కేంద్రానికి 2 కోట్లు బకాయిపడ్డ భారత తొలి మహిళా స్పీకర్
posted on Jul 17, 2016 @ 12:30PM
భారతదేశ తొలి మహిళా లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన మీరాకుమార్ దాదాపు రూ.2 కోట్ల వరకూ కేంద్రానికి బకాయిపడ్డారు. మీరా తండ్రి దివంగత బాబూ జగ్జీవన్‌రామ్ భారత ఉపప్రధానిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్‌లో ఆయనకు ఓ బంగళాను కేటాయించారు. ఆయన మరణం తర్వాత జగ్జీవన్ రామ్ సతీమణి ఇంద్రాణి అక్కడ ఉన్నారు. ఆమె మరణానంతరం వీరి కుమార్తె మీరా కుమార్ అదే బంగళాను వాడుతున్నారు. దీని జోలికి ప్రభుత్వం రాకుండా ఉండేందుకు , జగ్జీవన్ రామ్ స్మారక భవనంగా మార్చారని, అందుకు ప్రభుత్వ అనుమతి ఏమిలేదని తెలుస్తోంది. సుభాగ్ చంద్ర అనే సామాజిక కార్యకర్త, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భవంతికి సంబంధించి రూ.1.98 కోట్ల అద్దెను మీరా కుమార్ బకాయి పడ్డట్టు రికార్డులు వెల్లడించాయి. అద్దెను రద్దు చేయాలని కూడా ఆమె ఎటువంటి దరఖాస్తులు చేయలేదని తెలుస్తోంది.