ముద్రగడ దీక్ష ఈ మాత్రం దానికేనా..?
posted on Jun 21, 2016 @ 12:19PM
ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టి రోజులకు రోజులు గడుస్తున్నా ఫలితం మాత్రం ఎంటో ఎవ్వరికీ అర్ధంకావడంలేదు. గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. అయితే అప్పుడు ప్రభుత్వం కూడా దిగివచ్చి.. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. వారికోసం ఓ కమిటీ కూడా వేస్తాం అని సర్దిచెప్పడంతో అప్పుడు దీక్ష విరమించారు. అయితే ఇప్పుడు ముద్రగడ దీక్ష చేపట్టి పది రోజుల పైన అవుతున్నా ప్రభుత్వం కూడా అడుగు ముందుకేయడం లేదు. ఏదో రెండు రోజులు హడావుడి చేసినా.. ఆతరువాత చేసుకుంటే చేసుకోండి అన్నట్టు వదిలేసింది. ఇక ముద్రగడ కూడా తాను మాత్రం దీక్ష విరమించేది లేదని చెబుతూ.. ఒకపక్క వైద్య పరీక్షలకు సహకరిస్తూ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు.
అయితే ఇంతా చేసి.. దీక్షా చేస్తున్న.. కొంతమంది మాత్రం ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారో క్లారిటీ ఉందా..?లేదా..? అని అనుకుంటున్నారా. ఎందుకంటే. తుని కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలంటూ ముద్రగడ దీక్ష చేపట్టారు. అయితే దీనిపై ముగ్గురికి బెయిల్ దొరికింది. ఇక మిగిలివారికి కూడా దొరకడం పెద్ద కష్టమేమి కాదు. నేపథ్యంలో ఇక ముద్రగడ దీక్ష విరమింపజేయవచ్చని కాపు సంఘాల నేతలే అన్నారు. దీనికి ముద్రగడ బెయిల్ దొరికిన ముగ్గురు బయటకు వచ్చాకే విరమించేది లేదు అన్నట్టు సమాచారం. అంటే దీన్నిబట్టి చూస్తే.. ముద్రగడ ఎంతో కష్టపడి ఇన్నిరోజులు దీక్ష చేసింది నిందితులు బెయిల్ మీద బయటకు రావడం కోసమా..? కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. విచారణలు విన్న తరువాత వారికి బెయిల్ ఇవ్వడం అయిపోతుంది.. దానికి ఓ రెండు రోజుల టైం పడుతుంది.. ఆ మాత్రం దానికి దీక్ష చేయడం అవసరమా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక్కడ ఇంకా సిల్లీ విషయం ఏంటంటే.. ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటూ దీక్ష చేస్తున్న ముద్రగడకు అప్పుడప్పుడూ.. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూనే ఉన్నారు. మరి ఆ మాత్రం ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ ఎన్నిరోజులైనా దీక్ష చేసేయోచ్చు. అందుకే ప్రభుత్వం కూడా చేసుకుంటే చేసుకోండిలే అని నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు. మొత్తానికి ముద్రగడ చేస్తున్న దీక్షపై ప్రజలకు ఎలాగూ ఓ క్లారిటీ లేదు.. మరి ఆయనకన్నా ఓ క్లారిటీ ఉందో లేదో.. అసలు ఈ దీక్ష వల్ల ఆయన సాధించిందేంటో ఆయనకే తెలియాలి.