పవార్ బిగ్ డెసిషన్ మతలబు ఏమిటి?
posted on May 4, 2023 7:05AM
ఎన్సీపీ వ్యస్థాపక అధ్యక్షుడు, శరద్ పవార్ రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అదే ఆయన తుది నిర్ణయమా లేక మనసు మార్చుకునే అవకాశం వుందా అనే విషయంలో ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయినా, అధికారికంగా ఎలాంటి ప్రకటన లేక పోయినా, కొత్త అధ్యక్షుని ఎంపికకు సంబంధించి ఒక ప్రణాలికను సిద్ధం చేసేందుకు పార్టీ ముఖ్యనేతలతో స్వయంగా పవార్ ప్రకటించిన కమిటీ కసరత్తు ప్రారంభించింది. వారసుని ఎంపిక ప్రకియ మొదలైంది.
ఈ నేపధ్యంలో, శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అందులో సందేహం, లేదు. అయితే శరద్ పవార్ ఇంత సడన్ గా ఈనిర్ణయం ఎందుకు తీసుకున్నారు? శరద్ పవార్ సమీప బంధువు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పినట్లుగా కేవలం వయసు రీత్యానే పవార్ పక్కకు తప్పుకున్నారా? లేక.. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత, రాజ్యసభ ఎంపీ, సంజయ్ రౌత్ అనుమానించిన విధంగా, శరద్ పవార్ బిగ్ డెసిషన్ వెనక ఇంకా ఏదైనా మతలబు ఉందా అనేది తెలియవలసి వుంది.
అంతే కాదు, సంజయ్ రౌత్ శరద్ పవార్ నిర్ణయంతో మహరాష్ట్ర రాజకీయలలోనే కాదు, జాతీయ రాజకీయలోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. అన్నిటి కన్నా ముఖ్యంగా పవార్ ప్రకటనకు చాల ముందుగా, ఏప్రిల్ 19న పవార్ కుమార్తె సుప్రియా సూలే, 15 రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనలు (భూకంపాలు) వస్తాయని చెప్పారు. ఆమె ఈ మాట చెప్పిన 13వ రోజే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 24 ఏళ్లపాటు ఆయన ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో సుప్రియ చెప్పిన రెండో భూకంపం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
అదలా ఉంటే, శరద్ పవార్ వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా పవార్ కుమార్తె సుప్రియా సూలే, సమీప బంధువు అజిత్ పవార్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి పేర్లను పార్టీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ సిఫార్సు చేశారు. వీరిలో పార్లమెంట్ సభ్యురాలైన సుప్రియాను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని, అదే సమయంలో రాష్ట్ర బాధ్యతలను అజిత్‌కు అప్పగించాలని పేర్కొన్నారు.ఇదే అంతిమ నిర్ణయం అవునా కాదా అనేది ఒకటి రెండు రోజుల్లోనే తేలిపోతుందని అంటున్నారు. అలాగే, సుప్రియా సూలే, చెప్పిన రెండో భూకంపం ఏంటనేది కూడా ఒకటి రెండు రోజుల్లోనే తెలిపోతుందని, పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
నిజానికి అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగిన నేపధ్యంలో మొదలైన పవార్ బిగ్ డెసిషన్ ఎపిసోడ్ ఎలా ముగుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పవార్, వ్యూహాత్మకంగా పావులు కదిపి అజిత్ పవార్ కు చెక్ పెట్టారా? లేక... అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి గత కొంత కాలంగా శరద్ పవార్ బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.ఈ నేపధ్యంలో ఏమి జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. నిజానికి పవార్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదని సో.. పవార్ నెక్స్ట్ మువ్’ పై బెట్ కట్టడం అంట క్షేమం కాదని అంటున్నారు.