పెట్టుబడులు ఎవరికో మరి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికున్న అవకాశాలు, తెలంగాణ సర్కార్ పారిశ్రామిక వేత్తలకు వేస్తున్న రెడ్ కార్పెట్ గురించి వివరించడానికి మంత్రి కేటీఆర్ ఈ సారి యూకే కు బయల్దేరారు. మే 11, 12 తేదీల్లో లండన్‌లో జరగనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సు రెండో ఎడిషన్‌లో మాట్లాడాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావును గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ ఆహ్వానించింది.రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ యూకే పర్యటన ఈ నెల 13 వ తేదీ వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా కేటీఆర్ ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి ఆయన వివరించనున్నారు.అయితే గతేడాది మే లో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి  లండన్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భారత హైకమిషన్ సమావేశంతో పాటు ప్రవాస భారతీయలు, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో ఆయన భేటీ అయ్యారు.అయితే ఈ పర్యటన మంచి ఫలితాలను ఇచ్చింది. లండన్ కు చెందిన పలు కంపెనీలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈ సారి కేటీఆర్ యూకే పారిశ్రామిక వేత్తలను టార్గెట్ చేశారు. తెలంగాణాకు పెట్టుబడులు తేవాలన్న లక్ష్యంతో యూకే బయలు దేరిన కెటీఆర్ ఇక్కడి ప్రభుత్వ స్థలాలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికే ఈ పర్యటన అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు  ఒక సవాల్ చేశారు. దమ్ముంటే భూకబ్జాలు, ఖరీదైన ప్రభుత్వ భూములను కార్పొరేట్‌ ఆస్పత్రికి విక్రయించడం తదితర ఆరోపణలన్నీ అవాస్తవమని నిరూపించాలని సూచించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి  ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల వివరాలను కూడా వెల్లడిస్తానని చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి బిల్డర్లకు అనుమతులు ఇస్తున్నారని, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులివ్వడమేంటని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కెటీఆర్ యుకె పర్యటన వివాదాస్పదం కానుందని విశ్లేషకులు అంటున్నారు. 

పవన్ కల్యాణ్ ఫ్రం 2014 టు 2024

కొణిదెల కల్యాణ్@ కొణిదెల పవన్ కల్యాణ్@ పవర్ స్టార్ పవన్ కల్యాణ్లో కొన్ని అరుదైన గుణాలు ఉన్నాయని ఆయనను దగ్గరగా చూసిన వారు అంటూ ఉంటారు. అన్నచాటు తమ్ముడిగా, సినిమాలలో అడుగులు వేసి, అన్నతోటి తమ్ముడిగా ప్రజారాజ్యంలో కలిసి, అన్నను మించిన తమ్ముడిగా జనసేనతో మెరుస్తున్న పవన్ కల్యాణ్ ది కొంత విలక్షణమైన మనస్తత్వమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో  పవన్ కల్యాణ్  పేరు ఒకటి అని చెప్పడానికి అనుమానం అక్కర్లేదు.  2007 అక్టోబర్ లో రివాల్వర్ పట్టుకుని జూబ్లీహిల్స్ రోడ్లపై హల్ చల్ చేసిన పవన్ కు, పీఆర్పీ పెట్టనప్పుడు ప్రసంగాలు చేసిన పవన్ కు, జనసేన అధినేతగా  యిప్పుడు పావులు కదుపుతున్న పవన్ కి చాలా వ్యత్యాసం ఉంది.  కానీ పవన్ కల్యాణ్ కు సినిమారంగంలో దక్కినంత స్టార్ డమ్రాజకీయాలలో దొరకలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా అంగీకరించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. సహజంగా గెలిచిన నాయకులు కూడా ప్రజల మొహం చూడని నేటి రాజకీయాలలో సమయం దొరికినపుడు ప్రజలతో కలిసే పవన్ కల్యాణ్ ను ప్రజలు యిష్టపడతారు.  రెండు చోట్లా ఓడించినా ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తుమాట అనని పవన్ తన మీద తానే జోకులు వేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందకు ప్రయత్నిస్తున్నారు.  యిదంతా పవన్ మేనరిజం అనుకుంటే పొరపాటే. పవన్ తన భావోద్వేగాలను తాను నియంత్రించుకుని రాజకీయ నాయకుడిగా తనను తాను మలచుకుంటున్నారు. పవన్ సినిమాలు, రాజకీయాలు అంటే జోడు పడవల ప్రయాణం చేస్తున్నాడని ఆరోపిస్తున్న వారికి సినిమాలు తన జీవనోపాధి అని చెప్పేశారు. కనుక సినిమాలు చేయక తప్పని పరిస్థితి అనేది స్పష్టమైంది. గతంలో పవన్ ను కేవలం సినిమా స్టార్ గానే ప్రజలు చూశారనడంలో సందేహం లేదు. కానీ ఆ ఇమేజ్ ని పవన్ మార్చుకోగలిగారు. ఇందుకు పవన్ లోని రాజకీయ నిబద్ధత, కొంత కారణమైనా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం.  2014 మార్చ్ 14న ప్రారంభమైన జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో  2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చింది. టీడీపీఅధికారలోకి రావడానికి తాము కూడా కారణమని భావించిన జనసేన 2019 ఎన్నికలలో స్వయంగా రంగంలోకి దిగి ఒకే ఒక్క అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. దీంతో రాజకీయాలంటే సినిమా కాదని పవన్ కల్యాణ్ కి తెలిసి వచ్చింది. సహజంగానే 2019 ఓటమి తరువాతే పవన్ కల్యాణ్ లో గుణాత్మకమైన మార్పు వచ్చింది.  గడిచిన నాలుగేళ్లలో అధికార వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ను మరింతగా పదును పెట్టారు.  క్రమంగా రాజకీయాలు వంటబట్టించుకున్న పవన్ ఎప్పుడూ ర ాష్ట్ర అభివృద్ధి వైపే ఉంటానని చెప్పారు.  తాజాగా టీడీపీకి పవన్ దగ్గరవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ. అంతే కాకుండా మోడీ ఆశీస్సులు బలంగా పవన్ కల్యాణ్ పట్ల అధికార వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. గతంలో పవన్ వివాహాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగాగమనిస్తున్న జనసేన బృందం ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలుగుదేశంతో జతకట్టే అంశంపై రెండో ఆలోచనకు తావులేదనిపవన్ కల్యాణ్జనసేన ముఖ్యనేతలకు తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉంటుందని, పవర్ షేరింగ్అనే విషయాలపై ఎవరూ నోరెత్తవద్దని పవన్ కల్యాణ్ తన పార్టీ సీనియర్లకు అల్టిమేటం ఇచ్చారని తెలిసింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా త్వరలో బస్సుయాత్ర చేసేందుకు పవన్ సిద్ధంఅవుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.  ఇదంతా గమనిస్తే  రాజకీయ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి పవన్ ఎంత వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారో అర్ధంఅవుతుంది. అభిమానుల ఆవేశాన్నికంట్రోల్ చేస్తూ, వ్యూహాలకు పదును పెడుతున్న పవన్ 2024 ఎన్నికలలో జనసేనపోటీ చేయబోతున్న సీట్లపై కూడా స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలుస్తోంది.

సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతం తొలగింపు తగదు

పిల్లలలో తార్కిక ఆలోచనా విధానానికి, శాస్త్రీయ దృక్ఫధంలో నిర్ణయాలు తీసుకునే  శక్తికీ తిలోదకాలిచ్చేసేలా ఎన్సీఈఆర్టీ నిర్ణయాలు ఉంటున్నాయని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యాంశాల నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం అటువంటి నిర్ణయమేనని వారంటున్నారు. టెన్త్ క్లాస్ సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించాలని యిటీవల ఎన్సీఈఆర్టీ నిర్ణయించింది. ఈ అంశంపై తాజాగా టాటా యిన్సిటిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వివిధ ఐఐటీలకు చెందిన 1800 మంది  నిపుణులు రాసిన బహిరంగ లేఖలో జీవపరిణామ సిద్ధాంతాన్ని విస్మరిస్తే తదనంతర కాలంలో మనం దేన్నీ అర్థం చేసుకోలేమని అందులో పేర్కొన్నారు. డార్విన్ సిద్ధాంతం సాయం లేకుండా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని అధ్యయనం చేయడం కుదరదనీ,  ప్రజల్లో విజ్ఞానం పెంపొందించాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఎన్సీఈఆర్టీ నిర్ణయం విరుద్ధమని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.  చరిత్రను.. భవిష్యత్తును అర్ధం చేసుకోవడానికి దోహదపడే  సిద్దాంతాలను తొలగిస్తే.. భవిష్యత్ తరాలు దేన్నీ కూడా అర్థం చేసుకోలేమ పరిస్థితి ఎదురౌతుందనీ, రాబోయే తరంలో మూఢ నమ్మకాలు పెరుగుతాయని మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

కునో పార్కులో మరో చీతా మృతి

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చీతా ప్రాణాలు వదిలింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన  చీతాల్లో ఒకటైన ఆడ చీతా దక్ష మృతి చెందింది. పార్క్ లో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో  తీవ్రంగా గాయపడిన దక్ష చికిత్స పొందతూ  చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. దక్ష మృతిలో కునో నేషనల్ పార్కులో లో  40 రోజుల వ్యవధిలో ఇది మూడో  చీతా చనిపోయినట్లైంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన సాశా అనే ఆడ చీతా ఈ ఏడాది మార్చి 27న చనిపోయింది. భారత్ కు రాకముందు నుంచే మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆ చీతా.. మరింత అస్వస్థతకు గురై  మృతిచెందింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్ అనే మగ చీతా.. ఈ ఏడాది ఏప్రిల్ 23న అనారోగ్యానికి గురై చనిపోయింది.  ప్రాజెక్ట్ చీతా భాగంగా  ఇండియాకు 20 చీతాలు తీసుకొచ్చారు. 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను, 2023 ఫిబ్రవరి 17న సౌతాఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు చనిపోయాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా  వీటిని  దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి తీసుకువచ్చిన చీతాలను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా మధ్యప్రదేశ్ కునో పార్కులో వదిలిన సంగతి విదితమే.  వీటిలో ఒక్కొక్క చీతా  మరణిస్తుండటంతో పార్కు అధికారులు ఏం చేయాలో అర్థం కాక, తలలు పట్టుకుంటున్నారు.

మణిపూర్ లో మారణాయుధాలు చోరీ

దక్షిణాదిలో కర్నాటక ఎన్నికలలో మోడీ అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డిలు క్షణం తీరికలేకుండా వ్యూహాలు రచిస్తుంటే,  ఈశాన్యంలో మణిపూర్  పరస్పర దాడులతో అట్టుడుకుతోంది. యిప్పటికే అధికారిక లేక్కల ప్రకారం 60 మందికి పైగా మరణించగా వందల మంది గాయపడ్డారు. వేల కొలదీ యిళ్లు అగ్నికి ఆహుతి కాగా, 25కి పైగా చర్చిలు కూల్చివేయబడ్డాయి. యింత జరుగుతున్నా దేశ నాయకులకు యిది పట్టడం లేదు. మణిపూర్ లో పెట్రేగిన హింస యింత వరకూ అదుపులోనికి రాలేదు. స్థానిక పోలీసు, సైనిక వ్యవస్థలు కొంత వరకూ పరిస్థితిని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అయినా యింకా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. మణిపూర్ లో తాజా పరిస్థితిపై నోరు విప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని షాకింగ్ నిజాలను మీడియాతో పంచుకున్నారు. గత కొద్ది రోజులుగా  జరుగుతున్న దాడులలో 1041 తుపాకులు, 7450 రౌండ్ల బుల్లెట్లు మాయమయ్యాయని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పుకొచ్చారు. వీటిలో అత్యాధునిక ఏకే సిరీస్ రైఫిళ్లు, సెల్ఫ్ లోడెడ్ మ్యాగజైన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. జాతుల మధ్య జరుగుతున్న ఈ హిసాకాండలో వెయ్యికి పైగా తుపాకులు, ఏడున్నర వేల బుల్లెట్లు ప్రజలు లూటీ చేశారని  ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారు. ఆ ఆయుధాలు యిప్పుడు ఎవరి చేతికి చేరాయో తెలియని, యిది ఆందోళన కలిగించే అంశమని  బీరేన్ సింగ్ చెబుతున్నారు. దానిపై మణిపూర్ లో నిరసన వ్యక్తమవుతోంది.  నాలుగు దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రష్యాలలో పరిస్థితిపై దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. యిన్ని ఆయుధాలు నిజంగా భద్రతా సిబ్బంది నుండి ప్రజలు లూటీ చేశారా లేక ప్రభుత్వమే వాటిని దారి మరల్చిందా అన్న ప్రశ్న ప్రతిపక్షాల నుండి ఎదురౌతోంది. సమస్యాత్మక రాష్ట్రాలుగా చెప్పుకునే ఈశాన్య రాష్ట్రాల పట్ల యిలాంటి వైఖరి సరికాదనేది వారి వాదన. అల్లర్లలో మరణించిన వారికి 5లక్షలు ఎక్స్ గ్రేషియా, యిళ్లు కోల్పోయిన వారికి 2 లక్షలు నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి పాతిక వేల రూపాయల పరిహారాన్ని మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. 

బండి సెల్ ఫోన్ కేసీఆర్ చేతుల్లో?

తెలంగాణ బిజేపీ చీఫ్ బండి సంజయ్  సెల్ ఫోన్ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎత్తుకెళ్లారని ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. తనను అరెస్ట్ చేసిన పోలీసులే తన సెల్ ఫోన్ ఎత్తుకెళ్లి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.  సిద్దిపేట వరకు వచ్చే వరకు సెల్ ఫోన్ ను భధ్రంగానే ఉంచారని అక్కడి నుంచే మాయమైందని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు తనను కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజు బండి సంజయ్ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.  తన సెల్ ఫోన్లో కాల్ లిస్ట్ చూడటానికే కేసీఆర్ పోలీసుల చేత ఈ దొంగతనం చేయించారని బండి సంజయ్ ఆరోపించారు.  తనను కస్టడీలో తీసుకుని సెల్ ఫోన్ ను కేసీఆర్  మాయం చేయించారని ఆయన  ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు  చాలామంది తనతో టచ్ లో ఉన్నట్లు బండి సంజయ్ చెప్పారు. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో తన పాత్ర ఉందని కేసీఆర్ ప్రచారం చేశారని బండి గుర్తు చేస్తున్నారు. వరంగల్ సీపీ తన కాల్ లిస్ట్ బయటపెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్న బండి త్వరలో సీపీ మీద పరువు నష్టం కేసు వేస్తానన్నారు. రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బిజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ  ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దళిత బంధులో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు  మూడు లక్షల కమిషన్ అందుతుందని పార్టీ అధినేత ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయాల్లో అప్పట్లో  చర్చనీయాంశమైంది. ఆ 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు రావని కేసీఆర్ ఇప్పటికే  ఖరా ఖండిగా చెప్పారు. ఇక్కడ టికెట్లు రాకపోతే బిజేపీలో చేరతారు అని ఊహించే కేసీఆర్ ఈ సెల్ ఫోన్ మాయం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 30 మంది ఎమ్మెల్యేలు బండి సంజయ్ తో టచ్ లో ఉన్నట్లు వార్తలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతల పేర్లను తెలుసుకోవడానికే సెల్ ఫోన్ మాయం  అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.    

ద్వేషాన్ని తరిమి కొట్టండి

కర్ణాటకలో ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. బీజేపీని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత ట్వీట్ చేసింది. ద్వేషాన్ని దేశం నుంచే తరిమి కొట్టాలని, కర్ణాటక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిస్తున్నారు.  ఇవ్వాళ కర్ణాటక రాష్ట్రంలో పోలింగ్ సందర్బంగా కవిత చేసిన ట్వీట్ ఒక విషయాన్ని స్పష్టం అయ్యింది.  బీజేపీని ఓడించండి అని పరోక్షంగా    పిలుపునిచ్చారు . మద్యం కుంభకోణంలో తనను బీజేపీ ప్రభుత్వం ఇరికించిందని కవిత ప్రధాన ఆరోపణ. బీజేపీని  దేశం నుంచే తరిమికొట్టడానికి కర్ణాటక నాంది కావాలని ఆమె చెప్పకనే చెప్పారు. కర్ణాటక ఫలితాలు 13వ తేదీన ఉన్నాయి. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. రెండో స్థానంలో బీజేపీ కి వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కర్ణాటకలో ప్రచారం చేసింది. జేడీఎస్ తరపున ప్రచారం చేసింది. మాజీ ప్రధాని దేవగౌడ పిలుపు మేరకు కేసీఆర్ అక్కడ ప్రచారం చేయాలని తొలుత నిర్ణయించుకున్నారు. కానీ తెలంగాణా పాలిటిక్స్ హీటెక్కడంతో ఢిల్లీలో బీఆర్ ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభించి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఒక వేళ కేసీఆర్ హైదరాబాద్ రాకపోయి ఉంటే కర్ణాటక ఎన్నికల  ప్రచారంలో ఉండేవారు. బిజేపీని తరిమికొట్టడమే ప్రధాన లక్ష్యమని ముందు నుంచి కేసీఆర్ చెబుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి మీద ఫోకస్ పెట్టదలచుకుని బుధవారం ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. 

పశువులా మాట్లాడొద్దు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వ్యక్తిగత దూషణలు కూడా చేస్తున్నాయి. పశుసంవర్ధక శాఖామంత్రి తలసానిని పశువు అని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంభోధించింది.మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలపై తలసాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖ అయితే మాత్రం పశువులా మాట్లాడకు తలసాని అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ ఏ పార్టీ నుంచి వచ్చారు. టీడీపీలో ఆయన ఏం చేశారో అందరకీ తెలుసన్నారు. రాబోయే రోజుల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందని చెప్పారు. అందరూ దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణం తలసాని శ్రీనివాస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం కుర్చీలో ఉన్నారు అంటే అది తమ భిక్ష అని ఆమె చెప్పుకొచ్చారు. మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలపై  తలసాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖ అయితే మాత్రం.. పశువులా మాట్లాడకు తలసాని అంటూ ఘాటుగా స్పందించారు.తలసాని శ్రీనివాస్ ఏ పార్టీ నుంచి వచ్చారు.. టీడీపీలో ఆయన ఏం చేశారో అందరకీ తెలుసన్నారు సునీతారావు. రాబోయే రోజుల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందని చెప్పారు. అందరూ దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. . కేసీఆర్ సీఎం కుర్చీలో ఉన్నారు అంటే అది తమ భిక్ష అని సునీతరావు చెప్పారు.   

జగనన్నకు చెబుదాం.. గంటకు 250 కాల్స్

వైసీపీ ప్రభుత్వం కొత్తగా  ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి  విశేష స్పందన లభించింది. అంటే యిదేదో జగన్ కు జనాదరణ బ్రహ్మాండంగా ఉందనడానికి తార్కానంఎంత మాత్రం కాదు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జనాలు తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించుకునే అవకాశం యివ్వడమే. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించింది. ఆ నంబర్ కే కాల్స్ వెల్లువెత్తాయి. రమారమి గంటకు250 చొప్పున కాల్స్ వస్తున్నాయి. అంటే జగన్ నాలుగేళ్ల కాలంలో సమస్యలు ఎంతగా పేరుకుపోయాయి అన్నది ఈ కాల్స్ ను బట్టే అవగతమౌతోంది.  జనాలు ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి చెప్పుకుంటే.. వారి సమస్య అలా పరిష్కారం అయిపోతుందన్నంత రేంజ్ లో  ప్రచారం చేశారు. దీంతో  జగన్ పాలనలో పేరుకుపోయిన సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  నాలుగు గంటల్లో వెయ్యిమంది ఫిర్యాదులు చేశారంటేనే సమస్యలు ఏ స్ధాయిలో  పేరుకుపోయాయన్నది అర్ధమైపోతోంది. నిజానికి ప్రజా సమస్యల పరిష్కారాలకే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. గ్రామస్ధాయి నుండి సెక్రటేరియట్ లో పనిచేసే అత్యున్నత స్ధాయి అధికారులందరు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి. అయితే జగన్ హయాంలో ఆ దిశగా పనులు జరగడం లేదనడానికి జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి ఈ స్థాయిలో  ఫిర్యాదులు వెల్లువెత్తడమే నిదర్శనం.   రోడ్లు ,ఆరోగ్య కేంద్రాల పనితీరు, ఫించన్లు, రేషన్  వంటి సమస్యలే అధికంగా ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే  జగనన్నకు చెబుదాం  కార్యక్రమంపై సందేహాలు, అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.  పాలనలో నాలుగేళ్లు పూర్తయ్యాయి.  మరి నాలుగేళ్లలో చేయనిది, చేయలేనిదీ.. ఒక్క ఫోన్ కాల్ కు స్పందించి జగన్ ప్రభుత్వం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   రాష్ట్రంలో అభివృద్ధే కాదు.. సంక్షేమం కూడా అందని ద్రాక్షగానే మారిందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయన్నది  కేవలం విమర్శే కాదు.. కాదనలేని వాస్తవం.  

వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఇక దబిడి దిబిడే

ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయిందా?  బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు గ్యారంటీయేనా?  అంటే ఈ రెండు పార్టీల  నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది.  దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని ఆ పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది.  యిప్పటికే ఏవో రెండు మూడు జిల్లాలలో  ఒకటి రెండు  నియోజకవర్గాల విషయంలో తప్ప  పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు  దాదాపు ఖరారైపోయాయని కూడా చెబుతున్నారు.  2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందన్న అంచనాల నేపథ్యంలో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై జరిగిన చర్చలలో తెలుగుదేశం, జనసేనల మధ్య  రెండు పార్టీలకూ ఆమోదయోగ్యంగా ఒప్పందం దాదాపుగా కొలిక్కి వచ్చిందని అంటున్నారు. హీరోగా, పొలిటీషియన్ గా జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.  ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఆయన సభలకు హాజరౌతున్నారు.  తెలుగు రాష్ట్రాలలో అత్యంత జనాకర్షణ   ఉన్న నేతలలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు.   అయితే ఈ జనాకర్షణ ఎన్నికలలో విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం కచ్చితంగా ఔనన్న సమాధానం రాదు.  గత ఎన్నికలలో  130కి పైగా స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించింది.  ప్రస్తుతం కూడా ఆ పార్టీకి జనాదరణ పెరిగినా ఒంటరిగా ఎన్నికల సమరాంగణంలో గెలిచేంత బలం లేదని పరిశీలకులు మాత్రమే కాదు.. జనసేన వర్గాలు సైతం అంటున్నాయి. ఈ  నేపథ్యంలోనే 2014 ఎన్నికలలో వలె తమ పార్టీ ఓట్ల చీలికకు అవకాశం లేని పాత్ర పోషించాలని జనసేనాని సైతం చెబుతున్నారు. అయితే అప్పటి మాదిరిగా పోటీకి దూరంగా ఉండి మద్దతు తెలపడం కాకుండా తమ పార్టీ బలానికి తగ్గట్టుగా ఎంపిక చేసిన నియోజకవర్గాలలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే ఆయన గత కొంత కాలం నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనిచ్చేది లేదని చెబుతూ వస్తున్నారు. ఆయన అన్నఆ మాటతోనే  ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల చర్చ తెరమీదకు వచ్చింది. యిక జనసేన విషయానికి వస్తే  ఆ పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం  జగరలేదు.  అలాగే  జనసేన పార్టీకి సంబంధించినంత వరకూ పవన్ కల్యాణ్ వినా మరో నాయకుడు కనిపించరు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంతే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నా.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. వీరిద్దరినీ మినహాయిస్తే మిగిలిన నాయకులకు పెద్దగా జనంలో గుర్తింపు ఉన్న దాఖలాలు లేవు.  ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన మొదటి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు. శిక్షణ శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాల నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణ  శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. అందుకే   నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ  సంస్థాగతంగా బలంగా ఉంది.  అందుకే  తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు బలంగా చాటుకుని, స్థిరంగా నిలిచింది.   ఏ రాజకీయ పార్టీ అయిన పదికాలాలు  నిలవాలంటే, సంస్థాగత నిర్మాణం  అవసరం. అది లేక పోవడమే  జనసేన  లోపం. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే, 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి. అంతే కాదు,  జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఫలితంలో మార్పు ఉండదు. బీజేపీ దేశంలో బలమైన శక్తి కావచ్చును, కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బీజేపీకి నిండా ఒక శాతం ఓటు బలం కూడా లేదు. అందుకే  వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి తప్ప మరో పార్టీకి లేదు.  సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్  ముందున్న ఏకైక ఆప్షన్  తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకోవడం ఒక్కటే.  అలాగే  తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చే ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ గెలుపును అడ్డుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేనను కలుపుకుని పోవడం ఆ పార్టీకీ అవసరమే. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్యా పొత్తు పొడుపుకు మార్గం సుగమమయ్యేలా చర్చల ప్రక్రియకు తెరలేచింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా వరకూ ఒక అవగాహన కుదిరింది.  విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇప్పటికే ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు కూడా చాలా వరకూ ఖరారైందని చెబుతున్నారు.   పొత్తులో భాగంగా ఏడు జిల్లాలలో 20 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని చెబుతున్నారు. మిగిలిన జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అవగాహన కుదిరిన  స్థానాలు ఇలా ఉన్నాయి.  గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది.  ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనల పొత్తు ఖాయమని ఆ రెండు పార్టీలూ కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాయి.  పొత్తు చర్చల్లో భాగంగా జనసేన 60 స్థానాల నుంచి బేరాలు మొదలు పెట్టిందని చెబుతున్నారు. అయితే హేతుబద్ధత ఆధారంగా రెండు మూడు చర్చల అనంతరం ఆ సంఖ్యను బాగా కుదించుకుని పాతిక స్థానాలకు ఆమోదం తెలిపిందని అంటున్నారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా.. కష్టనష్టాలను తట్టుకుని, ప్రభుత్వ అణచివేత చర్యలను ఎదుర్కొని పార్టీ కోసం బలంగా నిలబడిన తెలుగుదేశం నాయకుల నుంచి ఆ సంఖ్యలో స్థానాలను వదులు కోవడం యిష్టం ఉండకపోవడంతో.. చర్చల సమయంలో  జనసేన కోరుకున్నా యివ్వలేని స్థానాలపై మరో సారి  చర్చించాలన్న అంగీకారానికి యిరు పార్టీలూ వచ్చాయని చెబుతున్నారు. మొత్తం మీద సీట్ల సర్దు బాటులో  ఒకటి రెండు స్థానాల విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడినా పోత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే  యిరు పార్టీల మధ్యా సీట్ల విషయంలో ఒక ఒప్పందం కుదిరిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో భాగస్వామ్యం, మంత్రివర్గంలో బెర్తులు వంటి అంశాలపై జనసైనికులెవరూ మాట్లాడవద్దని జనసేనానిని స్పష్టమైన ఆదేశాలిచ్చారనీ, అందుకే ఆ విషయాల జోలికి వెళ్ల కుండా క్షేత్ర స్థాయిలో తెలుగుదేశంతో కలిసి పని చేయడంపైనే పవన్ పార్టీ దృష్టి పెట్టిందనీ చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాల రెపరెపలు, స్థానిక సమస్యలపై ఐక్య పోరాటాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ప్రభుత్వ భూములు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో

ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని  కాంగ్రెస్ లెజిస్లేటివ్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన యాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సభలో మల్లు బీఆర్ఎస్ చేస్తున్న కబ్జాలను తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇల్లు ఇవ్వకపోగా.. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందన్నారు.రాజ్య హింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నామన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాఠీ చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ రాజధాని నడిబొడ్డున రాజహింస, భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుందన్నారు. ‘‘ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే రూ.5 లక్షల కోట్ల విలువైన సుమారు 10 వేల ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కబ్జా చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల భూములను కూడా 25 లక్షల కోట్ల రూపాయలతో లాక్కుంది. పేదల నుంచి లాక్కున్న భూములను ధనవంతులు, కార్పొరేట్ల కంపెనీలకు, హెచ్‌ఎండీఏ లేఅవుట్ల రూపంలో వేలానికి ఇచ్చారని కాంగ్రెస్‌ నేత ఆరోపించారు.కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్దంగా, మౌనంగా, కనిపించకుండా ప్రభుత్వం రాజ్య హింస చేస్తుంది’’అని భట్టి విక్రమార్క ఆరోపించారు. భట్టి చేపట్టిన యాత్రకు మహేశ్వరం నియోజకవర్గంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇది ప్రభుత్వ కుట్ర: అమరావతి జేఏసీ

అమరావతి భూములను పేదలకు దక్కకుండా చేయడంలో  ప్రభుత్వ కుట్రను  అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జే ఏ సీ) నేత పువ్వాడ సుధాకర్ రావు బయట పెట్టారు.  రాజకీయ స్వార్థంతో కూడినటువంటి నిర్ణయం వలన  ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రాజధాని అమరావతిలో ఉచితంగా ఇంటిని పొందే అవకాశాన్ని ఈ ప్రభుత్వం భూస్థాపితం చేస్తుందన్నారు.  వారికి శాశ్వతంగా రాజధానిలో నివాసాన్ని లేకుండా చేస్తుందని ఆయన ఆరోపించారు. ‘‘అమరావతి రాజధాని లో గత ప్రభుత్వ హయాంలో 44 ఎకరాలలో 5024 అత్యంత మన్నిక గల, గౌరవప్రదమైన టిడ్కో ఇళ్లను నిర్మించడం జరిగినది అనగా ఒక ఎకరమునకు 114 ఇళ్లను నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రస్తుతం 1134 ఎకరాలతో పాటు ఇప్పుడు అదనంగా కోరిన 268 ఎకరాలను కలుపుకొని మొత్తం 1402 ఎకరాలలో సుమారుగా 50వేల మందికి సెంటు భూమిని పంపిణీ చేస్తుంది. అనగా ఒక ఎకరం  35 కుటుంబాలకు కేటాయిస్తుంది, అదే 1402 ఎకరాలలో టిడ్కో ఇళ్ల నిర్మాణం తరహాలో ఎకరానికి పైన పేర్కొన్న విధంగా ఎకరం ఒక్కింటికి 114 ఇళ్ల  చొప్పున 160000 కుటుంబాలకు ఇళ్లను నిర్మించవచ్చు.ప్రభుత్వ స్వార్థపూరిత నిర్ణయం వలన, అమరావతి రాజధాని విధ్వంసకర కుట్రకు పాల్పడటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న సుమారుగా 110000 ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు అమరావతి రాజధాని లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉచితంగా ఇంటిని పొందే మహత్భాగ్యాన్ని, అమరావతి రైతుల త్యాగ ఫలితంగా ఏర్పడిన సువర్ణ అవకాశాన్ని ఈ ప్రభుత్వం సమూలంగా నాశనం చేయడం కాదా?  ఇది కాదా మోసం? ఇది కాదా దుర్మార్గం? ఇది కాదా ప్రభుత్వ దుందుడుకు చర్య?ఈ ప్రభుత్వం కాదా పేదల పాలిట శాపం?వాస్తవాలను నిర్భయంగా ప్రకటిద్దాం.పేదల పక్షాన నిలబడదాం.ఈ ప్రభుత్వ కుట్రలను చేదిద్దాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం పేదవాడిని గెలిపిద్దాం’’ అని పువ్వాడ సుధాకర్ పిలుపునిచ్చారు. 

నాగబాబు వాచాలత.. వాతావరణాన్ని చెడగొడుతోందా?

మెగా బ్రదర్ నాగబాబు.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఆయనకే అర్ధం కానట్లుంటుంది ఆయన తీరు. చాలా సార్లు ఆయన వ్యాఖ్యలు, మాటలు వివాదాలకు తావిచ్చేవిగానే ఉంటాయి. నటుడిగా, టీవీలలో  జబర్దస్త వంటి షోలకు జడ్జిగా ఆయన పాత్రను ఆయన బాగానే పోషించారు. అయితే రాజకీయాలలో మాత్రం ఆయన తప్పుటడుగులు వేస్తున్నారు. వాచాలత కారణంగా ఆయన సొంత పార్టీకే నష్టం చేకూరుస్తున్నారు. ప్రజారాజ్యంలో ఉన్నంత కాలం ఆయన ఏం మాట్లాడారు, ఏం చేశారు అన్నది పక్కన పెడితే.. చాలా కాలం తరువాత యిప్పుడు జనసేన పార్టీలో కీ రోల్ పోషిస్తున్న సమయంలో  ఏదైనా మాట్లాడే ముందు ఒకింత వెనకా ముందూ ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఆ పని నాగబాబుకు తెలియదన్న సంగతి ఆయనకు తప్ప అందరికీ తెలుసు. యింతకీ ఈ ఉపోద్ఘాతమెందుకంటే.. ఆయన తాజాగా జనసేన ఓట్ల శాతం గురించి ప్రకటన చేసి వివాదాల తుట్టె కదిపారు. జనసేనకు 35శాతం ఓట్లు ఉన్నాయని ఊరుకుంటే బాగానే ఉండేది. కానీ నాగబాబుకు ఎక్కడ ఆపాలో తెలియదు. అందుకే ఆయన పవన్ కల్యాణ్ సీఎం అవుతారంటూ చేసిన ప్రకటన జనసేన వర్గాలలోనే  భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణమైంది. జనసేన ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని సోదరుడు నాగబాబు వ్యాఖ్యలు జనసేన రాజకీయ లక్ష్యానికీ, ఆదర్శానికీ భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అంటూ పదే పదే చెబుతూ.. తెలుగుదేశంతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు యిస్తున్నారు. అలాగే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తుందన్న సంకేతాలు యిస్తున్నారు. ఈ సంకేతాల కారణంగానే క్షేత్ర స్థాయిలో జనసైనికులు తెలుగుదేశం శ్రేణులతో కలిసి పని చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్రలో కూడా జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. అయితే తెలుగుదేశం- జనసేన మధ్య పొత్తు వ్యవహారం అధికారికంగా ఖరారు అయిన దాఖలాలు లేవు. అందుకు అవసరమైన సానుకూల వాతావరణం అయితే ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆ సానుకూల వాతావరణాన్ని దెబ్బ కొట్టే విధంగా పవన్ కల్యాణ్ సీఎం అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పొత్తు లేకుండా జనసేన ఒక వేళ ఒంటరిగా రంగంలోకి దిగితే.. అప్పుడు నాగబాబు ఆ మాటలు అన్నా అర్ధం ఉండేది. కానీ పార్టీ అధినేత, పార్టీలో నంబర్ 2గా గుర్తింపు పొందిన నాయకుడు కూడా పోత్తులకు అనుకూలం అంటూ సంకేతాలు యిస్తుంటే.. నాగ బాబు మాత్రం ఆలూ లేదు చూలు లేదన్నట్లుగా ముఖ్యమంత్రి పవన్ అంటూ ప్రకటన చేయడంపై జనసేన శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. పవన్ సోదరుడు అన్న గుర్తింపు వినా జనసేనలో కానీ, రాజకీయంగా కానీ నాగబాబుకు ప్రత్యేక గుర్తింపు అన్నది లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మెగా బ్రదర్ కార్డుతో పొందుతున్న గౌరవాన్ని నిలుపుకోవాలంటే యిలాంటి తొందరపాటు ప్రకటనలు కూడదని సూచిస్తున్నారు.  ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న దానిపై యిప్పటికింకా సందిగ్ధతే నెలకొని ఉంది. అయితే ఒక జనరల్ ఫీలింగ్ మాత్రం బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా.. తెలుగుదేశం, జనసేనలు కలిసే సాగుతాయన్న సంకేతాలైతే స్పష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తెలుగుదేశంతో పొత్తు కుదిరితే.. జనసేన ఆ పార్టీతో సీట్లు పంచుకోవలసి ఉంటుంది. తెలుగుదేశం కచ్చితంగా అధిక స్ధానాలలో పోటీకి దిగుతుంది. అ విషయాన్ని జనసేనాని పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గౌరవానికి భంగం కలగని రీతిలో  పొత్తులు ఉంటాయనడం ద్వారా.. కొన్ని స్థానాలకు తమ పార్టీ పరిమితమౌతుందని ఆయన చెప్పకనే చెప్పేశారు. మరి అలాంటప్పుడు ఎక్కువ స్థానాలలో పోటీచేసే తెలుగుదేశం జనసేనకు సీఎం పదవి యివ్వడానికి అంగీకరిస్తుందా?  యిప్పటికిప్పుడు అయితే రాజకీయ అవసరాల దృష్ట్యా యిరు పార్టీలూ పరస్పర సహకారం గురించి మాట్లాడుకుంటున్నా.. గత అనుభవం దృష్ట్యా చూస్తే.. పొత్తు తెలుగుదేశం పార్టీకి కంటే జనసేన పార్టీకే ఎక్కు వ అవసరం. ఆ సంగతిని విస్మరించి పవన్ సీఎం అంటూ నాగబాబు ప్రకటనలు గుప్పించడం జనసేనకు ప్రయోజనం సంగతి పక్కన పెడితే నష్టం చేసే అవకాశాలే ఎక్కువ.   ఆయన వ్యాఖ్యలు క్షేత్ర స్థాయిలో జనసేన శ్రేణులను అయోమయానికి గురి చేయడం తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా.. వైసీపీకి తెలుగుదేశం.. జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీకి ఆయాచితంగా ఓ అస్త్రం అందించినట్లైందని విశ్లేషిస్తున్నారు. 

విజయసాయికి మెచ్చి మేకతోలు కప్పారా?

విజయసాయి రెడ్డి తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా, జగన్ అక్రమాస్తుల కేసులో సహ  నేరస్తుడిగా, ఏ2గా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంలోనూ.. జగన్ ముఖ్యమంత్రి కావడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయి. గత ఎన్నికలకు ముందు, పార్టీ అధికారంలోకి వచ్చాకా కూడా కుడి ఎడమ భుజాలు తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయసాయి.. ఆ తరువాత పార్టీలో కనీస గుర్తింపునకు కూడా నోచుకోకుండా మరుగున పడిపోయారు. రాజ్యసభ సభ్యుడు కనుక ఢిల్లీలో షెల్టర్ తీసుకున్నారు. అక్కడే దాదాపు ఒంటరిగా తిరుగుతున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు ఆయనను కలవడానికే యిష్టపడటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎలాగో.. అణిగిమణిగి ఒండి అత్యంత విశ్వాసపాత్రుడిగా యింత కాలం పని చేసిన విజయసాయి అలాగే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అనువుగాని చోట మౌనమే మేలు అన్నట్లుగా యిటీవలి కాలంలో విజయ సాయి పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విజయ సాయి యిప్పుడు అసలు దాని జోలికే పోవడం లేదు. ఏదో ఒకటీ రెండూ ట్వీట్లు చేసినా అవి ప్రధాని మోడీ కార్యక్రమాలను పొగడడానికో.. లేదా విపక్ష నేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికో పరిమితమైపోయారు.  అలాంటి విజయసాయికి పార్టీ అధినేత జగన్ హఠాత్తుగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో పార్టీలో విజయసాయికి మళ్లీ పూర్వ వైభవం వచ్చేసిందా అన్న చర్చ ప్రారంభమైంది.   అయితే.. పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు అంత సీన్ లేదంటున్నారు. యిప్పుడు జగన్ ఆయనను ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా నియమించారు సరే.. యింతకు ముందు వరకూ ఆ పోస్టులో బాలినేని ఉండేవారు. ఆయన దానిని తిరస్కరించిన తరువాతే  విజయసాయికి జగన్ ఆ బాధ్యతలు అప్పగించారు.   అంత మాత్రాన ఆయన నిజాయితీకి అదినేత మెచ్చి మేకతోలు కప్పారని కాదని పార్టీ శ్రేణులే ఉంటున్నారు. ఆ మూడు జిల్లాలకూ కోఆర్డినేటర్ అవసరం నిజానికి ఏ మాత్రం లేదని వారంటున్నారు. ఎందుకంటే ఆ మూడు జిల్లాలలోనూ యిప్పటికే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఆయన పెత్తనాన్నీ, ఆధిపత్యాన్ని తట్టుకోలేకే జగన్ కు సమీప బంధువు కూడా అయిన బాలినేని ఓ దడ్డం పెట్టి మరీ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ పదవి నుంచి వైదొలగారు. జగన్ స్వయంగా తన ప్రతినిథులను పంపి మరీ  బుజ్జగించినా బాలినేని దిగి రాలేదు.   యిక గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను జగన్  సుబ్బారెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచీ సుబ్బారెడ్డికీ, విజయసాయికీ పొసగడం లేదన్న భావన పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.  విజయసాకికి అప్పగించిన మూడు జిల్లాల్లో ప్రకాశం లో సుబ్బారెడ్డి వినా మరెవరూ వేలు పెట్టే అవకాశం లేదు.  చిత్తూరు జిల్లా వైసీపీ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నలలోనే మెలుగుతోంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే అక్కడ సమన్వయం చేయడానికి ఏమీ లేదు. అంటే జగన్ ఏరి కోరి మరీ విజయసాయిరెడ్డికి కట్టబెట్టిన మూడు జిల్లాల కోఆర్డినేటర్ పదవి అలంకార ప్రాయం తప్పితే అక్కడ చేయడానికి ఏమీ లేదు. దీంతో విజయసాయిని మరింతగా అవమానించేలాగే ఈ నియామకం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.   అన్నిటికీ మించి జగన్ తనకు కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టినట్టుగా వార్తలు వచ్చినా విజయసాయి స్పందించలేదు. అధినేతకు కృతజ్ణతలు చెప్పలేదు.దీనిని బట్టి చూస్తుంటే..  విజయసాయికి పార్టీలో ఉన్న గుర్తింపును మరింత పలుచన చేయడమే లక్ష్యంగా ఈ కొత్త పదవి కట్టబెట్టారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

జగన్ సహా మోడీకి 30 మంది దత్తపుత్రులు!

 మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారు. వారిలో జగన్ ఒకరు. అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను కాపాడేందకు ప్రధాని దేశ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే.. మోడీని గద్దె దింపడం ఒక్కటే మార్గం. అందుకే  దేశాన్నిరక్షించండి.. మోడీని ఓడించండి అన్ననినాదంతో  విపక్షాల ఐక్యత కోసం వామపక్షాలు నడుంబిగించాయి. అయితే ఏపీలో మాత్రం వారు తమ నినాదాన్ని ఒకింత సవరించుకున్నాయి. దేశానికి మోడీ ఎలాగో.. రాష్ట్రానికి జగన్ అలా తయారయ్యారనీ, సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని యిరువురూ దెబ్బతీస్తున్నారని వామపక్షాలు అంటున్నాయి. లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట చేరుతారన్నట్లుగా.. విధ్వంసం, విద్వేషమే స్వీయ సిద్ధాంతంగా వ్యవహరిస్తున్న మోడీ, జగన్ లు యిద్దరూ ఏపీలో కుమ్మక్కై పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. యిరువురి మధ్యా రహస్య సంబంధం ఉందంటున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శ నారాయణ ఓ అడుగు ముందుకు వేసి జగన్ ను దుర్యోధనుడితో పోల్చారు. మూడు పదులకు పైగా సలహాదారులను ఏర్పాటు చేసుకుని ఏపీలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.  బటన్‌ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి అంటే ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. వెూదీ  అండతో జగన్ విర్రవీగుతున్నారనీ, ఆ అండ పోయిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని నారాయణ అన్నారు.    వచ్చే ఎన్నికలలో బీజేపీతో సయోధ్య ఉన్న పార్టీలతో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. మణిపూర్‌ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే రూ.2500 ఉన్న టికెట్‌ ధరలను రూ.25 వేలు చేశారని మండిపడ్డారు.  ఎయిర్‌ పోర్టులు ప్రజల సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం పైవేట్‌ వాళ్లకు ఇవ్వటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పైవేట్‌ పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారని.. కేవలం పైవేట్‌ వాళ్ళకే ఇస్తారట అంటూ సీపీఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చిందన్నారు. ప్రధాని వెూదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారన్నారు. మోడీ దత్తపుత్రులు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు.   బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక బీజేపీ చొరవతో సినిమా తీయించారని విమర్శించారు. కర్ణాటకలో గెలుపు కోసం వెూడీ మతాల మధ్య చిచుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. అదానీ, వెూడీ బంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటు గురయ్యేలా చేశారని నారాయణ ఆరోపించారు. ఏపీలో అడుగడుగునా వెూడీకి సీఎం జగన్‌ అనుకూలంగా ఉన్నారన్నారు. రాష్టాన్రికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని నారాయణ అన్నారు.  కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్.. యిరువురూ తమ ప్రజా వ్యతిరేక విధానాలతో ఎక్కడిక్కడ జనాన్ని దోపిడీకి గురి చేస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో వీరిరువురినీ గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నారాయణ అన్నారు. 

జగనన్నకు చెబితే మాత్రం ఏం చేస్తారు?

జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం (మే 9) లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. సంతృప్తి స్థాయిలో వినతులను పరిష్కరించే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం  జగన్‌ మాట్లాడుతూ... వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వ పాలనలో లంచాలు, వివక్ష ఉండేవని, టిడిపి హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని దుయ్యబట్టారు, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించానని, పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని సిఎం చెప్పారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌-1902కు కాల్‌ చేస్తే సమస్యకు పరిష్కారం అందుతుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని సిఎం చెప్పారు. ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు జగనన్నకు చెబుదాం కార్యక్రమం మంచి పరిష్కార వేదిక అవుతుందని నమ్మబలికారు. ప్రజలకు సేవ అందించేందుకే తాను ఈ స్థానంలో ఉన్నానని, ఫిర్యాదు నవెూదు చేసిన వెంటనే వైఎస్సార్‌ ఐటీ కేటాయింపు చేస్తుందని, ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు స్టేటస్‌ అందుతుందని, ప్రత్యక్షంగా సిఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని తెలిపారు. స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. యిదంతా ఒకెత్తయితే.. ఈ నాలుగేళ్లలో జగన్ నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ బెబుతూ వస్తున్నదంతా  శుద్ధ అబద్ధమని జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జగన్ చేసిన ప్రసంగంతోనే తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల పాలన పూర్తయిన తరువాత జగన్ యింత కాలం ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేశారని స్వీయ విశ్లేషణ చేసుకుంటే ఏమీ చేయలేదని తేలడంతోనే.. తాజాగా జగనన్నకు చెబుదాం అన్న కార్యక్రమాన్ని ప్రారంభించి.. యింత కాలం మీరు చెప్పిందేమీ నేను వినలేదని తేటతెల్లం చేశారంటున్నారు. యింత కాలం ఆయన చేసిందేమిటయ్యా అంటే.. గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలకు నాలుగేళ్ల తరువాత మళ్లీ శంకుస్థాపనను చేయడం.. అలాగే గత ప్రభుత్వంలో ఆరంభమైన పనులను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసి.. యిప్పుడు వాటిని తిరిగి ఆరంభించడం.. అలా తిరిగి ఆరంభించిన పనులకు గతంలో ఉన్న పేర్లు తీసేసి తన పేరు పెట్టుకోవడం అంటూ విమర్శలు వినవస్తున్నాయి. యిక యిప్పుడు ఆయన తాజాగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కూడా కొత్త కార్యక్రమం ఏమీ కాదు.. గత చంద్రబాబు ప్రభుత్వం పీపుల్స్ ఫస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ విధానమే యిప్పుడు కొత్తగా జగనన్నకు చెబుదాం కార్యక్రమమని పరిశీలకులు చెబుతున్నారు.  యిప్పుడు కూడా ఈ కాల్ సెంటర్ కు అందే ఫిర్యాదులలో ఎక్కువ భాగం జగన్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పురగతికి నోచుకోని పనులు.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏయే సమస్యలపై అయితే  వైసీపీ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ ప్రజలు నిలదీశారో అవే సమస్యలు ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో  జనం ఫిర్యాదు చేస్తారని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకున్న సమస్యల పరిష్కారానికే దిక్కు లేదు. ఓ ఫోన్ నంబర్ కు జనం తమ సమస్యలు చెబితే ప్రభుత్వం స్పందిస్తుందనుకోవడం అపోహేనంటున్నారు. ఎన్నికల ముందు చేసే హడావుడిలో భాగమే యిదని విశ్లేషిస్తున్నారు. ప్రజల సమస్యలు ఏమిటి? నాలుగేళ్లలో తాము పరిష్కరించకుండా వదిలేసిన సమస్యలేమిటి? అన్నవి ఎవరో చెబితే తెలుసుకునే దుస్థితిలో జగన్ ఉన్నారా అని జనం కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగనన్నకు చెబుదాం  అన్న కార్యక్రమం వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్టు, ఆర్ జోన్ స్థలాల పంపిణీ వంటి అంశాల నుంచి జనం దృష్టి మరల్చేందుకు తీసుకువచ్చిన ప్రోగ్రామేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సీఎం ప్రధాన సలహాదారుగా సోమేష్.. తెలుగువన్ ఎప్పుడో చెప్పింది

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కు  ప్ర‌భుత్వం కీల‌క పోస్టు కేటాయించింది.  సీఎం కేసీఆర్ కు ప్ర‌ధాన స‌ల‌హాదారుగా ఆయనను నియ‌మిస్తూ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.   ఈ ప‌ద‌విలో సోమేశ్ కుమార్   మూడు సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగ‌నున్నారు. ప్ర‌ధాన స‌ల‌హాద‌రుగా ఆయ‌న‌కు కేబినెట్ హోదా క‌ల్పించింది.  సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ . ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌ని చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ గా ఉన్నారు. అనంత‌రం గిర‌జిన సంక్షేమ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా , 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. సోమేశ్ కుమార్ ప‌నితీరుకు మెచ్చిన సీఎం కేసీఆర్ 2019లో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. అయితే ఏపీ కి కేటాయించిన ఆయన వెంటనే అక్కడకు వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా   హైకోర్టు  ఆదేశించడంతో అక్క‌డికి వెళ్లి రిపోర్టు చేశారు.  ఆ తరువాత  స్వ‌చ్చంధ‌ ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.  ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బీఆర్ఎస్ స‌భ‌లో సీఎం ప‌క్క‌నే సోమేశ్ కుమార్ క‌నిపించారు. ఆలా ఉండగా సోమేష్ కుమార్ కు కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పదవి కట్టబట్టే అవకాశం ఉందని తెలుగువన్ ముందే చెప్పింది. ఆయనకు సలహాదారు పదవి దక్కే అవకాశం ఉందని కూడా పేర్కొంది.    సోమేష్ కుమార్ కోర్టు తీర్పు కారణంగా తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఆయన    అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన వెంటనే     స్వచ్చంద పదవీ విరమణ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది.   అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా సోమేష్ కుమార్ ఏపీలో రిపోర్టు చేసి ఆ తరువాత కొంత కాలానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.   ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంటనే   తెలంగాణ సర్కార్ ఏదో ఒక పదవి ఇచ్చి అకామిడేట్ చేస్తుందని తెలుగువన్ అప్పుడే చెప్పింది.  తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు  సలహాదారు వంటి పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అప్పట్లోనే తెలుగువన్ చెప్పింది.   తెలంగాణ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సయిజ్, కమర్షియల్ టాక్సెస్ కార్యదర్శిగానూ కొనసాగారు. ఇ ప్పుడు కూడా ఆయనకు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్‌కు అప్పగిస్తారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ.. సోమేష్ కుమార్ తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయిన తరువాత కూడా ఇప్పటి వరకూ ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఎవరికీ అప్పగించకపోవడంతో సోమేష్ అనుభవం దృష్ట్యా ఆయననే చూసుకోమనే అవకాశం ఉందని చెబుతున్నారు.   ఎన్నికల సంవత్సరం కావడం, కేంద్రం నుంచి సహకారం కరవైన నేపథ్యం, కారణంగా సొంత ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడాల్సిన పరిస్థితి.  దీంతో సోమేష్ కుమార్ కు రాష్ట్రానికి వనరులు సమకూర్చే బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు.  

ప్రభుత్వాల అప్పుల తిప్పలు

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ.. ప్రభుత్వ భూములు అమ్ముతూ జనాకర్షక పథకాలు, ఉచితాలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో తప్పు లేదు. కానీ అప్పులు చేసి, భూములు తెగ నమ్మి సంక్షేమ పథకాల పేరిట డబ్బులు పంచడం అంటే రాష్టాన్ని మరంతగా అప్పుుల ఊబిలోకి తీసుకుపోవడమే అవుతుంది. మితివిూరిన అప్పులు భవిష్యత్‌ తరాల వారికి గుదిబండగా తయారయ్యే ప్రమాదముంది. తెలుగు రాష్టాల్లో ఇప్పుడు అప్పులపైనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రానురాను ఇవి విపరీతంగా పెరుగుతున్నా పాలకులు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని సవరించి, ఆయా ప్రభుత్వాలు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రవేశపెట్టే ఉచితాలకు క్లళెం వేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు రెండు రకాలు.  మొదటి దాంట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, రోడ్లు వంటి వాటిని అభివృద్ధి చేస్తుంది. దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పేదలు చదువు అంది అభివృద్ధి చెందుతారు. ఉచిత వైద్యం పొంది ఆరోగ్యంగా ఉంటారు. ఇక రెండవ దాంట్లో వ్యక్తి(ఓటరు)ని దృష్టిలో పెట్టుకొని అమలు చేసే సంక్షేమ పథకాలు. ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్నట్లు కల్యాణలక్ష్మి, డబుల్‌బెడ్‌రూమ్‌ఇండ్లు, గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరెలు, రైతు బంధు, పింఛన్లు తదితరాలు. రెండవ రకంలో సమాజంతో సంబంధం లేకుండా లబ్దిదారులకు నేరుగా లాభం చేకూరుతోంది. కొన్ని దేశాలు మితివిూరిన సంక్షేమ పథకాలు, ఉచితాలు ప్రవేశపెట్టి కొద్దికాలంలోనే దివాలా తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న వెనిజులా దేశం సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి ఖర్చు చేసింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోవడంతో దివాల తీసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాంతో ప్రభుత్వాలు పడిపోయి దేశంలో అస్థిరత, అరాచకం చోటు చేసుకున్నాయి. గ్రీసు దేశం ప్రపంచానికి ప్రజాస్వామ్య జీవన విధానం, తత్వశాస్త్రం, రంగస్థలం, ఒలింపిక్ క్రీడలు వంటివి అందించిన ఒక అభివృద్ధి చెందిన రాజ్యం. మితివిూరిన సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ దేశం కూడా దివాలా తీసింది. శాంతి భద్రతల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మన పొరుగు దేశమైన శ్రీలంక పరిస్థితి వేరుగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం రెండు రకాలుగా అప్పులు చేస్తోంది. ఒకటి నేరుగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటోంది. ఇలా తీసుకున్న అప్పు రాష్ట్ర బడ్జెట్‌ పద్దుల్లో చూపిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌(ద్రవ్య వినిమయ చట్టం) ప్రకారం రాష్టాలు అప్పులు చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే కేంద్రం అనుమతి కూడా అవసరం. ఇక రెండవ రకం ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా. వీటి ద్వారా తీసుకుంటున్న అప్పులకు ప్రభుత్వం ప్రత్యక్షంగా పూచీ ఉండదు. పూచికత్తు మాత్రమే ఇస్తుంది. కార్పొరేషన్లు పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నా అవి ప్రభుత్వ లెక్కలోకి రావు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పు ఎంత అన్నది ప్రజలకు తెలియడం లేదు. పాలనలో వివిధ కార్యక్రమాలకు అప్పులు తీసుకోవడంలో తప్పు లేదు. అయితే అటువంటి అప్పు పెట్టుబడుల కింద ఖర్చు చేస్తే ఆదాయం వస్తుంది.   తిరిగి కట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రజాకర్షణ పథకాలకు అప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. ప్రభుత్వాలు పథకాల పేరిట ఖర్చులు తగ్గించి నాణ్యమైన విద్య, ఆరోగ్యం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్పాదక రంగం పైన ఖర్చు చేస్తే.. ఉపాధి అవకాశాలు పెరిగి పేదలకు మేలు జరుగుతుంది. ఎన్నికల్లో గెలుపు కోసం విచక్షణారహితంగా ఉచితాలు ప్రకటించడం, ఉద్యోగస్తుల జీతభత్యాలు పెద్ద ఎత్తున పెంచటం, మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఎన్నటికైనా ముప్పే. అలాంటి ముప్పును ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీదనే పూర్తిగా ఆధారపడిన పరిస్థితి. ఉత్పాదక రంగాలను నిర్వీర్యం చేసి ఆదాయ మార్గాలను పూర్తిగా విస్మరించి పూర్తిగా అప్పుల  మీదనే ఆధారపడి రోజులు గడిపేస్తోంది. ఆ అప్పులతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. వాటిని వచ్చే ఎన్నికలలో  మళ్లీ అధికారం కోసం  పెట్టుబడులుగా పరిగణిస్తున్నది. దీని వల్ల రాష్ట్రం  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగులు జీతాలు అందక ఉద్యమ బాట పడుతున్నారు. అన్ని వర్గాల వారీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అభివృద్ధి అడుగంటింది. పారిశ్రామిక ప్రగతి ఆనవాలే లేకుండా పోయింది.