పాత్రలు కడిగి.. చీపురుతో ఊడ్చిన కేజ్రీవాల్..
posted on Jul 18, 2016 @ 12:01PM
ఈమధ్య నేతలు చీపుర్లు పట్టి శుభ్రం చేయడం వంటి సామాజిక కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటున్నారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించాలనో.. లేక తమంతట తాము స్పూర్తి పొంది అలా చేస్తున్నారో తెలియదు మొత్తానికి పరిశుభ్రత కార్యక్రమంలో తాము కూడా ఒక చెయ్యి వేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చేరిపోయారు. ఈరోజు కేజ్రీవాల్ పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలోని వంట శాలలో వంట పాత్రలు కడిగి.. హాళ్ళు చీపురుతో ఊడ్చారు. యూత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తాము చేసిన తప్పిదానికి క్షమాపణ కోరుతూ ప్రాయశ్చిత్తంగా తామీ పని చేసినట్టు కేజ్రీవాల్ ఆ తరువాత తెలిపారు.
కాగా సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయ ఫోటోను, తమ పార్టీ గుర్తు అయిన చీపురు తో కలిపి ఈ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేజ్రీవాల్ తప్పు చేశారని, సిక్కులకు అపాలజీ చెప్పాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సోమవారం ఉదయమే కేజ్రీవాల్ స్వర్ణ దేవాలయానికి చేరుకొని సామాజిక సేవ చేశారు.