మోడీని కలవనున్న జగన్మోహన్ రెడ్డి

  కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని బెయిలుపై జైలు నుండి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఊహించని విధంగా ఎన్నికలలో ఓడిపోవడంతో వెంటనే అప్రమత్తమయినట్లున్నారు. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి మరీ నిధులు తీసుకు వస్తానని భింకాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, పరిస్థితులు తారుమారవడంతో ఈరోజు తన యంపీలను వెంటేసుకొని, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టబోతున్న నరేంద్ర మోడీని అభినందించి, సీమాంధ్రకు అన్ని విధాల న్యాయం చేయాలని కోరేందుకే చేందుకు డిల్లీ బయలుదేరుతున్నట్లు వైకాపా నేతలు చెప్పుకొంటున్నారు. అయితే అసలు కారణం ఏమిటో అందరికీ తెలిసిందే.   నేడు కాకపోతే రేపయినా జగన్ సీబీఐ కేసులలో దోషిగా జైలుకు వెళ్ళాక తప్పని పరిస్థితి ఉంది గనుక, అంత ప్రమాదం ముంచుకు రాకముందే, నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకొనేందుకే డిల్లీ బయలుదేరుతున్నారనుకోవచ్చును. లేకుంటే, బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొని నరేంద్ర మోడీతో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు కంటే ముందే, మోడీని వ్యతిరేఖించిన జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా డిల్లీ బయలుదేరవలసిన అవసరమేమీ లేదు. అయితే చంద్రబాబు మాటను కాదని మోడీ జగన్మోహన్ రెడ్డిని కనికరిస్తారని అనుకోవడం అత్యాసే అవుతుంది.   ఇప్పుడు బీజేపీకి జగన్ మద్దతు అవసరము లేదు, గనుక అతని మాట వినవలసిన అవసరము లేదు. అందువల్ల జగన్ తన కేసులను పూర్తిగా మాఫీ చేయించుకోలేకపోయినా, కనీసం వీలయినంత ఎక్కువ కాలం తన బెయిలు పొడిగించుకొనే ప్రయత్నం చేస్తారేమో. ఏమయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ముందున్నది అంతా గడ్డు కాలమేనని చెప్పవచ్చును.

ఎందుకు ఓడించారంటూ ఏడుపు మొహం పెట్టిన పొన్నం

  తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. అయ్యగారు ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు. తాను ఎంపీనన్న విషయాన్నే మరచిపోయి నోటికొచ్చినట్టుగా సీమాంధ్రులను తిట్టేవారు. తెలంగాణలోకి వస్తే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ని పేల్చేస్తానని వార్నింగిచ్చిన ఘనుడాయ. సీమాంధ్రలను అంతగా తిడితే తనకు తెలంగాణలో ఓట్లు బాగా పడతాయని ఆయన మురిసిపోయారు. చివరికేమైంది. పార్లమెంట్ ఎన్నికలలో తుక్కుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏడుపు మొహం పెట్టి మాట్లాడారు. ‘‘ఏం పాపం చేశామని ఎన్నికల్లో మమల్ని ఓడించారు’’ అని పొన్నం ప్రభాకర్ ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణను గట్టిగా వ్యతిరేకించిన టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేసి, తెలంగాణ కోసం ఢిల్లీలో పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేసిన తమను ఎందుకు ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ తెలంగాణలో అనుకున్నమేరకు సీట్లు సాధించలేకపోయామని ఆయన లబలబలాడారు. రాష్ట్ర విభజనతో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలోనూ నష్టపోయామనే విషయం పొన్నంకి అర్థమై జ్ఞానోదయం కలిగిందట.

సీమాంధ్రకు ఉందిలే మంచికాలం ముందుముందునా: మురళీమోహన్

  రాష్ట్ర విభజన కారణంగా సీమంధ్ర దారుణంగా నష్టపోయింది. ఈ నష్టం ఎప్పటికి తీరుతుందోనన్న ఆందోళన సీమాంధ్రులలో మొన్నటి వరకు వుంది. అయితే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ వుండటంతో ఇప్పుడు సీమాంధ్రులలో వున్న భయాందోళనలను తొలగిపోతున్నాయి. ఉందిలే మంచి కాలం ముందుముందునా అనే నమ్మకం వారిలో కలిగింది. ఈ విషయాన్నే నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చెబుతున్నారు. సీమాంధ్రకు మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు రావడానికి ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సీమాంధ్రను అభివృద్ధి చేసుకోడానికి అందరం కలిసి కృషి చేద్దామన్నారు.సీమాంధ్ర అభివృద్దికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి వుంటానని ఆయన అన్నారు. తన విజయం టీడీపీ పార్టీ స్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు అంకితమిస్తున్నట్లు మురళీమోహన్ ప్రకటించారు.

కేసీఆర్‌కి మోడీ ఫోన్: అందరితో భాయీభాయీ!

  త్వరలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబోతున్న నరేంద్రమోడీ ఇతర రాజకీయ నాయకులు అందరితో భాయీ భాయీ.. లేడీస్‌తో అయితే భాయీ.. బెహన్ సంబంధ బాంధవ్యాలను కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు తనను దారుణంగా విమర్శించిన వారితో కూడా స్నేహపూరిత సంబంధాలను కొనసాగించాలని నరేంద్రమోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌లో బీజేపీకి పూర్తి మెజారిటీ వున్నప్పటికీ, ఎన్టీయే కూటమికి బోలెడంత మెజారిటీ వున్నప్పటికీ ఎన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలతో కూడా స్నేహపూర్వకంగా వుండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మిత్రుడికి శత్రువు మనకి కూడా శత్రువు అనుకుంటాం. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఈ సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు కనిపిచండం లేదు. చంద్రబాబు నాయుడికి జగన్, కేసీఆర్ రాజకీయంగా శత్రువులు. వీళ్ళిద్దరూ గడచిన ఎన్నికలలో నరేంద్రమోడీ మీద కూడా మాటల తూటాలు విసిరారు. అయినప్పటికీ మోడీ వీళ్ళిద్దరితో స్నేహపూర్వకంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మెజారిటీ సాధించిన కేసీఆర్‌కి నరేంద్రమోడీ ఫోన్ చేశారు. ఎన్నికలలో గెలిచినందుకు అభినందనలు తెలిపారు. త్వరలో తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా ఆహ్వానించారు. కేసీఆర్ కూడా మురిసిపోయి అలాగేనని చెప్పారు. అదేవిధంగా మరోవైపు జగన్ మోడీని కలవటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తానొక్కడే కాకుండా తన ఎంపీలందరితో కలసి మోడీనికి కలిసి అభినందనలు చెప్పడానికి అపాయింట్‌మెంట్ కూడా దొరికింది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మొన్నటి వరకూ మోడీని నానామాటలూ అన్నారు. మోడీ ఆమెతో కూడా స్నేహపూరితంగా వ్యవహరించబోతున్నారు. అలాగే బెంగాలీ దీదీ మమతా బెనర్జీతో కూడా మంచిగా వుండాలని మోడీ తమ్ముడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాయనా మోడీ.. నువ్వు ఎవరితో అయినా మంచిగా వుండుగానీ, సీమాంధ్రని సర్వనాశనం చేసినవాళ్ళతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా వుండు.

జూన్ రెండు తరువాతే కేసీఆర్ పదవీ ప్రమాణం

  తెలంగాణాలో ఘనవిజయం సాధించిన తెరాస, తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకొని, అదేవిషయాన్ని గవర్నర్ నరసింహన్ కు నిన్న లికిత పూర్వకంగా తెలియజేసారు. పనిలోపనిగా తెలంగాణా అప్పాయింటడ్ డేట్ జూన్ రెండును ముందుకు జరపవలసిందిగా మరో మారు అభ్యర్ధించారు. అయితే ఆ విషయంలో తానేమీ చేయలేనని గవర్నర్ చెప్పినట్లు సమాచారం. అందువల్ల కేసీఆర్ కూడా జూన్ రెండు లేదా ఆ మరునాడే తెలంగాణా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చును. కేసీఆర్ క్యాబినెట్లో ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులకే కీలకమయిన మంత్రి పదవులు దక్కుతాయని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కేసీఆర్ కుమార్తె కవిత లోక్ సభకు పోటీ చేసినందున ఆమె కేసీఆర్ మంత్రివర్గంలో చేరకపోవచ్చును. కానీ ఆమెను కేసీఆర్ తన మంత్రి వర్గంలో చేర్చుకొన్నా ఆశ్చర్యం లేదు.

విజయవాడలో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం

  చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవాడ స్వరాజ్ మైదానంలో జూన్ రెండు లేదా మూడు తేదీలలో ప్రమాణస్వీకారోత్సవం చేయనున్నట్లు తాజా సమాచారం. మొదట ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, విజయవాడకే ఆయన మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయంలో తన తాత్కాలిక క్యాంపు ఏర్పాటు చేసుకొబోతున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్ అంటే డీజీపీ కార్యాలయం వగైరాలు ఏర్పాటుచేయబోతున్నట్లు తాజా సమాచారం. గుంటూరు, విజయవాడ, తెనాలి మూడు ప్రాంతాలను కలుపుతూ మెట్రో నగరాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కనుక కొత్త రాజధాని కూడా ఈ ప్రాంతాల మధ్యనే ఉంటుందని చెప్పవచ్చును. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ, కొత్త రాజధాని నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా గుంటూరులో తన క్యాంపు కార్యాలయం నుండే చంద్రబాబు ప్రభుత్వ నిర్వహణ చేయవచ్చును. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, సెక్రటరియేట్ ఉద్యోగులు హైదరాబాదులోనే ఉన్నందున అవసరాన్ని బట్టి కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు గుంటూరు నుండి పరిపాలన సాగించ వచ్చును.

ప్రజల విజ్ఞతను తప్పుబడుతున్న కాంగ్రెస్, వైకాపాలు

  చంద్రబాబు, కేసీఆర్ ఇరువురూ ఇచ్చిన భూటకపు హామీలు, చెప్పిన మాయమాటలను నమ్మి ప్రజలు ఓటేయడంతో వారు విజయం సాధించగలిగారని ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు, జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అంటే, వారి దృష్టిలో ప్రజలు ఆలోచనా జ్ఞానం లేని అవివేకులు, బుద్ధిహీనులన్నమాట. ఆ లెక్కన వారి దృష్టిలో దేశ ప్రజలందరూ కూడా బుద్ధిహీనులేననుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మోడీ చెప్పిన మాయ మాటలు విని బీజేపీకి అఖండ మెజార్టీ కట్టబెట్టారు. అయితే ఈ విజేతలకు ఓటేసినవారిలో కేవలం గ్రామీణులు, నిరక్షరాశ్యులే కాదు కోట్లాది మంది ఉన్నత విద్యావంతులు, మేధావులు కూడా ఉన్నారు. అటువంటి వారిచ్చిన తీర్పుని తప్పుబట్టడం కాంగ్రెస్, వైకాపాల అవివేకం, అహంకారానికి నిదర్శనమని చెప్పవచ్చును. అయితే వారు కూడా తెరాస, తెదేపాలకు తీసిపోకుండా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను గుప్పించిన సంగతి విస్మరించారు. ఒకవేళ ప్రజలు వారి హామీలను నమ్మి వారికే ఓటేసి గెలిపిస్తే, అప్పుడు వారికి విజ్ఞత ఉన్నట్లు భావిస్తారేమో.   కాంగ్రెస్ పార్టీ తన అసమర్ధ, అవినీతి పాలనకు మూల్యం చెల్లిస్తే, వైకాపా గత ఐదేళ్ళ కాలంలో గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకోకుండా, కేవలం సానుభూతి అంశం పట్టుకొని వ్రేలాడుతూ ఓటమిపాలయింది. వారి ఓటమికి ఇటువంటి అనేక కారణాలున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ప్రజల విశ్వసనీయత కోల్పోయినందునే ఓడిపోయాయి. అది పూర్తిగా స్వయంకృతాపరాధమే. అయితే అందుకు తమ ప్రత్యర్ధులను, వారికి ఓటేసి గెలిపించిన ప్రజలను, వారి విజ్ఞతను తప్పుబట్టడం అవివేకమే.

మధు యాష్కి సరికొత్త ఏడుపు

      సీమాంధ్రులను తిట్టిపోయడంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కి అందరికంటే ముందుండేవాడు. రాహుల్ గాంధీకి ఫ్రెండ్ అయిన మధు యాష్కి రాహుల్‌కి తప్పుడు నివేదికలు, లేనిపోని ఆశలు కల్పించి, తెలంగాణ ఇస్తే ఎంపీ సీట్లన్నీ మనవేనని సీన్ క్రియేట్ చేసి మొత్తానికి తెలంగాణ వచ్చేలా చేశాడు. చివరికి ఏమయింది.   తెలంగాణ కోసం ఎంతో పాటు పడ్డానని బిల్డప్ ఇచ్చుకునే మధు యాష్కి కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత చేతిలో దారుణంగా ఓడిపోయాడు. ఊహించని విధంగా ఓడిపోవడంతో మధు యాష్కికి మైండు ఖరాబైందేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలలో దారుణంగా ఓడిపోయినా, దానిలో సీమాంధ్రులకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన సీమాంధ్రుల మీద విషం కక్కడం మానలేదు. ఇలా ఓడిపోయాడో లేదో అలా బయటకి వచ్చిన మధు యాష్కి తాను వున్న కాంగ్రెస్ పార్టీని కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని పొగడ్డం మొదలెట్టాడు. టీఆర్ఎస్ సూపర్‌గా గెలిచిందని సర్టిఫికెట్ ఇచ్చాడు. అక్కడితే ఆగితే బాగుండేది, తాను ఓడిపోవడం బాధ కలిగించడం లేదుగానీ, తెలంగాణలో టీడీపీ, వైకాపా గెలవటం తనకి బాధ కలిగిస్తోందని అన్నాడు. ఓడిపోయిన పెద్దమనిషి ఇంట్లో కూర్చోడంట. సామాజిక తెలంగాణ కోసం పాటుపడుతూనే వుంటాడట.

సీమాంధ్రుల శాపం ఎవరెవరికి తగిలిందంటే..

      సీమాంధ్రుల శాపం తగిలి మహామహులు ఈ ఎన్నికలలో దుంపనాశనమైపోయారు. రాష్ట్ర విభజన నాటకంలో కొంతకాలం పాత్రని పోషించిన గులాం నబీ ఆజాద్ మటాషైపోయాడు. దగ్గరుండి రాష్ట్రాన్ని ముక్కలు చేయించిన దిగ్విజయ్ సింగ్ ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ రహస్య సంబంధం విషయం బయటపడి చిక్కుల్లో పడ్డాడు. సీమాంధ్రుల విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ షిండే ఘోరంగా ఓడిపోయాడు. విభజన పాపాన్ని మూటగట్టుకున్న చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం ఓటమిని మూటగట్టుకున్నాడు. లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలను చావగొట్టిన అజారుద్దీన్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అధికారం కోసం రాష్ట్రాన్ని విభజించిన సోనియా, రాహుల్ ఇప్పుడు అధికారం కోల్పోయి ఏడుస్తున్నారు.

చీరాల ఫలితంపై వివాదం: అభ్యర్థి ఆందోళన

      ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా రంగంలో వున్న ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వున్న ఆమంచి మీద అనేక అవినీతి ఆరోపణలున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆమంచి ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలోనూ చేరకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి పోతుల సునీతపై విజయం సాధించారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ విజయంపై ఇప్పుడు వివాదాలు మూగాయి. ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పద్మజకు లంచం ఇచ్చారని, నియోజకవర్గానికి చెందిన 60 ఈవీఎంలను తారుమారు చేసి ఫలితం తనకు అనుకూలంగా వచ్చేలా చేశారని ఈ స్థానం నుంచి ఓడిపోయిన తెలుగుదేశం అభ్యర్థి పోతుల సునీత ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేసి తీరాలంటూ ఆమె నిరసన దీక్ష చేపట్టారు. ఇది రాష్ట్ర రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో, ఎలా న్యాయం చేస్తుందో చూడాలి.

దారుణమైన ఓటమి: ప్రజలకు బొత్స సారీ

      పీసీసీ అధ్యక్షుడిగా వున్నప్పుడు బొత్స సత్యనారాయణ మాట తీరు అందరికీ తెలిసిందే. మీడియాని కూడా తీసిపారేస్తూ, నోరేసుకుని మీద పడిపోతూ హవా నడిపించేవాడు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఆ అగ్నికి ఆజ్యం పోసిన సీమాంధ్రులలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. రాష్ట్ర విభజన సందర్భంగా బొత్స మీద ఆయన నియోజకవర్గమైన చీపురుపల్లిలోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. పరిస్థితి కర్ఫ్యూ పెట్టే వరకు వెళ్ళినా బొత్స నియోజకవర్గ ప్రజలకు ఒక్క సారీ చెప్పిన పాపాన కూడా పోలేదు. ఇప్పుడు చీపురుపల్లి ప్రజలకు బొత్స సారీ చెప్పారు. అది కూడా చీపురుపల్లి ప్రజలు చీపురు వెనక్కి తిప్పి బొత్సని కొట్టి ఎన్నికలలో ఓడించాక సారీ చెప్పారు. చీపురుపల్లిలో దారుణంగా ఓడిపోయిన బొత్స ప్రజల ముందుకు వచ్చి సారీ చెప్పారు. తాను తెలిసి ఏ తప్పూ చేయలేదని, ఒక వేళ తాను తప్పు చేశానని భావిస్తే సారీ చెబుతున్నానని అన్నాడు. చీపురుపల్లి ప్రజలు మాత్రం ‘వి హావ్ నో లారీ టు క్యారీ యువర్ బిగ్ సారీ’ అని బొత్సని పట్టించుకోవడం మానేశారు. ఇక బొత్స రాజకీయ సన్యాసం తీసుకుంటే బెటర్.

రాఖీ సావంత్‌కి పోలయిన ఓట్లు కేవలం 15

  టీవీల్లో, సినిమాల్లో సెక్స్ బాంబ్‌లాగా చెలరేగిపోయే రాఖీ సావంత్ రాష్ట్రీయ ఆమ్ పార్టీ (రేప్) అనే పార్టీని ప్రారంభించి, దానికి గుర్తుగా మిరపకాయని ఎంచుకుని, ముంబై వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. రాఖీ సావంత్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంది. నియోజకవర్గాన్ని ఒక చుట్టు చుట్టింది. ఇంతకాలం రాఖీ సావంత్‌ని సెక్సీ పోజుల్లో మాత్రమే చూడ్డం అలవాటైన జనం ఒంటినిండా బట్టలు కప్పుకుని ప్రచారంలో పాల్గొనడం చూసి అవాక్కయిపోయారు. రాఖీ సావంత్ కూడా తాను గెలవటం ఖాయమని కలలు కూడా కన్నారు. చివరికి ఆమెకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా.. కేవలం 15 ఓట్లు.. దేశ చరిత్రలోనే ఇంత దారుణంగా ఎవరికీ ఓట్లు వచ్చి వుండవేమో. రాఖీకి 15 ఓట్లు రావడం ఒక అవమానకరమైతే, ఈ 15 ఓట్ల పాయింట్‌ని పుచ్చుకుని సోషల్ మీడియాలో జనం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లన్నీ రాఖీ సావంత్ చదివిందంటే తన పార్టీ గుర్తు అయిన మిరపకాయలు బోలెడన్ని తిని బాల్చీ తన్నేయడం ఖాయం.

మన్మోహన్ సింగ్: ఆర్థికవేత్తకి అవమానకర వీడ్కోలు

      ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగిసింది. ఆయన జాతిని ఉద్దేశించి ఇచ్చిన చివరి సందేశంలో ఆయన తన పదేళ్ళ పదవీకాలంలో తాను, కాంగ్రెస్ పార్టీ దేశం కోసం బోలెడంత చేశామని చెప్పుకొచ్చారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేశామని, అందుకు చాలా గర్వపడుతున్నామని చెప్పుకున్నారు. ఈ మాట చెప్పడానికి మన్మోహన్ ఎంతమాత్రం సిగ్గుపడకపోయినప్పటికీ, ప్రధాని సందేశం వింటున్న దేశ ప్రజలందరూ ఇలాంటి ప్రధాని పాలనలో ఇంతకాలం మగ్గిపోయామా అని సిగ్గుపడిపోయారు.   మన్మోహన్ తన పదేళ్ళ పదవీకాలంలో ఏమైనా సాధించారా లేదా అనేది ఆయన చెప్పుకోవలసిన అవసరం లేదు. దేశమే తన ఓటు ద్వారా చెప్పేసింది. దేశంలో గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న ఆయన, ఒకప్పడు దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని పేరు తెచ్చుకున్న ఆయనకి దేశ ఆర్థిక రంగం ఇచ్చిన అవమానకర వీడ్కోలే చెబుతుంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని తెలిసినప్పటి నుంచి గత పది రోజులుగా స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తోంది. దేశ ఆర్థిక రంగం ఉత్సాహంతో ఉరకలు వేసింది. కాంగ్రెస్ పాలన, మన్మోహన్ సింగ్ పాలన ఎప్పుడు ముగుస్తుందా, ఈ పీడా ఎప్పుడు వదులుతుందా అని దేశ ఆర్థిక రంగం ఆసక్తిగా ఎదురు చూసింది. ఒక ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ పదవిలోంచి దిగిపోవాలని దేశంలోని ఆర్థిక రంగం కోరుకుందంటే ఆయనకు అంతకంటే అవమానం మరొకటి వుండదు. ఈ విషయం తెలిసి కూడా తన ప్రభుత్వం ఎంతో సాధించిందని చెప్పుకోవడం మన్మోహన్‌కి అంతకన్నా అవమానం.  

రిజల్ట్స్ మందు పార్టీ: తప్పతాగిన త్రిష చిందులు

      టోటల్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా సూపర్‌గా ఎంజాయ్ చేసిందెవరయ్యా అంటే.. త్రిష అని చెప్పొచ్చు. అదేంటయ్యా అని అడిగితే, శుక్రవారం అంతా ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆసక్తి గా చూస్తూ ఉంటే త్రిషమాత్రం తన స్వస్థలమైన చెన్నైలో కాకుండా హైదరాబాద్‌లో మందు కొట్టి చిందేసినట్టు సమాచారం. వెండితెరమీద నోట్లో వేలుపెటితే కొరకలేనట్టు కనిపిస్తుందిగానీ, రియల్ లైఫ్‌లో త్రిష చాలా ఫాస్ట్. మందుకొట్టి రోడ్డుమీదకి ఎక్కిందంటే ఆమె అల్లరి చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఆ అల్లరి ఆమె మరోసారి హైదరాబాద్‌లో చేసింది. ఓ పక్క ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే మరోపక్క త్రిష ఫుల్లుగా తాగి రోడ్డు మీద ఫ్రెండ్స్ తో కలసి చిందులు వేసింది. త్రిష ఇలా లెటస్ట్ గా తాగి చిందులు వేయడానికి కారణం దేశంలో మోడీ ప్రభంజనం వీస్తున్నందువల్లే అని అనుకోకండి. త్రిషకి అంత రాజకీయ పరిజ్ఞానం, సామాజిక స్పృహ వుండే అవకాశం లేదు.

చివరి ప్రెస్‌మీట్‌లో ప్రధాని మన్మోహన్ సన్నాయి నొక్కులు

  పదేళ్ళపాటు దేశాన్ని అష్ట దరిద్రంగా, సోనియా ఆధిపత్యంలో పరిపాలించిన ప్రధాని మన్మోహన్ సింగ్ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో వెన్నెముక లేని ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. దేవెగౌడ కంటే అసమర్థుడైన ప్రధానిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తన పదవికి వీడ్కోలు పలికేముందు ఆయన జాతికి సందేశం ఇవ్వడానికి టీవీలో కనిపించారు. చివరికి చివరి సందేశం కూడా సరిగా ఇవ్వడం రాని ప్రధానమంతి మన్మోహన్ సింగ్ ఎదురుగా కాగితం పెట్టుకుని చదువుతున్న రోబోలా కనిపించారే తప్ప ఆయన మాట్లాడిన మాటల్లో, ముఖంలో జీవం లేదు. పదవిలో వున్నంతకాలం బొమ్మలా కనిపించడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. ఇప్పుడు తన చివరి సందేశంలో కూడా అదే వరస. ఇంత నీరసమైన ప్రధానమంత్రిగా నిలిచారు కాబట్టే బీజేపీకి, ఎన్టీయేకి దేశ ప్రజలు అంత భారీ మెజారిటీ ఇచ్చి సాగనంపారు. ప్రధానిగా తన చివరి సందేశంలో ఆయన చెప్పిన మాటలు వింటే బాగా కామెడీగా అనిపించడం ఖాయం. ఈ పదేళ్ళలో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు తీసుకుపోయిందట. అందుకని ఆయన చాలా గర్వంగా ఫీలవుతున్నారట. ఈ మాటలు చెప్పడానికి మన్మోహన్ కొద్దిగా కూడా సిగ్గుపడకపోవడం బాధాకరం. ఒకవేళ ఆయన సిగ్గుపడినా, ఏ భావమూ పలకని ఆయన ముఖంలో ఆ సిగ్గు కనిపించలేదు.