ఏపీయన్జీవోల సభకు భారీ స్పందన
posted on Sep 7, 2013 @ 1:28PM
టీ-జేఏసీ తదితర సంఘాలు 24గంటల హైదరాబాదు బందుకు పిలుపునిచ్చినప్పటికీ, ఈ రోజు యల్బీ స్టేడియంలో జరగనున్న ఏపీయన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల నుండి ప్రభుత్వోద్యోగులు, హైదరాబాదులో పనిచేస్తున్నఉద్యోగులలే కాకుండా అక్కడ నివసిస్తున్నఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఉదయం నుండే స్టేడియం వద్దకు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అయితే పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేవలం గుర్తింపు కార్డు కలిగిన ప్రభుత్వోద్యోగులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.
ఇప్పటికే స్టేడియం దాదాపు నిండిపోయింది. ఏపీయన్జీవో నేతలు ఊహించిన దానికంటే రెట్టింపు జనాలు సభకు వచ్చినట్లు కనబడుతోంది. ఇంకా స్థానికంగా నివసిస్తున్న వారు, ఇతర జిల్లాల నుండి వస్తున్నవారు స్టేడియం వద్దకు చేరుకొంటూనే ఉన్నారు. దాదాపు లక్షమందికి పైగా సభకు హాజరయ్యే అవకాశం ఉంది. స్టేడియం లోపలకి చేరుకొన్న ఉద్యోగులను రంజింప జేసేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
స్టేడియం లోపల ఎంతమంది ఉన్నారో, దాదాపుగా అంతే మంది బయట బారులు తీరి ఉన్నారు. యల్బీ స్టేడియం చుట్టుపట్ల ప్రాంతాలన్నీ సభకు వస్తున్నవారితో జనసంద్రం తలపిస్తున్నాయి. భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు సమైక్యాంధ్ర జెండాలు పట్టుకొని ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు స్టేడియం వైపు కదులుతున్నారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగుల కోసం ఆర్గనైజింగ్ కమిటీ భారీ ఎత్తున నీళ్ళు, భోజన ఏర్పాట్లు కూడా చేసింది. ముఖ్యమంత్రి, సీమాంధ్ర మంత్రులు, యంఎల్యేలే ఈ ఏర్పాట్లకి వెనక నుండి సహాయం చేస్తున్నారని టీ-జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ ఆరోపిస్తున్నారు. తమ పోరాటం సభను జరుపుకొంటున్నఆంధ్ర ఉద్యోగుల మీద కాదని, కేవలం వారి ఆధిపత్య ధోరణిపైన మాత్రమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కనబరుస్తున్నఈ ఆధిపత్య ధోరణిని తాము వ్యతిరేఖిస్తున్నామని ఆయన అన్నారు.
స్టేడియం లోపల, బయట జరుగుతున్న ఈ భారీ హంగామాను అన్ని టీవీ చాన్నళ్ళు ప్రముఖంగా ప్రసారం చేస్తుండటంతో, సహజంగానే అది తెలంగాణా వాదులకు తీవ్ర ఆగ్రహావేశాలు కలిగిస్తోంది. ఉస్మానియా, నిజం కాలేజీ విద్యార్దులు స్టేడియం వైపు ర్యాలీగా బయలుదేరబోతుంటే పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
మరి కొద్ది సేపటిలో ఏపీయన్జీవోల సభ మొదలుకాబోతోంది. ఈ సభ ద్వారా వారు ఎటువంటి పిలుపినిస్తారో మరి కొద్ది సేపటిలో తెలుస్తుంది.