తెలుగువారికి మరో షాక్.. పనామా జాబితాలో వివేక్, జగన్ స్నేహితుడు
posted on May 12, 2016 @ 10:20AM
దేశానికి వేలకోట్లు పన్ను ఎగవేసిన వాటిని విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు ప్రముఖుల బాగోతాన్ని బయటపెట్టిన పనామా పేపర్స్ తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు తెలుగువారు ఉండటంతో..ఉభయ రాష్ట్రాల్లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
నిన్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ ప్రసాద్ పేరును బయటపెట్టింది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వియ్యంకుడు, అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి, తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడు దివంగత వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ పేర్లు బయటకు వచ్చాయి.
వివేక్ తన భార్య సరోజతో కలిసి "బెల్‌రోజ్ యూనివర్శల్ లిమిటెడ్" పేరిట కంపెనీని ఏర్పాటు చేయగా, రామ్ ప్రసాద్ రెడ్డి "ఆరెంజ్ గ్లో లిమిటెడ్" పేరిట వర్జిన్ ఐల్యాండ్స్‌లో కంపెనీని ఏర్పాటు చేసినట్టు పనామా పేపర్స్ బయటపెట్టింది. అయితే ఇంతవరకు వీరిద్దరూ ఈ వార్తలు ఖండించలేదు.