ఓట్ల కౌంటింగ్: సీమాంధ్ర, తెలంగాణలో తాజా బలాబలాలు

  సీమాంధ్రలోని 195 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి 36 స్థానాలు గెలుచుకుంది. మరో 74 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. వైసీపీ 26 స్థానాల్లో గెలిచింది. మరో 34 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. బీజేపీ ఒక్క స్థానాన్ని గెలుచుకుని మరో రెండు స్థానాల్లో లీడింగ్‌లో వుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. అలాగే సీమాంధ్రలోని 25 పార్లమెంట్ సీట్లలో తెలుగుదేశం ఒక స్థానాన్ని గెలుచుకుంది. 14 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. వైసీపీ రెండు స్థానాల్లో గెలిచి 5 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. బీజేపీ మూడు స్థానాల్లో లీడింగ్‌లో వుంది.

గీతారెడ్డి గెలుపు..మెదక్ లో విజయశాంతి ఓటమి

      మెదక్ జిల్లాలో పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు, తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కన్న నాయకురాళ్ళు గీతారెడ్డి, విజయశాంతి. వీరిలో గీతారెడ్డి ఓటమి వరకు వెళ్ళి తప్పించుకుని, గెలిచారు. విజయశాంతి మాత్రం మొదటి నుంచీ వెనుకగులోనే వుండి చివరికి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన రాములమ్మకు భారీ షాక్ తగిలింది. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ పార్టీకి జంప్ అయిన విజయశాంతి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. జహీరాబాద్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జె.గీతారెడ్డి ఓటమిని తృటిలో తప్పించున్నారు.

హిందూపురంలో బాలకృష్ణ ఘన విజయం

      సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి, వైకాపాకి చెందిన నవీన్ నిశ్చల్ మీద 15 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొదటి నుంచి లీడింగ్‌లో వున్న నందమూరి బాలక‌ృష్ణ మధ్యలో కొన్నిసార్లు వైకాపా అభ్యర్థి కంటే వెనుకబడ్డారు. బాలక‌ృష్ణ లీడింగ్‌లో వున్నప్పుడు ఉత్సాహంతో ఉరకలు వేసిన ఆయన అభిమానులు బాలకృష్ణ వెనుకబడినప్పుడు మాత్రం నిరాశపడ్డారు. చివరిలో బాలకృష్ణతో గెలుపు దోబూచులాడింది. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగింది. చివరికి బాలకృష్ణ విజయం సాధించారు. 15 వేల ఓట్ల ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. గతంలో ఎన్టీఆర్ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ విజయం సులువుగా వుంటుందని అందరూ భావించారు. అయితే ఇక్కడ విజయం సాధించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.

సీమాంధ్ర విజయంతో టీడీపీలో ఆనందోత్సాహాలు

      సీమాంధ్రలో ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్రలో 109 స్థానాల ఆధిక్యతని సాధించడంతోపాటు పార్లమెంట్ సీట్లలో బీజేపీ, టీడీపీ కూటమి 18 ఎంపీ స్థానాలలో ఆధిక్యను ప్రదర్శిస్తూ వుండటం పట్ల తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం స్థాపించే మెజారిటీ రాదని ముందుగానే తెలిసినప్పటికీ, తెలంగాణలో కూడా గౌరవప్రదమైన అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే దిశగా తెలుగుదేశం పయనిస్తూ వుండటం కూడా తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. అటు సీమాంధ్రలో విజయం సాధించడంతోపాటు ఇటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే అవకాశాలు వుండటంతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

బీజేపీ విజయం సూపర్: రాజ్‌నాథ్ సింగ్

      దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తూ వుండటం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీకి, విజయాలు సాధిస్తున్న బీజేపీ అభ్యర్థులకు, బీజేపీ పార్టీ శ్రేణులకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ విజయం మీద రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ ట్విట్టర్‌లో ‘సూపర్’ అని ట్విట్ పోస్ట్ చేశారు. నరేంద్రమోడీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ విషయాన్ని కూడా ట్విట్టర్‌లో ప్రస్తావిస్తూ ‘‘నరేంద్రమోడీకి అభినందనలు. బీజేపీ అద్భుత ప్రతిభ చూపించింది’’ అని కామెంట్ పోస్ట్ చేశారు.

4లక్షల ఓట్లతో వడోదరలో మోడీ విజయం

      బిజెపి నాయకుడు నరేంద్ర మోదీ వడోదరలో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీ పై ఆయనకు 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి 326 స్థానాల్లో దూసుకుపోతుంది. సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించింది. ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో శుక్రవారం ఉదయం పదిన్నరకే ప్రకటించింది.ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ప్రధాన అభ్యర్థిగా పేర్కొన్న యువనేత రాహుల్ గాంధి సైతం ఒక దశలో వెనుకపడి మళ్లీ కాస్త పుంజుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన మహామహులు ఎందరో ఓడిపోతున్నారు. స్పీకర్ మీరా కుమార్, కమల్ నాథ్, కపిల్ సిబాల్, సుశీల్ కుమార్ షిండే వంటివారంతా ఓటమి అంచుల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఉద్దండులు అందరూ ముందంజలో ఉన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీఆర్ఎస్

  తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధించే దిశగా దూసుకు వెళ్తోంది. టీఆర్ఎస్‌కి 60 శాసనసభ స్థానాలు దాటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితాలను చూస్తే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన టీఆర్ఎస్‌కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణ ఇచ్చేదీ కాంగ్రెసే, తెచ్చేదీ కాంగ్రెసే అన్న కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ఇచ్చింది. అయితే ఇప్పుడు చివరికి తెలంగాణలో చచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అయింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పొందే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదాని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా వీచిన నరేంద్ర మోడీ హవా..

  మోడీ మంత్రం ఫలించింది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడిచింది. పదేళ్ళుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ పార్టీ పీడ వదిలింది. దేశంలో ఎక్కడ చూసినా వినిపించిన మోడీ మంత్రం ఫలించింది. బీజేపీ అధికారంలోకి రావడానికి భారతీయ ఓటర్లు రాజమార్గం వేశారు. ఇక దేశం గడచిన దశాబ్దపు పీడకలను మరచిపోవచ్చన్న అభిప్రాయంలో దేశ ప్రజలు వున్నారు. కాంగ్రెస్ పార్టీ కారు చీకట్లలో మగ్గిపోతున్న భారతీయ ప్రజలకు ఆశాకిరణంలా కనిపించిన మోడీకే పట్టం కట్టారు. దేశంలో కాంగ్రెస్ కుటుంబ పాలనను కట్టిపెట్టారు. నెల రోజులకు పైగా దేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారంటూ పెరిగిన ఉత్కంఠకు భారతీయుడు తన ఓటుతో తెర వేశాడు. భారతీయ జనతాపార్టీకి ఘన విజయాన్ని అందించాడు. ఉత్తర భారతదేశం, ఈశాన్యం, దక్షిణం, పశ్చిమం.. ఎక్కడ చూసినా బీజేపీ, ఎన్టీయే అనుకూల ఫలితాలు వచ్చాయి. నియంతలా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం, పరాభవం ఎదుర్కుంది. ఇప్పుడు దేశ ప్రజలు నరేంద్ర మోడీ వైపు నమ్మకంతో చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కుంటుపడిన భారతదేశ అభివృద్ధిని ప్రగతి పథంలో శరంవేగంగా పయనించేలా చేస్తారని ఆశిస్తున్నారు.

తెలంగాణలో ముందంజలో వున్న అభ్యర్ధులు

      సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణా లో టీఅర్ఎస్ అభ్యర్ధులు ముందంజలో కొనసాగుతున్నారు.   తెలంగాణా లో ఆధిక్యంలో వున్న అభ్యర్దులు:  * మెదక్ పార్లమెంట్‌లో కేసీఆర్ ముందంజ * జగిత్యాలలో కాంగ్రెస్ ముందంజ * ఘోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజ * కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం. * గద్వాల్‌లో డీకే అరుణ ఆధిక్యం. * నిజామాబాద్ లోక్‌సభలో కవిత ఆధిక్యం. * అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 452 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. * వేములవాడ చొప్పదండి స్థానాల్లో టీడీపీ ఆధిక్యం * మల్కాజ్‌గిరి లోక్‌సభకు టీఆర్ఎస్ ఆధిక్యం. * ఆలేరు, కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం * వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం ఆధిక్యం.

ఓట్ల లెక్కింపు: వెనుకబడిన ప్రముఖులు

    రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలలో మాజీ మంత్రులు అంతా వెనకబడిపోతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, డీకీ అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రఘువీరారెడ్డి తదితరులు వెనుకంజలో ఉన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, సంగారెడ్డిలో మాజీ విప్ జగ్గారెడ్డి, బాల్కొండలో అనిల్ తదితరులు వెనకబడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 53 స్థానాలలో ..కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో,టీడీనీ 15, బీజేపీ 8, ఎంఐఎం 1, బీస్పీ ఒకస్థానంలో, సీమాంధ్రలో టీడీపీ 80, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 66, బీజేపీ 3, జై సమైక్యాంధ్ర పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.

సార్వత్రిక ఎన్నికలు: ఉత్తర్ ప్రదేశ్, కర్నాటకలో బీజేపీ దూకుడు

      ఢిల్లీ పీఠంలో అధికారంలోకి రావాలంటే ఉత్తర ప్రదేశ్‌లో మెజారిటీ సాధించడం చాలా ముఖ్యం ఇప్పుడు బీజేపీ ఆ బాటలో ముందుకు దూసుకుపోతోంది. ఉత్తర ప్రదేశ్‌తోపాటు బీజేపీకి కంచుకోట లాంటి కర్నాటకలో కూడా ముందడుగులో వుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యంలో ఉంది. లక్నో సహా పలు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, సమాజ్వాది పార్టీ 3, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.కర్ణాటకలోనూ బీజేపీ ముందంజలో ఉంది. అధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నందన్ నిలేకనిపై బీజేపీ అభ్యర్థి అనంతకుమార్ ఆధిక్యంలో ఉన్నారు.