కాంగ్రెస్ బంగారాన్నిఇసుకగా మార్చగలదా
posted on Sep 7, 2013 @ 10:36PM
ఇసుకను బంగారంగా మార్చడం గురించి చాల కధలలో చదివి ఉంటాము. కానీ, బంగారాన్ని ఇసుకగా మార్చే కధని మాత్రం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుసుకోవచ్చును. ఈ సత్యాన్ని కనుగొన్నది ఎవరో కాదు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ! ఆయన ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రాన్ని చాలా ఘాటుగా విమర్శించారు. తెలంగాణా పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అగ్గి రాజేసిందని, సరయిన పద్ధతి అవలంభించకుండా అశాస్త్రీయంగా విభజించే ప్రయత్నం చేయడం వలనే నేడు రాష్ట్రం అల్లకల్లోలం అవుతోందని, అయినా కాంగ్రెస్ చోద్యం చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బంగారాన్నికూడా ఇసుకలా మర్చేయగలదని అన్నారు. తెలంగాణా అంశం బంగారం వంటిదని, దానిని కాంగ్రెస్ సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యిందని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయకపోయినట్లయితే, రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టినట్లయితే, అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్రాన్నివిభజించవచ్చునని మోడీ ఆలోచన.
రాష్ట్ర విభజన నిర్ణయంతో ప్రత్యర్ధి పార్టీలన్నిటినీ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతీయ గలిగినప్పటికీ, ప్రస్తుతం ఆ పార్టీకి సీమాంధ్ర లో ఎదురుగాలి వీస్తోంది. ఒకవేళ సమైక్యాంధ్ర ఉద్యమాల ఒత్తిడి కారణంగా, తెలంగాణా ఏర్పాటులో వెనక్కు తగ్గినా, విఫలమయిణా అక్కడ కూడా ఆ పార్టీ దెబ్బతినడం ఖాయం. అదేవిధంగా తెరాసతో సరిగ్గా వ్యవహరించలేకపోయినా, రానున్న ఎన్నికలలో దాని చేతిలో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు.
దాదాపు రెండు మూడు సం.లు సుదీర్ఘ చర్చలు, సమావేశాలు, నివేదికలు, కమిటీలు వగైరా తంతు అంతా పూర్తయిన తరువాత కూడా కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని సరిగ్గా చక్కబెట్టలేకపోయింది. అందుకు నేటి రాష్ట్ర పరిస్థితే ఒక చక్కని ఉదాహరణ. కాంగ్రెస్ అసమర్ధతకు, వైఫల్యానికి రాష్ట్ర ప్రజలు భారీ మూల్యం చెల్లించవలసి వస్తోంది. అందుకు ప్రతిగా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా భారీ మూల్యం చెల్లించక తప్పదు.