ఆంధ్ర, తెలంగాణాకు పుట్టిన బిడ్డ హైదరాబాద్
posted on Sep 7, 2013 @ 6:02PM
ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఎన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ....ఉద్యమాల వల్ల రాజకీయ నాయకులు ఎవ్వరూ నష్టపోలేదని, ఇరు ప్రాంతాలలోనూ ప్రజలే నష్టపోయారని ఆయన చెప్పారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాలలో మరణించినవారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాలి అర్పించారు.
హైదరాబాదును ఆంధ్ర, తెలంగాణాలకు పుట్టిన బిడ్డ వంటిదని దానిపై ఇరుప్రాంతల వారికి పూర్తి హక్కులు ఉంటాయని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే విద్యార్ధులు, ఉద్యోగులు, ఆర్టీసీ ముందుగా నష్టపోతారని అన్నారు. విభజనవల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరో ముప్పై కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని, రాష్ట్రం విడిపోయి కొత్త సమస్యలతో ఇబ్బందులు పడే కంటే సమైక్యంగా ఉంటే మంచిదనే అభిప్రాయాన్నివివిధ రాష్ట్రాల పార్టీనేతలు వ్యక్తం చేసారని ఆయన అన్నారు.
రాజధాని మీరు కట్టుకోవచ్చు కదా అని అంటున్నారని, విడిపోవడం ఎందుకు మళ్లీ కట్టుకోవడం ఎందుకు అని ఆయన అన్నారు. ముప్పైవేల నుంచి నలభై వేల మంది ఉద్యోగులు వేరే చోటకు వెళ్లవలసి ఉంటుందని అశోక్ బాబు అన్నారు. రెండువేల పద్నాలుగులో ఉమ్మడి రాజధాని అయినా రాజ్యం లేని రాజరికం ఎందుకు అని కొత్త ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఉన్న వేలాది మంది ఉద్యోగులు ఎక్కడికి వెళ్లాలన్నది ప్రశ్న అని ఆయన అన్నారు.
సమైక్యవాదం ఇక్కడ ఆగడానికి లేదు, ఇది ఆరంభం మాత్రమే. కేంద్రం పునరాలోచించుకోకుంటే ఖచ్చితంగా సికింద్రాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం, ఇది బెదరింపు కాదు, ప్రజల అభిప్రాయం చెప్పడానికి మాత్రమే అని ఆయన ప్రసంగం ముగించారు.