సచివాలయం దేవాలయం సచివులు దేవుళ్ళా ?
posted on May 3, 2023 @ 2:14PM
చదవేస్తే ఉన్నమతి పోయిందన్నది సామెత. తెలంగాణలో మంత్రుల మాట తీరు చూస్తే ఒకరి తర్వాత ఒకరు ఆ సామెతను నిజం చేస్తున్నారా అని అనిపించక మానదు. ఇతరుల సంగతి ఎలా ఉన్నప్పటికీ. మంత్రి కల్వకుట్ల తారక రామా రావు ( సచివాలయానికి ఇచ్చిన తాజా నిర్వచనం వింటే, ఈయన అమెరికా వెళ్లి చదువుకున్నది ఇదేనా, అనే సందేహం కలుగుతోందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి దివ్యమైన సచివాలయాన్ని నిర్మించింది. అంతే కాదు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరున, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని నామకరణం చేసింది. అలాగే, సెక్రటేరియట్ నుంచి కన్నెత్తి చూస్తే కనిపించేలా అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఇంతచేసి సెక్రటేరియట్ గేటుకు ‘ప్రజలకు ప్రవేశం లేదు’ అనే బోర్డును పెట్టలేదు దాదాపుగా ప్రభుత్వం అదే చేస్తోంది. సమాన్య ప్రజలను కాదు, చివరకు అధికార ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా సెక్రటేరియట్ లోకి అనుమతించడం లేదని విపక్షాలే కాదు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్నారు.
ఎవరిదాకానో ఎందుకు పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని కూడా గేటు దాటనీయ లేదని ఆయనే మీడియా సమావేశంలో ఆరోపించారు. దీంతో ప్రగతి భవన్ లా సెక్రటేరియట్ కూడా కొందరి కోసమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రజాస్వామ్యం గురించి పెద్ద మాటలు మాట్లాడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిందం కేజ్రివాల్ కూడా ఇలాగే మీడియాకు ఎంట్రీ లేకుండా చేశారు.. ఇప్పడు మళ్ళీ ఇంతకాలానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ సచివాలయంలోకి మీడియా ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేశారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే, యూఎస్ రిటర్న్ మంత్రి కేటీఆర్ సచివాలయం అంటే సచివుల ఆలయం అనే కొత్త నిర్వచనం ఇచ్చారు. సచివాలయం దేవాలయం, సచివులు దేవుళ్ళు అనే అర్థ వచ్చేలా, సచివాలయం అంటే సచివులు ఉండే ఆలయం మాత్రమే అని కేటీఅర సెలవిచ్చారు. అందుకే సచివాలయంలోకి సామాన్యులను అనుమతించడం లేదని చెప్పారు. నాలుగు రోజుల కిందట ( ఏప్రిల్ 30న) ముఖ్యమంత్రి కేసీఆర్ స్వహస్తాలతో నూతన సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించినప్పటి నుంచి సచివాలయం వివాదాల నిలయంగా మారింది. సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించక పోవడం మొదలు అస్మదీయ మీడియాను మాత్రమే ఆహ్వానించడం వరరూ సచివలయాం చుట్టూ అనేక వివాదాలు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో కొందరు విలేకరులు సచివాలయంలోకి మీడియాను అనుమతించక పోవడానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సచివాలయం దేవాలయం ..సచివులు దేవుళ్ళు సచివాలయంలోకి వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మీడియా మిత్రులకు జ్ఞానబోధ చేశారు.
అలాగే మంత్రి కేటీఆర్ కర్ణాటకఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కూడా తమ అమూల్య అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్నమొన్నటి వరకు ఉచితాలు దేశానికి మంచిది కాదంటూ ప్రధాని మోదీ పదే పదే గొంతు చించుకున్నారని, కానీ.. కర్ణాటకలో మూడు సిలిండర్లు, పాలు ఫ్రీ అంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించారని విమర్శించారు. అంత వరకు ఓకే కానీ, మంత్రి కేటీఆర్ ‘మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్, మీ ఇంటి కొస్తే మాకేంపెడతావ్’ అని మైండ్సెట్’ ట్యూన్ చేసి పెట్టుకున్నారో ఏమో కానీ కర్ణాటకు ఇచ్చినప్పుడు దేశంలోని ఇతర, రాష్ట్రాలకు ఫ్రీ సిలిండర్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. నిజానికి, ప్రీ సిలెండర్లు ఇచ్చేది మోదీ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, కర్ణాటక ప్రభుత్వం. అది కూడా బీజేపీ అధికారంలోకి వస్తే కర్ణాటక ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తుంది. ఇది సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయమే. కానీ యూఎస్ రిటర్న్ మంత్రి గారికి ఎందుకు అర్థం కాలేదో ఏమో కానీ, కేటీఆర్ తీరు చూస్తే చదవేస్తే ఉన్నమతి పోయిందనే సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు.