వివేకా హత్య కేసు.. అవినాష్ డైరక్షన్ లో సీబీఐ దర్యాప్తు!?
posted on May 4, 2023 @ 10:49AM
వివేకా హత్య కేసు దర్యాప్తు, ఆ కేసులో సీబీఐ నిందితుడిగా పేర్కొన్న అవి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. అవినాష్ రెడ్డి అరెస్టుతో వివేకా హత్య కేసుకు ఒక తార్కిక ముగింపునకు వస్తుందని అంతా భావించారు. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో సీబీఐకి ఉన్న అడ్డంకులన్నిటినీ కోర్టులు సందేహాలకు అతీతంగా తొలగించేసినా.. సీబీఐ మీనమేషాలు లెక్కించడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఏ ఒత్తిడులు సీబీఐ కాళ్లూ చేతులూ కట్టేస్తున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి మొదటి నుంచీ తాను అరెస్టవుతానన్న భావంతోనే దాని నుంచి తప్పించుకోవడానికి చేయాల్సినంతా చేశారు. ప్రధానంగా ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందడానికి ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నారు. కేసు తెలంగాణకు మారిన తరువాతే వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయంపై సీబీఐ బలమైన వాదనలు వినిపించింది. దీంతో అవినాష్ హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ వెళ్లి మరీ అరెస్టు కాకుండా ఉండేందుకు చేయగలిగినంతా చేశారు.
తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ముందస్తు బెయిలు యిచ్చి ఒకింత ఊరట కలిగించినా.. వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఆయనకు ఆ ఊరట కూడా లభించలేదు. అయినా హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉందన్న సాకుతో అరెస్టు నుంచి తప్పించుకోగలిగారు. చివరికి హైకోర్టు కూడా ముందస్తు బెయిలు పిటీషన్ పై తీర్పును వాయిదా వేస్తే.. అవినాష్ ను అరెస్టు చేసి విచారించడానికి సీబీఐకి ఎటువంటి అడ్డంకులూ లేవని తేల్చేసింది.
యిదంతా జరిగి రోజులు గడిచినా సీబీఐ మాత్రం ఆయన అరెస్టు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు విషయంలో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో మాత్రం వివేకా హత్య కేసులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సాక్ష్యాల మాయం నుంచి పలు అంశాలలో అవినాష్ కు ప్రమేయం ఉందనీ, ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందనీ విస్పష్టంగా పేర్కొంది. అలాగే హత్య కొోసం నాలుగు కోట్ల సొమ్ముకు ఒప్పందానికి సంబంధించిన అంశంలో కూడా అనినాష్ రెడ్డిని విచారించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది.
అలాగే నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10 కోట్లు.. ఇస్తామన్నారని గంగాధర్రెడ్డి వాంగ్మూలంలో వాస్తవం తేల్చాలనీ సీబీఐ పేర్కొంది. అంతే కాకుండా అవినాశ్ రెడ్డికి నేర చరిత్ర ఉందనీ, ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనీ కూడా పేర్కొంది. యిన్ని చెప్పిన సీబీఐ అడ్డంకులన్నీ తొలగిపోయినా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం అటుంచి.. విచారణకు పిలిచినప్పటి నుంచీ ఆయన మీడియా ఎదుట..
సీబీఐ సవ్యదిశలో దర్యాప్తు చేయడం లేదంటూ .. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో చెబుతూ వస్తున్నారు. యిప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో వెనకడుగు వేసిన సీబీఐ.. తన దర్యాప్తును అవినాష్ చెప్పిన విధంగా సాగిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో డాక్టర్ సునీత దంపతులకు వివేకా హత్య కేసుతో సంబంధం లేదని విస్పష్టంగా చెప్పిన సీబీఐ.. ఆ తరువాత వారిరువురినీ విచారించింది. అలాగే వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఉద్దేశపూర్వకంగా ఆయన కుమార్తె.. అల్లుడు దాచేసినా పట్టించుకోలేదన్న అవినాష్ ఆరోపణలకు అనుగుణంగా దర్యాప్తు సాగిస్తోంది. తాజాగా వివేకా పీఏ క్రిష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని హత్య జరిగిన చోట లభించిన లేఖను ఎందుకు దాచారంటూ ప్రశ్నలు గుప్పించిందని చెబుతున్నారు. మొత్తంగా సీబీఐ ప్రస్తుతం అవినాష్ లేవనెత్తిన అంశాల దర్యాప్తుపై దృష్టి సారించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ డైరెక్షన్ లో సీబీఐ దర్యాప్తు సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.