ప్రత్యేక హోదాపై సీఎం రమేష్ డిమాండ్.. శభాష్ రమేష్ అన్న కురియన్
posted on May 11, 2016 @ 5:27PM
రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. రెవెన్యూ లోటులో ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ కు ఎలగైతే ప్రత్యేక హోదా ఇచ్చారో అలాగే ఏపీకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావలసిన నిధులను కేంద్రం ఇంకా విడుదల చేయలేదని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోకపోతే మరింత నష్టపోతామని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోడా టీడీపీతోనే సాధ్యమవుతుందని.. కాంగ్రెస్ ను నమ్ముకోలేమని.. చంద్రబాబు నాయకత్వంలో హోదా సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
అయితే సీఎం రమేష్ ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుండగా డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కల్పించుకొని.. రమేష్.. రమేష్ అని పిలుస్తూ ఒక్కమాట విను అని అడిగారు. అయితే రమేష్ మాత్రం వినిపించుకోకుండా కంటిన్యూ చేస్తుండగా.. అబ్బా! విను రమేష్ అని ఆపి.. 'మీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందా?' అని అడిగారు. 'అవును సర్' అని ఆయన సమాధానమివ్వడంతో 'ఏ ఇబ్బందుల్లో ఉంది?' అని మళ్లీ ప్రశ్నించారు. దీనికి సీఎం రమేష్ చేతిలో ఉన్న పేపర్లను చదివే ప్రయత్నం చేయడంతో 'నీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు నీకు తెలియక పేపర్ పై ఉన్న సమాచారం చదువుతున్నావా?' అని అన్నారు. దీంతో సీఎం రమేష్ కొన్ని లెక్కలు చెబుతూ, రెవెన్యూలోటు పూడ్చాలని కోరారు. దీంతో కురియన్ 'శభాష్ రమేష్... ఇది కావాలి...నీ ప్రాంతం గురించి ఏదో రాసుకొచ్చి చదవితే ఎలా?' అని అడిగారు.