89 ఏట పెళ్ళి చేసుకున్న ఎన్.డి.తివారీ తాతయ్య
కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్ తివారీ తన 89వ యేట మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. ఒకప్పటి సహచారిణి, రోహిత్ శేఖర్ తల్లి అయిన ఉజ్వలా శర్మ(62)ను ఆయన గురువారం లక్నోలో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత ఉజ్వలా శర్మ మీడియాతో మాట్లాడుతూ, వివాహ ప్రతిపాదనను తివారీ తన ముందుకు తెచ్చారని, ఈ వేడుక కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే జరిగిందని తెలిపారు. ఇన్నాళ్ళకైనా తనను తివారీ పెళ్ళి చేసుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఉజ్వల కొడుకు రోహిత్ శేఖర్ 2008లో తనను కొడుకుగా గుర్తించాలని ఎన్డీ తివారీపై ఢిల్లీ హై కోర్టులో దావా వేశాడు. తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభియోగాన్ని ఖండించటమే గాక, డిఎన్ఏ పరీక్షకు కూడా మొదట అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ విజయం సాధించాడు. ఇటీవలే రోహిత్ శేఖర్ తన కుమారుడేనని తివారీ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతని తల్లి ఉజ్వలా శర్మను తివారీ వివాహం చేసున్నట్లు తెలుస్తోంది. ఎన్డీ తివారీ 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. ఆ సమయంలోనే కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తివారీ తరచూ వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో షేర్ సింగ్ కూతురు ఉజ్వలా శర్మకు తివారీకి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి రోహిత్ శేఖర్ జన్మించాడు. కాగా, ఎట్టకేలకు వీరిద్దరూ పెళ్లితో మళ్లీ ఒక్కటయ్యారు.