గోల్డ్‌బాబును అందుకే చంపారా..?
posted on Jul 17, 2016 @ 11:25AM
"పింప్రీ గోల్డ్‌మాన్"గా పేరు గాంచిన దత్తా ఫూగే గత గురువారం హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కొడుకు స్నేహితులే ఆయన్ను చంపినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఫూగే తన కొడుకు శుభం స్నేహితుల వద్ద లక్షన్నర రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. దాని విషయంలో వారికి ఫూగేకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనిలో భాగంగానే ప్రధాన నిందితుడు అతుల్ మోహిత్..శుభంకు ఫోన్ చేసి ఓ స్నేహితుడిని బర్త్‌డేకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. తండ్రిని కూడా వెంట తీసుకురమ్మన్నాడు. వచ్చేటపుడు బిర్యానీ తీసుకురమ్మన్నాడు.
ఈ విషయం తండ్రి ఫూగేకు చెప్పి శుభం మరో స్నేహితుడు రోహన్‌తో కలిసి ఆహారం తెచ్చేందుకు కారులో వెళ్లాడు. వారు పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చే సరికి మోహిత్, మరికొందరు ఆయుధాలతో ఫూగేపై దాడి చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిని ఫూగే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దుండగులు చీకట్లో పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు శుభం ఇచ్చిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లక్షన్నర రూపాయల బాకీ వసూలు కోసమే ఫూగేను హతమార్చినట్టు నిందితులు నేరాన్ని అంగీకరించారు. నాలుగేళ్ల కిందట దత్తాఫూగే 22 క్యారెట్ల బంగారంతో తయారు చేయించిన షర్ట్ ధరించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఆ షర్ట్ ఖరీదు కోటి రూపాయలు..బరువు మూడున్నర కేజీలు.