కేంద్రమంత్రులకు మోడీ సలహా.. లక్ష మంది ఫాలోయర్లు ఉండాలి

  ప్రధాని మోడీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయనకి ఉన్న ఫాలోవర్లు సెలబ్రిటీలకు కూడా లేరు అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు వారి మంత్రులకు కూడా మోడీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారట. అంతేకాదు ప్రతి కేంద్రమంత్రి కనీసం లక్ష మంది ఫాలోయర్లను కలిగి ఉండాలని.. ఎక్కువ పోస్టులు పెట్టాలని.. ఆ పోస్టులు కూడా చదివేవారికి అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఉండాలని సూచించారట. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి.. చేపట్టనున్న పనుల గురించి ఎప్పటికప్పుడు పోస్టులు ఉండాలని చెప్పారంట. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కేంద్రమంత్రులను అభినందించగా.. లేని వారిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ట్రంప్ ని కూడా వదలని వర్మ.. చరిత్రలో నిలిచిపోతాడు

  ఇప్పటి వరకూ మన తెలుగు వాళ్లపైనే కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ట్రంప్ పై తన ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పటికే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం అమెరికా అంధకారంలో పడుతుందని.. అందరూ భయపడుతుంటే.. వర్మ అందుకు విరుద్దంగా ట్రంప్ ని కొనియాడాడు. ఎందుకో, ట్రంప్ అమెరికా అధ్యక్షుల్లో గొప్ప అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతారనిపిస్తోందని ట్వీట్ చేశాడు. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన జాన్ ఎఫ్ కెన్నెడీ, అబ్రహాం లింకన్ ల సరసన చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోతాడనిపిస్తోందని రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు. మొత్తానికి వర్మ ఎడ్డం అంటే తెడ్డెం అనే రకం అని మరోసారి నిరూపించాడు.

అగస్టా స్కాంలో కొత్త ట్విస్ట్.. ఎరగా అందమైన అమ్మాయి

  అగస్టా స్కాంలో రోజుకో ఆసక్తికర విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఈ స్కాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలతో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగి ఇప్పటికే ఈడీ విచారణలో ఉన్నారు. అయితే గతంలో ఈ కేసులో మధ్యవర్తిగా ఉన్నవారు త్యాగిని అపురూప లావణ్యవతి అనే కోడ్ నేమ్ తో పిలిచుకునేవారు అన్న విషయం బయటకు రాగా ఇప్పుడు.. మరో అందమైన అమ్మాయిని కూడా వాడుకున్నట్టు తెలుస్తోంది. రూ.3,200 కోట్ల విలువ కలిగిన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు గాను ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ ల్యాండ్ అనే కంపెనీ డబ్బుతో పాటు అందాల భామను కూడా ఎరగా వేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.     ఈస్కాంలో మద్యవర్తగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ క్రిస్టిన్ బ్రెడో స్ల్పిడ్‌ అనే లండన్ యువతిని పావుగా వాడుకున్నట్టు తెలుస్తోంది. మొదట తన కంపెనీలో ఆమెకు డైరెక్టర్ పదవిని ఇచ్చిన మైఖేల్ ఆ తర్వాత అగస్టా కుంభకోణంలో ఆమెను ఎరగా వేశాడు. డబ్బులో పాటు ఎంతో సౌందర్యవతి, అందగత్తె క్రిస్టిన్ బ్రెడో స్ల్పిడ్‌‌ను ఎరగా వేయడంతో భారత్‌కు చెందిన అధికారులతో పాటు రాజకీయ నేతలు డబ్బుతో పాటు ఆమె అందానికి దాసోహమైపోయి కాంట్రాక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

పోలీసుల అదుపులో సోనియా, రాహుల్... ఇది ప్రజాస్వామ్యమా?

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ‘సేవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. అయితే ఈ జంతర్ మంతర్ వద్ద నుండి ప్రారంభించి.. పార్లమెంట్ కి చేరుకోగానే పోలీసులు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ గేట్లు, కాంపౌండ్ వాల్ ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేసిన వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని వారు ప్రశ్నించారు.

ఉత్తరాఖండ్‌ బలపరీక్షకు సుప్రీం ఓకే.. 9 మంది ఎమ్మెల్యేలు నో ఛాన్స్

  ఉత్తరాఖండ్‌ శాసనసభలో హరీష్‌ రావత్‌ తన బలాన్ని నిరూపించుకునే అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశిస్తూ నేటి వరకూ గడువు ఇచ్చిన విషయం విదితమే. అయితే దీనిపై సుప్రీంకోర్టు నేడు నిర్ణయం తీసుకుంది. మే 10వ తేదీన శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు అంగీకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఆరోజు ఉదయం 11 గంటలనుంచి 1 గంట వరకూ రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్‌ మాట్లాడుతూ..  శాసనసభలో జరిగే బలపరీక్షను పరిశీలించడానికి పరిశీలకుడిని నియమించాల్సిందిగా కోరారు. అంతేకాదు పదవీ విరమణ చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పరిశీలను నియమించాలని ఎజి కోరారు.   కాగా అనర్హత వేటు పడిన 9 మంది ఎమ్మెల్యేలు ఈ బలపరీక్షలో పాల్గొనడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో అధికార పార్టీనుంచి వైదొలగి, ప్రతిపక్ష బిజెపిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ సహా 9మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు కోల్పోయినట్లయింది.

మరో వివాదంలో సాక్షి మహరాజ్.. బాలికపై అనుచిత ప్రవర్తన

  బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వివాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అని అందరికి తెలిసిందే. అయితే ఈసారి ఆయనే వివాదంలో ఇరుక్కున్నారు. ఉత్తర ప్రదేశ్లో ఒక బాలికపై అతను ప్రవర్తించిన తీరు గురించి వీడియో ఒకటి హల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కొంతమంది మహిళలతో మాట్లాడుతున్న ఆయన.. ఓ బాలికను ప్యాంట్ తొలగించి గాయాల గుర్తులు చూపించమని అడిగినట్టు ఆవీడియోలో ఉంది. దీంతో ఆయన ప్రవర్తనపై మండిపడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఎంపీ గారు ప్రవర్తించారు పలువురు విమర్శిస్తున్నారు.

ఉజ్జయిని కుంభమేళాలో విషాదం.. తొక్కిసలాటలో 5గురు మృతి

  ఉజ్జయిని కుంభమేళాలో పెను విషాదం చోటు చేసుకుంది. గతరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందగా 30 మంది వరకు గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే స్పందించారు. ఉజ్జయిని అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.   కాగా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా ఏప్రిల్ 22న ప్రారంభమైన నేపథ్యంలో.. ఈ కుంభమేళాకు లక్షల మంది భక్తులు వచ్చారు. నెల రోజులు పాటు జరిగే ఈ కుంభమేళాకు రోజుకూ 3 నుంచి 7 లక్షల వరకు భక్తులు హాజరవుతున్నారు.

ఎంపీలపై గజపతిరాజు కామెంట్స్.. వారేమి సూపర్ సిటిజన్స్ కాదు

  టీడీపీ సీనియర్ నేత, కేంద్రం పౌరయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో విమానాశ్రయాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన గజపతిరాజు.. విమానాశ్రయాల్లో ప్రత్యేక సదుపాయాలు పొందడానికి పార్లమెంటు సభ్యులు సూపర్ సిటిజన్స్ కాదని అన్నారు. అంతేకాదు వారికి సాధారణ పౌరులకు మించి సౌకర్యాలు కల్పించడం కుదరదు. సీట్ల అందుబాటు, ప్రాధాన్యాన్ని బట్టి వాటి కేటాయింపులు ఉంటాయి. అంతేగాని ఎంపీలైనంత మాత్రాన ప్రత్యేకంగా పరిగణించే అవకాశం లేదు. రోగులు, వృద్ధుల విషయంలో మానవత్వంతోనే వ్యవహరిస్తాం. సీట్ల కేటాయింపులో వాణిజ్య కోణమే ఎక్కువగా ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

మనం రక్తాన్ని చిందించాం.. భయపడేది లేదు.. సోనియా

  ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నుండి పార్లమెంట్ వరకూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘సేవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. మానవతా విలువల పరిరక్షణ కోసం మనం రక్తాన్ని చిందించామని.. అటువంటి మనల్ని భయపెట్టడానికీ, అప్రదిష్టపాలు చేయడానికి ఈ రోజు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సోనియా విమర్శించారు. ఎవరెంత ప్రయత్నించినా భయపడేది లేదని స్పష్టం చేశారు.     మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిర పరచడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విమర్శించారు. ప్రజాస్వమ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడం ద్వారా మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు.

అఖిలేష్ యాదవ్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు.

  మహారాష్ట్రలోని లాతూర్ కి  నీటి రైలును పంపించినట్టే.. యూపీలోని బుందేల్ ఖండ్ కు కూడా కేంద్రం నీటి రైలును పంపించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం మాత్రం నీటి రైలును అడ్డుకొని.. తమకు నీటి రైలు ఏం అవసరం లేదని.. దీనిపై ప్రధాని మోడీతో మాట్లాడతామని చెప్పిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పందించి ఈ రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తే చేశారు. అఖిలేష్ యాదవ్ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని.. యూపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని.. ప్రజలు నీళ్లు లేక అల్లల్లాడిపోతుంటే.. నీళ్లు, ఆహారం విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.

మరోసారి ముస్లింలపై విరుచుకుపడ్డ ట్రంప్..

  గతంలో ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి ముస్లింలపై విరుచుకుపడ్డాడు. ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించాలని, అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలని అన్నారు. అయితే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముస్లిం దేశాలతో కలసి కృషి చేస్తానని అన్నారు. కాగా, అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ట్రంప్ ప్రధాన ప్రత్యర్థి టెడ్ క్రుజ్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకోగా.. తాజాగా మరో ప్రత్యర్థి అయిన ఒహియో గవర్నర్ కాసిచ్ కూడా రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

సునందా పుష్కర్ మృతి కేసు.. కొత్త డాక్టర్ల బృందం

  మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంధ పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మృతిపై శశిథరూర్ మీద కూడ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే ఈమె విషంతో చనిపోయింది అని ఎయిమ్స్  వైద్యులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఫొరెన్సిక్ సాక్ష్యాన్ని విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు డాక్టర్లు ఉన్న ఈ బృందంలో ఇద్దరు ఛండీగఢ్, పుదుచ్చేరి, ఢిల్లీల నుంచి ఒక్కో డాక్టర్ ఉన్నారు. సునందా పుష్కరం మరణం వెనుక మిస్టరీని ఛేదించడంలో దర్యాప్తు అధికారులు విఫలమవ్వడంతో కేంద్రం ఈ డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది.

సోనియా, రాహుల్ నేతృత్వంలో ర్యాలీ..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ‘సేవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుండి.. పార్లమెంట్ వరకూ ఈ ర్యాలీ సాగుతుంది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే యత్నాలకు నిరసనగా కాంగ్రెస్ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది. అలాగే అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంగా మోడీ సర్కార్ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని ఇరికించే కుట్ర పన్నుతున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు.

క్షీణించిన కన్నయ్య కుమార్ ఆరోగ్యం..

  ఢిల్లీ జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ తమపై విధించిన జరిమానాను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కన్నయ్య కుమార్ ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న కన్నయ్యకు నిన్న ఉన్నట్టుండి వాంతులు అవడంతో అతనిని జేఎన్యూలోని మెడికల్ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ అతనిని పరీక్షించిన వైద్యులు కన్నయ్య ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని.. అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. కాగా కన్నయ్య ఏప్రిల్‌ 28న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అతనితో పాటు మరో 25 మంది విద్యార్దులు కూడా అతనితో పాటు దీక్షలో పాల్గొన్నారు.

మైనర్ బాలికపై గోవా లామేకర్ అత్యాచారం.. నా ఒళ్లంతా రక్తం, నగ్నంగా అతడు

  గోవా మాజీ విద్యాశాఖ మంత్రి బహిష్కృత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాబుష్ మోన్సరేట్‌ నేపాలికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనపై మాట్లాడిన బాధిత మైనర్ బాలిక.. అతను తనను ఓ బంగ్లాకు తీసుకెళ్లాడని.. అక్కడ తనకు మద్యం తాగించి అత్యాచారం జరిపాడని.. ఉదయం లేచి చూసేసరికి నేను నగ్నంగా ఉన్నాను.. రక్తంతో నేను తడిసిపోయి ఉన్నాను.. నా పక్కన ఆయన కూడా బట్టలు లేకుండా నగ్నంగా కూర్చోని ఉన్నాడని పోలీసులకు చెప్పింది. ఇంకా చెబుతూ.. తన సవతి తల్లే తనను అమ్మేసిందని తెలిపింది.   మరోవైపు ప్రస్తుతం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనపై మానవ అక్రమ రవాణా, రేప్ అభియోగాలను మోపినట్టు పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. నమోదైన అత్యాచారం కేసును క్రైం బ్రాంచికి తరలిస్తున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు.

"ఛత్రపతి"నే టచ్ చేసింది...!

  మరాఠాలు దైవంగా కొలిచే మహాయోధుడు ఛత్రపతి శివాజీ అంటే మహారాష్ట్రులకు ఎంత గౌరవం, భక్తి ఉందో దేశమంతా తెలుసు . అలాంటి ఛత్రపతి శివాజీని అగౌరవపరిచింది ఒక బీజేపీ మహిళా కార్పోరేటర్. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ కార్పోరేటర్ రాజశ్రీ శిర్వాద్కర్ కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహంపై చేయి వేసి స్టైలుగా ఫోటోకి పోజిచ్చారు. ఇక్కడితో బాగానే ఉంది. కాని ఆమె ఫోటోని ఎవరో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ధీరత్వానికి ప్రతీకగా కొలిచే శివాజీపై చేయివేస్తావా..? అంటూ ఆ పోస్ట్‌పైనా, కార్పోరేటర్‌పైనా నెటిజన్లు ఫైరయ్యారు. ఈ ఫోటో అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ నేతల కంట పడింది. ఇంకేముంది దీనికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో రాజశ్రీపై చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీ కూడా నిర్వహించారు. కళ్లు తెరచిన కార్పోరేటర్‌గారు తాను పొరపాటు చేశానని, శివాజీపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.