సీమాంధ్ర ఎంపీటీసీ తాజా ఫలితాల వివరాలు

      సీమాంధ్ర జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. సీమాంధ్ర జిల్లాల వారీగా మధ్యాహ్నం రెండుగంటకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.   1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (88), వైసీపీ (43), ఇతరులు (17) 2. విజయనగరం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (9), వైకాపా (4), ఇతరులు (1) 3. విశాఖపట్నం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (24), వైకాపా (6), ఇతరులు (4) 4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (70), వైకాపా (30), ఇతరులు (18) 5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (36), వైకాపా (17), ఇతరులు (21) 6. కృష్ణ: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (101), వైకాపా (68), ఇతరులు (12) 7. గుంటూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (78), వైకాపా (66), ఇతరులు (5) 8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (52), వైకాపా (48), ఇతరులు (9) 9. నెల్లూరు: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (34), వైకాపా (38), ఇతరులు (7) 10. చిత్తూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (10), ఇతరులు (1) 11. కడప: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (35), వైకాపా (93), ఇతరులు (3) 12. కర్నూలు: కాంగ్రెస్ (13), తెలుగుదేశం (96), వైకాపా (124), ఇతరులు (20) 13. అనంతపురం: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (48), వైకాపా (18), ఇతరులు (3) మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 19, తెలుగుదేశం: 676, వైకాపా: 565, ఇతరులు: 120  

ఇండియన్లకి ఒబామా కంగ్రాట్స్: థాంక్స్ చెప్పిన బీజేపీ

      మన దేశంలో ఎన్నికల పోలింగ్ ముగియగానే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించాడు. భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాలో రాబోయే కొత్త ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ఒబామా ప్రకటించారు. ‘అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో సమర్థంగా ఎన్నికలు నిర్వహించడం ప్రశంసనీయం. ఎన్నికల ప్రక్రియని విజయవంతం చేసిన భారతీయులకు నా అభినందనలు’ అని ఒబామా తన సందేశంలో పేర్కొన్నారు. ఒబామా సందేశాన్ని భారతీయ జనతాపార్టీ స్వాగతించింది. భారతీయులకు అభినందనలు తెలిపిన ఒబామాకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశం మీద భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, ఇండియాలో ‘కొత్త ప్రభుత్వం’ రాబోతుందన్న విషయం ఒబామాకి కూడా తెలిసిపోయిందని అన్నారు. రాబోయే బీజేపీ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల సహకారం తప్పకుండా లభిస్తుందన్న నమ్మకం వుందని ఆయన చెప్పారు.

ఎన్డీయేదే ఢిల్లీ అన్న ఎగ్జిట్ పోల్స్: దూసుకెళ్ళిన స్టాక్ మార్కెట్స్

      సోమవారం నాడు వివిధ జాతీయ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడి చేసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో ఒకేమాట చెప్పాయి.. అదేమిటంటే, కేంద్రంలో ఎన్టీయే అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ ఇంటికి పోవడం ఖాయం. ఈ వాస్తవాలు వెలుగులోకి రాగానే మంగళవారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్ళాయి. సెన్సెక్స్ 490 దూసుకెళ్ళి మొత్తం 24000 పాయింట్ల మార్కును దాటింది. అలాగే నిఫ్టీ 150 పాయింట్లు పెరిగింది. గత వారం రోజులుగా నరేంద్రమోడీ అధికారంలోకి వస్తున్న సూచనలు కనిపిస్తూ వుండటంతో స్టాక్ మార్కె్ట్ లాభాల బాటలో పయనిస్తోంది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్: సీమాంధ్రలో టీడీపీ ముందంజ

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ జరగడం వల్ల కౌంటింగ్ సాధారణ వేగంతో జరుగుతోంది. చాలాచోట్ల బ్యాలెట్ బాక్సుల్లో నీరు చేరడం, బ్యాలెట్లకు చెదలు పట్టడం లాంటి సంఘటనలు జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం 11 గంటల వరకు జరిగిన కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ తన హవాని కొనసాగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో మునిసిపల్ ఎన్నికలలో తన సత్తా చాటిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఓటర్ల మద్దతు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒక జడ్పీటీసీ స్థానాన్ని, 108 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. వైకాపా 74 జడ్పీటీసీ స్థానాలను పొందింది. కాంగ్రెస్ పార్టీ 5 ఎంపీటీసీ స్థానాలతో సరిపెట్టుకుంది. వామపక్షాలు నాలుగు ఎంపీటీసీలు, ఇతరులు 74 ఎంపీటీసీలు పొందారు. పరిషత్ ఎన్నికలలో కూడా మునిసిపల్ తరహా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: బ్యాలెట్ బాక్సుల కష్టాలు

      రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్లను బాక్సుల్లో పెట్టి స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. అయితే కొన్ని స్ట్రాంగ్ రూములు పేరుకే స్ట్రాంగ్ తప్ప బ్యాలెట్లకు భద్రత కల్పించలేకపోయాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈమధ్య కురిసిన వర్షాల కారణంగా స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన కొన్ని బాక్సుల్లోకి నీళ్ళు చేరాయి. చాలాచోట్ల బ్యాలెట్లు తడిచిపోయాయి. ప్రస్తుత అలా బ్యాలెట్లు తడిచిన కేంద్రాల్లో లెక్కింపు సిబ్బంది ఓట్లు లెక్కపెట్టే పనిని పక్కన పెట్టి తడిచిపోయిన బ్యాలెట్లను ఎండలో ఆరబెట్టే పనిలో వున్నారు. ఎండలో ఆరబెట్టిన బ్యాలెట్లు గాలిలోకి ఎగిరిపోతూ వుంటే వాటిని పట్టుకోవడానికి తంటాలు పడుతున్నారు. అలాగే కొన్నిచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయి. బూత్ బంగ్లాల్లా వుండే స్ట్రాంగ్ రూమ్స్ లో నెలల తరబడి బ్యాలెట్ పేపర్లు పెడితే చెదలు పట్టవా? తడిచిన బ్యాలెట్లు, చెదలు పట్టిన బ్యాలెట్లు పనికిరాకపోతే ఆయా కేంద్రాలలో రీ పోలింగ్ నిర్వహించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

డబుల్‌ డెక్కర్ రైలు వస్తోంది.. అందరు పక్కకి జరగండి..

      రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ రైలు హైదరాబాద్‌‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణం ప్రారంభించింది. మంగళవారం ఉదయం 6.45 గంటలకు కాచిగూడ- గుంటూరు మధ్య ఏసీ డబుల్‌ డెక్కర్ రైలు ప్రారంభమైంది. రైల్వే శాఖ సీనియర్ ఉద్యోగి ఒకరు ఈ రైలుకు పచ్చజండా ఊపి ప్రారంభించారు. దీంతో దక్షిణాదిన తొలిసారిగా ఈ డబుల్‌ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతివారం కాచిగూడ- గుంటూరు- కాచిగూడ ఏసీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. బుధవారం నుంచి కాచిగూడ నుంచి తిరుపతికి డబుల్ డెక్కర్ సర్వీసు అందుబాట్లోకి వస్తోంది. తొలిసారి డబుల్ డెక్కర్ రైలు ఎక్కిన ప్రయాణికులు మురిసిపోయారు. సెల్ ఫోన్లతో రైలును ఫొటోలు తీసుకున్నారు. తొలి ప్రయాణంలో కాచిగూడ నుంచి గుంటూరు వరకు 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు.

పరిషత్ ఎన్నికలలో ఏకగ్రీవాల వివరాలు

      జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన స్థానాల వివరాలివి. తెలంగాణలో 69 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 24 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు, తెరాసకు చెందిన 14 మంది అభ్యర్థులు, వామపక్షాల అభ్యర్థులు ఇద్దరు, ఇతరులు 26 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సీమాంద్రలో 251 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ ఏకగ్రీవమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఒక జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచింది. వైకాపా 70 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, వామపక్షాలు 4 స్థానాల్లో, ఇతరులు 70 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచారు.

రాష్ట్రంలో 29 కేంద్రాలలో రీ పోలింగ్

      దేశవ్యాప్తంగా 2014 సంవత్సరం ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మంగళవారం కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 29 పోలింగ్ కేంద్రాలలో మంగళవారం నాడు రీపోలింగ్ జరుగుతోంది. సీమాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, కడప జిల్లాల్లోని 17 పోలింగ్ కేంద్రాలతోపాటు తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 12 కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు రీ పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తోంది.

ఎగ్జిట్ పోల్స్: ఎన్డీయేకే పట్టం కట్టిన ఇండియన్ ఓటరు

      దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన మీడియా సంస్థలు, విశ్వసనీయమైన సర్వే సంస్థలతో కలసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సోమవారం నాడు వెల్లడి అయ్యాయి. ఏ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అయినా ముక్తకంఠంతో ఒకే విషయాన్ని చెప్పింది. అదే కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని. వివిధ ఎగ్జిట్ పోల్స్ వివరాలు...   టుడేస్ చాణక్య: ఎన్డీయే - 340, యుపీఏ - 70, ఇతరులు - 133. టైమ్స్ నౌ: ఎన్డీయే - 249, యుపీఏ - 148, ఇతరులు - 146. సీఎన్ఎన్-ఐబీఎన్: ఎన్డీయే - 270-282, యుపీఏ - 92-102, ఇతరులు - 150 - 160. హెడ్ లైన్స్ టుడే: ఎన్డీయే - 272, యుపిఏ - 115, ఇతరులు - 156. సీ ఓటర్: ఎన్డీయే - 289, యుపీఏ - 101, ఇతరులు - 153. ఏబీపీ న్యూస్: ఎన్డీయే - 281, యుపీఏ - 97, ఇతరులు: 161. ఆజ్ తక్: ఎన్డీయే - 272, యుపీఏ - 115, ఇతరులు: ----- ఇండియా టీవీ: ఎన్డీయే - 289, యుపీఏ - 101, ఇతరులు: ------ సీమాంధ్ర ఎగ్జిట్ పోల్ ఫలితాలు....... సీఎన్ఎన్-ఐబీఎన్: టీడీపీ, బీజేపీ - 11-15, వైకాపా: 11-15, కాంగ్రెస్ - 0. టైమ్స్ నౌ: టీడీపీ, బీజేపీ - 17, వైకాపా - 8, కాంగ్రెస్ - 0. తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు...... సీఎన్ఎన్-ఐబీఎన్: తెరాస - 8-12, కాంగ్రెస్ - 3-5, టీడీపీ, బీజేపీ - 2-4, ఇతరులు - ----- టైమ్స్ నౌ: తెరాస: 9, కాంగ్రెస్ - 4, టీడీపీ, బీజేపీ - 2, ఇతరులు - 2.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం

      మునిసిపల్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు ఈ విషయం మరింత స్పష్టంగా తెలిసే ప్రక్రియ ప్రారంభమైంది. అది పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 441 జడ్పీటీసీ, 6,480 ఎంపీటీసీ స్థానాలకు, సీమాంధ్రలో 1,093 జడ్పీటీసీ, 16,214 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును చేపట్టారు. పేపర్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరిగింది కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా జరిగే అవకాశం వుంది. ఈరోజు రాత్రి వరకూ కౌంటింగ్ జరుగుతుంది.

నేడే పరిషత్ ఫలితాలు

  గ్రామీణ ఓటరు నాడిని పట్టిచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. గతనెల 6,7 తేదీలలో నిర్వహించిన ఈ ఎన్నికలలో 1,096 జడ్పీటీసీ స్థానాలకు 5,0 34 మంది, 16, 589 ఎంపీటీసీ స్థానాలకు 53, 345 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. ఈరోజు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికలు బ్యాలట్ పేపర్లతో నిర్వహించినందున లెక్కింపులో జాప్యం అనివార్యమవుతుంది గనుక ఫలితాలు వెలువడేందుకు కూడా సమయం పట్టవచ్చును. బహుశః మధ్యాహ్నం నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో కూడా నిన్నటిలాగే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి, సీమాంద్రాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్లయితే, ఇక సార్వత్రిక ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలదే విజయం అని భావించవచ్చును. తెరాస, వైకాపాలకు గ్రామీణ ప్రాంతాలలో మంచి పట్టు ఉందనే అభిప్రాయం నిజమో కాదో నేటి ఫలితాలాలో తేలిపోతుంది.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: తప్పుల తడక సర్వే

      టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వివరాలలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పార్టీలకు లభించే సీట్లకి సంబంధించిన అంచనా తప్పులతడకగా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. . టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుంది. లెఫ్ట్ పార్టీలు 2 స్థానాలు సొంతం చేసుకుంటాయి. అలాగే సీమాంధ్రలో ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకోబోతోంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంటుంది. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారు. అయితే టైమ్స్ నౌ ప్రకటించిన ఈ ఫలితాలు తప్పుల తడకలా వున్నాయని టైమ్స్ నౌ ఛానల్లో డిస్కషన్‌లో పాల్గొన్న పలువురు చెప్పారు. అటు సీమాంధ్రలో, ఇటు టీడీపీలో టీడీపీ, బీజేపీ కూటమికి ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. సోమవారం వెల్లడి అయిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అంతే కాకుండా టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎం.ఐ.ఎం. ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదన్న ఫలితాన్ని ఇచ్చింది. అయితే దీనిని పలువురు ఖండించారు. హైదరాబాద్‌ లోక్ సభ స్థానంలో ఎంఐఎం గెలిచి తీరుతుందని వారు స్పష్టం చేశారు.