పోలవరాన్ని కూడా వదిలించుకోబోతున్నారా..జవదేకర్ వ్యాఖ్యలు నిజమేనా?
posted on May 11, 2016 @ 4:08PM
ఇప్పటికే ప్రత్యేకహోదా విషయాన్ని పక్కకు నెట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరోక షాకిచ్చింది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్ట్‌కు నీలి నీడలు పట్టించేందుకు బీజేపీ రెడీ అయ్యింది. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. పోలవరాన్ని నీటితో నింపేందుకు కేంద్రం సమ్మతించలేదని తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లతో తలెత్తిన వివాదాలు ముగిసేవరకు పోలవరం జలశయానని నింపొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించామని కేంద్రమంత్రి సెలవిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లు తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అక్కడ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు బంద్‌లు, రాస్తారోకోలు చేశాయి. అవి ఎట్టిపరిస్థితుల్లోనే పోలవరం నిర్మాణాన్ని ఒప్పుకోవు. దీనిని బట్టి పోలవరం ప్రాజెక్ట్‌పై నీలి మేఘాలు కమ్ముకున్నట్టే.