చంద్రబాబు రూట్ లోనే జగన్ కూడానా..!
posted on Jul 16, 2016 @ 2:46PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు హైదరాబాద్ కు స్వస్తి పలికేశారు. హైదరాబాద్ నుండి తన చిరునామాను మార్చాలని ఉండవల్లి పంచాయితీ అధికారులను చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే. ఇంకా తన ఓటరు కార్డుపై ఉన్న చిరునామాను కూడా మార్చమన్నారు. ఎప్పటినుండో ఆయన విజయవాడ నుండే పాలన చేస్తున్నా.. తన చిరునామాను కూడా మార్చుకోవడంతో ఇప్పుడు పూర్తిగా ఏపీకి చెందిన వ్యక్తిగా మారిపోయారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు రూట్ లోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కూడా తన మకాంను ఎత్తివేసి ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకన్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని ఎపి రాజధాని ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన అనుచరులు జగన్ కోసం అక్కడ ఓ ఇంటికోసం వెతుకుతున్నారంట. అంతేకాదు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మంగళగిరి సమీపంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇక త్వరలో జగన్ కూడా హైదరాబాద్ ను వీడి ఇక్కడే మకాం మార్చేలా ఉన్నారు.