'మిస్ అమెరికా' పోటీల్లో విజేత తెలుగమ్మాయి

  'మిస్ అమెరికా' కిరీటాన్ని మిస్ న్యూయార్క్ నీనా దావులూరి (24) కైవసం చేసుకున్నారు. 15మంది సెమీ ఫైనలిస్ట్ లనూ అధిగమించి అందాల కీరిటాన్ని అందుకున్నారు. 'మిస్ అమెరికా' కిరీటాన్ని సొంతం చేసుకున్న తొలి ప్రవాస భారతీయురాలు దావూలూరి నీనా.ప్లాస్టిక్ సర్జరీపై జడ్జిలు అడిగిన ప్రశ్నకు నీనా బదులిస్తూ... తాను పూర్తిగా సర్జరీకి వ్యతిరేకమని, ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే నచ్చిన నచ్చకున్నా దానితోనే ఉండాలని కానీ కృత్రిమపరంగా పుట్టుకతో వచ్చే శారీరక అందంతోపాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక అందమే గొప్పదని ఆమె చెప్పిన సమాధానం ఆకట్టుకుంది. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చునని ఆమె చెప్పారు. కాగా, మిస్ అమెరికా రేసులో నిన్నటి వరకు ఇద్దరు ప్రవాసాంధ్ర అందగత్తెలు పోటీ పడ్డారు. హైదరాబాదుకు చెందిన పామర్తి బిందు(23), నీనా దావులూరిలు ఉన్నారు.నీనాకు అమెరికా తరపున 50వేల డాలర్లు ఉపకర వేతనం రూపంలో అందనున్నాయి.

రాష్ట్ర విభజనపై బీజేపీలో అంతర్మధనం

  మొదటి నుండి చిన్న రాష్ట్రాలకు మొగ్గుచూపుతున్న బీజేపీ ఆంధ్ర రాష్ట్ర విభజనకు కూడా పూర్తి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే, తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తామని కూడా ప్రకటించింది. అదేవిధంగా ఇటీవల హైదరాబాదు పర్యటనలో నరేంద్ర మోడీ కూడా రాష్ట్ర విభజనకే మొగ్గు చూపారు. అయితే, ఇటీవల ఏపీఎన్జీవో నేతలు సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ డిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన తరువాతనే వారి ఆలోచనల్లో మార్పు మొదలయింది.   బీజేపీ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పరిచి ఆ ప్రాంతంలో మరింత బలపడుతుంటే, అందుకు సహకరించిన తాము అక్కడ ఎటువంటి రాజకీయ ప్రయోజనమూ పొందకపోగా, సీమాంధ్రలో చేజేతులా పార్టీని నాశనం చేసుకోవడం ఎందుకనే ఆలోచన బీజేపీలో మొదలయింది. తమ వైఖరి వలన తమ కంటే కాంగ్రెస్ పార్టీయే ఇందులో ఎక్కువ లాభపడుతుందని గ్రహించిన వెంటనే బీజేపీలో రాష్ట్ర విభజనపై మాట మర్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాలకు ‘సమన్యాయం’ చేయలేకపోతే, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని బీజేపీ ప్రకటించింది. ఇక, ప్రస్తుతం తాము తెలంగాణా రాష్ట్రం ఏర్పరిచే పరిస్థితిలో లేనప్పుడు, పదేపదే తెలంగాణా గురించి మాట్లాడటం వలన నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదని ఆ పార్టీకి జ్ఞానోదయం అవడంతో, ఇప్పుడు ఇరు ప్రాంతాలలో తమ పార్టీని ఎలా కాపాడుకోవాలనే కొత్త ఆలోచన కూడా మొదలయింది.   అందుకే బీజేపీకి చోదకశక్తి (డ్రైవింగ్ ఫోర్స్)గా పనిచేస్తున్న ఆర్.యస్.యస్. ఈ నెల 17న బీజేపీ టీ-నేతలతో హైదరాబాదులో, ఆ మరునాడే బీజేపీ-సీమాంధ్ర నేతలో విజయవాడలో సమావేశమయ్యి, రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకొనేందుకు ఎటువంటి వైఖరి అవలంభించాలనే అంశంపై చర్చించబోతున్నారు. ఒకవేళ బీజేపీ కూడా రెండు ప్రాంతాలకు అనువయిన వైఖరి తీసుకోదలిస్తే, బహుశః అది కూడా ప్రస్తుతం తెదేపా అనుసరిస్తున్నవైఖరినే అవలంభించవచ్చును. తద్వారా ఇంతవరకు సమైక్యాంధ్ర ఉద్యమాలకు దూరంగా ఉంటూ అక్కడ ప్రజల నుండి వ్యతిరేఖత మూటగట్టుకొన్న బీజేపీ కూడా ఇక నుండి జోరుగా ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా పార్టీని మళ్ళీ ప్రజలకు దగ్గరచేయవచ్చునని బీజేపీ-సీమాంధ్ర నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   ఇక దీనివలన మరో ప్రయోజనం ఏమిటంటే, రానున్నఎన్నికల కోసం తెదేపాతో దోస్తీ చేయాలని తహతహలాడుతున్నబీజేపీ, ఈ విధంగా తేదేపాకు దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది.

టిడిపి బషీరుద్దీన్‌ బాబుఖాన్‌ మృతి

తెలుగుదేశం పార్టీ మరో సీనియర్‌ నాయకున్ని కొల్సోయింది, గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి బషీరుద్దీన్‌ బాబుఖాన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. తెలుగుదేశ్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బషీరుద్దీన్‌ ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాలలో వివిధ మంత్రిశాఖలు నిర్వహించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబులకు అత్యంత సన్నిహితుడిగా కూడా బషీరుద్దీన్‌ బాబుఖాన్‌కు పూరుంది. కాని 1998లో ఆయన టిడిపి పార్టీకి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన మృతికి తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. బాబుఖాన్‌ మృతితో మైనారిటీలతో పాటు బడుగు బలహీన వర్గాలకు ఓ అండపోయినట్టయిందని, వారికి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

జెపికి రాజ‌మౌళి మ‌ద్దతు

  ఈ జ‌న‌రేష‌న్ సినీ ప్రముఖులు సినిమాల‌తో పాటు ఇత‌ర విష‌యాల మీద కూడ త‌మ అభిప్రాయ‌ల‌ను పంచుకుంటున్నారు. అలా స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై స్పందించే అలవాటు ఉన్న టాలీవుడ్ ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి.. ఇటీవ‌ల జేపి చేప‌ట్టిన తెలుగుతేజం యాత్ర ఆగిపోవ‌టం పై ఈ క్రియేట‌ర్ స్పందిచారు. గ‌తంలో కూడా పలు సంద‌ర్భాల్లో జెపికి మ‌ద్దతు తెలిపిన రాజ‌మౌళి ఆయ‌న యాత్ర ఆగిపోవ‌టంపై ఆవేద‌న వ్యక్తం చేశారు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ ద్వారా స్పందించిన ఆయ‌న ప్రస్థుత పరిస్థితుల్లో జెపి ప్రజ‌ల‌కు మ‌ద్దతుగానే యాత్ర చేప‌ట్టార‌న్న రాజ‌మౌళి ఆయ‌న‌పై దాడులు చేయ‌టం త‌గ‌ద‌న్నారు. గ‌తంలో తెలంగాణ ఉద్యయం జ‌రుగుతున్నపుడు జెపి ఇలాగే ప‌ర్యటించార‌ని, ఇప్పుడు కూడా ఆయ‌న ప్రజ‌ల త‌రుపునే ఉద్యమం చేస్తున్నార‌న్నారు. రాష్ట్రం క‌లిసున్నా విడిపోయినా ప్రజ‌లు మాత్రం క‌లిసే ఉండాలన్నారు రాజ‌మౌళి.

చంద్రబాబు అంటే వణుకే

      చంద్రబాబు నాయుడు కాలు కదిపితే వైసీపీ, టిఆర్ఎస్ పార్టీలకు వణుకు వస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. 'చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాలనుకొంటున్నానని అనగానే ఈ పార్టీలు గడగడలాడుతున్నాయి. ఆ యాత్రకు రకరకాల కారణాలు ఆపాదిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్తే తమ ముసుగులు ఊడిపోతాయని, తమ నిజ స్వరూపం బయట పడుతుందని వాటి భయం. రాష్ట్రంలో రగులుతున్న మంటలను ఆర్పి అందరికీ న్యాయం చేయమని చంద్రబాబు కోరుతున్నారు. దానికి వీరికేమిటి బాధ? ఇరు పక్కలా ప్రజలను రెచ్చగొట్టి ఒకరిపైకి మరొకరిని ఉసిగొల్పి పబ్బం గడుపుకోవాలని ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సమస్యలు పరిష్కారమైతే తమ పబ్బం గడవదని వీటి భయం. అందుకే బాబును తిటి ్ట పోస్తున్నాయి' అని ఆయన విమర్శించారు.

ఒడిసాలో భారీ ఎన్‌కౌంట‌ర్‌

  ఒడిసాలో మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఒడిసాతో పాటు చ‌త్తీస్‌గ‌డ్‌ల‌తో వ‌రుస దాడుల‌తో రెచ్చిపోతున్న మావోయిస్టుల‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. శ‌నివారం ఆంద్రా ఒడిసా స‌రిహాద్దులో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్లో 13 మంది మావోలు మ‌ర‌ణించారు. మ‌రో మావోయిస్టు పోలీసుల‌కు దొరికాడు. ఒడిసాలోని మల్కన్‌గిరి జిల్లా  సిలాకోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్‌సింగ్ ఎస్‌వోజీ, డీవీఎఫ్ బలగాల‌తో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో పోలీసుల మావోయిస్ట్‌ల మ‌ధ్య ఎదురు కాల్పుల జరిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్లో 13 మంది న‌క్సల్స్ చ‌నిపోగా 12 తుపాకులు, ఒక పిస్టల్, ఒక ఏకే-47, రెండు రాకెట్ లాంచర్లు, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చనిపోయిన మావోలు  బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన మావోల‌లో మ‌న రాష్ట్రానికి చెందిన ప్రమీలా అలియాస్ జిలానీ బేగం కూడా ఉన్నట్టు స‌మాచారం.

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌కు నేత‌ల ప‌రామ‌ర్శలు

  గ‌త ప‌ది రోజులుగా అల్లర్లతో అట్టుడికిన ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఇప్పుడిప్పుడే కాస్త సాదార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో ఆదివారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాద‌వ్ ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ప‌ర్యటించ‌నున్నారు. ఈ అల్లర్లలో గాయ‌పడి వివిధ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వేలాది మంది క్షత‌గాత్రుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్షించ‌నున్నారు. త‌రువాత అక్కడి జిల్లా యంత్రాంగంతో పాటు శాంతి భ‌ద్రత‌లపై పోలీసు ఉన్నతాధికారుల‌తో చర్చించ‌నున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో అల్లర్లు అదుపు రావ‌డంతో చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌లు కూడా జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ‌ను ఆదేశించారు. అలాగే ముజఫర్నగర్లో సోమవారం ప్రదాని మన్మోహన్ సింగ్, యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధి పర్యటించనున్నారు. హిందుతుల్లోని జాట్ తెగ‌కు ముస్లిం నాయ‌కుల‌కు జ‌రిగిన చిన్న గొడ‌వ ముదిరి 48 మంది ప్రాణాలు కోల్పోయే అంత పెద్ద గొడ‌వ‌గా మారింది. దీంతొ భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ర్షణ‌లు చోటు చేసుకోకుండా క‌ట్టుదిట్ట మైన చ‌ర్యల తీసుకోవ‌డానికి రెడీ అవుతుంది అఖిలేష్ ప్రభుత్వం.

అగ్ని వి ప్రయోగం విజ‌య‌వంతం

  భార‌త అమ్ముల పొదిలో మ‌రో అస్త్రంలో స‌గ‌ర్వంగా చేరింది. పూర్తిస్వదేశి ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన అగ్నివి క్షిప‌ణిని రెండోసారి కూడా విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది డిఆర్‌డిఓ. ఒడిశా కోస్తా తీరంలోని వీల‌ర్ ద్వీపంలోని లాంయ్‌ప్యాడ్ 4 నుంచి డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌లెప్‌మెంట్ ఆర్గనైజేష‌న్ దీన్ని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఆదివారం ఉద‌యం ఎనిమిది గంట‌ల యాబై నిమిషాల‌కు అగ్ని వి ను ప్రయోగించారు. దాదాపు 5000 కిలోమీట‌ర్లకు పైగా దూరంలో ఉన్న ల‌క్షాల్యను కూడా అగ్ని వి గురిత‌ప్పకుండా చేదించ‌గ‌ల‌దు. దాదాపు 50 ట‌న్నుల బ‌రువు, 17 మీట‌ర్ల పొడ‌వు ఉన్న అగ్ని వి ఒక ట‌న్ను బ‌రువైన అణ్వస్త్రాల‌ను ల‌క్ష్యం వైపు మోసుకుపోగ‌ల‌దు. గ‌త ఏడాది ఏప్రిల్ 2న కూడా అగ్ని వి క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. ఈ ప్రయోగంతో ఖండాత‌ర క్షిప‌ణి ర‌క్షణ వ్యవ‌స్థ ఉన్న అతి కొద్ది దేశాల స‌ర‌స‌న భార‌త్ చేరింది. భార‌త ర‌క్షణ వ్యవ‌స్థలో అగ్ని ఓ కీల‌క ఆయుదంగా మార‌నుంది.

ఒకే వేదిక‌పైకి అద్వాని, మోడి

  ప్రదాని అభ్యర్ధిగా మోడి ప్రక‌ట‌న‌ల‌తో కినుక వ‌హించిన అద్వాని శాంతిస్తున్నట్టుగా స‌మాచారం.ఇప్పటి వ‌ర‌కు అద్వాని ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాకున్నా ఆయ‌న అల‌క తీర్చడానికి బిజేపి అగ్రనేత‌లు చేస్తున్న ప్రయ‌త్రాలు ఫ‌లిస్తున్నట్టుగా క‌నిపిస్తున్నాయి. బిజెపి పార్టీ ఎప్పుడు అద్వాని సార‌ధ్యంలోనే న‌డుస్తుంద‌ని రాజ్‌నాధ్ వ్యాఖ్యనించ‌గా, అద్వానికి ఎలాంటి అసంతృప్తి లేద‌న్నారు సుష్మా. మోడి ప్రక‌ట‌న‌తో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారాయి. అదే స‌మ‌యంలో అద్వాని రాజ్‌నాధ్‌కు లేఖ రాయ‌డంలో అద్వాని మ‌రోమారు అస్త్రస‌న్యాసానికి దిగుతున్నట్టుగా కూడా వార్తలు వ‌చ్చాయి.  అయితే అలాంటి వాద‌న‌ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ బిజెపి పెద్దలు అద్వానిని బుజ్జగించే ప్రయ‌త్నం చేశారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, అద్వానీని శాంతపర్చేందుకు అన్నిర‌కాలుగా ప్రయ‌త్నించారు. అద్వాని ఎప్పటికి బిజెపి అగ్రనేతే అన్న రాజ్‌నాధ్ ఆయ‌న‌కు మమ్మల్ని తిట్టే హ‌క్కు కూడా ఉంటుంద‌ని చెప్పారు. భ‌విష్యత్తులో కూడా ఆయ‌నే మ‌మ్మల్ని ముందుడి న‌డిపిస్తార‌ని, భోపాల్‌లో జ‌ర‌గ‌బోయే స‌భ‌లో అద్వాని మోడిలు ఒకే వేదిక పంచుకోనున్నార‌ని ప్రక‌టించారు.

నా కూతురే అయితే సజీవ దహనం చేసేసేవాడిని

  “నా కూతురే గనుక పెళ్ళికి ముందే శృoగారంలో పాల్గొంటూ పరాయి మొగాడితో అలా అర్ధ రాత్రి వరకు రోడ్ల మీద తిరిగి ఉంటే, ఆమెను నేనే సజీవ దహనం చేసేసేవాడిని. అసలు ఇటువంటి పరిస్థితి రానే రానీయకపోదును. తల్లి తండ్రులందరూ కూడా ఇటువంటి ధోరణినే అలవరచుకోవాలి,” ఈ వివాద స్పద మాటలు అన్నది మరెవరో కాదు నిర్భయ కేసులో ఇద్దరు దోషుల తరపున డిఫెన్స్ లాయర్ గా వాదించిన ఏపీ.సింగ్.   ఆయన చేసిన వ్యాఖ్యలతో డిల్లీ ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారే గాక డిల్లీ బార్ కౌన్సిల్ సభ్యులు కూడా అతని వ్యాక్యలను తప్పుపట్టారు. అతనిపై ఎవరయినా లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినట్లయితే దాని ఆధారంగా కేసు వేస్తామని, లేకుంటే అతను మీడియాతో అన్నమాటలనే సుమోటోగా స్వీకరించి అతనిపై కోర్టులో కేసు వేస్తామని డిల్లీ బార్ కౌన్సిల్ కార్యదర్శి మురారి తివారి మీడియాకు తెలియజేసారు. ఈ నెల 20న జరుగనున్న బార్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.

ఉమ్మడి రాజ‌ధానికి ఒప్పుకోం

  విభ‌జ‌న‌కు వ్యతిరేఖంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న నేప‌ధ్యంలో తెలంగాణ నాయ‌కులు కూడా త‌మ స్వరం పెంచారు. రాష్ట్రవిభ‌జ‌న అనివార్యం అయిన ప‌క్షంలో హైద‌రాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజ‌ధానిగా చేయాల‌న్న కొంద‌రు సీమాంద్ర నాయ‌కుల వాద‌నను వారు ఖండిచారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని తాత్కలిక ఉమ్మడి రాజ‌ధానిగా అయితేనే అంగీక‌రిస్తాం త‌ప్ప శాశ్వత ఉమ్మడి రాజ‌ధానిగా అంగీక‌రించే ప్రస‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. ఈనెల 29వ తేదీన సకల జనుల భేరీ నిర్వహిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. దీనితో పాటు తెలంగాణ జిల్లాలో ప‌దిరోజుల పాటు స‌న్నాహ‌క ర‌ణ‌భేరి ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగా ప్రక‌టించారు. రాష్ట్ర రాజ‌ధాని పై పెద్ద మ‌నుషుల ఒప్పందం త‌ర‌హాలో నిర్ణయం జ‌ర‌గాల‌న్నారు. అలాగే రాజ‌ధాని విష‌యంలో ఎలాంటి మార్పు లేకుండా మంత్రులు ప్రజా ప్రతినిధుల‌పై వ‌త్తిడి తీసుకు వ‌స్తామ‌ని జెఏసి నాయ‌కులు ప్రక‌టించారు.

'తెలుగుతేజం' యాత్రలో జెపికి సమైక్య సెగ

        లోక్ సత్తా నేత, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ‘తెలుగుతేజం’యాత్రలో సమైక్య సెగ తగిలింది. కొండారెడ్డి బురుజు వద్ద జేపిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో లోక్సత్తా కార్యకర్తలకు సమైక్యవాదులకు మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. సమైక్యవాదులు అక్కడ ఉన్న స్పీకర్ బాక్స్లను తోసి వేశారు. జేపి గోబ్యాక్ అని నినాదాలు చేశారు. జేపీ వెళ్లిపోయిన అనంతరం సమైక్యవాదులు లోక్ సత్తా పార్టీ బ్యానర్ల, జెండాలను తొలగించారు. ఇక కర్నూలులో జేపీ వ్యాఖ్యల పట్ల తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాష్ట్ర విభజన జరిగిందని హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన జేపీ ఇప్పుడు విభజన అంశం ముందుకు వెళ్లొద్దని, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టామని, రాజధానిని త్యాగం చేశామని ఎలా అంటారని తెలంగాన వాదులు ప్రశ్నిస్తున్నారు.

కెసిఆర్ దృష్టిలో 1956కి "ముందున్న తెలంగాణా జిల్లాలే''వి?

  - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     ఒకటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చి, "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తానని మాటయిస్తే'' తాను ఏర్పాటు చేసుకున్న సొంతపార్టీ (టి.ఆర్.ఎస్.)ను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో రహస్యమంతనాలు జరిపివచ్చిన కాంగ్రెస్ మాజీ సభ్యుడు, "తెలుగుదేశం'' పార్టీలో మాజీమంత్రి అయిన "బొబ్బిలిదొర'' కె.సి.ఆర్. మళ్ళీ క్షణానికొక మాట మారుస్తున్నారు. ఇలా అతని నాలుక పదేపదే తిరగబడుతూ కొత్త ప్రతిపాదనలతో కొత్త సమస్యలు లేవనెత్తుతూండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తల బద్ధలు కొట్టుకోవలసి వస్తోంది. ఈలోగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ప్రజలు ఆందోళన చెంది, భారీస్థాయిలో ఉద్యమాల బాట పట్టవలసి వస్తోంది. ప్రజలను ఎలా విరగదొక్కాలో తెలిసిన కె.సి.ఆర్. తాజాగా ఓ కొత్త నినాదం లేవనెత్తాడు. తన మాట విని, తన డిమాండ్ ను అంగీకరించి, ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే "తెలంగాణా పునర్నిర్మాణం'' పేరిట తనను ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ప్రకటిస్తే సరి, లేదా అది నెరవేరే దాకా కాంగ్రెస్ తో సహకరించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానంతో ఆయన పేచీ పెట్టుకున్నాడు. ఈ "పేచీకోరు''తో తన అనాలోచిత నిర్ణయాల ద్వారా యిప్పటికే రెండు ప్రాంతాలలోనూ (సీమాంధ్ర, తెలంగాణా) పరువు ప్రతిష్ఠలు వేగంగా కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కె.సి.ఆర్. మాటలు వింటే "కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే''నన్న సామెతలా అవుతుందని భావించిన కాంగ్రెస్ రెండు ప్రాంతాలలోనూ తన మిగిలిన పరువును కాపాడుకోవడం కోసం "రెండు పడవలపై''న రెండు కాళ్ళు పెట్టి కె.సి.ఆర్.తో సంబంధం లేకుండా పార్టీని ఇటు తెలంగాణాలోనూ, అటు సీమాంధ్రలోనూ కొనవూపిరితోనైనా బతికించుకోవాలని నిర్ణయించుకుంది!     హైదరాబాద్ లో ఇటీవల భారీ ఎత్తున జరిగిన "సమైక్యాంధ్ర సభ'' జయప్రదం కావడంతో ఇటు తెలంగాణలో కెసిఆర్ (టి.ఆర్.ఎస్.) పార్టీతో నిమిత్తం లేకుండానే, సమైక్యాంధ్ర సభ తాకిడి ఫలితంగా వేరుగా ఒక సభ జరపాలని స్థానిక కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది; అటు కె.సి.ఆర్. వర్గం కూడా కాంగ్రెస్ తో సంబంధం లేకుండా లోపాయకారీగా కాంగ్రెస్ సభకు పోటీగా వేరే సభను వేరే తేదీల్లో జరపాలని నిర్ణయించుకుంది! అంటే అటువైపు, సమైక్యాంధ్ర సభలు జరపడానికి రాజకీయ నాయకులను వెలివేసి ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.వో.ల సంస్థ కేవలం ఉద్యోగవర్గాలతో భారీస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగుతూండగా, ఇటు కె.సి.ఆర్. వర్గానికి, అటు కాంగ్రెస్ (తెలంగాణాలో) నాయకవర్గానికి "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం'' అనే లక్ష్యం ఒకటే అయినా, ఒకే సభగా కాకుండా "ఎవరికీ వారే యమునా తీరే'' అన్నట్టుగా వేర్వేరుగా రెండు భిన్నమైన తేదీల్లో జరుపుకుంటున్నారు. అంటే, అక్కడ జరుగుతున్నది తెలుగుజాతి విడిపోకూడదు, "విడిపోతే చెడిపోతాం'' అన్న హెచ్చరికలతో ఉద్యోగ కార్మిక, కర్షక, విద్యార్థి, వర్తక, మహిళా, బడుగు బలహీనవర్గాల ప్రజాబాహుళ్యంతో, గ్రామ గ్రామం నుంచీ సాగుతున్న మహోద్యమం కాగా, ఇక్కడ మన తెలంగాణలో నడుస్తున్నది కేవలం రాజకీయ నిరుద్యోగుల నిర్వహణలో పదవీ ప్రయోజనాల కోసం సాగిస్తున్న ఉద్యమంగా మారింది! అందుకే, లక్ష్యంలోనూ, ఆచరణలోనూ కూడా ఇరుప్రాంతాల సభల మధ్య అంత తేడా వచ్చింది. ఈ ఇరువర్గాల ఉద్యమాల మధ్య నినాదాలలో కూడా నేలకూ నింగికీ మధ్య ఉన్నంత తేడా స్పష్టంగా కన్పిస్తోంది!   "సీమాంధ్రులది ఒక సభా, పనికిమాలినది'' అని ఇటు రాజకీయ నిరుద్యోగుల ఉద్యమనాయకులు వర్ణిస్తుండగా, అటు సీమాంధ్ర ఉద్యోగసంఘాల "సమైక్యాంధ్ర'' ఉద్యమం "తెలుగుజాతి ఒక్కటిగా కలిసి ఉంటే'' సభ్యప్రపంచంలో ఇనుమడించిన వ్యక్తిత్వంతో "ఎగిసిపడుతుంది'' అని నినదించింది; రాష్ట్ర సమస్యలకు "మూడుప్రాంతాల ప్రజల మధ్య, ప్రజా ప్రతినిధుల మధ్య ప్రజాస్వామిక చర్చలే శరణ్య''మని చివరికి మావోయిస్టు పార్టీ సహితం ప్రకటిస్తుండగా అసలు "చర్చలే మాకొద్దు, లెక్కలూవద్దు, మా తెలంగాణా మాకివ్వండి'' అని వేర్పాటు ఉద్యమ నిరుద్యోగ నేతలు నినదిస్తున్నారు. సరిగ్గా ఈ సందర్భంగానే మూడు, నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి కె.సి.ఆర్. కాంగ్రెస్ నూ, అతడితో పోటీగా ఎక్కడ వెనుకబడి పోతామోనని ఇన్ని రోజులూ "ప్రత్యేక రాష్ట్ర'' నినాదంతో కదంతొక్కినా చంద్రబాబు పార్టీ సహా కొన్ని ఇతర పార్టీల రాజకీయ నిరుద్యోగులూ ఆశ్చర్యపడేలా ఒక ప్రకటన చేశాడు.   అసలు అదీ, ఇదీ కాదు "1956 నాటికి ఉన్న తెలంగాణా'' అంతా కావాలని, అంతకు మినహా మరొకటి తనకు ఇష్టంలేదనీ పాత 'దొర'స్వామ్యం రాచరికపు స్థాయిలో కెసిఆర్ ప్రకటించారు! అంటే, నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలన్న  కోరికపై ప్రారంభించి కొనసాగిస్తున్న "ఉద్యమాన్ని'' 1956కి ముందు, నిజాం పాలనలోనూ, 1953 నాటి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న 16 జిల్లాలతో కూడిన తెలంగాణా కావాలని ఆయన కోరుతున్నాడన్న మాట, అప్పటిదాకా చెబుతున్న 10 జిల్లాలకు తోడు ఏనాడో హైదరాబాద్ స్టేట్ లో నిజాం-బ్రిటిష్ పాలకుల జమానాలో యుద్ధాలద్వారా, దురాక్రమణ పూరిత ఒడంబడికల ద్వారా కలుపుకున్న మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలు సహా అదే స్టేట్ లోని నిరంకుశ పాలన కింద విద్యకు, వికాసానికి దూరమై, అణచివేతలకు గురి అవుతూ వచ్చిన తెలుగు జిల్లాలని అర్థం!   అంటే, 1953లో కేంద్రప్రభుత్వం తెలుగుప్రాంతాలన్నింటిని [సీమాంధ్ర-నిజం ఆంధ్రుల జిల్లాలతో] విలీనంచేసి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పరచాలన్న సంకల్పంతో సమస్య పరిశీలనార్థం నియమించిన జస్టిస్ ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పాటు చేయగా, ఆ కమీషన్ 1955 చివరి మాసాల కల్లా సమర్పించిన నివేదిక ప్రకారమే "ఆంధ్రప్రదేశ్'' ఏర్పడింది; ఆ నివేదిక ప్రకారమే భాషాప్రయుక్త రాష్ట్రాలా ప్రాతిపదికపైన హైదరాబాద్ స్టేట్ లో అంతవరకూ భాగమై ఉండి, కునారిల్లిపోతూ వచ్చిన మరాఠీ ప్రాంతాలూ, కన్నడ ప్రాంతాలూ ఎలాంటి వివాదాలూ లేకుండా అటు బొంబాయి రాష్ట్రంలోనూ, ఇటు కర్నాటక రాష్ట్రంలోనూ చేరి పునరావాసం పొందాయి! అలానే ఈ కమీషన్ నివేదిక ఆధారంగానే ఆంధ్ర-తెలంగాణాల విలీనం సందర్భంగా తలెత్తే సమస్యలేవైనా ఉన్నా, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలలో విలీనమైన పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో నిరంకుశ పాలన క్రింద మగ్గిపోతూ వచ్చిన మరాఠీ, కన్నడ ప్రాంతాలతో కూడా ఆ రెండు రాష్ట్రాలలో కొన్ని సమస్యలు రావచ్చుననీ, విశాల భాషాప్రయుక్త రాష్ట్రాలలో తలెత్తే సమస్యలు పరిష్కారానికి అతీతం కావనీ కమీషన్ స్పష్టం చేసింది.   కాని ఒక్క ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణ సందర్భంగానే కాలం చెల్లిన పాత ఫ్యూడల్ శక్తులకు ప్రతినిధులయిన కొందరు దొరలు, జాగిర్దార్లు, దేశ్ ముఖ్ లు పోతున్న పూర్వవైభవాన్ని మరచిపోలేక కాంగ్రెస్ లో దూరి ఆంధ్రప్రదేశ్ అవతరణకు అడ్డు కొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు! దాని ఫలితమే, వేర్పాటు ఉద్యమానికి పడుతూ వచ్చిన స్వార్థపూరిత బీజాలు! కెసిఆర్ మనస్సులో ఉన్న 1956కి ముందున్న "తెలంగాణా జిల్లాలు'' అంటే మనకు చెందని మరాఠా ప్రాంతాలూ లేదా కన్నడ ప్రాంతాలతో కూడిన పాత "హైదరాబాద్ స్టేట్'' అనే! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అంతవరకూ నిజాముల ఏలుబడిలో పడి ఉన్న మరాఠా ప్రాంతాలైన ఉస్మానాబాద్, ఔరంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్ ప్రాంతాలు, కర్నాటకలో చేరిపోయిన బీదరు, రాయచోరు వగైరా ప్రాంతాలూ అన్నమాట!   ఇది యిలా ఉండగా అటు సీమాంధ్రలోని ఆంధ్రోద్యమానికి, ఇటు తెలంగాణలో మాడపాటి సురవరం, హయగ్రీవ చారి ప్రభృతులు, రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఎస్.వి. ప్రసాద్ లాంటి కమ్యూనిస్టు యోధుల నాయకత్వాన నడిచిన ఆంధ్రోద్యమాలకు ఒక దశ వరకూ నిజాముల నిర్బంధకాండ మధ్య విజయవాడ కార్యక్షేత్రంగా ఉందన్న సత్యాన్నీ మరచిపోరాదు. ఈ పూర్వరంగాన్నంతనూ పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే ఫజల్ ఆలీ కమీషన్ హైదరాబాద్ ను సందర్శించి వివిధ సంస్థల, వ్యక్తుల అభిప్రాయాన్ని తెలుసుకుని వారినుండి భారీస్థాయిలో మహాబరులను స్వీకరించి, 1955 సెప్టెంబర్ 30న తన నివేదికను సమర్పించింది; "విశాలాంధ్ర ఏర్పాటునకు ఏకాభిప్రాయం బలంగా ఉన్నందున హైదరాబాద్ స్టేట్ ను విభజించడం సబబని కమీషన్ అభిప్రాయపడింది. అలాగే ఉభయ ప్రాంతాలకు చెందిన కొన్ని సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చుకో కూడా సిఫారసు చేస్తూ ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది :   "రెండువందల సంవత్సరాలనుండి దక్కను ప్రాంతానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఏర్పడినందున, ఈ సంస్కృతే భారతదేశ ఐక్యతకు మిక్కిలి దోహదపడింద'ని చెబుతూ విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కొలదిమంది వేర్పాటువాద నాయకుల వాదాలను అప్పుడే కమీషన్ తోసిపుచ్చింది! అంతేగాదు, రాష్ట్ర ఐక్యత మాదిరిగానే హైదరాబాద్ రాష్ట్ర సంస్కృతి కూడా ఆనాటి పాలకులు విధి రాసిందే గాని మరొకటి కాదు కదా అని కమీషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే కమీషన్ తొలి ప్రాధాన్యతగా ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణనే కమీషన్ అభిలషించి బలంగా నివేదికలో పేర్కొంది. 'విశాలాంధ్ర' రాష్ట్రం ఏర్పాటు వల్ల వొనగూడే ప్రయోజనాల్ని స్పష్టంగా కమీషన్ యిలా వివరించింది :   "ప్రస్తుతపు ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణా విలీనమైతే కోట్లాది జనాభాతో పాటు విలువైన ముడిసరుకులు, కావలసినంత ఖనిజసంపద, ఎక్కువ జల, విద్యుత్ వనర్లు కల్గిన భూభాగంతో పెద్దరాష్ట్రం ఏర్పాటవుతుంది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర రాజధాని సమస్య కూడా పరిష్కారమై పోతుంది. విశాలాంధ్ర రాజధానిగా జంటనగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదు చక్కగా సరిపోతాయి. విశాలాంధ్ర ఏర్పాటువల్ల కృష్ణా-గోదావరి నదీజలాల వినియోగం ఒకే అధికారం కిందికి వస్తుంది. వివిధ సాంకేతిక, పాలనాపరమైన కారణాల వల్ల జరిగిన సుదీర్ఖ కాలహరణం తర్వాత ఈ ప్రాజెక్టులు డెల్టా ప్రాంతంలో రూపుదిద్దుకోవలసి వచ్చింది. అయితే కృష్ణా-గోదావరి లోయల (బేసిన్స్) పూర్తీ ఏకీకరణ అసాధ్యం. ఈ నదీ ముఖద్వారాలలో ఉన్న తూర్పు ప్రాంతాలకు అభివృద్ధి పథకాలను రూపొందించడానికి, అమలు పరచడానికి గొప్ప అవకాశాలుంటాయి. విశాలాంధ్రలో భాగంగా తెలంగాణా ప్రాంతం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రయోజనాలు పొందుతుంది. కాబట్టి తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఆంధ్రరాష్ట్రం, తెలంగాణా ప్రాంతాలకు కలిగే పరస్పర ప్రయోజనాలు కూడా ముఖ్యమైనవే. కరువు కాటకాది ఉపద్రవాలు వచ్చినప్పుడు తెలంగాణలో ఆహారకొరత ఉంటుంది. అయితే ఆంధ్రరాష్ట్రంలో ఎప్పుడూ అధికాహారోత్పత్తికి వీలుంటుంది కాబట్టి మిగులు ఉత్పత్తిని తెలంగాణా ప్రాంతానికి వాడుకోవచ్చు. ఇదే విధంగా ఆంధ్రరాష్ట్రంలో బొగ్గు వనరులు లేవు. వీటిని సింగరేణి నుండి ఆంధ్రరాష్ట్రానికి చేరవేయవచ్చు. పైగా ఆంధ్రరాష్ట్రంలో కలవడంవల్ల తెలంగాణాకు పరిపాలనా సంబంధమైన వ్యయం కూడా ఉండదు''   ఈ వాస్తవాలన్నింటిని 1969, 1970ల నాటి వేర్పాటువాద ఉద్యమాల సందర్భంగా తెలంగాణా రైతాంగ సాయుధపోరాట అగ్రనాయకులంతా గురించి, "విడిపోతే చెడిపోతాం'' అని ఆనాడే పదేపదే హెచ్చరించిన వాళ్ళని మరవరాదు, మరవరాదు! అందువల్ల "బొబ్బిలిదొర'' కెసిఆర్ 1956 నాటి హైదరాబాద్ స్టేట్ ను మొత్తంగా తెలంగాణా అని భావించుకుని మనవిగాని ఇతర నిజాం ఆక్రమిత జిల్లా ప్రాంతాలు కూడా కలిసిన తెలంగాణా ఏర్పడాలని కోరుకుంటున్నందున - ఆ ప్రతిపాదన కాంగ్రెస్ అధిష్ఠానం మెడకు తగిలిస్తున్న కొత్త 'ఉచ్చు' అవుతుంది! ఇది సమస్యలను పరిష్కరించడానికి కాదు, కొందరు భావిస్తున్నట్టు "తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదని'' భావిస్తున్న వ్యక్తి అసలు కెసిఆర్ మాత్రమేనన్న అపవాదును అతను మీద మోసుకోక తప్పదు! చరిత్రలో తెలంగాణా రాష్ట్రమంటూ ఏనాడూ లేదు! ఉన్నదల్లా హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణా ఒక భాగమేగాని, తెలంగాణా రాష్ట్రమనేది లేదు. కనుకనే మూడుప్రాంటలలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలూ, వాటిలోని బడుగు బలహీనవర్గాల ప్రయోజనాలకు పరిష్కారం ప్రభుత్వాల విధాన నిర్ణయాలే గాని ప్రాంతీయ వాదాలు కావు. ఆ వాదాలు ముందుకు రావడానికి అసలు కారణం - పెట్టుబడిదారీ, భూస్వామ్యవ్యవస్థలో దోపిడీ, అసమా ఆర్థికాభివృద్ధి దశలేనని మరవరాదు!

డీజీపీపై కధనంతో ‘జీ-24గంటలు’ హడావుడి

  సంచలన వార్తల కోసం మీడియా ఆరాటం వలన మీడియా కూడా ఇబ్బందులో పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ ‘జీ-24గంటలు’ కూడా అటువంటి చిక్కుల్లోనే పడింది. మూడు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డి హైదరాబాదు, ఫతెహ్ దర్వాజా వద్ద ఉండే బాబా హబీబ్ ముస్తఫా ఇబ్రూస్ ను కలసినపుడు, వారిరువురి పరువుకు భంగం కల్గించే రీతిలో ఒక ప్రత్యేక కధనం‘జీ-24గంటలు’ చానల్ ప్రసారం చేసింది.   అందుకోసం కొంత మార్ఫ్ చేయబడిన వీడియో ఫుటేజ్ ను కూడా వాడినట్లు గమనించిన సిటీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యం.సుబ్బారావు పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు ‘జీ-24గంటలు’ పై సెక్షన్ 469 క్రింద క్రిమినల్ కేసు నమోదు చేసారూ.అదే విధంగా బాబా కుటుంబ సభ్యులు హుస్సేనీ ఆలం పోలీసు స్టేషనులో ‘జీ-24గంటలు’ చానల్ పై పిర్యాదు చేయడంతో‘జీ-24గంటలు’ పై మరో మరో కేసు కూడా నమోదు చేసారు.   ‘జీ-24గంటలు’ కధనంపై ఆగ్రహించిన బాబా అనుచరులు కొందరు ఖైరతాబాద్ వద్దగల ‘జీ-24గంటలు’ కార్యాలయం వద్దకు చేరుకొని చానల్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ లోపలకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకొని శాంతింప జేశారు. కానీ  ‘జీ-24గంటలు’ చానల్ మీడియా ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేయడానికి బయలుదేరాన్నసమాచారంతో నగరంలో మిగిలిన మీడియా ప్రతినిధులు కూడా వెంటనే చానల్ కార్యాలయం వద్దకు చేరుకొని, పోలీసులకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ కాసేపు ట్రాఫిక్ ను కూడా స్తంభింపజేసారు. అయితే పోలీసులు తాము ఎవరినీ అరెస్ట్ చేయడానికి రాలేదని, కేవలం చానల్ లో ప్రసారమయిన వీడియో గురించి ప్రశ్నించడానికే మాత్రమే వచ్చామని నచ్చజెప్పడంతో గొడవ సర్దుమణిగింది.

అంతా షరా మామూలే

  షరా మామూలుగానే మళ్ళీ సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, యంపీలు హైదరాబాదులోఈ రోజు మరో మారు సమావేశమయ్యారు. షరా మామూలుగానే కాఫీ టిఫిన్స్ సేవించారు. షరా మామూలుగానే రాష్ట్ర విభజనను ఏవిధంగా ఎదుర్కోవాలోసమావేశంలో తీవ్రంగా చర్చించారు. షరా మామూలుగానే రాష్ట్రాన్నివిభజిస్తే ఊరుకొనేది లేదని గట్టిగా గర్జించారు. షరా మామూలుగానే రాజీనామాలకు వెనుకాడేది లేదని కూడా గట్టిగా చెప్పారు. షరా మామూలుగానే కొందరు రాజీనామాల వలన ఎటువంటి ఉపయోగం ఉండదని అభిప్రాయలు వ్యక్తం చేసారు. షరా మామూలుగానే తెలంగాణా బిల్లును శాసనసభలో, పార్లమెంటులో ఓడించడానికి తము పదవులలో కొనసాగడం ఎంతయినా అవసరమని మరోమారు తేల్చి చెప్పారు. షరా మామూలుగానే త్వరలోనే మరో మారు సమావేశం అవ్వాలని నిర్ణయించుకొన్నారు. షరా మామూలుగానే ఈ వార్త మీడియాలో ప్రచురితమయింది.

ముందుకెళ్తే రాజీనామాలే: లగడపాటి

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ముందడుగు వేసినా రాజీనామాలకు వెనుకాడేది లేదు. ఏడుగురు సీమాంధ్ర ఎంపీలం రాజీనామాలు ఆమోదించుకుంటాం. కేంద్రమంత్రులు కూడా కొందరు రాజీనామాలకు సిద్దంగా ఉన్నారు అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో సమైక్య వాదులు తమను రాజీనామాలు కోరడంలో అర్ధం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని, సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే శాసనసభలో తెలంగాణ తీర్మానం ఓడించడం కష్టంగా ఉంటుందని, తెలంగాణ మీద కేంద్ర కేబినెట్ నోట్ వస్తే ఏం చేయాలి అన్న విషయం మీద సమాలోచనలు చేసేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు లగడపాటి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించమని అన్నారు.

100 కోట్ల కుంభకోణం..ఐఏఎస్ అరెస్టుకు రంగం సిద్ధ౦!

      విశాఖ నగరాభివృద్ధి సంస్థ భూ మాయ కేసులో ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణు అరెస్టుకు రంగం సిద్ధమైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన సమర్పించిన అభ్యర్థనను హైకోర్ట్ కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న వీఎన్ విష్ణు గతంలో వుడా వీసీగా వ్యవహరించారు. అప్పట్లో విశాఖలోని ఎంవీపీ కాలనీలో సామాజిక అవసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొందరికి కేటాయించారు. ఆ స్థలాన్ని సామాజిక అవసరాలకే ఉపయోగించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా...  ఆ ఆదేశాలను భెఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు సమర్పించిన ఫోర్జరీ పత్రాలను ఆధారంగా చేసుకుని గజం రూ.50 వేలు విలువైన స్థలాన్ని కేవలం రూ.3,500 చొప్పున విష్ణు వారికి కేటాయించారు. ఆ తర్వాత ఆయన మహా విశాఖ నగర పాలక సంస్థకు కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ఆ హోదాలో అదే స్థలంలో బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇంతలో అక్రమంగా ఈ స్థలం పొందినవారు తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించారు. విచారణ తరువాత  సీబీఐ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం మళ్ళీ విచారణ చేయమని సీఐడీకి కేసు అప్పగించారు. సీఐడీ కూడా అక్రమాలు వాస్తవమేనని నిర్థారించి కేసు నమోదు చేసింది.ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణును ఏ1 నిందితునిగా పేర్కొంది. మరో 18 మందిని నిందితులుగా చేర్చి వారిలో ఆరుగురిని 15 రోజుల క్రితం అరెస్ట్ చేసి జైలుకు పంపించింది.  ఈ కేసులో అరెస్టులు జరుగుతున్నాయని తెలిసిన విష్ణు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. విష్ణు నిర్ణయం వల్ల వుడాకు రూ.100 కోట్ల నష్టం జరిగిందని...ఇందులో కుట్ర ఉందని, ముందస్తు బెయిల్ పొందడానికి అనర్హులు అంటూ దరఖాస్తును కొట్టేశారు.

పహిల్వాన్ తో కుస్తీకే మొగ్గు చూపుతున్న అసదుద్దీన్

  హైదరాబాద్ పాతబస్తీ అనగానే మజ్లిస్ పార్టీ దాని అధినేతలు ఒవైసీ సోదరులే ముందు గుర్తుకు వస్తారు. వారిలో చిన్నవాడయిన అక్బరుదీన్ ఒవైసీపై దాదాపు రెండేళ్ళ క్రితం అదే ప్రాంతానికి చెందిన మొహమ్మద్ పహిల్వాన్ హత్యా ప్రయత్నం చేసినపుడు, ఒవైసీ త్రుటిలో తప్పించుకోగలిగాడు. అప్పుడు పహిల్వాన్ పై ఆయన నమోదు చేసిన కేసు నేటికీ కోర్టులో నలుగుతూనే ఉంది. అయితే మొన్నఅకస్మాత్తుగా పహిల్వాన్ శ్రేయోభిలాషులుగా చెప్పబడుతున్నఓనలబై,యాబై మంది బర్కాస్, జామియా మశీదు యొక్క ఇమామ్ నేతృత్వంలో, దరుసలాం వద్దగల ఒవైసీల కార్యాలయానికి వచ్చి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో దాదాపు అర్ధగంట పైగా మంతనాలు చేసారు.   పహిల్వాన్ తరపున వచ్చిన వారు దయచేసి ఆయనను క్షమించి, ఈ కేసును ఇంతటితో ముగించాలని అసదుద్దీన్ ఒవైసీకి విజ్ఞప్తి చేసారు. అయితే ఆయన తన సోదరుడిపై హత్యా ప్రయత్నం చేసిన మహమ్మద్ పహిల్వాన్ ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదని, అతనితో రాజీకి అంగీకరించబోమని, ఈ విషయం ఇక కోర్టులోనే తేల్చుకొందామని వారికి చెప్పడంతో వారు అసంతృప్తిగా వెనుతిరిగారు.   ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో కేవలం పాతబస్తీకే పరిమితమయిన మజ్లిస్ పార్టీ నేతలు, తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు స్థానికంగా బలమయిన యఫై శాఖకు చెందిన పహిల్వాన్ తో రాజీపడి ఆయన వర్గానికి చెందిన ముస్లిం ప్రజల ఓట్లను పొందుతారో లేక తమపై హత్యాప్రయత్నం చేసిన వ్యక్తికి శిక్ష పడేందుకే మొగ్గు చూపుతారో త్వరలోనే తేలిపోవచ్చును.