సీమాంధ్ర బస్సులపై రాళ్ళ దాడి
posted on Sep 8, 2013 @ 10:14AM
హైదరాబాద్ లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో స్వస్థలాలకు వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుల మీద తెలంగాణ వాదులు, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడులు చేశారు. ఈ ఘటనల్లో ఇద్దరికి గాయాలు కాగా ఐదు బస్సుల అద్దాలు పగిలాయి. బస్సులు నగర శివార్లకు చేరుకోగానే హయత్‌నగర్, లక్ష్మారెడ్డిపాలెం, రామోజీ ఫిల్మ్‌సిటీ, ఇనాంగూడ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. దాడుల్లో హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద ఓ బస్సు, లక్ష్మారెడ్డిపాలెం వద్ద రెండు బస్సులు, రామోజీ ఫిల్మ్‌సిటీ గేటు వద్ద రెండు బస్సుల అద్దాలు పగిలాయి.
ఈ దాడుల్లో రాజమండ్రి సీటీవో కార్యాలయంలో పని చేస్తున్న సత్యనారాయణ, వెంకటేశ్వర్ లు గాయపడడంతో వారిని సమీపంలోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సీమాంధ్ర ఉద్యోగులు బస్సులు నిలిపివేసి విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొంతమంది తెలంగాణవాదులు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ, సమైక్య వాదులు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. సీమాంద్రులను బస్సు ఎక్కించి పంపించారు.