హైదరాబాద్‌లో చిన్నారుల మధ్య ఫైట్..ఒకరి మృతి
posted on Jul 17, 2016 @ 1:03PM
చిన్నారులు సరదాగా చేసుకున్న హేళన ఒక చిన్నారి మరణానికి కారణమైంది. హైదరాబాద్ టోలిచౌకిలోని ఐఏఎస్ కాలనీలో ప్రామిసింగ్ స్కాలర్స్ హైస్కూలులో ఒకటో తరగతి చదువుతున్న మహ్మద్ ఇబ్రహీం అనే ఆరేళ్ల చిన్నారి..మూడో తరగతి విద్యార్థిని చీమిడి ముక్కోడా అంటూ గేలి చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ విద్యార్ధి నన్నే టీజింగ్ చేస్తావా అంటూ తరగతి గదిలోనే ఇబ్రహీం మర్మాంగాలపై తన్నాడు. అక్కడే కుప్పకూలిన ఇబ్రహీం..కాసేపటి తరువాత లేచి ఇంటికి వెళ్లిపోయాడు.
అయితే తనకు మర్మాంగాల వద్ద నొప్పిగా ఉందని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. మొదట పట్టించుకోని తల్లిదండ్రులు ఉదయం మరోసారి చూడగా దెబ్బతగిలిన చోట బాగా వాపు వచ్చింది. వెంటనే ఇబ్రహీంను నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పురుషాంగం, కడుపు ప్రాంతాల్లో చికిత్స చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఇబ్రహీం మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.