పబ్లిసిటీకి దూరంగా చంద్రబాబు...
posted on Jul 18, 2016 @ 12:31PM
త్వరలో కృష్ణపుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో ఏపీ ప్రభుత్వం మునిగిపోయింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడటానికి పనులు చేపడుతున్నారు. అయితే ఈసారి మాత్రం కృష్ణ పుష్కరాలకు మాత్రం ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా చూస్తున్నారు చంద్రబాబు. ఎందుకంటే గతంలో గోదావరి పుష్కరాల సమయంలో ఎదురైన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు.
గోదావరి పుష్కరాల మొదలవుతాయి అన్న దగ్గర నుండి.. వాటి ఏర్పాట్ల నిర్మాణంతో పాటు అన్ని విషయాలపై ఊదరగొట్టారు. దీనికి గాను ప్రభుత్వం నిర్వహించిన భారీ ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. దీంతో ఆ పుష్కరాల సమయంలో జరిగిన తోపులాట.. ఏర్పాట్లు సరిగాలేవు అన్న చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో అప్పుడు జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరగకుండా ఉండటానికే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంట. సరిగ్గా ఇంకో 25 రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ ఇంకా ఏర్పాట్లు సరిగా పూర్తి కాలేదు. అందుకే ప్రచారం కనుక చేస్తే అసలే అరకొరవగా ఉన్న ఏర్పాట్లతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పి చంద్రబాబు కూడా ఈ దఫా ప్రచారంపై అంతగా ఫోకస్ చేయట్లేదని వార్తలు వస్తున్నాయి.