లోక్ సభలో అదే తంతు.. ఈ గొడవేంటి..
posted on Aug 3, 2016 @ 11:52AM
గత రెండు రోజులుగా ఏపీ ప్రత్యేక హోదాకోసం లోక్ సభలో ఎంపీలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూలాగే ఈరోజు కూడా సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. తమ సీట్ల నుండి లేచి వెల్ లోకి వచ్చి నినాదాలు చేపట్టారు.
దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారించినా వారు వినకుండా నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు."రోజూ ఏమిటిలా? మీరు దయచేసి ప్లకార్డులు చూపవద్దు. సభలో ప్లకార్డులపై నిషేధం ఉంది. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏదో చెప్పారుగా? కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. వారికి కాస్తయినా సమయం ఇవ్వకుండా ఈ గొడవేంటి? మాట్లాడుకొని వారు ఓ నిర్ణయానికి వస్తారు. ఆపై అనుమానాలు ఉంటే తీర్చుకోవచ్చు. నేను మిమల్ని కేవలం రిక్వెస్ట్ మాత్రమే చేయగలను. దయచేసి మీ సీట్లలోకి వెళ్లిపోండి. ప్లకార్డులు ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు" అని సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు.