ కేటీఆర్ ఇవ్వాళ ప్రకటించిన అభ్యర్థి వినోద్ కేసీఆర్ కు సమీప బంధువు  కావడం విశేషం. బోయినపల్లి వినోద్ కుమార్ బంధువులకు ఢిల్లీ పరిధిలో కొన్ని మద్యం లైసెన్స్ ల కోసం కవిత మధ్యవర్తిత్వం వహించిందని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులతో కవిత, బోయినపల్లి వినోద్ కుమార్ లు పలు దఫాలు ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో సమావేశమైనట్టు  ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీపై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై  కేటీఆర్  విమర్శలు గుప్పించారు. నల్లధనం తెస్తామని చెప్పి తెల్లముఖం వేశారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ ఎవరని అడిగితే బండి సంజయ్ పేరు చెప్పాలంటే సిగ్గేస్తోందని అన్నారు. వినోద్ ను ఎంపీగా గెలిపించాలని.. బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని అన్నారు

బజ‘రంగు’ పడుద్దా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్’కు కౌంట్ డౌన్’ మొదలైంది... మరో మూడు రోజుల్లో (మే 8న) ప్రచారం ముగుస్తుంది. మరో ఐదు రోజుల్లో మే 10న పోలింగ్ జరుగుతుంది. మే 13న ఫలితాలు వెలువడతాయి.ఇక అక్కడితో కర్నాటకంలో ఒక అంకం ముగుస్తుంది, మరో అంకం మొదలవుతుంది.  అయితే కర్ణాటక పీఠాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, కర్ణాటక గెలుపుతో దేశంలో పూర్వ వైభవాన్ని పొందేందుకు కాంగ్రెస్ హోరాహోరీగా పోరాదుతున్న ఈ ఎన్నికల ఫలితాలు కర్ణాటకకు మాత్రమే పరిమితం కావు. ఈ సంవత్సరం చివరలో జరగనున్న తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్  అసెంబ్లీ ఎన్నికల పైనా, వచ్చే సంవత్సరం జరిగే  సార్వత్రిక ఎన్నికల పైనా ప్రభావం చుపుతాయనే అంచనాలతో,  దేశం మొత్తం కూడా  కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  కాగా, ఇంతవరకు వచ్చిన సర్వేలు చాలా వరకు కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలనే ఇస్తున్నారు. అయితే  సర్వే సర్వేకు గ్రాఫ్ మారుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ  (135/224) ఖాయం చేసిన సర్వే సంస్థలే.. తాజా సర్వేలో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ నుంచి సింగిల్ – లార్జెస్ట్ దాకా వచ్చారు. అటు చేసి ఇటు చేసిచివరకు మళ్ళీ హంగ్ వైపుకే సర్వే లెక్కలు సర్దుకుంటున్నాయి. అయితే, ఈసారి కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని, సర్వేలు సూచిస్తున్నాయి.   ఇంతవరకు ఒక లెక్క అయితే, ఇక ముందు ఇంకో లెక్క అన్నట్లుగా, మిగిలున్న ఐదు రోజులు అత్యంత కీలకమని సర్వే సంస్థలతో పాటుగా రాజకీయ పండితులు కూడా పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఒకప్పటి సంగతి ఏమో కానీ,ఇప్పడు ఎన్నికలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ గా మారిపోయాయి. చివరి బంతి (ఓటు) పడే వరకు ఏమైనా జరగవచ్చును. ఒక్క బంతి .. ఒక్క రాంగ్ షాట్ మ్యాచ్ రిజల్ట్  ను మార్చి వేసినట్లు ఎన్నికల్లో చివరి ‘ఘడియ’ లో తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్స్ ఫలితాలను తారుమారు చేస్తాయని గతంలో అనేక సందర్భాలలో రుజువైంది. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ చేసిన, ‘మోడీ విషసర్పం’ వంటి వివాదాస్పద  కామెంట్స్ పార్టీ ఇమేజ్ ని డ్యామేజి చేయడమే కాదు, ఎన్నికల ఫలితాలపైన ప్రతికూల ప్రభావం చూపుతాయిని గుర్తించారు, అందుకే ఖర్గే, తూచ్. అన్నారు. విష సర్పం అనండి మోదీని కాదు, ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్దాంతాలను అంటూ అర్థ తాత్పర్యాలు విడమరిచ్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయిందని, కాంగ్రెస్ నాయకులే  అంగీకరిస్తున్నారు. అలాగే సిద్దరామయ్య,డీకే శివకుమార్ లింగాయత్ కమ్యూనిటీకే వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభావం కూడా ఎన్నికల ఫలితాలపై ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే ఎన్నికల ప్రచారం ఆఖరి  ఘట్టానికి చేరుతున్న సమయంలో. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ...తాము అధికారంలోకి వస్తే  ‘బజరంగ్‌దళ్‌’పై నిషేధం విధిస్తామని ఇచ్చిన హామీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుంది. బజరంగ్‌దళ్‌‌ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ వెనకడుగు వేసింది.అసలు తాము బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని అననేలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బజరంగ్‌దళ్‌‌ను బ్యాన్ చేయలేదని కూడా తెలిపారు. మరోవంక ఈ విషయంపై స్పందించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గ నిరాకరించారు. ముఖ్యం చాటేశారు.  మరోవైపు ఓటు వేసేటప్పుడు ‘జై బజరంగబలి’ నినాదం చేయడం ద్వారా కాంగ్రెస్‌ దుష్ట సంస్కృతిని శిక్షించాలని కర్ణాటక ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఆ పార్టీయే అభివృద్ధి, శాంతిసామరస్యాలకు శత్రువని నిందించారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షణ కన్నడ, బెళగావి జిల్లాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో మోడీ ప్రతి బహిరంగసభలోనూ ‘జై బజరంగబలి’ అంటూ నినదించారు. దీంతో పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగించు కుంటున్నాయి. మరో వంక ఎన్నికల విశ్లేషకులు.. ఒకటి రెండు శాతం ఓట్లు అటూ ఇటూ అయితే ఫలితాలు తారుమారతాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వేలు సూచించిన విధంగా హస్తానికి పట్టా కడతాయా ? లేక తుస్సు మంటాయాఅన్నది మే 13న తేలిపోతుంది.

చితి పేర్చుకుని సజీవ దహనమయ్యాడు!

భరించరాని బాధను మనుసులో పెట్టుకున్న ఓ పెద్దాయన తీసుకున్న నిర్ణయం అందరినీ కలిచివేసింది. తన పోషణ కుమారులకు భారం కాకూడదని ఆ పెద్దమనిషి నిర్ణయం   సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 90ఏళ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ మండలం పోట్లపల్లికి చెందిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తనకున్న నాలుగు ఎకరాల పొలంతోనే బిడ్డలను పెంచి పెద్ద చేసి వారికంటూ ఒక జీవితాన్ని అందించాడు. వయసు విూద పడటంతో వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల పొలాన్ని నలుగురు కుమారులకు పంచి ఇచ్చాడు. పొలాన్ని పంచుకున్న ఆ అన్నదమ్ములు తండ్రిని కూడా పంచుకోవాలని భావించారు. తండ్రిని వంతుల వారీగా చూసుకోవాలని కుమారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పారు. అయితే కుమారులు తీసుకున్న నిర్ణయం నచ్చని వెంకటయ్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తనని వంతులు వారీగా చూసుకుంటానన్న కుమారుల నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ప్రాణాలు వదలడానికి సిద్ధమయ్యాడు. దీంతో తన చితిని తానే పేర్చుకున్న వెంకటయ్య ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. వెంకటయ్య ఆత్మాహుతి చేసుకున్నాడని తెలిసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నవెూదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అటకెక్కిన సమగ్ర పంటల బీమా

రైతులలో చైతన్యం నింపి వారితో నామమాత్రంగా బీమా సొమ్ము చెల్లించేలా చేయించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. వ్యవసాయం లో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం, దాని అనుబంధ రంగాలను ప్రోత్స హించడం వల్ల ఒక్కో రైతు కనీసం వందమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించవచ్చు. దీంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు, ఎగుమతులకు అవకాశాలు పెరుగతాయి. విదేశీ మారక నిల్వలను సాధించవచ్చు. ఈ సూత్రాన్ని గతంలో ఉన్న ఏ ప్రభుత్వం పాటించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ సైతం అదే బాటలో సాగుతోంది.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన వెూడీ వారిని రోడ్డున పడేలా చేస్తున్నారు. కేవలం విదేశీ పెట్టుబడులే సర్వస్వం అన్న విధంగా నేతలంతా ఆయా దేశాల ముందు వెూకరిల్లు తున్నాయి. కానీ ఏనాడు రైతులకు ఒక్క పైసా విదల్చడం లేదు. గిట్టుబాటు ధరలు, పంటలకు బీమా తదితర అంశాలను పట్టించుకోవడం లేదు. రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం కదలడం లేదు. పంటల బీమా విధిగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటే రైతులను ఆదుకున్న వారు అవుతారు. ఇందుకు జాతీయ స్థాయిలో సమగ్ర బీమా పథకం అమలు చేయాలి. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తించేలా చూడాలి. పం ట నష్టపోయిన రైతులు ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా లేదా..బిచ్చమెత్తుకునే ఉండే పరిస్థితులు పోవాలి. బీమా సొమ్ము దర్జాగా రాబట్టుకునేలా చట్టాలు రావాలి. అప్పుడే అన్నదాత కంటినిండా నిద్రపోగలడు. ప్రధానంగా బీమా పథకాల వల్ల కలిగే లబ్దిపై వారికి సమాచారం ఉండడం లేదు. అకాల వర్షాలు, వడగళ్లు, తుఫాన్లు సంభవిస్తే జరిగే నష్టాలు పూడ్చేలా సమగ్ర బీమా పథకం రూపొందించాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ మోడీ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.  అలాగే ఏ పంటకు ఎంత చెల్లించాలన్న సమాచారం కూడా రైతులకు చేరడం లేదు. అలాగే పథకాల అమలుపై రైతుల్లో చైతన్యం కానరావడం లేదు. వడగళ్లు, విలయం సంభవించినప్పుడు ప్రభుత్వాలపై ఆధారపడి పరిహారం అందక లబోదిబోమంటున్నారు. దీనిని తప్పించేందుకు ఫసల్‌ బీమా వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులను చైన్యం చేయకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో బీమాకు నోచుకోవడం లేదు. గతంలో కనీసం ఇందులో పది శాతం మంది కూడ బీమా ప్రయోజనాలు పొందలేకపోయారు. వేల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదని సమాచారం. క్షేత్ర స్థాయిలో అధికారులు తగిన రీతిలో రైతులకు బీమా సమాచారాన్ని చేరవేయకపోవడంతోనే బీమాకు దూరమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఈ విషయంపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో ఖరీఫ్‌, యాసంగి పంటల బీమా ప్రీమియం ధరలు ఖరారయ్యాయి. సీజన్‌కు సంబంధించి బీమా పథకంలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, శనగ పంటలతో పాటు మామిడి తోటలను చేర్చారు. అతివృష్టి, అనావృష్టి, వడగండ్లు, ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతింటే రైతులను ఆదుకోవడంలో బీమా పథకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. పత్తికి వాతావరణ ఆధారిత బీమా సోయాబీన్‌కు గ్రామం యూనిట్‌, జొన్న, కంది, పెసర, మినుము తదితర పంటలకు మండలం యూనిట్‌గా పంట బీమా అమలు చేయాల్సి ఉంది. దీనికితోడు టమాట, మామిడి పంటలకు కూడా వాతావరణ బీమాను ప్రకటించడం వల్ల రైతులకు ఊరట కలగనుంది. పంటల వారీగా ప్రీమియం ధరలు, చెల్లించాల్సిన గడువు తేదీల వివరాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు రైతులకు తెలియచేయాలి. ఎన్ని హెక్టార్లలో ఏ విధమైన పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయాలి. ఈ సీజన్‌లో అత్యధికంగా వరి, మొక్కజొన్న , పత్తి, పెసర, మినుము సాగయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో పరిస్థితి అనుభవిస్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏ పంట సాగు విస్తీర్ణం ఎలా ఉంటుందన్నది స్పష్టం కానుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, వేరుశనగ, శనగ పంటల కు వాతావరణ ఆధారిత బీమా పథకంలో భాగంగా మామిడి పంటలకు బీమా వర్తిస్తుంది. పంటరుణం తీసుకునే రైతులు, రుణం అవసరం లేని రైతులు ఈ బీమా పథకాలను వినియోగిం చుకోవచ్చు. అయితే పంట రుణాలను పొందాలనుకున్న రైతులకు సంబంధించి రుణం అంద జేసే సమయంలోనే ప్రీమియాన్ని తీసుకుని మిగతా మొత్తాన్ని సదరు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. పంట నష్టం జరిగితే పరిహారం రావాలంటే నిర్ణీత గడువులో బీమా చెల్లించాలి. ఈ విషయంలో రైతులకు విస్తృతం గా అవగాహన కల్పించాలి ప్రతి రైతు ప్రీమియం చెల్లించేలా కృషి చేయాలి. ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఏఈవోలు, ఏవోలను సంప్రదించేలా క్షేత్రస్థాయిలో రైతుల కు తెలియచేయాలి. పంట రుణాలు తీసుకోని రైతులు నేరుగా ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు ఉంది. విూ సేవా కేంద్రాలు, బ్యాంకులు తదితర వాటి ద్వారా చెల్లించవచ్చు. ఇవన్నీ గ్రామస్థాయిలో ప్రచారం జరగాలి. అపðడే పంటలకు తగిన భరోసా దక్కుతుంది. మిర్చి, పత్తి, శనగ తదితర రైతులు నష్టం సంభవిం చినపðడు ఏ విధంగా పరిహారం పొంద వచ్చో గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేయాలి. విదేశీ పారిశ్రామిక వేత్తలను కాళ్లావేళ్లాపడుతూ వారి ప్రాపకం కోసం పాకులాడే రోజులు పోయేలా రైతులు స్వయం సమృద్ది సాధించాలి.

ఎమ్మెల్యే రాపాక ఎన్నికపై విచారణకు సీఈవో ఆదేశం.. వాచాలతకు తగిన శాస్తి?

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నికపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్  కుమార్ మీనా ఆదేశాలు జారీచేశారు. ఆ ఉత్తర్వుల్లోని వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 24న అంతర్వేదిలో జరిగిన వైకాపా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వరప్రసాద్   పూర్వం నుంచి తమ సొంత గ్రామం చింతలమోరికి కొందరు వ్యక్తులు దొంగ ఓట్లు వేయడానికే వచ్చేవారని, ఒక్కొక్కరు 5నుంచి పది ఓట్లు వేసేవారని, అవే తన విజయానికి దోహదపడేవని వ్యాఖ్యానించగా, పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గత నెల 24న ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వరప్రసాద్ ఎన్నికపై విచారణ నిర్వహించి, వారంరోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విచారణకు ఆదేశం నేపథ్యంలో ఫిర్యాదుదారు ఎనుముల వెంకటపతిరాజా మాట్లాడుతూ, దొంగ ఓట్లతో నెగ్గినట్లు రాపాక స్వయంగా ఒప్పుకొన్నారు కనుక ఆయన ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. జనసేన పార్టీ టికెట్ పై విజయం సాధించి, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి, వైసీపీ పంచన చేరిన రాపాక కు   శాస్తి జరిగిందని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

రజనీ అభిమానుల అగ్రహం

ఇటీవలి కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై  వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు  ఆ పార్టీ మెడకు చుట్టుకున్నాయి. చిత్తూరు, తిరుపతి,  నెల్లూరులో రజనీ కాంత్ అభిమానులు అలాగే తమిళులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాలలో ఈ ప్రభావం కనిపిస్తుంది.  మూడు జిల్లాల ప్రజలు వైసీపీ నేతలపై రగిలిపోతున్నారు. మూరో 9 నెలల్లో జరిగే  ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో  వైసీపీకి తగిన బుద్ది చెబుతాం అంటూ స్థానిక ప్రజలు, రజనీ కాంత్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో  వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులలో ఈ మూడు జిల్లాల్లో ఈ సారి గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. రజనీ కాంత్ పై వైసీపీ నాయకుల వల్ల ఖచ్చితంగా రెండు శాతం ఓట్లపై ప్రభావం పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు

నయీంతో పోలిక..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ జరిగా సంవత్సరాలు గడుస్తున్నా అతని డైరీని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముందు ప్రవేశ పెట్టడం లేదని భట్టి ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి  దోచుకున్న బంగారం,నగదు, భూములను తిరిగి ప్రజలకే ముట్టజెప్పాలని భట్టి వాదన. నయీం సంపాదించిన ఆస్తులను అతని కుటుంబ సభ్యులు, ముఠాసభ్యులే అనుభవిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిందిస్తుంది.    నయీం చోటామోటా గ్యాంగ్ స్టర్ కాదు. గుజరాత్ లో సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్లో నయీం పాత్ర కీలకం. సోహ్రబుద్దీన్ తో నయీంకు ఉన్న పరిచయంతోనే గుజరాత్ పోలీసులకు ఇన్ ఫార్మర్గా మారి ఎన్ కౌంటర్ చేయించినట్లు సమాచారం.   నయీంను షాద్ నగర్ లో 2016 ఆగస్టులో ఎన్ కౌంటర్ చేశారు.     తెలంగాణ పోలీసులు . ఎపిసిఎల్ సి నేత  కరణం పురుషోత్తం హత్య కేసులో నయీం ముద్దాయిగా  ఉన్నాడు. ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ హత్య కేసులో నయీం ముద్దాయి. నయీం ఎన్ కౌంటర్ జరిగి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నయీం డైరీని బయట పెట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  నయీంకు బీఆర్ ఎస్ ప్రభుత్వానికి పెద్ద తేడాలేదని మిలియన్ మార్చ్ పాదయాత్రలో భట్టి సంచలన ఆరోపణ చేశారు. నయీం దోచుకున్న తీరులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని భట్టి అంటున్నారు.    మార్చి 16న యాత్ర ప్రారంభమై మొత్తం 90 రోజుల పాటు యాత్ర సాగనుంది. 39 నియోజకవర్గాల్లో భట్టి కలియ తిరుగుతున్నారు. భట్టి దాదాపు 1,365 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరపనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర తర్వాత భట్టి చేపడుతున్న పాదయాత్ర రెండో అతి పెద్ద యాత్ర అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి 50 అసెంబ్లీనియోజకవర్గాల్లో పర్యటించారు. 5 బహిరంగ సభలు నిర్వహించారు. భట్టి దళిత కమ్యూనిటీ నుంచి వచ్చారు. మునుపటి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. భట్టి చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో జూన్ 15న ముగుస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను స్పూర్తిగా తీసుకుని భట్టి ఈ యాత్రను చేపట్టారు. గడప గడపకు పాదయాత్ర వెళ్లడం వల్ల ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చని ఎ ఐసీసీ భావిస్తుంది. రాష్ట్రంలోబీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఇస్తున్న బూటకపు వాగ్దానాలను కాంగ్రెస్ ఎండగట్టడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుంది. ఇరు ప్రభుత్వాలు యువత కు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రలో ఆరోపిస్తుంది. తెలంగాణ ఏర్పాటు కాకమునుపు 12 లక్షల మంది ఉన్న నిరుద్యోగులు ప్రస్తుతం 30 లక్షలకు చేరుకున్నారని కాంగ్రెస్ లెక్కలేసి చెప్పింది.  భట్టి విక్రమార్క  కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  విద్యార్థులు కొలువులు రాక ఇబ్బందులు పడుతుంటే కేసిఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కట్టామని మట్లాడటం బాధాకరమన్నారు. నిజాం రాచరిక నియంతృత్వ నిరంకుశ మనస్తత్వం కలిగిన కేసీఆర్ ను గద్దె దించటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దివంగత నేత వైఎస్ ఆర్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.   

జగనాసుర పాలనకు నాలుగేళ్లు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  మరో  మూడు వారాల్లో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుంది. 2019 మే 30 తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ అని    వేడుకున్న జగన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం వేదిక నుంచే, ఆరు నెలల్లో అద్భుతాలు సృష్టిస్తానని, బ్రహ్మాండం బద్దలు చేస్తాని ప్రజలకు వాగ్దానం చేశారు.   వరస పెట్టి  హామీలు గుప్పించారు. కానీ, ఆరు నెలలు కాదు కదా నాలుగేళ్లు పూర్తయ్యే సమయానికి కూడా రాష్ట్రం ప్రగతి దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడలేదు సరికదా పాతాళానికి దిగజారింది. ఈ నాలుగేళ్లుగా ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ ల మీదే బండి లాగించేస్తోంది. ప్రస్తుతం యిక అప్పులు కూడా పుట్టని దివాలా దశకు చేరుకుంది.   అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాలుగేళ్ల సుందర ముదనష్ట పాలనలో  పాతాళానికి జారింది  ఒక్క ఆర్థిక రంగమేనా, మిగిలిన వ్యవస్థలన్నీ బాగున్నాయా? అంటే ఏ వర్గం నుంచీ ఆఖరికి సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా ఔననే సమాధానం రావడం లేదు.  ఏ రంగానికి ఆ రంగం, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ దినదిన ప్రవర్తమానంగా దిగజారి ఆఖరి మెట్టుకు చేరుకున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి గురించైతే చెప్పనే అక్కర్లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో కూడా గంజాయి, మద్యం యథేచ్ఛగా లభ్యమౌతున్నాయి. హత్యాయత్నాలు  జరుగుతున్నాయంటే రాష్ట్రంలోని యితర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో తేలికగానే అర్ధమౌతుంది. రాష్ట్రప్రగతికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం పురోగమించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి శాంతి భద్రతలు కీలకం. కానీ, జగన్ రెడ్డి పాలనలో  అరాచకత్వమే రాజ్యమేలుతోంది. ఆయన పాలన ఆరంభించడమే విధ్వంసం, కూల్చివేతతో .. మొదలు పెట్టారు.  రాజకీయ కక్ష సాధింపుకు అంకురార్పణ చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభించిన ఆయన విధ్వంస పాలన  నాలుగేళ్లుగా అలాగే కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి పునాదిగా నిలుస్తుందని అంతా ఆశించిన అమరావతిని నిర్వీర్యం చేశారు. అధికార వికేంద్రీకరణ అంటూ. మూడు రాజధానుల పేరిట అభివృద్ధి ఆశలను ఆర్పేశారు. అందుకే రాష్ట్రం రాజధాని లేకుండా నిర్భాగ్యంగా మిగిలిపోయింది.   రివర్స్ టెండర్ల పేరుతో  ప్రగతికి  హాలిడే ప్రకటించారు.    పోలవరం సహా తెలుగు దేశం ప్రభుత్వం మొదలు పెట్టిన  ప్రాజెక్టుల నిర్మాణం  ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా నిలిచే అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు.  ఆయన పాలనా వైభోగానికి నిదర్శనంగా జగన్ స్వయంగా దావోస్ వెళ్లి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నా ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు.  యిక ప్రశాంతతకు మారుపేరైనా కోనసీమలో  జగన్ సర్కార్ పెట్టిన  రాజకీయ, కుల చిచ్చు కోనసీమ సరిహద్దులు దాటిపోయి కాల్చేస్తోంది. ఒక్క కోనసీమ అనేమిటి  రాష్ట్రం అంతటా  జగన్ సర్కార్ కాష్టం రగిల్చింది. అరాజకత్వం పేట్రేగిపోయింది.  అధికార పార్టీ ఎమ్మెల్సీ తమ కారు డ్రైవర్ ను హత్య చేసి శవాన్ని స్వయంగా డోర్ డెలివరీ చేస్తారు. ఒక మంత్రి ఇంటిని సొంత పార్టీ (వైసీపీ)మూకలు  తగులపెట్టినా చర్యలు ఉండవు.   యిక వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే నవరత్నాలు  నవ్వుల పాలవుతున్నాయి.  జగన్ రెడ్డి ప్రభుత్వ్వం ఓటు బ్యాంకు సృష్టించుకునే దురాలోచనతో  సంక్షేమ పథకాలకు అనవసరమైన  ప్రాధాన్యాత ఇచ్చింది.  ఆదాయ మార్గల విషయాన్ని పూర్తిగా విస్మరించి  అభివృద్ధిని అటకెక్కించి, అప్పులు చేసి మరీ, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. అయినా, చివరకు  అప్పులే మిగిలాయి కానీ   హామీలు అరకొరగానే అమలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం వివిధ  సంక్షేమ పథకాల కింద కుటుంబానికి, ఏడాదికి రూ. మూడు నుంచి ఐదు లక్షలు ప్రయోజనం చేకూరుస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. కానీ  అది జరగకపోగా..  తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అమలైన, అన్న క్యాంటీనలు మొదలు విదేశీ విద్యాపథకం వరకూ అనేక పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించేసింది. ఇంకొన్ని పథకాలకు అర్హతలను కుదించి, అర్హుల సంఖ్యలో కోత విధించి భారాన్ని తగ్గించుకుంది. అందుకే, జగన్ రెడ్డి నాలుగేళ్ల  పాలన పట్ల అన్ని వర్గాలలోనూ అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ మాట ఎవరో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే చెప్పడం లేదు..  వైసేపీ అభిమానులు,  శ్రేణులే చెబుతున్నాయి.  యిక జగన్ పాలనలో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ సర్కార్  అధ్వాన నిర్ణయాలను అమలు చేసి కోర్టుల అక్షింతలు వేయించుకోని అధికారి లేడంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా యిద్దరు ఉన్నతాధికారులు సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు, ఐపీఎస్ ద్వారకా తిరుమల రావులకు నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. యిందుకు వారు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే కారణం.   తమ సర్వీసును క్రమబద్దీకరించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ  కొందరు ఆర్టీసీ ఉద్యోగులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్  విచారించిన హైకోర్టు  వారి సర్వీస్‌ను క్రమబద్దీకరించాలని వారి జీతాలకు ఏడు శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని   2022 ఆగస్టులో  హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలు చేయలేదు.  దీంతో ఆ ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారుల తీరుపై మండిపడింది. జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.  కోర్టు ఉత్తర్వులను ఆ అధికారులు అమలు చేయకపోవడానికి కారణమేమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. యిలా జగన్ హయాంలో ప్రభుత్వ తప్పిదాలకు అధికారులు శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జగన్ సర్కార్ యిచ్చిన ఎన్ని జీవోలను కోర్టులు తప్పుపట్టాయో లేక్కే లేదు. మొత్తంగా జగన్ నాలుగేళ్ల పాలన అన్ని విధాలుగా అధ్వానంగా ఉందనీ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

చేరుతారా? చేరరా? పొంగులేటి, జూపల్లి డైలమా ఇంకెన్నాళ్లు?

సినిమాల్లోనే కాదు,  రాజకీయాల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి. అందుకు తెలంగాణలో ఉత్కంఠ భరితంగా నడుస్తున్న ‘పొంగులేటి..జూపల్లి’ పొలిటికల్ డ్రామాయే ఉదాహరణ అంటున్నారు.  పొంగులేటి  ఏ పార్టీలో చేరతారు? జూపల్లి దారెటు? అనే చర్చ ఎడతెగకుండా మారుతూనే ఉంద. ఈ పార్టీ.. కాదు కాదు ఆ పార్టీ అంటూ లీకులు వస్తూనే ఉన్నాయి.  అయితే వారిరువురూ మాత్రం ఒక విషయంలో మాత్రం స్పష్టత యిస్తున్నారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా చెబుతున్న వారిరువురూ తమ మొగ్గు బీజేపీవైపా, కాంగ్రెస్ వైపా అన్న విషయంలో మాత్రం స్పష్టత యివ్వడం లేదు.     ప్రధానంగా, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితిలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదనీ, అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనీ,  అది తమకు ఇష్టం లేదని ఆ ఇద్దరు నేతలు తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారని, ఈ నేపథ్యంలోనే వీరిరువురూ కమలం గూటికే చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అలాగే మరి కొందరు ముఖ్యనాయకులు, బీఆర్ఎస్ తో ప్రీ పోల్ కాకున్నా పోస్ట్ పోల్ అలయన్స్ తప్పదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలాగే  జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నాలలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఏదో ఒక స్థాయిలో పొత్తు తప్పదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల నుంచే వినిపిస్తోంది. అందుకే  రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను దీటుగా  ఎదుర్కొనగలిగేది  ఒక్క బీజేపీ మాత్రమేనని పొంగులేటి, జూపల్లి భావిస్తునట్లు చెబుతున్నారు. మరో వంక బీజేపీ నాయకుల వద్ద నుంచి ఈ యిరువురికీ స్పష్టమైన హామీ కూడా లభించిందని వార్తలు వస్తున్నాయి.   ఏది ఏమైనా పొంగులేటి, జూపల్లి ఏ గూటికి చేరుతారన్న విషయంలో  వారు యిప్పటికీ క్లారిటీ  యివ్వలేదు. మొత్తం మీద తాజాగా  బీజేపీ చేరికల కమిటీ పొంగులేటి, జూపల్లితో సుదీర్ఘ చర్చలు జరిపింది. దాదాపు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం కూడా వీరి దారెటు? ఏ పార్టీలో చేరుతారు అన్న విషయంలో  స్పష్టత రాలేదు. పొంగులేని శ్రీనివాసరెడ్డి నివాసంలో బీజేపీ చేరికల కమిటీ  చైర్మన్ ఈటల రాజేందర్, సభ్యులు  రఘునందన్ రావు.. విశ్వేశ్వర రెడ్డి.. యెన్నం శ్రీనివాస రెడ్డి తదితరులు కలిసి నిర్వహించిన ఐదు గంటల సమావేశం అనంతరం కూడా  పొంగులేటి, జూపల్లి రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు అన్న విషయం తేలలేదు 

15 ఏళ్లుగా తేలని ఆయేషా మీరా హత్య కేసు

అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2007లో జరిగిన ఈ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొని నిర్దోషిగా విడుదలైన సత్యంబాబును అరెస్ట్ చేయాల్సిన కారణాల గురించి ఆరా తీస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాద్ నగర కమిషనరేట్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు నుంచి సీబీఐ అధికారులు గురువారం పలు వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన శ్రీనివాసులు రాత్రి 8 గంటలకు బయటికి వచ్చారు. ఆయన నుంచి 8 గంటలపాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని దుర్గా లేడీస్ హాస్టల్లో ఆయేషామీరా హత్య జరిగిన సమయంలోనే నందిగామ పరిసరాల్లో మరిన్ని నేరాలు నమోదయ్యాయి. ఆ సమయంలో శ్రీనివాసులు నందిగామ డీఎస్పీగా ఉన్నారు. నందిగామ ప్రాంతంలో జరిగిన వరుస నేరాలను దర్యాప్తు చేసేందుకు అప్పటి తూర్పుగోదావరిజిల్లా అదనపు ఎస్పీగా ఉన్న ఎ.వి.రంగనాథ్(వరంగల్ ప్రస్తుత కమిషనర్)ను అక్కడికి పంపించారు. దర్యాప్తులో భాగంగా అప్పటికే మరో కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సత్యంబాబును విచారించి.. ఆయేషామీరా హత్య కేసుతో సంబంధమున్నట్లు పోలీసులు భావించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాల్ని శ్రీనివాసులు సైతం పర్యవేక్షించారు. అయితే ఆయేషామీరా హత్యకేసులో సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసిన నేపథ్యంలో హత్య ఎవరు చేశారని తేల్చేందుకు సీబీఐ మరోసారి దర్యాప్తు ఆరంభించింది. ఇందులో భాగంగానే అప్పటి కేసుకు సంబంధించి శ్రీనివాసులు నుంచి సీబీఐ అధికారులు వాంగ్మూలం సేకరించారు. ఘటన సందర్భంలో.. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడి పేరు అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. రాజకీయ వత్తిడి కారణంగా అతని పేరు..ఆ తర్వాత అటకా ఎక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూతురిని పోగొట్టుకున్న అయేషా తల్లిదండ్రులు దాదాపు 15 ఏళ్లుగా కడుపు కోతను అనుభవిస్తూ కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు.

ఓఆర్ఆర్ టెండర్ గోల్ మాల్.. కేసీఆర్ సర్కార్ పై మరో మరక

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం .. టీఎస్పీఎస్సీ పేపర్ లేకేజి కుంభ కోణం.. ఇప్పుడు ..తాజాగా ఓఆర్ఆర్ కుంభకోణం. తెలంగాణలో జరిగిన కుంభకోణాలు ఇంకా ఉన్నా..ఈ మూడు కుంభకోణాల్లో ..ఒక కామన్ త్రెడ్’ కనిపిస్తుంది. అవును ఈ మూడు మేజర్ కుంభకోణాల్లో ముఖ్యమంత్రి .. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆఫ్కోర్స్  మిషన్ కాకతీయ, మిషన్ సిసన్ భగీరధ, మొదలు, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్ వంటి ప్రాజెక్టులు, పథకాలలో అవినీతికి సంబందించి వచ్చిన ఆరోపణలు అన్నిటిలో ముఖ్యమంత్రి కుతుమాబ్ సభ్యుల పేర్లు ప్రముఖంగా వినిపించిన మాట నిజమే అయినా ఈడీ, సీబీఐ ఎంట్రీతో ఈ కేమూడు కేసులు రాజకీయంగానూ ప్రధాన్యత సంతరించుకున్నాయి. నిజమే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం పెద్ద విశేషం కాదు. ఇంచు మించుగా 25 సంవత్సరాలకు కొంచెం అటూ ఇటుగా  ముఖ్యమంత్రి, ప్రధాని వంటి కీలక పదవుల్లో ఉన్నా, కుటుంబ సభ్యులు ఎవరినీ, అధికారం గడప దాక కూడా రానీయని  ప్రధాని మోడీ పైనే ఆరోపణలు వచ్చినప్పడు, పీవీ, మన్మోహన్ వంటి పెద్ద మనుషులకే అవినీతి మరకలు తప్ప నప్పుడు ... తెలంగాణలో ఏకంగా ఐదారుగురు కుటుంబ సభ్యులు అధికార పదవులు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు ఫ్యామిలీ పై ఆరోపణలు రావడం విశేషం కాదు. అలాగే దళిత బంధు పథకం లబ్దిదారుల నుంచి మూడేసి లక్షలు (30 శాతం) లంచాలు పుచ్చుకున్న ఎమ్మెల్యేల చిట్టా చేతిలో  పెట్టుకుని కూడా ... చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి కేసీఅర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటారు అనుకోవడం కుదిరే వ్యవహారం కాదు.  నిజమే కావచ్చును తన  కొడుకు , కూతురు సహా ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రే స్వయంగా శాసన సభలో ప్రకటించి ఉండవచ్చును  కానీ  దళిత ముఖ్యమంత్రి హామీ లాగా అది జరగలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు.  అయితే ఇప్పడు  ఓఅర్ఆర్ విషయంలో తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లు. ఈ వ్యవహారంలో అటు నుంచి బీజేపీ ఇటు నుంచి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు చేస్తున్న సవాళ్ళు సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. అంతే కాదు  మళ్ళీ ఈ గోల్ మాల్ వ్యవహారంలోనూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు కేటీఆర్, కవితపై  రోపణలు చేయడమే కాకుండా  ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరుతున్నారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు.  ఇందుకు సంబంధించి తాజగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను 30 సంవత్సరాల పాటు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం సరైన పద్ధతి కాదని  అన్నారు.  ప్రైవేటు కంపెనీకి లీజు ఇచ్చే విషయంపై కోర్టుకు వెళ్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా లేఖ రాస్తామని స్పష్టం చేశారు.  మరో వంక రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి స్పందిచక పోవడం, అదే సమయంలో దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వారిని హెచ్చరించిన నేపధ్యంలో  ప్రభుత్వం ఇంకా పలచనవుతోందని, అవినీతి ముద్ర ముఖ్య్మగా కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ప్రధాన ఎన్నికల అంశం మారే అవకాశం ఉందని అంటున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీలో మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ విధానం

రైల్వే, విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానానికి నేరుగా సర్వీసులు లేకపోతే.. మధ్యలో వేరొక చోట రైలు లేదా విమానం మారి ఎలా ప్రయాణిస్తారో అలాంటి ఏర్పాట్లను ఏపీఎస్ ఆర్టీసీలో అమల్లోకి తెస్తున్నారు. ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా బస్సు లేకపోతే మధ్యలో వేరొక నగరం, పట్టణంలో బస్సు మారి వెళ్లేందుకు ఒకే టికెట్ తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ పేరిట దీనిని రూపొందించారు. ఉదాహరణకు అనంతపురానికి చెందిన ఓ ప్రయాణికుడు   శ్రీకాకుళానికి వెళ్లేందుకు నేరుగా బస్సు ఉండదు. కొత్త విధానంలో అనంతపురం నుంచి విజయవాడకు ఒక బస్సులో వచ్చి, విజయవాడ నుంచి  శ్రీకాకుళానికి  వేరొక సర్వీసులో వెళ్లేందుకు ఒకే టికెట్ తో రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇలా రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకున్నాసరే కేవలం ఒక్కసారి మాత్రమే రిజర్వేషన్ ఛార్జి తీసుకోనున్నారు. ప్రయాణికుడు తొలుత ఒక బస్సులో వెళ్లి ఓ పట్టణం లేదా నగరంలోని వేరొక బస్సులోకి మారేందుకు 2 నుంచి 22 గంటల గడువునిచ్చారు. ఆ సమయాల్లో ఉన్న సర్వీసులలో ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మొత్తంగా 137 మార్గాల్లో ఈ విధానాన్ని తొలిసారి అమలుచేయనున్నారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారాగానీ, ఆర్టీసీ ఆన్లైన్ పోర్టల్ ద్వారాగాని ఈ రిజర్వేషన్లు చేసుకునేందుకు వీలుంది. దేశంలోని ప్రభుత్వరంగ ఆర్టీసీల్లో  ఏపీలోనే ఈ విధానం తొలిసారి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విధానం ప్రారంభం కానుంది. ఎన్ని సంస్కరణలు తెచ్చినా చాలా కాలంగా ఆర్టీసీ నష్టాల్లోనే ఈదుతోంది.. ఒకే టిక్కెట్.. రెండు బస్సులలో ప్రయాణం..ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో సహాయకారిగా ఉంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.

ఏపీ-తెలంగాణ భవన్ ఆంధ్రకు... పటౌడీ హౌస్ తెలంగాణకు

దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్ పరిధిలోని 19.73 ఎకరాల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ తన ప్రతిపాదనను తెలియజేసింది. 12.09 ఎకరాల్లోని ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ఉమ్మడి భవన్ ను (శబరి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్) పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని, పటౌడీ హౌస్లోని 7.64 ఎకరాలను తెలంగాణ తీసుకోవాలని ఏప్రిల్ 26న జరిగిన సమావేశంలో సూచించింది. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్, సంయుక్త కార్యదర్శి జి.పార్థసారథి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశం మినిట్స్ ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఉమ్మడి ఆస్తి విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆప్షన్లు: (ఏ) తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్ లో   సగభాగం.. ఏపీకి పటౌడీ హౌస్ లో మిగిలిన సగభాగం, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ బ్లాక్. (బీ)ఏపీకి మొత్తం పటౌడీ హౌస్, శబరి బ్లాక్.. తెలంగాణకు గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్. (సీ) తెలంగాణకు శబరి, గోదావరి బ్లాక్ లు.. ఆంధ్రప్రదేశ్ కు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్. తెలంగాణ ఇచ్చిన ఆప్షన్లు: ఆప్షన్ (డీ): తెలంగాణకు శబరి బ్లాక్, గోదావరి బ్లాక్ లు, నర్సింగ్ హాస్టల్ (12.09 ఎకరాలు).. ఏపీకి పటౌడీ హౌస్ (7.64 ఎకరాలు). ఇది విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాటాకు విరుద్ధంగా ఉంది. అయితే ఏపీ కోల్పోయేదానికి విలువ కట్టి ఆ మొత్తం తెలంగాణ చెల్లిస్తుంది. ఒకవేళ దీనికి అంగీకరించకపోతే ఏపీ ఇచ్చిన ఆప్షన్ (సీ)ని పరిశీలించాలి. ఆప్షన్ (ఈ) గోదావరి, శబరి బ్లాక్ లు, నర్సింగ్ హాస్టల్తో ఉన్న 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్కు.. 7.64 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ తెలంగాణకు. ఈ ప్రతిపాదన ఆచరణీయంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారని మినిట్స్ లో పేర్కొన్నారు. ఆప్షన్ సీ, డీ, ఈలను పరిశీలించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను వారంలోపు పంపాలని కేంద్ర హోంశాఖ కోరింది. రెండు తెలుగు రాష్ట్రాల విభజన జరిగి.. దాదాపు దశాబ్దం కాలం తర్వాత.. భవనాలు, స్థలాల బట్వారా జరగనున్ను తరుణంలో.. కేంద్ర హోం శాఖ ప్రతిపాదనపై తెలంగాణ, ఆంధ్ర ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.

ఢిల్లీ నుంచి గంటల్లో వెనక్కి ఎందుకలా ? ఏం జరిగింది?

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు చాలా చాలా కాలం తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రే ఆయినా, ఆయనకు రాష్ట్ర రాజదాని  హైదరాబాద్  కంటే దేశ రాజధాని ఢిల్లీ అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం. నిజానికి, ఒకానొక సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు బోర్ కొడుతున్నాయి, అనే మాట ఆయన నోటి నుంచే వచ్చింది. అయన మనసులోని ఆ ఆలోచనకు కొనసాగింపుగానే కావచ్చును, ఆయన ఒక సుముహుర్తన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచారు.  అందులో భాగంగానే, దేశ రాజధాని ఢిల్లీలోని, వసంత విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ కేంద్ర కారాల్యయాన్ని ప్రారంభించారు.   అయితే చిత్రంగా ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి వెళ్ళినంత వేగంగా వెనక్కి తిరిగొచ్చారు. సహజంగా ముఖ్యమత్రి కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా .చెప్పిన రోజుకు తిరిగొచ్చిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అలాంటింది, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇలా వెళ్లి అలా రావడం నిజ్జంగా  చాలా మందికి చాలా రకాలుగా అర్థమవుతోంది. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కంటి నొప్పికి, పంటి నొప్పికి ఢిల్లీ వెళ్లి రోజులు, వారాల కొద్దీ అక్కడే ఉండిపోయిన కేసీఆర్, ఏదో మొక్కుబడిగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అయిష్టంగా ఢిల్లీ వెళ్లి రావడం పజ్లింగ్ గా ఉందని, కొందరు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటే, మరి కొందరు.. ఇతకాలం ఢిల్లీ వెళ్ళక పోవడం, ఇప్పడు ఇలా వెళ్లి అలా వెనక్కి రావడం వెనక ఏదో ఉందని అంటున్నారు.  కేసీఆర్ అసలు ఢిల్లీలో ఉండేందుకే ఇష్టపడకపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి రెండో తేదీనే ఆయన ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఎందుకనో ఆగిపోయారు. ఢిల్లీలో పలు కీలక సమావేశాలు నిర్వహిస్తారని.. మేధావులతో చర్చలు జరుపుతారని.. పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో .. జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని అనుకున్నారు. కానీ, అవేవీ లేవు సరికదా, కనీసం  మీడియాను కూడా  అడ్రెస్ చేయకుండా  మౌనంగా తిరిగొచ్చారు. కేసేఆర్ లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటి? ఇప్పడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్  గా ట్రెండవుతోంది.  నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాం  లో కేసీఆర్ కుమార్తె కవిత పేరు బయటకు వచ్చినప్పటి నుంచి, ముఖ్యమంత్రి ఢిల్లీకి దూరంగా, చాలావరకు మౌనంగా ఉంటున్నారు. జాతీయ రాజకీయ కార్యకలాపాలను కూడా చాలా వరకు మహారాష్త్రకు పరిమితం చేసుకున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని, జేడీఎస్ తరపున ప్రచారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఓ వంక నితీష్ కుమార్ మరో వంక  మమతా  బెనర్జీ, ఇటు నుంచి స్టాలిన్, అటు నుంచి కేజ్రివాల్ ఎవరి ప్రయత్నాలలో  వారున్నారు. కానీ, అందులో ఏ ఒక్కరు కేసీఆర్ ను కలవలేదు. కేసీఆర్ వారెవరినీ కలవలేదు. అసలు కేసీఆర్ పేరు జాతీయ రాజకీయాల్లో వినిపించడమే లేదు.   ఇప్పుడు ఢిల్లీ పర్యటన మొక్కుబడి తంతుగా ముగియడంతో, రీల్ వెనక్కి, ఫ్లాష్ బ్యాక్’లోకి తిరగడంతో, తెర  వెనక ఏదో జరుగుతోందనే అనుమనాలు మొదలయ్యాయి. ఏదో తెలియని భయం వెంటాడుతోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు ఏమి జరిగింది? ఏమి జరుగుతోంది? అనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగా మిగిలింది.కానీ, కేసీఆర్  కు ఎక్కడ హెచ్చలోనే  కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అంటారు ..  అందుకే ఇప్పడు తగ్గారు ..కానీ, ఇది వెనకడుగు అనుకోరాదని అనుకోరాదని అంటున్నారు.

మేనిఫెస్టో చించి వార్తల్లో నిలిచి..

 కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ , బీజేపీలు తమ తమ మేనిఫెస్టోలో విడుదల చేశాయి. మేనిఫెస్టోలో బూటకపు హామీలు, వాగ్దానాలు ఉంటే ప్రత్యర్థుల చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే.  ఆరోపణలు ,  ప్రత్యారోపణలు  షరా మామూలే. కానీ ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టో ను ఏకంగా చింపి వేయడం అరుదు. గురువారం అదే జరిగింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రి వర్గంలో డిప్యూటి సీఎంగా పని చేసిన ఈశ్వరప్ప  కాంగ్రెస్ మేనిఫెస్టోను చించివేశారు. ఆయన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు .  భజరంగ్ దళ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న కారణంగా ఆ సంస్థను తాము అధికారంలో రాగానే నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో పేర్కొంది.  సీనియర్ బీజేపీ నేత అయిన ఈశ్వరప్పకు ఇది రుచించలేదు. హడావిడిగా మీడియాను పిలిచి మేనిఫెస్టోను చించి వేసి వార్తల్లో నిలిచారు. భజరంగ్ దళ్ కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టింది. కానీ బిజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా మేనిఫెస్టోను చించివేయడం చర్చనీయాంశమైంది.  ఎమర్జెన్సీ సమయంలో ఆయన బళ్లారి జైల్లో గడిపారు. ఎమర్జెన్సీ అయిపోయాక ఆయన రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. షిమాగో నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ తొలిసారి విజయం పొందడానికి ఈశ్వరప్ప ప్రధాన కారణం. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కమీషన్లు కావాలని  కాంట్రాక్టర్లను ఈశ్వరప్ప వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. విహెచ్ పి, ఆర్ ఎస్ ఎస్ లలో ఆయన ముఖ్య భూమిక వహించారు. రైట్ వింగ్ సంస్థలతో ఆయన దశాబ్దాల పాటు మమేకం అయి పని చేశారు. మధుర, కాశీ టెంపుల్స్ విధ్వంసం జరిగినప్పుడు ఈశ్వరప్ప విద్వేష ప్రసంగాలను చేసినట్టు ఆరోపణలున్నాయి. 

ఏపీలో ఆలయాల రక్షణ గాలిలో దీపమేనా ?

ఏమి జరుగుతోంది... ఎందుకిలా జరుగుతోంది...? ఆంధ్ర ప్రదేశ్ లో  హిందువులకు రక్షణ కరవవుతోంది, అనే ఆవేదన నిజం అవుతోందా? సర్కార్ ప్రభువుల అండ చూసుకుని అన్యమత ప్రచారం, మత మార్పిడి’ జోరుగా సాగుతున్న విషయం,అద్దంలో ముఖంలా అందరికి కనిపిస్తోంది. రాష్ట్రంలో అనేక గ్రామాలకు గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా బోర్డులు తగిలించుకుంటున్నాయి. క్రైస్తవ గ్రామాల సంఖ్య పెరుగతున్న విషయం పలు సందర్భాలాలో చేర్చకు వస్తూనే వుంది.  క్రైస్తవులే లేని గ్రామాల్లో చర్చిలు వెలుస్తున్నాయి. పాస్టర్లు వచ్చి యధేచ్చగా మత ప్రచారం చేస్తున్నారు.నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్న మత ప్రచారం, మత మార్పిడికి సంబంధించి (బాప్టిజం) క్రతువులు యధేచ్చగా జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించి అనేక గ్రామాల్లో ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవదమే లేదు.    అదలా ఉంటే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 250కి పైగా దేవాలయపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. విగ్రహాలను ద్వంసం చేశారు. రధాలను తగుల పెట్టారు. హుండీలను పగ కొట్టి దోచుకున్నారు. ఆభరణాలను దొంగిలించారు. చివరకు పూజారులను హత్య చేశారు. దేవాలయాలలో అన్యమత ప్రార్ధనలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, హిందువుల మనోభావాలను భయంకంగా దెబ్బతీశారు.ఇక దేవాలయ సంపద దోపిడీ గురించి అయిత చెప్పనే అక్కరలేదు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు ప్రధాన హిందూ దేవాలయాలలో ధర్మ విరుద్ద కార్యకలాపాలు యధేచ్చగా సాగుతున్నాయి.  ఇప్పడు శ్రీశైలం క్షేతంలో అదే జరిగింది.కొద్ది రోజుల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఏడు కొండలపి పై డ్రోన్స్ కలకలం సృష్టించిన విషయం, మరవక ముందే ఇప్పడు తాజగా పవిత్ర శైవ క్షేతం శ్రీశైలంలో ఏకంగా చార్టర్ ఫ్లైట్ కలకలం సృష్టించింది. మల్లన్న ఆలయ పరిసరాల్లో  గుర్తు తెలియని చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టిందని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెపుతున్నారు. శ్రీశైలం క్షేత్రం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే పలు మార్లు ఆలయ పరిసరాలలో డ్రోన్ చక్కర్లు కొట్టగా.. ఇప్పటి వరకు దాని ఆచూకీని ఆలయ సిబ్బంది కనిపెట్టలేదని చెబుతున్నారు. డ్రోన్ ను చూసిన సిబ్బంది దానిని కిందకు దించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు శ్రీశైలం ఆలయ పరిసరాలతో పాటు.. మల్లన్న ఆలయం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో   స్థానికులు, భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శ్రీశైలం ఆలయ శిఖర ప్రాంతం నో ఫ్లయింగ్ జోన్ అంటే ఆ ప్రాంతంలో విమానాలు ఎగరరాదు,   అన్న నిబంధన వుంది. అయితే ఇప్పుడు నో ఫ్లయింగ్ జోన్ ప్రాంతంలో చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో ఆలయ అధికారులు ఏమి చేయాలో తెలియక, తెలిసినా ఏమీ చేయలేక గుండె బరువును గుండెలోనే దాచుకుంటున్నారు.   అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా  గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్నా, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇంతవరకు కనీసం ఒక్కరంటే ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  సోషల్ మీడియా  పోస్టుల పెట్టిన వారిని వెంటాడి వేటాడి అరెస్ట్ చేస్తున్న పోలీసు యంత్రాంగం దేవాలయలపై దాడులు చేస్తున్న  గుర్తు తెలియని వ్యక్తులను ఎందుకు గుర్తించలేక పోతున్నారు? ఎందుకు అరెస్ట్ చేసి శిక్షించడం లేదు? ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేవాలయాలు దుండగుల టార్గెట్  ఎందుకయ్యాయి ? అందుకే ఏపీలో ఏమి జరుగుతోంది?  ఎందుకిల జరుగుతోంది? అనే భేతాళ ప్రశ్నలు పదే పదే వినిపిస్తున్నాయి. ఏపీలో దేవాలయాల రక్షణ గాలిలో దీపమేనా, అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవును, ఆయనెవరో అనంట్లుగా, వైసీపీ ప్రభుత్వ చర్యలు, వినాశకాలే విపరీత బుద్ధి అనే నానుడిని గుర్తు చేస్తున్నాయి అంటున్నారు.