మధ్యలో నలిగిపోతున్న చంద్రబాబు..
posted on Jun 21, 2016 @ 3:24PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అభివృద్ధికి పడుతున్న పాట్లు చూస్తుంటే ఒక్క ముక్కలో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్ధిక లోటుతో ఉన్న ఏపీని వృద్ది చేయడానికి ఆయన బాగానే కష్టపడుతున్నారు. ఒక పక్క కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీలు లాంటివి ఇవ్వడం లేదు.. మరోవైపు ప్రతిపక్షాల గోల. ఇక ప్రతిపక్ష నేత జగన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. చంద్రబాబును ఏ పాయింట్ మీద విమర్శించాలా.. ఏ రచ్చ చేయాలా అని చూస్తుంటారు. చంద్రబాబు అంత రాజకీయానుభవం లేకపోయినప్పటికీ..యువనేత చేసే పనులు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగానే తయారయ్యాయి. ఇప్పుడు ముద్రగడ రూపంలో మరో తలనొప్పి.
ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో మరో పరిస్థితి. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కాని తెలంగాణలో పరిస్థితి వేరు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీదే ప్రస్తుతం హవా అక్కడ. ఏపీలోనే ఆయన ఎక్కువ గడుపుతుండటంతో.. తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో నేతల్లో అసంతృప్తి నెలకొనడం.. పార్టీ మారడం. ఇప్పటికే దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ నుండి ఇద్దరో ముగ్గురో ఎమ్మెల్యేలకు చేరిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మరో నేత కూడా పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ నేత ఎవరో కాదు.. నల్గొండ జిల్లా దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. దీంతో చంద్రబాబు మోత్కుపల్లి కూడా వెళ్లిపోతారేమో అని టెన్షన్ పడుతున్నారంట.
గత కొంత కాలంగా చంద్రబాబు మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తాననే చెబుతున్నారు. కానీ అది ఇంతవరకూ జరగలేదు. పోనీ.. అదికాకపోయినా రాజ్యసభ స్థానాల్లో ఒక సీటు కేటాయించాలని కోరారట.. కానీ అదీ జరగలేదు. వచ్చిన మూడు సీట్లలో ఒకటి మిత్రపక్షమైన బీజేపీకి ఇవ్వగా.. ఏపీలో ఉన్న రాజకీయాల దృష్యా రెండు సీట్లు అక్కడివారికే కేటాయించారు. అయితే ఇకపై కేంద్రనుండి ఏ సీటు వచ్చినా అది తెలంగాణ టీడీపీకే ఇస్తానని చెప్పారంట. అనుకున్నట్టే టీడీపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చింది. అయితే ఈసారి కూడా బాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. కేంద్రం మంత్రి పదవి ఇస్తే కేంద్రం నిధుల విషయంలో మొండి చేయి చూపుతుందని.. మంత్రి పదవి తీసుకోకుండా ఉంటే నిధుల కోసం గట్టిగా డిమాండ్ చేయవచ్చని అనుకుంటున్నారు.. మరోపక్క టీ టీడీపీకి పదవి ఇస్తామని హామి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటారో. అంతేకాదు మంత్రి పదవి వద్దని ఆయన గవర్నర్ పదవి అడగాలని.. పోస్ట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారంట. ఈ పదవి కునుక దక్కి తెలంగాణ నేతలకు ఇస్తే చంద్రబాబును వారి నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు మోత్కుపల్లిని సంతోపెట్టగలరా..? లేదా..? అన్నది చూడాలి.